కృష్ణాజీ భరిత్ సెంటర్‌లో పని చేయకుండా ఖాళీగా ఉండే చేతులు కనిపించవు.

మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం, అలాగే జళగావ్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్ళు ఆగడానికి కొన్ని గంటల ముందు కూడా, ప్రతిరోజూ వంకాయలతో చేసే దాదాపు 300 కిలోల భరిత్‌ ను వండి, వడ్డిస్తారు; అలాగే ప్యాక్ చేసి పంపించేందుకు సిద్ధం చేస్తారు. ఇది జళగావ్‌ నగరంలోని పాత బిజె మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దుకాణం. పారిశ్రామికవేత్తల నుంచి కార్మికుల వరకు, ఔత్సాహిక పార్లమెంటు సభ్యుల నుంచి అలసిపోయిన పార్టీ కార్యకర్తల వరకు దీని ఖాతాదారులు.

వేడిగా ఉండే ఏ సాయంత్రమైనా, రాత్రి భోజన సమయానికి ముందు, కృష్ణాజీ భరిత్ లోపలి భాగంలో - శుభ్రం చేయటం, తరగడం, పొడి కొట్టడం, పొట్టు తీయడం, కాల్చడం, వేయించడం, వంటకాన్ని తిప్పుతుండటం, వడ్డించడం, ప్యాకింగ్ చేయటం వంటివన్నీ అస్పష్టంగా కనిపిస్తుంటాయి. రెస్టరెంట్ వెలుపల ఉన్న మూడు స్టీలు రెయిలింగ్‌ల వెంట ప్రజలు క్యూలో నిలబడి ఉంటారు. ఒకప్పటి పాత సింగిల్-స్క్రీన్ సినిమా హాళ్ళ బయట సినిమా టిక్కెట్ల కోసం వేచి ఉండేవారి వరుసలా ఈ క్యూ కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ ప్రధాన పాత్ర 14 మంది మహిళలది.

PHOTO • Courtesy: District Information Officer, Jalgaon

జళగావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఏప్రిల్ 2024 చివరి వారంలో, కృష్ణాజీ భరిత్‌లో ఎన్నికల అవగాహనపై ఒక వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను జనం లక్షలసార్లు డౌన్‌లోడ్ చేసుకుని చూశారని జిల్లా సమాచార అధికారి తెలిపారు

ప్రతిరోజూ మూడు క్వింటాళ్ళ వంకాయలను భరిత్‌ గా వండే భారీ ప్రక్రియకు మహిళలే వెన్నెముకవంటివారు. ఈ వంటకాన్ని దేశంలో ఇతర చోట్ల బైంగన్ కా భర్తా అంటారు. జళగావ్ జిల్లా యంత్రాంగం ఎంతో బిజీగా ఉండే ఈ అవుట్‌లెట్‌లో ఎన్నికల అవగాహన వీడియోను చిత్రీకరించిన తర్వాత, వీరికి విస్తృత ప్రచారం లభించింది.

మే 13న జరిగే జళగావ్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికలలో మహిళల ఓటింగ్ శాతాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన ఈ వీడియోలో, కృష్ణాజీ భరిత్‌లోని మహిళలు తమ హక్కుల గురించి తమకేం తెలుసో చెబుతూ, ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ గురించి ఆ రోజు వాళ్ళేం నేర్చుకున్నదీ చర్చిస్తూ కనిపిస్తారు.

"మన వేలిపై సిరా గుర్తుతో వోటింగ్ యంత్రం ముందు నిలబడినపుడు, మనం నిజంగా స్వతంత్రంగా ఉన్నట్లు- అని నేను జిల్లా కలెక్టర్ నుంచి తెలుసుకున్నాను," అని మీరాబాయి నారళ్ కోండే చెప్పారు. ఆమె కుటుంబం ఒక చిన్న మంగలి దుకాణాన్ని నడుపుతోంది. ఆమె రెస్టరెంట్‌లో పని చేసి తెచ్చే జీతం ఆమె ఇంటి ఆదాయానికి విశేషంగా తోడ్పడుతుంది. "భర్తనో లేదా తల్లిదండ్రులనో లేదా యజమానినో లేదా నాయకుడినో అడగకుండానే మనం యంత్రం ముందు నిల్చొని మనకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎంపిక చేసుకోవచ్చు," అని ఆమె వీడియోలో చెబుతారు.

అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో మంచి నాణ్యమైన వంకాయలు స్థానిక మార్కెట్‌లను ముంచెత్తినప్పుడు, కృష్ణాజీ భరిత్ వంటశాలలో ఉత్పత్తి 500 కిలోలకు చేరుకుంటుంది. తాజాగా నూరిన వేయించిన మిరపకాయలు, కొత్తిమీర, వేయించిన వేరుశెనగ, వెల్లుల్లి, కొబ్బరి వంటివి భరిత్‌ తయారీ పనిలో ఒక భాగమని మహిళలు చెబుతారు. మిగిలిన సగం భరించగలిగేంత ధర. రూ. 300 లోపు ఖర్చుతో ఒక కుటుంబానికి సరిపడా కిలో భరిత్ , దాంతోపాటు కొన్ని అదనపు ఆహారపదార్థాలను తీసుకెళ్ళవచ్చు.

ఇక్కడ 10 x 15 అడుగుల వంటగదిలో నాలుగు స్టవ్‌లతో కూడిన కొలిమి మండుతుంటే, వాటిపైన వేపుడు పప్పు, పనీర్-బఠానీ, ఇతర శాకాహారాలతో సహా మొత్తం 34 రకాల ఆహార పదార్థాలను తయారుచేస్తారు. అయితే, ఈ తయారీ శ్రేణిలో మణిమకుటాలు మాత్రం భరిత్ , శేవ్ భాజీ లే. శేవ్ భాజీ ని నూనెలో వేయించిన సెనగపిండి శేవ్‌ (చక్రాలు/జంతికలు)తో తయారుచేస్తారు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఎడమ: భరిత్‌ను తయారుచేయడానికి కృష్ణా భరిత్ స్థానిక రైతులు, మార్కెట్‌ల నుంచి ప్రతిరోజూ 3 నుంచి 5 క్వింటాళ్ళ నాణ్యత గల వంకాయలను కొనుగోలు చేస్తుంది. కుడి: రాత్రి భోజనం కోసం వచ్చే ఖాతాదారుల కోసం, రాత్రి 7:30 గంటల వేళ భరిత్ తయారీకి సిద్ధంగా ఉన్న తరిగిన ఉల్లిపాయలు, కూరగాయలు

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఎడమ: కృష్ణాజీ భరిత్‌లోని చిన్న వంటగదిలో ఉన్న నాలుగు స్టవ్‌ల పక్కన ఉన్న బఠానీలు, సుగంధ ద్రవ్యాలు, ఒక ముక్క కాటేజ్ చీజ్, అప్పుడే తయారుచేసిన రెండు డబ్బాల వేపుడు పప్పు. కుడి: ఎండు కొబ్బరిని పొడిగానో పేస్ట్‌గానో చేయటానికి ముందు చిన్న ముక్కలుగా తరుగుతోన్న రజియా పటేల్. ఆమె రోజుకు ఇలా 40 కొబ్బరికాయలను తరుగుతారు

మా సంభాషణ కొనుగోలు స్తోమత, జీవన వ్యయం పైకి మారడంతో, మహిళలు తమ సమస్యలను గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. 46 ఏళ్ళ పుష్పా రావుసాహెబ్ పాటిల్, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వచ్చే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్‌ను పొందలేకపోయానని, కొన్ని పత్రాలతో సమస్య ఉందని చెప్పారు.

60 ఏళ్ళు దాటిన ఉషాబాయి రమా సుతార్‌కు ఇల్లు లేదు. “ లోకాన్న మూలభూత్ సువిధా మిల్యాలా హవ్యేత్, నాహీ [ప్రజలకు ప్రాథమిక సేవలు అందాలి, నిజమేనా కాదా]?” చాలా సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆమె అన్నారు. "పౌరులందరికీ నివసించడానికి ఇళ్ళు ఉండాలి."

చాలామంది మహిళలు అద్దె ఇళ్ళలో నివసిస్తున్నారు. 55 ఏళ్ళ రజియా పటేల్ ఇంటి అద్దె రూ.3,500. అది తన నెలసరి ఆదాయంలో దాదాపు మూడో వంతని ఆమె చెప్పారు. "ప్రతి ఎన్నికల్లో, మహంగాయీ (ద్రవ్యోల్బణం) గురించి మేం ఎన్నో వాగ్దానాలు వింటాం," అని ఆమె అన్నారు. "ఎన్నికల తర్వాత ప్రతి వస్తువు ధర పెరిగిపోతూ ఉంటుంది."

వేరే ప్రత్యామ్నాయం లేక, స్వతంత్రంగా ఉండేందుకు కూడా తాము ఈ పని చేస్తున్నామని మహిళలు తెలిపారు. చాలామంది ఇక్కడ చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నారు - సుతార్ 21 సంవత్సరాలు, సంగీత నారాయణ్ శిండే 20 సంవత్సరాలు, మాలుబాయి దేవిదాస్ మహాళే 17 సంవత్సరాలు, ఉషా భీమ్‌రావ్ ధన్‌గర్ 14 సంవత్సరాలు.

వీళ్ళ రోజువారీ పని 40 నుంచి 50 కిలోల వంకాయలను మొదటి తడవ వంట కోసం సిద్ధం చేయడంతో ప్రారంభమవుతుంది. రోజు మొత్తంలో వారు అలాంటి కొన్ని తడవలుగా వంట చేస్తారు. వంకాయలను ఆవిరిలో ఉడికించి, కాల్చి, ఒలిచి, లోపలి కండని జాగ్రత్తగా తీసి, చేతితో మెత్తని గుజ్జుగా చేస్తారు. కిలో పచ్చి మిరపకాయలను వెల్లుల్లి, వేరుశెనగతో కలిపి చేతితో దంచుతారు. ఉల్లిపాయలు, వంకాయలను వేడి నూనెలో వేయడానికి ముందు ఈ ఠేచా (పచ్చిమిర్చి, వేరుశెనగలను దంచిన పొడి)ని చిన్నగా తరిగిన కొత్తిమీరతో కలిపి వేడి నూనెలో వేస్తారు. మహిళలు ప్రతిరోజూ కొన్ని డజన్ల కిలోల ఉల్లిపాయలను కూడా తరుగుతారు.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ఎడమ: మహిళలు ప్రతిరోజూ సుమారు 2,000 పోళీలను లేదా చపాతీలను, వాటితో పాటు 1,500 బజ్రా (సజ్జలు) భాకరీలను తయారుచేస్తారు. కుడి: కృష్ణాజీ భరిత్ ‘పార్సెల్ డెలివరీ’ కిటికీ బయట వేచి ఉన్న కూరలు నింపిన ప్లాస్టిక్ సంచులు

కృష్ణాజీ భరిత్ కేవలం స్థానికులకు మాత్రమే ఇష్టమైనదికాదు; సుదూర పట్టణాలు, తహసీల్‌ల నుంచి వచ్చే ప్రజలకు ఇదొక గమ్యస్థానం. లోపల ఉన్న తొమ్మిది ప్లాస్టిక్ బల్లల దగ్గర భోజనం చేస్తున్నవారిలో కొందరు 25 కి.మీ నుంచి 50 కి.మీ దూరంలో ఉన్న పచోరా, భుసావల్‌ల నుంచి వచ్చారు.

డోంబివలీ, ఠాణే, పుణే, నాసిక్‌లతో సహా 450 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు కృష్ణాజీ భరిత్ నుంచి రోజూ రైలులో 1,000 పార్సెళ్ళు వెళతాయి.

2003లో అశోక్ మోతీరామ్ భోలే, కృష్ణాజీ భరిత్‌ను స్థాపించారు. శాకాహారాన్ని విక్రయించే రెస్టరెంట్ లాభదాయకంగా ఉంటుందని దాని యజమానికి స్థానిక బాబా ఒకరు చెప్పడంతో దీనికి ఆయన పేరే పెట్టారు. ఇక్కడ భరిత్ ఒక ప్రామాణికమైన, ఇంట్లో తయారుచేసే సాంప్రదాయిక వంటకమనీ, దీనిని లేవా పాటిల్ సముదాయానికి చెందినవారు అత్యుత్తమంగా వండుతారనీ మేనేజర్ దేవేంద్ర కిశోర్ భోలే చెప్పారు.

ఉత్తర మహారాష్ట్రలోని ఖాందేశ్ ప్రాంతంలో సామాజికంగా, రాజకీయంగా ప్రముఖులైన లేవా-పాటిల్‌లు, తమ స్వంత మాండలికం, వంటలు, సాంస్కృతిక మూలాలు కలిగిన వ్యవసాయ వర్గానికి చెందినవాళ్ళు.

వంకాయ కూర సువాసన రెస్టరెంట్‌ అంతా వ్యాపించడంతో, మహిళలు రాత్రి భోజనాల రద్దీ కోసం పోళీ లను, భాకరీ లను చేయటం ప్రారంభించారు. మహిళలు ప్రతిరోజూ దాదాపు 2,000 పోళీలూ (గోధుమలతో చేసిన చపాతీలు), దాదాపు 1,500 భాకరీ లను (కృష్ణాజీ భరిత్‌లో సజ్జలతో తయారుచేసే రొట్టె) చేస్తారు.

మరి కాసేపట్లో రాత్రి భోజన సమయం అవుతుంది. ఒక్కో భరిత్ పార్శిల్‌ తయారు చేయటంతో మహిళల రోజువారీ పనులు ముగిసి, వారికి విశ్రాంతి లభిస్తుంది.

అనువాదం: రవి కృష్ణ

Kavitha Iyer

కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.

Other stories by Kavitha Iyer
Editor : Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna