అతను దర్వాజా దగ్గర పట్టుబడి, నాలుగు వీధుల కూడలిలో చంపబడ్డాడు,
వీధుల్లో అలజడి చెలరేగింది
అయ్యో! హమీరియో ఇక్కడ లేడు, ఇక రాడు

ఈ పాట 200 ఏళ్ళ నాటిది. కచ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ జానపద గాథ, ఇద్దరు యువ ప్రేమికులైన హమీర్, హామ్లీల ప్రేమ కథను చెబుతుంది. వారి కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేదు. దాంతో వారిద్దరూ భుజ్‌లోని హమీర్‌సార్ కొలను ఒడ్డున రహస్యంగా కలుసుకునేవారు. కానీ ఒక రోజు హమీర్, తన ప్రియురాలు హామ్లీని కలవడానికి వెళుతున్నప్పుడు, ఆమె కుటుంబ సభ్యులు అతడిని చూశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ వారతన్ని వెంబడించారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో వారతన్ని చంపేశారు. ఇక ఎప్పటికీ తిరిగి రాని తన ప్రేమికుడి కోసం ఆ కొలను దగ్గర నిరీక్షిస్తున్న హామ్లీ శోక దృశ్యం ఈ పాటలో మనకు కనిపిస్తుంది.

కుటుంబాలు ప్రేమను ఎందుకు అంగీకరించవు?

ప్రసిద్ధ సాహిత్యరూపమైన రసుడాలో రచించిన ఈ పాట పూర్తి సాహిత్యం, ప్రేమికుడి హత్యలో కులం చాలా కీలకమైన పాత్ర పోషించినట్లుగా సూచిస్తోంది. కారణం ఏదైనప్పటికీ అనేకమంది కచ్ పండితులు ఈ పాటను తన ప్రేమికుడిని కోల్పోయిన స్త్రీ తన దుఃఖాన్ని వ్యక్తపరిచే పాటగా చదివేందుకు ఇష్టపడతారు. కానీ అలా చేయడం వలన అది దర్వాజా, కూడలి, అవ్యవస్థలకు సంబంధించిన నిజమైన సూచనలను విస్మరిస్తుంది.

కచ్ మహిళా వికాస్ సంఘటన (కెఎమ్‌విఎస్) 2008లో ప్రారంభించిన సాముదాయక రేడియో, సురవాణి రికార్డ్ చేసిన 341 పాటల్లో ఇది ఒకటి. కెఎమ్‌విఎస్ ద్వారా PARI సేకరించిన ఈ పాటలు ఈ ప్రాంతపు అద్భుతమైన సంస్కృతి, భాష, సంగీత వైవిధ్యాలను చక్కగా పట్టుకున్నాయి. ఈ సేకరణ క్షీణించిపోతోన్న, ఎడారి ఇసుకలో మసకబారుతున్న రాగాల కచ్ సంగీత సంప్రదాయాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.

ఇక్కడ అందించిన పాటను కచ్‌లోని భచావ్ తాలూకా కు చెందిన భావనా భిల్ పాడారు. ఈ ప్రాంతంలో జరిగే పెళ్ళిళ్ళలో ఈ రసుడాను తరచుగా ఆడతారు. రసుడా అనేది ఒక కచ్ జానపద నృత్యం కూడా. ఇందులో మహిళలు ఢోల్ వాయించే వ్యక్తి చుట్టూ తిరుగుతూ పాడతారు. ఒక అమ్మాయి పెళ్ళికి అవసరమైన నగలు కొనడానికి ఆమె కుటుంబం పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సివస్తుంది. హమీరియో మరణంతో, హామ్లీ ఈ ఆభరణాలను ధరించే హక్కును కోల్పోతుంది. ఈ పాట ఆమెకు కలిగిన కష్టనష్టాలను, అప్పులను గురించి కనులకు కట్టినట్లు చెబుతుంది.

చంపార్‌కు చెందిన భావనా భిల్ పాడుతోన్న ఈ జానపద గీతాన్ని వినండి

કરછી

હમીરસર તળાવે પાણી હાલી છોરી  હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો
ઝાંપલે જલાણો છોરો શેરીએ મારાણો
આંગણામાં હેલી હેલી થાય રે હમીરિયો છોરો હજી રે ન આયો
પગ કેડા કડલા લઇ ગયો છોરો હમિરીયો
કાભીયો (પગના ઝાંઝર) મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
ડોક કેડો હારલો (ગળા પહેરવાનો હાર) મારો લઇ ગયો છોરો હમિરીયો
હાંસડી (ગળા પહેરવાનો હારલો) મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
નાક કેડી નથડી (નાકનો હીરો) મારી લઇ ગયો છોરો હમિરીયો
ટીલડી મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
હમીરસર તળાવે પાણી હાલી છોરી  હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો

తెలుగు

ఎదురు చూపులతో హమీర్‌సర్ ఏటి ఒడ్డున ఓ హమీరియో!
నీ కోసమే వేచి ఉంది హామ్లీ ఓ హమీరియో!
హమీర్‌సర్ గట్టు పైన నీ రాకకై
ఎదురుచూస్తూ... ఓ హమీరియో! నువ్విక లేవు, ఇక రావు.
అతను ఆ దర్వాజా దగ్గర పట్టుబడ్డాడు, ఆ కూడలిలో చంపబడ్డాడు
వీధుల్లో అలజడి చెలరేగింది
అయ్యో! హమీరియో ఇక్కడ లేడు, ఇక రాడు.
నా కాలి కడియాలు తీసుకుపోయాడు, ఆ పిల్లాడు హమీరియో!
నా కాలి కడియాలు నర్తిస్తాయి,
నువ్విక లేవు, ఇక రావు, ఓ హమీరియో!
ఈ రుణమెట్లు తీరునో ఓ హమీరియో!
నా కంఠహారం తీసుకుపోయాడు, ఆ పిల్లాడు ఓ హమీరియో!
నర్తిస్తూనే ఉంటాను, ఈ రుణమెట్లు తీరునో.
నువ్విక లేవు, ఇక రావు ఓ హమీరియో!
నా ముక్కెర తీసుకుపోయాడు, ఆ పిల్లాడు హమీరియో!
నా నుదుటి బొట్టు, నా పాపిట బొట్టు
అయినా నేను ఆడుతూనే ఉంటాను, ఓ హమీరియో!
నువ్విక లేవు, ఇక రావు. ఈ రుణమెట్లు తీరునో ఓ హమీరియో!
ఆమె హమీర్‌సర్ సరస్సు ఒడ్డున వేచి ఉంది; హామ్లీ వేచి ఉంది
గట్టుపైకి ఎక్కి, ఆమె తన ప్రేమ కోసం తన హమీరియో కోసం వేచి ఉంది...


PHOTO • Rahul Ramanathan

పాట స్వరూపం : సంప్రదాయ జానపద గీతం

శ్రేణి : ప్రేమ, కోల్పోవడం, విషాదం

పాట : 2

పాట శీర్షిక : హమిసర్ తాడావి పాణీ హాలీ చోరి హామలీ

స్వరకర్త : దేవల్ మెహతా

గానం : భచావ్ తాలూకాలోని చంపార్ గ్రామానికి చెందిన భావనా భిల్

ఉపయోగించిన వాయిద్యాలు : హార్మోనియం, డ్రమ్

రికార్డ్ చేసిన సంవత్సరం : 2005, కెఎమ్‌విఎస్ స్టూడియో

గుజరాతీ అనువాదం : అమద్ సమేజా, భారతి గోర్

ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; గుజరాతీ అనువాదంలో అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

అనువాదం: పద్మావతి నీలంరాజు

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Illustration : Rahul Ramanathan

రాహుల్ రామనాథన్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 17 ఏళ్ళ విద్యార్థి. అతను బొమ్మలు గీయడాన్ని, వర్ణచిత్రలేఖనాన్నీ, చదరంగం ఆడటాన్నీ ఇష్టపడతాడు.

Other stories by Rahul Ramanathan
Translator : Padmavathi Neelamraju

పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.

Other stories by Padmavathi Neelamraju