“నా ఊపిరితిత్తులు రాళ్ళలా అనిపిస్తాయి. నేను కనీసం నడవలేను,” అని మాణిక్ సర్దార్ అన్నారు.

నవంబర్ 2022లో, ఆ 55 ఏళ్ళ వ్యక్తికి సిలికోసిస్‌ ఉందని పరీక్షలలో తేలింది - అది నయం కాని ఊపిరితిత్తుల వ్యాధి. "జరగబోయే ఎన్నికలపై నాకు ఆసక్తి లేదు," అని ఆయన అన్నారు. "నేను నా కుటుంబ పరిస్థితి గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాను."

నబ కుమార్ మండల్ కూడా సిలికోసిస్ రోగి. అతను మాట్లాడుతూ, “ఎన్నికలంటే తప్పుడు వాగ్దానాలు. ఓటు వేయడం అనేది మాకొక మామూలు కార్యక్రమం. ఎవరు అధికారంలోకి వచ్చినా మా పరిస్థితి మారదు,’’ అన్నారు.

మాణిక్, నబ కుమార్‌లిద్దరూ పశ్చిమ బెంగాల్‌లోని మినాఖాఁ బ్లాక్‌లో ఉన్న ఝూప్‌ఖాలీ గ్రామంలో ఉంటున్నారు, ఇక్కడ జూన్ 1న 2024 సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతుంది.

వీరిద్దరూ ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరాలు అడపాదడపా పనిచేసిన కర్మాగారాల్లో సిలికా ధూళికి గురి కావడం వల్ల ఆరోగ్యం క్షీణించి, వేతనాలు లేక బాధపడుతున్నారు. ర్యామింగ్ మాస్ ఫ్యాక్టరీలు చాలావరకు డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో రిజిస్టర్ కాకపోవటం వలన, ఒకవేళ అయినా వాళ్ళకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు లేదా గుర్తింపు కార్డ్‌లను జారీ చేయకపోవటం వలన వీరికి ఎటువంటి పరిహారం అందడంలేదు. నిజానికి అనేక కర్మాగారాలు చట్టవిరుద్ధమైనవి, లేదా కొంత మటుకే చట్టబద్ధమైనవి కావటంతో వాటిలో పనిచేసే కార్మికులు అధికారికంగా నమోదు కాలేదు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

పశ్చిమ బెంగాల్‌, ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఝూప్‌ఖాలీ గ్రామస్తులు మాణిక్ సర్కార్ (ఎడమ), హరా పాయిక్ (కుడి). ర్యామింగ్ మాస్ యూనిట్‌లో పని చేయడానికి వలసపోయిన వీరిద్దరూ అక్కడ సిలికా ధూళికి గురికావడంతో సిలికోసిస్ బారిన పడ్డారు

ఇటువంటి పని ప్రమాదకరమైనదని స్పష్టంగా తెలిసినా కూడా, 2000 నుంచి 2009 మధ్య దాదాపు ఒక దశాబ్దం పాటు మాణిక్, నబ కుమార్ లాంటి ఉత్తర 24 పరగణా వాసులు మెరుగైన జీవనోపాధిని వెతుక్కుంటూ ఈ కర్మాగారాలలో పని చేయడానికి వలస వచ్చారు. వాతావరణ మార్పులు, పంటల ధరలు పడిపోవడం వల్ల వారి సంప్రదాయ ఆదాయ వనరైన వ్యవసాయం ఇంకెంతమాత్రం లాభసాటిగా లేదు.

"మేం ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళాం," అని ఝూప్‌ఖాలీ గ్రామానికే చెందిన హరా పాయిక్ అన్నారు. "మేం మృత్యుకుహరంలోకి వెళ్తున్నామని మాకసలు తెలియనే తెలియదు."

ర్యామింగ్ మాస్ యూనిట్లలో పనిచేసే కార్మికులు నిరంతరం పీల్చే గాలి వల్ల, సిలికా సూక్ష్మకణాలు వాళ్ళ ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి.

లోహపు వ్యర్థాలను, లోహేతర ఖనిజాలను, లాడిల్, క్రాడిల్ ద్వారా బదలాయించే కార్లను కరిగించేందుకు; ఉక్కు ఉత్పత్తిలో ఉపయోగించే ఇండక్షన్ బట్టీలకు పూత పూయటానికి ర్యామింగ్ మాస్‌ను ప్రధానంగా ఉపయోగిస్తారు. కొలిమిలో కాల్చే ఇటుకల్లాంటి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల వస్తువుల తయారీలోనూ దీనిని ఉపయోగిస్తారు.

ఈ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు నిరంతరం సిలికా ధూళిని పీలుస్తుంటారు. “నేను పని ప్రదేశానికి దగ్గరలోనే పడుకునేవాణ్ని. ఆ విధంగా నిద్రలో కూడా ఆ ధూళిని పీల్చుకున్నాను,” అని హరా చెప్పారు. అతనక్కడ సుమారు 15 నెలల పాటు పనిచేశారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా పనిచేయడం వల్ల సిలికోసిస్ బారిన పడడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: 2001-2002 నుంచి వాతావరణ మార్పులు, పంటల ధరలు పడిపోవడంతో ఉత్తర 24 పరగణా జిల్లా నుంచి చాలామంది రైతులు వలస వెళ్ళారు. 2009లో వచ్చిన ఐలా తుఫాను విధ్వంసం తర్వాత, మరింతమంది వలస వెళ్ళారు. చాలామంది వలసదారులు స్ఫటికరాయిని పగలగొట్టడం, చూర్ణం చేయటం లాంటి ప్రమాదకరమైన పనులు చేశారు. కుడి: సిలికోసిస్ అనేది నయం చేయలేని ఊపిరితిత్తుల వ్యాధి. కుటుంబంలో సంపాదించే మగ మనిషి అనారోగ్యం పాలైతే లేదా మరణిస్తే, ఆ బాధ్యత అప్పటికే గాయపడి దుఃఖంలో పెనగులాడుతోన్న మహిళలపై పడుతుంది

2009-10 నుంచి, మినాఖాఁ-సందేశ్‌ఖాలీ బ్లాక్‌లోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది కార్మికులు, ర్యామింగ్ మాస్ పరిశ్రమలో తొమ్మిది నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పనిచేసిన తరువాత సిలికోసిస్‌తో అకాల మరణం చెందారు.

కార్మికులు ఊపిరి పీల్చుకున్నప్పుడు సిలికా ధూళి, ఊపిరితిత్తుల అల్వియోలార్ సంచులలోకి వెళ్ళి, క్రమంగా అవి బిరుసుగా అయ్యేలా చేస్తుంది. సిలికోసిస్ మొదటి లక్షణాలు - దగ్గు, ఊపిరి అందకపోవడం, ఆ తర్వాత బరువు తగ్గడం, చర్మం నల్లబడటం. క్రమంగా ఛాతీ నొప్పి, శారీరక బలహీనత ఏర్పడతాయి. తరువాతి దశలలో, రోగులకు నిరంతరం ఆక్సిజన్ సహాయం అవసరం అవుతుంది. సిలికోసిస్ రోగులలో సాధారణంగా మరణానికి కారణం- ఆక్సిజన్ అందక గుండె ఆగిపోవడం.

సిలికోసిస్ అనేది కోలుకోలేని, నయం చేయలేని, మెల్లమెల్లగా వృద్ధి చెందే వృత్తి సంబంధంగా వచ్చే వ్యాధి, ఇది న్యుమోకోనియోసిస్ నిర్దిష్ట రూపాన్ని సూచిస్తుంది. వృత్తిసంబంధిత వ్యాధి నిపుణుడు డాక్టర్ కునాల్ కుమార్ దత్తా మాట్లాడుతూ, "సిలికోసిస్ ఉన్న రోగులు క్షయవ్యాధి బారిన పడే అవకాశం 15 రెట్లు ఎక్కువగా ఉంది," అన్నారు. దీనిని సిలికో-క్షయ లేదా సిలికోటిక్ టిబి అంటారు.

అయితే గత రెండు దశాబ్దాలుగా పనుల అవసరం ఎంతగా ఉందంటే, పని వెతుక్కుంటూ అక్కడికి వలస వెళ్ళే పురుషుల సంఖ్య పెరుగుతూ ఉంది. 2000లో, గోవాల్‌దహ్ గ్రామానికి చెందిన 30-35 మంది కూలీలు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్టీ లోని ర్యామింగ్ మాస్ ప్రొడక్షన్ యూనిట్‌లో పని చేసేందుకు వెళ్లారు. కొన్ని సంవత్సరాల తరువాత, మినాఖాఁ బ్లాక్‌కు చెందిన గోవాల్‌దహ్, దేవీతల, ఖరీబారియా, జయగ్రామ్ వంటి గ్రామాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రైతులు బారాసాత్‌లోని దత్తపుకుర్‌లోని ఒక యూనిట్‌లో పనికి వెళ్ళారు. అలాగే 2005-2006లో సుందరీఖాలీ, సర్‌బేరియా, బాటిదహ, ఆగర్‌హాటి, జెలియాఖాలీ, రాజ్‌బారీ, ఝూప్‌ఖాలీ గ్రామాల రైతులు సందేశ్‌ఖాలీ బ్లాక్ 1, 2లలో పనికి వెళ్ళారు. అదే కాలంలో, ఈ బ్లాకులలో పని చేసే కార్మికులు జామూరియాలోని ర్యామింగ్ మాస్ యూనిట్‌కు వెళ్ళారు.

"మేం బాల్ మిల్లు [ఒక రకమైన గ్రైండర్] ఉపయోగించి స్ఫటిక రాయినుంచి సన్నని పొడిని, అలాగే క్రషర్ యంత్రాన్ని ఉపయోగించి గోధుమ గింజల నుంచి సెమోలినా (బొంబాయి రవ్వ)ను, చక్కెర పొడిని తయారు చేస్తాం," అని ఝూప్‌ఖలీకి చెందిన అమయ్ సర్దార్ చెప్పారు. “పనిచేసే చోట మీ ముందు చేయి దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేనంత ధూళి ఉంటుంది. ఆ దుమ్మంతా మా మీద పడుతుంది,” చెప్పారతను. దాదాపు రెండేళ్ళపాటు పనిచేసిన తర్వాత 2022 నవంబర్‌లో అమయ్‌కు సిలికోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఇకపై బరువులను ఎత్తలేడు. “నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధిని వెతుక్కుంటే, ఈ వ్యాధి నన్ను పట్టుకుంది,” అని అతను చెప్పారు.

2009లో వచ్చిన తీవ్రమైన ఐలా తుఫాను సుందరవనాలలోని వ్యవసాయ భూమిని నాశనం చేయడం వల్ల వలసలు మరింత పెరిగాయి. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, అమయ్ సర్దార్‌కు సిలికోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 'నేను నా కుటుంబాన్ని పోషించడానికి ఉపాధి కోసం వెతుక్కున్నాను, కానీ నన్ను ఈ వ్యాధి పట్టుకుంది,' అన్నారతను. కుడి: ఔత్సాహిక కీర్తన్ గాయకుడు మహానంద సర్దార్, సిలికోసిస్‌తో బాధపడుతున్న అతను ఇకపై ఎక్కువసేపు పాడలేడు

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: సందేశ్‌ఖాలీ, మినాఖాఁ బ్లాక్‌లకు చెందిన చాలామంది సిలికోసిస్ రోగులకు నిరంతర ఆక్సిజన్ సహాయం అవసరం. కుడి: ఎక్స్-రే చిత్రాలను పరిశీలిస్తున్న ఒక సాంకేతిక నిపుణుడు. సిలికోసిస్ అనేది మెల్లమెల్లగా వృద్ధి చెందే వ్యాధి, దానిని క్రమం తప్పకుండా ఎక్స్-రేల ద్వారా పర్యవేక్షిస్తూండవచ్చు

మహానంద సర్దార్ గాయకుడు కావాలనుకున్నారు, కానీ ఐలా తుఫాను తర్వాత అతను జామూరియాలోని ర్యామింగ్ మాస్ కర్మాగారంలో పని చేయడానికి వెళ్ళారు. అక్కడ ఆయనకు సిలికోసిస్‌ వచ్చింది. "నేను ఇప్పటికీ కీర్తనలు పాడతాను, కానీ నాకు శ్వాసకోశ సమస్యలు ఉన్నందున ఎక్కువసేపు పాడలేను," అని ఈ ఝూప్‌ఖాలీ వాసి చెప్పారు. సిలికోసిస్‌ నిర్ధారణ అయిన తర్వాత, మహానంద భవన నిర్మాణాలలో పని చేయడానికి చెన్నైకి వెళ్ళారు, అయితే అక్కడ ప్రమాదంలో చిక్కుకోవడంతో 2023 మే నెలలో తిరిగి రావాల్సి వచ్చింది.

సందేశ్‌ఖాలీ, మినాఖాఁ బ్లాక్‌ల నుంచి చాలామంది రోగులు బయటకు రావచ్చు, కానీ వారు తమ అనారోగ్యంతో పోరాడుతూనే రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలలోనూ రోజువారీ వేతన కూలీలుగా పని చేస్తున్నారు.

*****

సిలికోసిస్‌వ్యాధికి చికిత్స చేయడానికి దానిని ముందస్తుగా గుర్తించడం కీలకం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంచాలకులు డాక్టర్ కమలేశ్ సర్కార్ “వ్యాధికి విజయవంతంగా చికిత్స చేయడానికి, అరికట్టడానికి, దానిని ముందుగానే గుర్తించాలి. సిలికోసిస్‌తో సహా వివిధ ఊపిరితిత్తుల వ్యాధులకు బయోమార్కర్, మన వేలికొనల నుంచి సేకరించిన రక్తం చుక్క ద్వారా గుర్తించే క్లారా సెల్ ప్రోటీన్ 16 [సిసి 16]," అన్నారు. ఆరోగ్యవంతమైన మానవ శరీరంలో, సిసి16 విలువ మిల్లీలీటర్‌కు 16 నానోగ్రామ్‌లు (ఎన్‌జి/ఎమ్‌ఎల్) ఉండాలి. అయితే సిలికోసిస్ రోగులలో, వ్యాధి పెరుగుతున్నప్పుడు దాని విలువ తగ్గుతూ పోయి, చివరికి సున్నాకి చేరుకుంటుంది..

“నిరంతరం లేదా అడపాదడపా సిలికా ధూళిని పీల్చుకునే ప్రమాదకరమైన పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సిసి 16 పరీక్షలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తగిన చట్టాన్ని తీసుకురావాలి. ఇది సిలికోసిస్‌ను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడుతుంది," అని డాక్టర్ సర్కార్ చెప్పారు.

2019లో సిలికోసిస్‌ ఉన్నట్లు తేలిన రవీంద్ర హల్దార్, "సమీపంలో ఆసుపత్రులు లేవు," అని తెలిపారు. సమీప బ్లాక్ ఆసుపత్రి ఖుల్నాలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఝూప్‌ఖాలీ నివాసి రవీంద్ర రెండు పడవల్లో ప్రయాణించాలి. "సర్బేరియాలో శ్రమజీవి ఆసుపత్రి ఉంది, కానీ దానిలో తగినన్ని సౌకర్యాలు లేవు," అని అతను చెప్పారు. "ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే, మేం కొల్‌కతాకు వెళ్ళాలి. దానికి అంబులెన్స్‌ కోసం రూ. 1,500-2,000 ఖర్చవుతుంది," అన్నారతను.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: ఝూప్‌ఖాలీకి చెందిన రవీంద్ర హల్దార్, సమీపంలోని బ్లాక్ ఆసుపత్రికి వెళ్ళాలంటే, తాను రెండు పడవల్లో ప్రయాణించాలని చెప్పారు. కుడి: గోవాల్‌దహ్ గ్రామంలో నివసించే సఫీక్ మొల్లాకు నిరంతరం ఆక్సిజన్ సహాయం అవసరం

గోవాల్‌దహ్‌లోని తన ఇంటిలో, 50 ఏళ్ళ మహమ్మద్ సఫీక్ మొల్లా దాదాపు రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మంచానికే పరిమితమయ్యారు. “నేను 20 కిలోల బరువు తగ్గాను, నాకు నిరంతరం ఆక్సిజన్ సహాయం కావాలి. నేను రోజా (ఉపవాసం) ఉండలేకపోతున్నాను,” అని ఆయన చెప్పారు. “నా కుటుంబం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నేను చనిపోతే వాళ్ళ గతి ఏమవుతుందో?”

ఫిబ్రవరి 2021లో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు నష్టపరిహారం లభించింది. "మా తరపున సమిత్ కుమార్ కర్ కేసు పెట్టారు," అని సఫీక్ భార్య తస్లీమా బీబీ చెప్పారు. కానీ డబ్బు చాలా తొందరగా ఖర్చయిపోయింది. "మేం ఆ డబ్బును ఇంటి ఖర్చులకు, మా పెద్ద కుమార్తె వివాహానికి ఖర్చు చేశాం," అని తస్లీమా వివరించారు.

ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఝార్ఖండ్ (ఒఎస్‌ఎచ్‌ఎజె ఇండియా)కు చెందిన సమిత్ కుమార్ కర్ రెండు దశాబ్దాలుగా ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలోని సిలికోసిస్ బాధిత కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నారు. సామాజిక భద్రత, నష్ట పరిహారం కోసం బాధితుల తరపున ఆయన ఫిర్యాదులు దాఖలు చేస్తారు.

ఒఎస్‌ఎచ్‌ఎజె ఇండియా 2019-2023లో పశ్చిమ బెంగాల్‌లో సిలికోసిస్‌తో మరణించిన 23 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, అలాగే 30 మంది సిలికోసిస్ బాధిత కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించడంలో సహాయపడింది. అంతేకాకుండా ఈ సంస్థ కృషితో రాష్ట్ర ప్రభుత్వం పింఛను, సంక్షేమ పథకాల కోసం రూ. 10 కోట్లు మంజూరు చేసింది.

"కర్మాగారాల చట్టం 1948 ప్రకారం ర్యామింగ్ మాస్, సిలికా పొడులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు విద్యుత్‌తో పని చేస్తూ, వాటిలో 10 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నట్టయితే, అవి వ్యవస్థీకృత పరిశ్రమల క్రిందికి వస్తాయి. కాబట్టి, కర్మాగారాలకు సంబంధించిన అన్ని కార్మిక నియమాలు, నిబంధనలు వీటికి వర్తిస్తాయి," అని సమిత్ చెప్పారు. ఈ కర్మాగారాలు ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం 1948, వర్క్‌మెన్ (ఉద్యోగుల) పరిహారం చట్టం 1923 కిందకు కూడా వస్తాయి. సిలికోసిస్, కర్మాగారాల చట్టంలో పేర్కొన్న సూచనార్హమైన వ్యాధి కాబట్టి, ఒక వైద్యుడు ఎవరినైనా సిలికోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారిస్తే, వాళ్ళు కర్మాగారాల ప్రధాన పరిశీలకుడికి తెలియజేయాలి.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

సిలికోసిస్‌ కారణంగా తమ భర్తలను కోల్పోయిన అనితా మండల్ (ఎడమ), భారతి హల్దార్ (కుడి). ర్యామింగ్ మాస్ యూనిట్లు చాలా వరకు చట్టవిరుద్ధమైనవి లేదా కొంత మటుకే చట్టబద్ధమైనవి కావటంతో, వాటిలో పనిచేసే చాలామంది కార్మికులు అధికారికంగా నమోదు కాలేదు

దీర్ఘకాలికంగా పనిచేస్తేనే సిలికోసిస్ వస్తుందనే సాధారణ నమ్మకానికి విరుద్ధంగా, ఆ ధూళిని తక్కువ సమయం పీల్చినా అది సిలికోసిస్ వ్యాధికి దారి తీస్తుందని ఒఎస్‌ఎచ్‌ఎజె ఇండియా మార్చి 31, 2024న కొల్‌కతాలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న నిపుణుల బృందం గుర్తించింది. ర్యామింగ్ మాస్ పరిశ్రమలలో పనిచేసే ఉత్తర 24 పరగణా జిల్లాకు చెందిన సిలికోసిస్ రోగులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పనిని ఎన్ని రోజులు చేసినా, ధూళి కణాల చుట్టూ ఫైబ్రస్ టిష్యూలు ఏర్పడటానికి దారితీసి, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడిని అడ్డుకుని, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది.

సిలికోసిస్ ఒక వృత్తిపరమైన వ్యాధి, ఈ వ్యాధి బారిన పడిన కార్మికులు పరిహారం పొందేందుకు అర్హులని సమిత్ కుమార్ వివరించారు. కానీ చాలామంది కార్మికులు రిజిస్టర్ అయినవాళ్ళు కాదు. సిలికోసిస్‌తో బాధపడుతున్న కార్మికులున్న ఫ్యాక్టరీలను గుర్తించే బాధ్యత ప్రభుత్వానిదే. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ (క్లాజ్ 11.4)లో, కార్మికులు చట్టంతో సంబంధం లేకుండా యజమానుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చు అని పేర్కొంది.

కానీ వాస్తవికత కొంత భిన్నంగా ఉంటుందని సమిత్ అన్నారు. "మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి సిలికోసిస్‌ కారణమని చెప్పడానికి అధికారులు నిరాకరించడం నేను చాలా సందర్భాలలో గమనించాను," అని ఆయన చెప్పారు. దానికి ముందే, కార్మికులు అనారోగ్యానికి గురి కాగానే, కర్మాగారాలు వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగిస్తాయి.

మే 2017లో అనితా మండల్ భర్త సువర్ణ సిలికోసిస్‌తో మరణించినప్పుడు, కొల్‌కతాలోని నీల్ రతన్ సర్కార్ ఆసుపత్రి జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణంగా 'లివర్ సిరోసిస్, ఇన్ఫెక్షన్‌తో కూడిన పెరిటోనిటిస్' అని పేర్కొన్నారు. సువర్ణ జామూరియాలోని ర్యామింగ్ మాస్ ఫ్యాక్టరీలో పని చేసేవారు.

"నా భర్తకు ఎప్పుడూ కాలేయ వ్యాధి లేదు," అని అనిత చెప్పారు, "అతను సిలికోసిస్‌తో బాధపడేవాడు." ఝూప్‌ఖాలీ నివాసి అనిత, ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. ఆమె కుమారుడు వలస కూలీగా మారి, కొల్‌కతా డైమండ్ హార్బర్‌లో నిర్మాణ ప్రదేశాలలో పనులు చేస్తున్నాడు. “మరణ ధ్రువీకరణ పత్రంలో వాళ్ళు ఏమి రాశారో నాకు తెలీదు. ఆ సమయంలో నా బాధల్లో నేనున్నాను. నేను సాధారణ గ్రామీణ గృహిణిని, చట్టపరమైన నిబంధనలు నాకేం అర్థం అవుతాయి?” అని అనిత ప్రశ్నించారు.

అనిత, ఆమె కుమారుడు తమ ఇద్దరి ఆదాయంతో, కుమార్తెను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఆమె కూడా సార్వత్రిక ఎన్నికలపైన నిరాసక్తత కనపరిచారు. "గత ఏడేళ్ళలో రెండు ఎన్నికలు జరిగాయి. కానీ నేను ఇప్పటికీ కష్టాల్లోనే జీవిస్తున్నాను. వాటి మీద నాకెందుకు ఆసక్తి ఉండాలో చెప్పండి?" అని ఆమె ప్రశ్నించారు.

అనువాదం: రవి కృష్ణ

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Other stories by Ritayan Mukherjee
Editor : Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna