కారదగ గ్రామంలో ఎవరికైనా బిడ్డ పుడితే, కుటుంబీకులు ముందుగా సోమక్క పూజారికి తెలియజేస్తారు. దాదాపు 9,000 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో, ఇప్పటికీ గొర్రె వెంట్రుకలతో గాజులు తయారుచేసే అతికొద్దిమంది కళాకారులలో ఆమె ఒకరు. స్థానికంగా కండ అని పిలిచే ఈ ఆభరణాలను శుభప్రదంగా పరిగణిస్తారు, వాటిని నవజాత శిశువుల మణికట్టు చుట్టూ కడతారు.

"గొర్రెలు తరచుగా కఠినమైన వాతావరణంలో, పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ గ్రామాలన్నీ తిరుగుతాయి, రకరకాల ప్రజలతో కలుస్తాయి" అని మలి 50ల వయసులో ఉన్న సోమక్క చెప్పారు. గొర్రెలను సహనానికి చిహ్నంగా పరిగణిస్తారు, వాటి వెంట్రుకలతో చేసిన కండ చెడును దూరం చేస్తుందని విశ్వసిస్తారు

ధనగర్ సముదాయానికి చెందిన మహిళలు సంప్రదాయకంగా ఈ గాజులను తయారుచేస్తారు. నేడు, కారదగలోని ఎనిమిది ధనగర్ కుటుంబాలు మాత్రమే ఈ కళను కొనసాగిస్తున్నాయి. “ నిమ్మ గావాలా ఘత్లా ఆహే [ఈ ఊరిలో సగం మంది పిల్లల మణికట్టులను ఈ గాజులతోనే అలంకరించాను],” అని సోమక్క మరాఠీలో చెప్పారు. కారదగ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెళగావీ జిల్లాలో ఉంది. అందువల్ల సోమక్క వంటి చాలామంది కన్నడ, మరాఠీ రెండు భాషలూ మాట్లాడగలరు.

" కండ కోసం అన్ని కులమతాల ప్రజలూ మా దగ్గరకు వస్తారు," అని సోమక్క చెప్పారు.

చిన్నతనంలో సోమక్క తన తల్లి కిస్నాబాయి బణ్‌గర్, కారదగలోకే అందమైన కొన్ని కండ లను తయారుచేయడాన్ని చూశారు. " కండ ను తయారుచేసే ముందు ఆమె ప్రతి గొర్రె వెంట్రుకను [ లోకర్ అని కూడా పిలుస్తారు] ఎందుకు తనిఖీ చేసేదో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉండేది," అని తన తల్లి మెత్తటి వెంట్రుకలను ఎలా ఉపయోగించేదో గుర్తు చేసుకుంటూ చెప్పారామె. మొదటిసారి కత్తిరించిన గొర్రె వెంట్రుకలు బిరుసుగా ఉంటాయి. "వంద గొర్రెలలో, సరైన వెంట్రుకలు కేవలం ఒకదానిలోనే కనిపిస్తాయి."

సోమక్క తన తండ్రి అప్పాజీ బణ్‌గర్ వద్ద కండ ను తయారుచేయడాన్ని నేర్చుకున్నారు. అప్పుడామె వయస్సు 10 సంవత్సరాలు, దాన్ని నేర్చుకోవడానికి ఆమెకు రెండు నెలలు పట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత, సోమక్క ఈ కళను ఇంకా అభ్యసిస్తూనే ఉన్నారు. కానీ దానికి ప్రజాదరణ క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు: “ఈ రోజుల్లో యువ కాపరులు గొర్రెలనే మేపడం లేదు. ఇక గొర్రె వెంట్రుకలతో చేసే కళ గురించి వాళ్ళకేం తెలుస్తుంది?"

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: కారదగ గ్రామంలో ఒక పసిబిడ్డ మణికట్టు చుట్టూ కండ కడుతున్న సోమక్క. కుడి: గొర్రెల వెంట్రుకలను కత్తిరించడానికి ఉపయోగించే లోహపు కత్తెర కాథర్భుని

PHOTO • Sanket Jain

ఒక జత కండను చూపిస్తోన్న సోమక్క, ఇది చెడును దూరం చేస్తుందని నమ్ముతారు

"సాధారణంగా ఒక గొర్రె ఒకసారి కత్తిరింపుకు 1-2 కిలోల లోకర్‌ ను ఇస్తుంది," అని సోమక్క వివరించారు. ఆమె కుటుంబానికి ఉన్న గొర్రెలకు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు - దీపావళి, బెందూర్ (జూన్-ఆగస్టు నెలల మధ్య జరిగే ఎద్దుల వేడుక) సమయంలో - వెంట్రుకలను కత్తిరిస్తారు. దీని కోసం ఒక కాథర్భుని , లేదా సంప్రదాయ కత్తెరను ఉపయోగిస్తారు. గొర్రె వెంట్రుకలను కత్తిరించడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది, సాధారణంగా ఈ పనిని ఉదయం పూట చేస్తారు. గొర్రె వెంట్రుకలలోని ప్రతి వెంట్రుక నాణ్యతనూ పరీక్షించి, వాతావరణ పరిస్థితుల వలన పాడైపోయిన వెంట్రుకలను పక్కన పారేస్తారు.

ఒక్కో కండ తయారు చేయడానికి సోమక్కకు 10 నిమిషాలు పడుతుంది. సోమక్క ఇప్పుడు ఉపయోగిస్తున్న లోకర్‌ ను 2023 సంవత్సరం దీపావళి సందర్భంగా కత్తిరించారు. "నేను దానిని నవజాత శిశువుల కోసం దాచిపెట్టి ఉంచాను," అని ఆమె చెప్పారు.

గొర్రె వెంట్రుకలను గాజు ఆకారంలోకి తీసుకొచ్చే ముందు సోమక్క వాటికున్న దుమ్మును, ఇతర మలినాలను తొలగిస్తారు. ఆమె వెంట్రుకలను బలంగా లాగి, నవజాత శిశువు మణికట్టు పరిమాణానికి అనుగుణంగా వాటిని గుండ్రంగా పేనతారు. వాటిని గుండ్రంగా చేసిన తర్వాత, ఆమె దానిని తన అరచేతుల్లో పెట్టుకుని రుద్దుతారు. ఆ వత్తిడికి అది గట్టిగా మారుతుంది.

సోమక్క ఈ గుండ్రంగా చేసినదాన్ని కొన్ని సెకన్లకోసారి నీటిలో ముంచుతారు. "మీరు ఎంత ఎక్కువ నీటిని జోడిస్తే, దాని ఆకారం అంత బలంగా మారుతుంది," గొర్రె వెంట్రుకలను నేర్పుగా లాగి, గాజు ఆకారాన్ని తన అరచేతుల మధ్య గట్టిగా పేనుతూ చెప్పారామె.

"1-3 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఈ గాజును ధరిస్తారు," అని ఆమె చెప్పారు. ఒక జత కండ కనీసం మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సముదాయం గాజులను తయారుచేయటంతో పాటు పశువులను మేపటం, పొలంపని చూసుకోవటం చేస్తుంటారు. ధనగర్లు మహారాష్ట్రలో సంచార జాతులుగాను, కర్ణాటకలో ఇతర వెనుకబడిన తరగతి జాబితాలోనూ ఉన్నారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

శుభ్రం చేసిన గొర్రె వెంట్రుకలకు తన అరచేతుల మధ్య ఉంచుకుని గుండ్రంగా పేనుతున్న సోమక్క

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఆమె గుండ్రని కండను మరింత బలంగా చేయడానికి నీటిలో ముంచి, ఆపైన అదనపు నీటిని పిండేస్తారు

సోమక్క భర్త బాళు పూజారి తనకు పదిహేనేళ్ళ వయసప్పటి నుండి గొర్రెల కాపరిగా పని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు 62 ఏళ్ళ వయస్సున్న ఆయన తన వయస్సు కారణంగా పశువులను మేపడం మానేశారు. ప్రస్తుతం రైతుగా గ్రామంలో తనకున్న రెండెకరాల భూమిలో చెరకు సాగు చేస్తున్నారు.

సోమక్క పెద్ద కుమారుడు, 34 ఏళ్ళ మాళు పూజారి పశువులను మేపే పనిని చేపట్టారు. తన కొడుకు 50 కన్నా తక్కువే గొర్రెలను, మేకలను మేపుతున్నాడని బాళు చెప్పారు. "ఒక దశాబ్దం క్రితం, మా కుటుంబం స్వంతానికి ఉన్న 200కు పైగా పశువులను మేపేది," అని ఆయన గుర్తు చేసుకున్నారు. కారదగ చుట్టుపక్కల ఉన్న పచ్చిక బయళ్ళు తగ్గిపోవడమే పశువుల సంఖ్య క్షీణించడానికి ప్రధాన కారణమని ఆయన అరోపణ..

మంద పరిమాణం తగ్గిపోవడం వల్ల, ఇంతకుముందు వెంట్రుకలను కత్తిరించి ఉండని గొర్రెలను కనిపెట్టడం కష్టమవుతోంది. అది గ్రామంలో కండ తయారుచేయటంపై ప్రభావం చూపుతోంది.

ప్రతి రోజూ బాళు గొర్రెలు, మేకలు మేపడానికి వెళ్ళినప్పుడు తాను కూడా ఆయనతో కలిసి వెళ్ళిన రోజులను సోమక్క గుర్తు చేసుకున్నారు. ఈ జంట 151 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని బీజాపూర్‌కు, 227 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సోలాపూర్‌కు ప్రయాణించారు. "మేం చాలా దూరాలు ప్రయాణించేవాళ్ళం, పొలాలే మా ఇళ్ళయేవి," అంటూ సోమక్క ఒక దశాబ్దం క్రితం నాటి తమ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. “ప్రతిరోజూ ఆరుబయట పొలాల్లో పడుకోవడం నాకు అలవాటైపోయింది. మా తలల మీదుగా చంద్రుడు, నక్షత్రాలు ఉండేవి. నాలుగు గోడలతో సురక్షితమైన ఇల్లులాంటివేవీ మాకు ఉండేవి కావు."

సోమక్క కారదగ, దాని చుట్టుపక్కల గ్రామాలలో, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో కూడా, పని చేస్తారు. ఆమె పని చేయడానికి ప్రతిరోజూ నడుచుకుంటూ వెళతారు. "నేను బావులు తవ్వాను. రాళ్ళు కూడా మోశాను," అని చెప్పారామె. 1980లలో బావులు తవ్వినందుకు ఆమెకు 25 పైసలు ఇచ్చేవాళ్ళు. "ఆ సమయంలో కిలో బియ్యం ధర రూ.2 ఉండేది,” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

PHOTO • Sanket Jain

తమ గొర్రెలను మేకలను మేపుకోవడానికి సోమక్క, ఆమె భర్త బాళు ఇంటి నుంచి వందల కిలోమీటర్ల దూరాలు, కఠినమైన భూభాగాల వెంట నడిచి వెళ్ళేవాళ్ళు

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: ధనగర్ సముదాయానికి చెందిన మహిళలు అల్లికకు ఉపయోగించే సాంప్రదాయిక సాధనం. కుడి: గోరును ఉపయోగించి ఇత్తడి పాత్రపై చెక్కిన పక్షి బొమ్మ. 'ఇది చేయడమంటే నాకు చాలా ఇష్టం' అని బాళు పూజారి చెప్పారు. 'ఈ పాత్ర నాదే అనడానికి ఇది గుర్తు’

చేతితో కండ ను తయారుచేయడం చాలా సులభం అనిపించవచ్చు, కానీ దీనిలో అనేక సవాళ్ళున్నాయి. గొర్రె వెంట్రుకలు తరచుగా దాన్ని తయారుచేసేవారి ముక్కుల్లోకి, నోళ్ళలోకి వెళ్తుంటాయి. దీని వల్ల  దగ్గు, తుమ్ములు వస్తాయి. వీటిని డబ్బు తీసుకోకుండా, ఉచితంగా తయారుచేసి ఇవ్వడంతో పాటు, పచ్చిక బయళ్ళు తగ్గిపోతుండటం వలన కూడా ఈ కళ క్రమంగా కనుమరుగవుతోంది.

నవజాత శిశువు మణికట్టు చుట్టూ కండ ను కట్టే వేడుక తర్వాత, సోమక్కకు సాధారణంగా హళద్-కుంకు (పసుపు-కుంకుమ), టోపీ (సాంప్రదాయిక టోపీ), పాన్ (తమలపాకు), సుపారీ (వక్కలు), ఝంపర్ (జాకెట్ ముక్క), చీర, నారళ్ (కొబ్బరికాయ), తవల్ (తువ్వాలు)లను దక్షిణగా ఇస్తారు. "కొన్ని కుటుంబాలు కొంచెం డబ్బు కూడా ఇస్తాయి," అని సోమక్క చెప్పారు. తాను ఎవరినీ ఎప్పుడూ ఏమీ అడగనని ఆమె అన్నారు. "ఈ కళ డబ్బు సంపాదించడం గురించి కాదు," అని ఆమె నొక్కి చెప్పారు.

ఈ రోజుల్లో కొందరు గొర్రె వెంట్రుకలకు నల్ల దారం కలిపి, దాన్ని కండ అని చెప్పి జాతరలలో పది రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతున్నారు. "నిజమైన కండ ను కనిపెట్టడం కష్టంగా మారింది," అని సోమక్క చిన్న కుమారుడు, 30 ఏళ్ళ రామచంద్ర చెప్పారు. అతను ఒక గ్రామంలోని గుడిలో పూజారిగా పనిచేస్తూనే, తండ్రితో కలిసి వ్యవసాయం కూడా చేస్తున్నారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: బాళు, సోమక్క పూజారి కుటుంబం ఆరు తరాలుగా కారదగలో ఉంటోంది. కుడి: గొర్రె వెంట్రుకలతో చేసిన సంప్రదాయ ఘొంగడి. ఇది పూజారి కుటుంబానికి చెందినది

సోమక్క కుమార్తె, 28 ఏళ్ళ మహాదేవి ఆమె నుంచి ఈ కళను నేర్చుకుంది. "ఇప్పుడు చాలా కొద్దిమందికి మాత్రమే దీనిపై ఆసక్తి ఉంది," అని సోమక్క చెప్పారు. ధనగర్ సముదాయానికి చెందిన ప్రతి స్త్రీకి కండ ను ఎలా తయారుచేయాలో తెలిసిన కాలాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

లోకర్ (గొర్రెల వెంట్రుకలు) నుంచి పోగులను కలిపి తన కాలిపై పేని దారాలు తీయడం కూడా సోమక్కకు తెలుసు. వాటిని పేనడం వల్ల తరచుగా ఆమె చర్మం బొబ్బలెక్కుతుంది. అందుకే కొందరు అలాంటిది పేనడానికి చెక్కతో చేసిన చరఖాను ఉపయోగిస్తారు. ఆమె కుటుంబం ఘొంగడి (గొర్రెల ఉన్నితో నేసిన దుప్పట్ల)ను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందిన సంగర్లకు పేనిన లోకర్‌ ను విక్రయిస్తుంది. ఈ దుప్పట్లను వినియోగదారులకు ఒక్కొక్కటి రూ. 1,000కు విక్రయిస్తుండగా, సోమక్క వెంట్రుకలతో పేనిన దారానికి చాల తక్కువగా కిలోకు రూ. 7 ఇస్తారు.

కొల్హాపూర్‌లోని పట్టణ్ కొడోలి గ్రామంలో ప్రతి సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ మధ్య జరిగే విఠ్ఠల్ బీర్‌దేవ్ యాత్రలో ఈ దారాలను అమ్ముతారు. ఈ యాత్రకు ముందు సోమక్క చాలా గంటలు పని చేస్తారు, యాత్ర ప్రారంభానికి ముందురోజుకు ఆమె కనీసం 2,500 దారాలను పేనుతారు. "దీని వల్ల తరచుగా నా కాళ్ళు వాచిపోతాయి," అని ఆమె చెప్పారు. సోమక్క తన తలపై బుట్టలో 10 కిలోల దారాన్ని మోస్తూ 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి నడిచి వెళతారు. ఈ పనికి ఆమె సంపాదించేది కేవలం 90 రూపాయలే.

ఎన్ని కష్టాలు ఎదురైనా కండ తయారీ విషయంలో మాత్రం సోమక్క ఉత్సాహం సన్నగిల్లిపోలేదు. "నేను ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు గర్వపడుతున్నాను," నుదిటిపై భండారా (పసుపు) పూసుకున్న ఆమె చెప్పారు. "నేను పొలాల్లో, చుట్టూ గొర్రెలూ మేకలతో పుట్టాను. నేను చనిపోయే వరకు ఈ కళారూపాన్ని సజీవంగా ఉంచుతాను," అని సోమక్క అన్నారు.

ఈ కథనం సంకేత్ జైన్ గ్రామీణ కళాకారులపై రూపొందిస్తోన్న సిరీస్‌లో ఒక భాగం. దీనికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ సహకారం అందించింది.

అనువాదం: రవి కృష్ణ

Sanket Jain

రిపోర్టర్: సంకేత్ జైన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన జర్నలిస్టు. ఆయన 2022 PARI సీనియర్ ఫెలో, 2019 PARI ఫెలో.

Other stories by Sanket Jain
Editor : Dipanjali Singh

దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.

Other stories by Dipanjali Singh
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna