హర్మన్‌దీప్ సింగ్ తన చుట్టూ పరచుకున్న రంగురంగుల గాలిపటాలతో నిలబడి ఉన్నాడు. అక్కడికి కాస్త ముందర పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్ద రైతులు దిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీ అవరోధాలు ఏర్పాటు చేశారు.
నిరసన తెలుపుతోన్న రైతులపై బాష్పవాయు గోళాలను కురిపిస్తోన్న డ్రోన్‌లను కిందకు దించడానికి అమృత్‌సర్‌కు చెందిన 17 ఏళ్ళ ఈ కుర్రాడు వినూత్నమైన పద్ధతిలో గాలిపటాలను ఉపయోగించాడు. “బాష్పవాయువు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నేను నా కళ్ళ చుట్టూ టూత్‌పేస్ట్‌ను కూడా పూసుకున్నాను. మేం ముందుకు సాగి ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం,” అన్నాడు హర్మన్.
ఫిబ్రవరి 13, 2024న పంజాబ్ నుండి దిల్లీకి శాంతియుతంగా కవాతును ప్రారంభించిన వేలాదిమంది రైతులు, కార్మికులలో హర్మన్‌దీప్ ఒకరు. శంభూ సరిహద్దు వద్ద వారికి పారామిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది, పోలీసు అధికారులు ఎదురయ్యారు. దిల్లీలో తాము నిరసన చేపట్టబోయే ప్రదేశానికి రైతులు చేరుకోకుండా రోడ్డుపై ఇనుప మేకులు, కాంక్రీట్ గోడలు వేశారు.
మొదటి అవరోధం వద్ద, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (MSP) హామీ, రైతులకు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ, లఖింపూర్ ఖేరీ ఊచకోతలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయటం, దోషులను అరెస్టు చేయడం, రైతులకు, కార్మికులకు పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడం, 2020-2021 నిరసనలలో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం - ఈ ఐదు ప్రధాన డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ గురుజాండ్ సింగ్ ఖాల్సా మాట్లాడారు.
2020-21లో దేశవ్యాప్తంగా రైతులు సెప్టెంబర్ 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన మూడు వ్యవసాయ చట్టాలకు - ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; రైతుల ఉత్పత్తి, వర్తకం, వాణిజ్యం (ప్రోత్సాహం మరియు సులభతరం చేయటం) చట్టం, 2020 ; నిత్యావసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 - వ్యతిరేకంగా సంఘటితమయ్యారు. నవంబర్ 2021లో ఈ చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఉద్యమంపై PARI కథనాలను చదవండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు: పూర్తి కథనాలు
“మేమెప్పుడూ నిరసనను ముగించలేదు. మేం కేంద్ర ప్రభుత్వంతో సమావేశమయ్యాం, ఆ సమావేశంలో కేంద్ర మంత్రులు మా డిమాండ్లన్నింటికీ అంగీకరించారు, వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అందువలన మేం దానికి విరామమిచ్చాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు కొనసాగుతున్నందున ఇంతకాలం వేచి చూశాం. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఆ సమావేశాలను అకస్మాత్తుగా నిలిపివేసి, కమిటీని రద్దు చేశారు. దాంతో మళ్ళీ మేం తిరిగి రావలసివచ్చింది." కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ళ ఖాల్సా అన్నాడు.
పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో గుమిగూడి, నిరసనకారులు సరిహద్దు దాటడానికి వీలుగా అధికారులను సవాలు చేయడం, వారి దృష్టిని మరల్చడం వంటి పనులు చేయటం మొదలుపెట్టారు.
శంభూ వద్ద ఉంచిన అవరోధాలను నిరసనకారులు ఛేదించడం ప్రారంభించడంతో, పోలీసు అధికారులు వారిపై పలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఫలితంగా చాలామంది గాయపడ్డారు. గుంపును చెదరగొట్టడం కోసం పోలీసులు బాష్పవాయు గోళాలను గాలిలోకి వదలటానికి బదులు వ్యక్తులపైకి గురిచూసి వాటిని వదులుతున్నారని ఇదంతా చూసినవారు చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు నీటి ఫిరంగులను కూడా ప్రయోగించారు. బాష్పవాయు గోళాలను పగలగొట్టేందుకు పలువురు వృద్ధ రైతులు, కూలీలు కర్రలతో వచ్చారు. ప్రతి గోళాన్ని పనిచేయకుండా చేసి, ప్రజలు హర్షధ్వానాలతో సంబరాలు చేసుకున్నారు
బాష్పవాయు గోళాలను పనిచేయకుండా చేసినవారిలో అమృత్‌సర్‌కు చెందిన తిర్పాల్ సింగ్ అనే రైతు ఉన్నారు. "మా దగ్గర ఆయుధాలు లేవు. అయినప్పటికీ వాళ్ళు రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు, పెట్రోల్ బాంబులు, బాష్పవాయువు వంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు," అని ఆయన చెప్పారు. "ఈ రహదారి ప్రపంచానిది, మేం కేవలం దాని మీద ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. శాంతియుతంగా ఉన్నప్పటికీ మాపైన దాడులు జరుగుతున్నాయి. నాకిప్పుడు, శంభూ సరిహద్దులో బందీనైనట్టుగా అనిపిస్తోంది."
ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని 50 ఏళ్ళ వయసున్న ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వం ఎమ్ఎస్‌పికి హామీ ఇవ్వడం లేదు. ఎందుకంటే వారు తమ పార్టీకి నిధులు సమకూర్చే ధనిక కార్పొరేట్లను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నారు," అన్నారతను. “ఎమ్ఎస్‌పి హామీ లేకపోతే, పెద్ద సంస్థలు మమ్మల్ని దోపిడీ చేయగలవు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, మా పంటలను మా వద్ద నుండి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆపైన చాలా ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ప్రభుత్వం పెద్ద సంస్థలకు వందల కోట్ల రుణాలను రద్దు చేయగలిగినప్పుడు, కొన్ని లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న రైతుల, కార్మికుల రుణాలను కూడా మాఫీ చేయగలదని తిర్పాల్ సింగ్ అభిప్రాయపడ్డారు.
బాష్పవాయువు పొగలనూ, నీటి ఫిరంగులనూ ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత, చాలామంది నిరసనకారులు అవరోధాల రెండవ అంచెపై ఉన్న మేకులను తొలగించేందు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు రైతులను వెనక్కు వెళ్ళేలా చేయడానికి రైతుల కాళ్ళపైకి గురిచూసి రబ్బరు బుల్లెట్లను కాల్చడం కనిపించింది.
నిమిషాల వ్యవధిలోనే, రక్తాలు కారుతోన్న అనేక మంది రైతులను, కూలీలను కొంతమంది స్వతంత్ర వైద్యులు ఏర్పాటుచేసిన వైద్య శిబిరానికి తీసుకెళ్ళడం కనిపించింది.
"చివరి గంటలో నేను దెబ్బతిన్న 50 మందికి చికిత్స చేయాల్సివచ్చింది," అటువంటి ఒక వైద్య శిబిరానికి బాధ్యత వహిస్తోన్న డాక్టర్ మన్‌దీప్ సింగ్ చెప్పాడు. "నేను శంభూ సరిహద్దుకు వచ్చినప్పటి నుండి ఎంతమందికి చికిత్స చేశానో లెక్క కూడా మర్చిపోయాను," 28 ఏళ్ళ వయసున్న ఈ వైద్యుడు తన స్వగ్రామమైన హొషియార్‌పూర్‌లో బాబా శ్రీ చంద్‌జీ హాస్పిటల్‌ను నడుపుతున్నాడు. ఈ యువ వైద్యుడు కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చాడు, 2020లో జరిగిన నిరసనలో పాల్గొన్నాడు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న న్యాయవాద, మానవతా సహాయ సంస్థ యునైటెడ్ సిఖ్‌తో కలిసి ఒక శిబిరాన్ని నిర్వహించాడు.
"తెగిన గాయాల నుండి కోసిన గాయాల వరకు, కొంతమంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ, ఇంకా అనేక రకాల సమస్యలతో జనం వచ్చారు" అని మన్‌దీప్ చెప్పాడు. “ప్రభుత్వం మన రైతుల గురించీ, వారి శ్రేయస్సు గురించి శ్రద్ధ పెట్టాలి. మనమే కదా వారిని ఎన్నుకుని అధికారంలోకి తెచ్చింది,” అన్నాడతను.
మైదానంలో ఉన్న మరో వైద్యురాలు దీపిక. వైద్య శిబిరంలో సహాయం చేయడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుండి వచ్చిన ఈ 25 ఏళ్ళ యువతి ఇలా అంటోంది, “శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు, ప్రజలు ఆందోళననూ అసౌకర్యాన్నీ అనుభవిస్తున్నారు. నిరంతర బాష్పవాయు ప్రయోగంతో వచ్చే పొగనంతా పీల్చుకోవటం వల్ల వారు పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు.”
ఇక్కడ సహాయం చేస్తున్నది ఒక్క వైద్యులే కాదు - ఈ అవరోధాలకు కొద్ది మీటర్ల దూరంలో జనం తమ ట్రాలీలను ఏర్పాటు చేయటంలోనూ, అందరికోసం లాంగర్ తయరుచేయటంలోనూ తీరికలేకుండా ఉన్నారు. చాలామంది తమ కుటుంబాలతో సహా అక్కడికి వచ్చారు. గుర్‌ప్రీత్ సింగ్ తన చిన్నకుమారుడు తేజస్‌వీర్‌తో సహా వచ్చారు. "మా పోరాటాన్ని చూసేందుకు నేను నా కొడుకుని ఇక్కడకు తెచ్చాను," పటియాలా నుంచి వచ్చిన గుర్‌ప్రీత్ చెప్పారు. "మనం మన హక్కుల కోసం పోరాడటం ఎందుకు ముఖ్యమో నేను అతనికి బోధించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనలను అణచివేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులుగా, కార్మికులుగా మనం చేయవలసింది ఇదే," అని ఆయన అన్నారు.
నిరసన వేదిక చుట్టూ విప్లవ గీతాలు, నినాదాలు మోగుతున్నాయి. “ ఇక్కీ దుక్కీ చక్ దేయాంగే, తౌణ్ చే గోటా రఖ్ దేయాంగే " [మేం ప్రతి టామ్‌నీ, డిక్‌నీ, హ్యారీని మట్టికరిపిస్తాం, వారి మెడలు మా కాళ్ళ క్రింద ఉంటాయి], అని నినాదాలు చేస్తూ కవాతు చేస్తూ ఎక్కువమంది ప్రజలను సమీకరిస్తున్నారు.
"ఇది రైతుల ప్రాథమిక హక్కుల కోసం చేసే పోరాటం కాబట్టి నేను నిరసన తెలుపుతున్నాను," అని రాజ్ కౌర్ గిల్ చెప్పారు. చండీగఢ్‌కు చెందిన 40 ఏళ్ళ రాజ్ కౌర్ 2021లో చండీగఢ్‌లో రైతుల నిరసనలకు నాడీ వేదిక అయిన మట్కా చౌక్‌లో కేంద్ర బిందువుగా కనిపించేవారు.
“ఎమ్ఎస్‌పిని అందించకపోవడం ద్వారా ప్రభుత్వం రైతు ప్రాథమిక మనుగడను చాలా కష్టతరం చేస్తోంది. ఇదంతా దేశాన్ని పోషించేవారిని దోపిడీ చేస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందడానికే,” అని ఆమె చెప్పారు.
"వాళ్ళెన్నటికీ విజయం సాధించలేరు."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి