"పత్రం అయితే సరిగా ఉండేది. యంత్రంతో అయితే నువ్వు ఏ బటన్ నొక్కుతున్నావో తెలియదు, వోటు ఎవరికి పడుతుందో కూడా తెలియదు!"

అంటే, ఇవిఎమ్(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల కంటే బ్యాలెట్ పేపర్ల వాడకానికే తాను ప్రాధాన్యమిస్తానని కల్ముద్దీన్ అన్సారి అంటున్నారు. పలామూలోని కుమనీ గ్రామ నివాసి అయిన 52 ఏళ్ళ కల్ముద్దీన్‌ను మేం స్థానిక మవేశీ (పశువుల) బాజార్లో కలిశాం. ఝార్ఖండ్‌లో ఏప్రిల్ మాసపు బొబ్బలెక్కించే ఎండ నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆయన తన తలచుట్టూ ఒక తెల్లని గమ్ఛా (తువ్వాలు)ని చుట్టుకొని ఉన్నారు. పలుచని, ముతకగా ఉండే నూలు వస్త్రమైన గమ్ఛా ను సంప్రదాయకంగా తువ్వాలుగా, స్కార్ఫ్‌గా, తలపాగాగా చుట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తారు; ఇది అనేక రకాలుగా ఉపయోగించేందుకు అనుకూలమైన వస్త్రం.

పాథర్‌లో జరిగే ఈ వారపు సంతలో తన ఎద్దును అమ్మటం కోసం కల్ముద్దీన్ 13 కిలోమీటర్ల దూరం నడిచి ఇక్కడకు వచ్చారు. "మాకు డబ్బు అవసరం ఉంది," అన్నారాయన.

పోయిన ఏడాది (2023), ఆయన వరి పంట పూర్తిగా నాశనమైపోయింది. రబీ పంటకాలంలో ఆయన ఆవాల పంట వేశారు, కానీ మూడవ వంతు పంటను పురుగులు తినేశాయి. "మేం 2.5 క్వింటాళ్ళ పంటను కోసుకోగలిగాం. అదంతా అప్పులు చెల్లించడానికే పోయింది," అన్నారు కల్ముద్దీన్.

నాలుగు బిఘాల (సుమారు మూడు ఎకరాలు) భూమిని సాగుచేసే రైతు కల్ముద్దీన్ స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వివిధ రకాల అప్పుల భారం కింద ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. " బహుత్ పైసా లే లేవా లే [వాళ్ళు చాలా డబ్బు తీసేసుకున్నారు]," అంటూ అతను ప్రతి వంద రూపాయలకు నెలకు ఐదు రూపాయల వడ్డీ కట్టాల్సిరావడం మనిషిని అశక్తుడిని చేస్తుందని కూడా అన్నారు. "నేను 16,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, అదిప్పుడు రూ. 20,000 అయింది. అయితే నేను అందులో రూ. 5,000 మాత్రమే చెల్లించాను."

ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక అవకాశం తన ఎద్దును అమ్మటం. ఇసీలియే కిసాన్ చుర్మురా జాతా హై. ఖేతీ కియె కి బైల్ బేచా గయా [అందుకే రైతు కష్టాలు పడుతున్నాడు. నేను వ్యవసాయం చేస్తూ, చివరకు నా ఎద్దును అమ్ముకునే స్థితికి వచ్చాను]," 2023లోనైనా వర్షాలు పడతాయని ఆశించిన కల్ముద్దీన్ అన్నారు.

PHOTO • Ashwini Kumar Shukla

పలామూలోని కుమనీ గ్రామానికి చెందిన రైతు కల్ముద్దీన్. ఆయన తన ఎద్దును అమ్మటం కోసం పథార్‌లో జరిగే వారపు సంతకు 13 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు. వర్షాభావం, పురుగుల దాడి వలన గత ఏడాదిలో ఆయన వేసిన వరి, ఆవాల పంటలు నాశనం కావటంతో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వివిధ రకాల అప్పుల భారం కింద ఆయన సతమతమవుతున్నారు

ఝార్ఖండ్‌లో 70 శాతం మంది రైతులు ఒక హెక్టారు కంటే తక్కువ భూమిని కలిగివున్నారు. దాదాపు మొత్తం ( 92 శాతం ) భూమి వర్షంపై ఆధారపడినది, బావులు కేవలం మూడవ ( 33 శాతం ) వంతు నీటిపారుదల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతున్నాయి. తమ పంటల కోసం ఎటువంటి అవకాశాలనూ వదులుకోని కల్ముద్దీన్ వంటి చిన్న రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం అప్పులు చేస్తారు.

అందువలన, రాబోతున్న 2024 సాధారణ ఎన్నికలలలో తన గ్రామానికి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించినవారికే తన వోటు అని ఆయన చెప్పారు. కొత్త దిల్లీకి 1000 కిలోమీటర్ల దూరంలో నివసిస్తూ, టెలివిజన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ లేని ఆయన, తనకు దేశీయ వార్తలు కానీ, ఎలక్టోరల్ బాండ్స్ గురించి కానీ తెలియదని చెప్పారు.

సంతలో, సుమారు మూడు గంటలపాటు వివిధ కొనుగోలుదారులతో బేరసారాలు సాగించిన తర్వాత కల్ముద్దీన్ చివరకు తన ఎద్దును రూ. 5000కు అమ్మారు; నిజానికి ఆయన దానికి ఆశించిన ధర రూ. 7,000.

తన ఎద్దును అమ్మేసిన తర్వాత కల్ముద్దీన్‌కు ఇంకా రెండు ఆవులు, ఒక దూడ ఉంటాయి. ఏడుగురున్న తన కుటుంబాన్ని పోషించుకోవటంలో ఆసరాగా వున్న వాటిని అట్టేపెట్టుకోగలనని ఆయన ఆశపడుతున్నారు. "రైతులకు ఏమైనా మేలు చేసేవారికే మేం వోటు వేస్తాం," దృఢంగా చెప్పారాయన.

ఈ రాష్ట్రం వరసగా వచ్చి పడుతోన్న కరువులతో సతమతమవుతూ ఉంది: 2022లో దాదాపు మొత్తం రాష్ట్రాన్ని - 226 బ్లాక్‌లు - కరువుపీడిత రాష్ట్రంగా ప్రకటించారు. ఆ తర్వాతి ఏడాది (2023), 158 బ్లాక్‌లు కరవు బారిన పడ్డాయి.

PHOTO • Ashwini Kumar Shukla

ఝార్ఖండ్‌లో దాదాపు సాగులో ఉన్న భూములన్నీ వర్షాధారం కావటం వలన 2022, 2023లలో ఆ రాష్ట్రం వరుస కరవుల బారిన పడింది. బావులు నీటిపారుదల అవసరాలలో 3వ వంతు భాగాన్నే తీర్చగలవు. అంచేత, తమ గ్రామంలో నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినవారే తమ వోటును పొందగలరని కల్ముద్దీన్ అంటారు

ఇక్కడ పలామూ జిల్లాలో పోయిన ఏడాదీ, ఈ ఏడాదీ కూడా మొత్తం 20 బ్లాక్‌లలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారంగా ఒక్కో కుటుంబానికి రూ. 3500 ఇస్తామని రాష్ట్రం చేసిన ప్రకటన, చాలా మందికి ఆ పరిహారం అందకపోవటం వలన ఈ సార్వత్రిక ఎన్నికలలో చర్చనీయాంశం అయింది. "కరవు పరిహార పత్రాన్ని నింపేందుకు నేను డబ్బులు కూడా ఇచ్చాను. ఒక ఏడాది (2022) రూ. 300, తర్వాతి ఏడాది (2023) రూ. 500. కానీ ఇప్పటివరకూ నాకు ఏమీ అందలేదు," అన్నారు సోనా దేవి.

మిట్టమధ్యాహ్నం కాబోతున్న ఆ సమయంలో ఝార్ఖండ్‌లోని బరాఁవ్ గ్రామంలో 37  డిగ్రీల సెల్సియస్ ఎండ నిప్పులు చెరుగుతోంది. యాభయ్యేళ్ళ వయసున్న సోనా దేవి ఒక సుత్తినీ, ఉలినీ ఉపయోగించి కట్టెలను చీలుస్తున్నారు. ఆ కట్టెలు వంట చేయటం కోసం. పోయిన సంవత్సరం ఆమె భర్త కామేశ్ భుయ్యాఁకు పక్షవాతం రావటంతో ఈ పనులన్నీ సోనా దేవి చేపట్టారు. భుయ్యాఁ దళిత సముదాయానికి చెందిన ఈ జంట తమ జీవిక కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు.

ప్రస్తుత శాసనసభ్యుడు అలోక్ చౌరసియాకు తాను 2014 ఎన్నికలలో ప్రచారం చేశానని, ఆ ఎన్నికల ప్రచారంలో రూ. 6000కు పైగా సంపాదించానని, కానీ ఆ శాసనసభ్యుడు "గత పదేళ్ళలో ఒక్కసారి కూడా మా ప్రాంతాన్ని సందర్శించలేదు," అని కామేశ్ చెప్పారు.

వారి రెండు గదుల మట్టి ఇల్లు వారికున్న 15 కట్ఠాల (సుమారు అరెకరం) భూమిని చూస్తున్నట్లుగా ఉంది. "రెండేళ్ళుగా ఎలాంటి సాగు చేయటం లేదు. పోయిన ఏడాది [2022] అసలు నీరన్నదే లేదు. ఈ సంవత్సరం [2023] కొద్దిగా వాన పడింది గానీ, వరి నారు సరిగ్గా పెరగలేదు," అన్నారు సోనా.

సార్వత్రిక ఎన్నికల గురించి ఈ రిపోర్టర్ ఆమెను ప్రశ్నించినపుడు, ఆమె ఇలా తిప్పికొట్టారు: "మమ్మల్నెవరు అడుగుతున్నారు? కేవలం ఓటింగ్ జరిగే సమయంలోనే వాళ్ళు (రాజకీయనాయకులు) మమ్మల్ని ' దీదీ [అక్కా], భయ్యా [సోదరా], చాచా [చిన్నాన్నా]' అని పిలుస్తూ వస్తారు. గెలిచాక, వాళ్ళు మమ్మల్ని కనీసం గుర్తుకూడా పట్టరు. వరసగా వచ్చిపడిన రెండు కరవులు, తన భర్తకు పక్షవాతం వచ్చినప్పుడు అయిన ఖర్చుల వలన సోనా దేవి రూ. 30,000 అప్పు కింద కొట్టుమిట్టాడుతున్నారు. "మాకు సహాయం చేసే పార్టీకే మేం వోటు వేస్తాం."

ఈ రిపోర్టర్ వైపు చూస్తూ ఆమె ఇంకా ఇలా అన్నారు: "నువ్వెళ్తే (రాజకీయ నాయకులను కలవడానికి), వాళ్ళు నిన్ను కుర్చీ మీద కూర్చోబెడతారు. మేం వెళ్తే, బయట వేచి ఉండమని చెప్తారు."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

పలామూలోని చియాంకీ గ్రామంలో (ఎడమ) నీటి కొరత వలన సాగుచేయకుండా పడావు పడివున్న భూములు. రబీ పంటకాలంలో రైతులు గోధుమను సాగుచేసేవారు, కానీ ఇప్పుడు బావులు ఎండిపోతుండటంతో, వారికి తాగు నీరు కూడా కరవైపోతోంది. సుమారు మూడేళ్ళ క్రితం కట్టినప్పటి నుంచీ ఎండిపోయే ఉన్న ఒక కాలువ (కుడి)

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: పలామూలోని బరాఁవ్ గ్రామంలో, 2023లో ఒక కరవు పరిహార పత్రాన్ని నింపటం కోసం సోనా దేవి డబ్బులు చెల్లించాల్సివచ్చింది. అయితే ఆమె ఇంకా ఆ పరిహారం డబ్బులు అందుకోవాల్సే ఉంది. 'పోయిన సంవత్సరం [2022], అసలు నీళ్ళన్నవే లేవు,' అని ఆమె చెప్పారు. కుడి: ఆమె పొరుగింటి మాలతి దేవి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇంటిని దక్కించుకున్నారు. 'గ్రామంలోని ఇతర మహిళలతో కలిసి ఆలోచించి ఎవరికి వోటెయ్యాలో ఉమ్మడిగా నిర్ణయించుకుంటాం,' అన్నారామె

సోనా దేవి పొరుగింటివారైన మాలతి దేవి(45) కూడా రైతే. ఆమె ఒక బిఘా (ఎకరం కంటే తక్కువ) పొలాన్ని సాగుచేస్తుంటారు, వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తుంటారు. "మా భూమి (ఒక బిఘా ) నుంచి కాకుండా బటైయ్యా [కౌలుకు తీసుకోవాటం]కు తీసుకున్న ఇతరుల భూమినుంచే కనీసం 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మేం పొందేవాళ్ళం. ఈ సంవత్సరం మేం బంగాళా దుంపలను పండించాం, కానీ మార్కెట్లో అమ్ముకోవడానికి తగినంత పంట రాలేదు," అన్నారామె.

ప్రధాన్ మంత్రి యోజన కింద ఒక ఇంటిని పొందిన ఆనందంలో ఉన్న ఆమె, అంతకుముందు పంజా ఛాప్‌ కు - కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు - వోటు వేసిన తాను ఈ ఇల్లు రావటం వలన పార్టీ మారి మోదీకి వోటు వేసినట్టుగా తెలిపారు. "మేం గ్రామంలోని మహిళలమంతా కూర్చొని చర్చించుకొని ఎవరికి వోటు వెయ్యాలో ఉమ్మడిగా నిర్ణయించుకుంటాం. మాలో కొందరికి చేతిపంపు అవసరం ఉంది, కొంతమందికి బావి, కొంతమందికి ఒక కాలనీ కావాలి. వీటన్నిటినీ ఎవరు నెరవేరుస్తారో వారికే మా వోటు వేస్తాం," అన్నారామె.

*****

"పప్పులు, గోధుమ, బియ్యం, అన్నీ ఖరీదైపోయాయి," పలామూలోని చియాంకీ గ్రామానికి చెందిన ఆశా దేవి అన్నారు. ముప్పయ్యేళ్ళు దాటిన ఈ జంటకు ఆరుగురు పిల్లలు; భర్త సంజయ్ సింగ్ (35) శ్రామికుడిగా పనిచేస్తారు. ఈ కుటుంబం ఝార్ఖండ్‌లో ఉన్న 32 ఆదివాసీ తెగలలో ఒకటైన చెరో తెగ కు చెందినది. "వ్యవసాయానికి కాలం మంచిగా ఉన్న రోజుల్లో, మాకు రెండు సంవత్సరాలకు సరిపడా తిండి ఉండేది. ఇప్పుడు, మేం అదే ఆహారాన్ని కొంటున్నాం," అన్నారామె.

అయితే ద్రవ్యోల్బణం, కరవు వంటి సమస్యలపై ఓటు వేస్తారా అని అడిగినప్పుడు, ఆశా దేవి స్పందిస్తూ, “ లోగ్ కహతా హై కి బడీ మహంగాయీ హై, కుఛ్ నహీ కర్ రహే హై మోదీ జీ. హమ్‌ లోగ్ తో ఉసీ కో అభీ భీ చున్ రహే హై . [ద్రవ్యోల్బణం చాలా ఉందనీ, మోదీజీ ఏమీ చేయడం లేదని ప్రజలు అంటున్నారు. కానీ మనం ఇంకా అతనినే ఎంచుకుంటున్నాం]," అని ఆమె ఈ విలేఖరితో దృఢంగా చెప్పారు. రూ. 1,600 రుసుము చెల్లించి ఒక బిడ్డను మాత్రమే ప్రైవేట్ పాఠశాలకు పంపగలుగుతున్నామని ఆమె అన్నారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణు దయాళ్ రామ్ 62 శాతం వోట్లు గెల్చుకొని రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన ఘూరన్ రామ్‌పై విజయం సాధించాడు. ఈ ఏడాది కూడా బిజెపి అభ్యర్థిగా విష్ణు దయాళ్ రామ్ పోటీ చేస్తుండగా రాష్ట్రీయ జనతా దళ్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో 18 లక్షలకు పైగా వోటర్లున్నారు.

ద్రవ్యోల్బణంతో పాటు కరవు నిజంగా ఆందోళనను కలిగిస్తోంది. "ఇక్కడి ప్రజలు తాగు నీటి కోసం కూడా ఆలోచించవలసివస్తోంది. గ్రామాలలోని చాలా బావులు ఎండిపోయాయి. చేతి పంపుల ద్వారా నీరు చాలా ఆలస్యంగా వస్తోంది," అంటారు ఆశా దేవి. "కాలువ కట్టారు కానీ దానిలో ఎన్నడూ నీరు మాత్రం లేదు."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: చియాంకీ గ్రామానికి చెందిన ఆశా దేవి. ఆమె భర్త దినసరి కూలీ కాగా, ఆమె గ్రామంలో ఒక సరుకులమ్మే దుకాణాన్ని నడుపుతున్నారు. 'పప్పులు, గోధుమ, బియ్యం ప్రతి ఒక్కటీ ఖరీదైపోయాయి,' అంటారామె. కుడి: తన పశువులను సంతలో అమ్మడానికి బరాఁవ్ గ్రామం నుంచి వచ్చిన రైతు, సురేంద్ర చౌధరి

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

చియాంకీ గ్రామానికి చెందిన అమరీకా సింగ్. గత రెండేళ్ళలో ఆయనకు మూడు లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఈ సంవత్సరం అతని బావి (కుడి) ఎండిపోయింది. 'రైతులను గురించి పట్టించుకునేదెవరు? గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎంతగా పోరాటం చేసినా ఏమీ మారలేదు, చూడండి,' అంటారతను

ఆమె పొరుగునే ఉండే సాటి ఆదివాసీ రైతు అమరీకా సింగ్ గత రెండేళ్ళలో మూడు లక్షల రూపాయలు నష్టపోయారు. అతనిలా అంటారు, “ఇంతకుముందు ఏం లేకపోయినా మేం కూరగాయలు పండించగలిగాం. కానీ ఈ ఏడాది నా బావి ఎండిపోయింది.”

పలామూ వ్యాప్తంగా ఉన్న రైతులందరిలాగే, అమరీకా కూడా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటిఎద్దడిని గురించి ఎత్తిచూపారు. 'నీరు లేకుండా వ్యవసాయానికి అర్థంలేదు. బావి నీటితో ఎంతని వ్యవసాయం చేయగలం?'

ఉత్తర కోయల్ నదిపై నిర్మించిన మండల్ ఆనకట్ట సహాయకారిగా ఉంటుందని భావించారు. "నాయకులు కేవలం ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తారు. మండల్ ఆనకట్టకు ఒక గేటును పెట్టిస్తామని 2019 లో మోదీ చెప్పాడు. ఆ గేటు పెట్టించి ఉంటే, ఒక నీటి సరఫరా అనేది ఉండేది," అంటారు అమరీకా సింగ్. "రైతు గురించి పట్టించుకునేదెవరు? గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎంతగా పోరాటం చేసినా ఏమీ మారలేదు, చూడండి. ప్రభుత్వం అదానీకీ అంబానీకీ అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ అప్పులను మాఫీ చేస్తుంది. కానీ రైతు సంగతేమిటి?"

"చూడండి, ఇప్పుడున్నది బిజెపి ప్రభుత్వం. మాకు ఏ కొంచం లభించినా అది వారివల్లనే. వీళ్ళే ఏమీ చేయకపోతే, అవతలి పార్టీ కూడా ఏమీ చేయనట్టే," అంటారు రైతు సురేందర్. ఎలక్టోరల్ బాండ్లు, నిరుద్యోగం వంటి అంశాలను కొట్టిపారేస్తూ, "అవి పెద్ద పెద్దవారికి సంబంధించిన పెద్ద విషయాలు. మేం అంత చదువున్నవాళ్ళం కాదు... పలామూలో ఉన్న అతిపెద్ద సమస్య నీటిపారుదల. ఇక్కడి రైతులు నీటి కోసం తహతహలాడుతున్నారు," అన్నారాయన.

పలామూలోని బరాఁవ్ గ్రామంలో ఐదు బిఘాల [3.5 ఎకరాలు] భూమి వున్న సురేందర్ ఆ భూమిని సాగుచేసేందుకు వర్షంపై ఆధారపడతారు. "జనం కూర్చొని జూదమాడతారు. మేం వ్యవసాయంలో జూడమాడుతుంటాం."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Other stories by Ashwini Kumar Shukla
Editor : Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli