మొదట వర్షాలే పడకపోవటం, ఆపైన కురిసిన అకాల వర్షాలు ఛత్రా దేవి పంటలను నాశనం చేశాయి. "మేం బాజ్రా [సజ్జలు] సాగుచేస్తున్నాం, అది చక్కగా పెరుగుతోంది కూడా. కానీ మా పొలాలకు నీళ్ళు అవసరమైనప్పుడు వర్షాలు పడలేదు. ఆ తర్వాత కోతల సమయంలో వర్షాలు పడి పంటలన్నింటినీ పాడుచేశాయి," అంటూ రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా, ఖిర్‌ఖిరి గ్రామానికి చెండిన 45 ఏళ్ళ ఈ రైతు చెప్పారు.
కరౌలీ ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడివుంది. ఇక్కడ నివసించే ప్రజలలో ఎక్కువమంది వ్యవసాయదారులు, లేదా వ్యవసాయ కూలీలు (2011 జనగణన). చారిత్రాత్మకంగా నీటి కరవును ఎదుర్కొంటోన్న ఈ రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం .
మీనా సముదాయానికి (రాష్ట్రంలో ఒబిసిగా జాబితా చేసివుంది) చెందిన ఛత్రా దేవి, తాను గత 10 ఏళ్ళుగా వర్షపాత నమూనాలో వస్తున్న మార్పును గమనిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో (విస్తీర్ణం ద్వారా) అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం, పశుపోషణల మీద ఆధారపడి జీవిస్తున్నారు.
మారిపోతోన్న వర్షపాత నమూనాలు ఖిర్‌ఖిరిలోని రైతులను తమ జీవనోపాధి కోసం పాల అమ్మకాలపై ఆధారపడేలా చేశాయి. కానీ వాతావరణంలోని మార్పుల చెడుప్రభావాలు పశువుల ఆరోగ్యంపై పడి, వాటిని వివిధ రోగాలపాలయ్యేలా చేశాయి. "గత 5-10 రోజులుగా మా ఆవు సరిగ్గా మేత మేయటంలేదు," అన్నారు ఛత్రా దేవి.
ఖిర్‌ఖిరిలోని మహాత్మా గాంధీ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న 48 ఏళ్ళ అనూప్ సింగ్ మీనా భవిష్యత్తు గురించి విచారపడుతున్నారు. "మా గ్రామ భవిష్యత్తు గురించి ఊహించినప్పుడు, వర్షాలపై ఆధారపడిన వ్యవసాయం అనేక మార్పులకు లోనయ్యేలా తోస్తోంది. భవిష్యత్తు చాలా అంధకారంగా కనిపిస్తోంది."
ఖిర్‌ఖిరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం భూమిపై ఆధారపడి జీవించేవారి గురించి, వాతావరణ నమూనాలు మరింతగా అస్థిరంగా మారుతుండటం వలన వారు ఎదుర్కొనే సవాళ్ళ గురించీ చెబుతుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి