కోమల్ ఒక రైలు ఎక్కాలి. ఆమె అసోమ్‌లోని రాంగియా జంక్షన్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తోంది.

అది, తాను ఎన్నడూ తిరిగి వెళ్ళకూడదని, చివరకు మానసిక వైకల్యం ఉన్న తన తల్లిని చూసేందుకు కూడా, ఒట్టు పెట్టుకున్న ప్రదేశం.

తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ఆ ఇంటికి తిరిగి వెళ్ళటం కంటే, దిల్లీలోని జిబి రోడ్‌లో ఉండే వేశ్యా గృహాలలో ఉంటూ, అక్కడ పనిచేయటానికే ఆమె ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు తనను తిరిగి పంపుతున్న ఆ కుటుంబంలో తాను పదేళ్ళ బాలికగా ఉండగా తనపై అనేకసార్లు అత్యాచారం చేసిన 17 ఏళ్ళ అన్న వరసయ్యే అతను (కజిన్) కూడా నివసిస్తున్నాడు. "నాకు అతని (కజిన్) మొహం చూడాలని లేదు. నాకు అతనంటే రోత," అంటుంది కోమల్. అతను ఆమెను తరచూ కొట్టేవాడు, తనను ఆపే ప్రయత్నం చేస్తే ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించేవాడు. ఒకసారి అతను ఆమెను ఒక పదునైన వస్తువుతో కొట్టడం వలన ఏర్పడిన గాయపు మచ్చ ఆమె నుదిటిపై అలాగే ఉంది.

" హే కారొణే ముర్ ఘర్ జాబో మొన్ నై. మొయ్ కిమన్ బార్ కొయిసు హీ హోతొక్ [నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించకపోవటానికి కారణం ఇదే. నేను వాళ్ళకు చాలాసార్లు చెప్పాను కూడా]," పోలీసులతో వ్యవహరించేటపుడు తాను వారితో ఇలా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నది కోమల్. అయినప్పటికీ, పోలీసులు ఎలాంటి ఏర్పాట్లూ చేయకుండా ఆమెను రైలులో 35 గంటల అసోమ్ ప్రయాణానికి పంపేస్తున్నారు. ఆమె సురక్షితంగా ఇంటికి చేరిందో లేదో నిర్ధారించడానికి కానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఆమె మరింత హింసను ఎదుర్కోకుండా రక్షించబడటానికి కానీ వీలు లేకుండా, కనీసం ఒక సిమ్ కార్డు కూడా ఇవ్వకుండా ఆమెను పంపించేస్తున్నారు.

కోమల్‌కు నిజంగా కావలసింది అక్రమ రవాణాకు గురైన మైనర్లకు, చిన్నవయసు యువతులకు అవసరమైన ప్రత్యేక సహాయక సేవలు.

Komal trying to divert her mind by looking at her own reels on her Instagram profile which she created during her time in Delhi’s GB Road brothels. She enjoys the comments and likes received on the videos
PHOTO • Karan Dhiman

దిల్లీలోని జిబి రోడ్‌లో ఉండే వేశ్యాగృహాల్లో ఉన్న సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసుకున్న తన సొంత రీళ్ళను చూసుకోవడం ద్వారా మనసును మళ్ళించుకునే ప్రయత్నం చేస్తోన్న కోమల్. వీడియోలపై వచ్చిన కామెంట్లు, లైక్‌లు ఆమెకు ఆనందాన్నిస్తాయి

*****

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇద్దరు పోలీసు అధికారులు ఆమె పనిచేస్తూ, నివసిస్తోన్న వేశ్యా గృహంలోకి వచ్చ్చినప్పుడు, దాదాపు 4x6 చదరపు అడుగుల అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే తన గది నుండి ఇనుప మెట్ల నిచ్చెన మీదుగా తాను కిందికి దిగుతున్న విషయాన్ని కోమల్ (అసలు పేరు కాదు) గుర్తుచేసుకుంది. ఆ దారిన వెళ్ళేవారికి ఈ గదులు కనిపించవు; ఆ ఇనుప నిచ్చెనలు మాత్రమే దిల్లీలోని రెడ్‌లైట్ జిల్లాగా చెడ్డపేరున్న శ్రద్ధానంద్ మార్గ్‌లో సెక్స్ వర్క్ నిర్వహించబడుతున్న విషయాన్ని పట్టి ఇస్తాయి. ఈ ప్రాంతాన్ని వాడుకలో జిబి రోడ్ అని పిలుస్తారు.

తనకు 22 ఏళ్ళ వయసని ఆమె వారితో చెప్పింది. " కొమ్ ఒ హోబో పారేఁ... భాల్కే నజానూ మొయ్ [ఇంకా తక్కువే ఉండొచ్చు. నాకు సరిగ్గా తెలియదు]," కోమల్ తన మాతృభాష అస్సామీలో చెప్పింది. చూసేందుకు ఆమెకు 17 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నట్టుగా అనిపించటంలేదు, బహుశా 18 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె మైనర్ అని నమ్మిన పోలీసులు ఆ రోజు ఆమెను ఆ వేశ్యా గృహం నుంచి 'రక్షించారు'.

ఆ పోలీసు అధికారులను దీదీలు (వేశ్యాగృహం యజమానులు) ఆపలేదు, ఎందుకంటే కోమల్ అసలు వయసెంతో వారికి కూడా తెలియదు. అధికారులు అడిగితే తన వయసు 20 దాటిందనీ, తాను “ అప్నీ మర్జీ సే [తన ఇష్ట ప్రకారమే]” ఈ వేశ్యావృత్తిని చేపట్టానని చెప్పమని కోమల్‌కు దీదీలు సూచనలు ఇచ్చారు.

ఆ మాట కోమల్ మనసుకు నిజమే అనిపించింది. స్వతంత్రంగా జీవించేందుకు దిల్లీకి వెళ్ళి పడుపు వృత్తిని తానే ఎంచుకున్నట్లు ఆమె భావించింది. కానీ ఆమె ఈ 'ఎంపిక' మైనర్‌గా అత్యాచారానికి గురై, అక్రమ రవాణాతో సహా బాధాకరమైన అనుభవాల పరంపర తర్వాత చేసుకున్నది. వాటిని తట్టుకోవడానికి, కోలుకొని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడానికి సహాయపడే సహాయక వ్యవస్థలు ఏవీ ఆమెకు అందుబాటులోకి రాలేదు.

ఆమె తన ఇష్టానుసారమే వ్యభిచార గృహంలో ఉన్నానని పోలీసులకు చెప్పినా వాళ్ళు నమ్మలేదు. తన ఫోన్‌లో ఉన్న జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా ఆమె వారికి చూపించి, తన వయస్సు 22 సంవత్సరాలు అవునో కాదో సరిచూడమని వారిని కోరింది. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. ఆమెకున్న ఏకైక గుర్తింపు పత్రం అదే అయినా అది సరిపోలేదు. కోమల్‌ను 'రక్షించి', పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి, ఆమెకు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను మైనర్ల కోసం ప్రభుత్వం నడుపుతోన్న ఆశ్రయానికి పంపారు. అక్కడ ఆమె 18 రోజులుంది. కోమల్‌ను మైనర్ అని భావించినందున, సరైన పద్ధతి ప్రకారం ఆమెను ఆమె కుటుంబంతో తిరిగి చేరుస్తామని ఆమెకు చెప్పారు.

ఆమె ఆ అశ్రయంలో ఉండగానే, పోలీసులు వేశ్యాగృహం నుంచి దీదీలు అందజేసిన 20,000 ఖరీదు చేసే చెవిపోగులతో పాటు, ఆమె బట్టలను, రెండు ఫోనులను స్వాధీనం చేసుకున్నారు.

కోమల్ సెక్స్ వర్క్‌లోకి ప్రవేశించడం, మైనర్‌గా అత్యాచారానికి గురై, అక్రమ రవాణాతో సహా అనేక బాధాకరమైన అనుభవాల పరంపర తర్వాత జరిగింది. వాటిని తట్టుకోవడానికి, వాటినుంచి కోలుకోవడానికి ఆమెకు ఎటువంటి సహాయక వ్యవస్థలు అందుబాటులోకి రాలేదు

ఒక బంధువు చేత లైంగిక వేధింపులకు గురైన కోమల్ తన జీవితాన్ని గురించి మాట్లాడిన ఈ వీడియోను చూడండి

"మైనర్లు తిరిగి అక్రమ రవాణాకు గురికాకుండా అధికారులు హామీపడాలి. మైనర్ బాధితులు తిరిగి తమ కుటుంబం దగ్గరికి చేరాలనుకున్నా, లేదా ఆశ్రయ గృహంలోనే ఉండిపోవాలనుకున్నా వారి ఇష్టానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. బాధితులను కుటుంబాలకు అప్పగించబోయే ముందు ఆ కుటుంబాలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం," అంటారు దిల్లీకి చెందిన మానవ హక్కుల న్యాయవాది ఉత్కర్ష్ సింగ్. జువనైల్ జస్టిస్ యాక్ట్, 2015 కింద ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), కోమల్ కేసు వంటి కేసులలో పునరావాస ప్రక్రియలు ఈ చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ఆయన నమ్ముతారు.

*****

కోమల్ గ్రామం అసోమ్‌కు చెందిన బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలోని బక్సా జిల్లాలో ఉంది. బిటిఆర్‌గా అందరికీ తెలిసిన రాష్ట్రంలోని ఈ పశ్చిమ ప్రాంతం ఒక స్వయంప్రతిపత్తి కలిగిన విభాగం, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ఏర్పడిన ప్రతిపాదిత రాష్ట్రం.

కోమల్ గ్రామంలోని చాలామంది ఆమెపై ఆమె బంధువు అత్యాచారం చేసి, దానిని చిత్రీకరించి, ప్రచారం చేసిన వీడియోలను చూశారు. “మా మామ [మేనమామ, కజిన్‌కు తండ్రి] ప్రతిదానికీ నన్ను నిందిస్తాడు. నేను అతని కొడుకుకు ఎర వేశానని అతనంటాడు. మా అమ్మ ఏడుస్తూ, ఆపమని వేడుకుంటున్నప్పటికీ కూడా అతను నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టేవాడు,” అని కోమల్ వివరించింది. ఎటువంటి సహాయం గానీ, ఈ హింసకు అంతం గానీ లేకపోయేసరికి, పదేళ్ళ వయసున్న కోమల్ తరచుగా తనకు తాను హాని చేసుకునేది. “నేను అనుభవించే తీవ్రమైన కోపం, భాధల నుండి ఉపశమనానికి ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌తో నా చేతిని కోసుకునేదాన్ని. నా జీవితాన్ని ముగించాలనుకున్నాను.”

ఆ వీడియోలు చూసినవారిలో ఆమె బంధువు స్నేహితుడైన బికాస్ భయ్యా (అన్న) కూడా ఉన్నాడు. అతను ఒక 'పరిష్కారం'తో ఆమెను కలిశాడు.

"తనతో పాటు సిలిగురి [దగ్గరలో ఉన్న నగరం]కి వచ్చి పడుపు వృత్తిలో చేరమని అతను నాతో చెప్పాడు. [అతను చెప్పాడు] ఆ విధంగా నేను కనీసం డబ్బు సంపాదించి మా అమ్మను కూడా చూసుకోగలనని కూడా. పల్లెటూరిలో ఉండి అత్యాచారానికి గురికావటం, పరువు పోగొట్టుకోవటం కంటే అదే మెరుగైన పని అని అతను చెప్పాడు," అంది కోమల్.

కొద్ది రోజులలోనే ఆ చిన్న బాలిక తనతో పాటు పారిపోయి వచ్చేసేలా బికాస్ ఆమెను బలవంతపెట్టాడు. పదేళ్ళ కోమల్ పశ్చిమ బెంగాల్, సిలిగురి నగరంలోని ఖాల్‌పారా వేశ్యా గృహాలకు తనకు తానే అక్రమ రవాణా అయింది. భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 370 ప్రకారం, మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులు, బలప్రయోగం, బలవంతపెట్టడం, అపహరణ, వంచించటం, మోసం, అధికార దుర్వినియోగం, వ్యభిచారం చేయించే ఉద్దేశంతో మరొక వ్యక్తిని ప్రలోభపెట్టటం, బాల కార్మికులు, వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, మొదలైనటువంటి చట్టవిరుద్ధమైన చర్యగా నిర్వచించబడింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ (నివారణ) చట్టం (ITPA), 1956 లోని సెక్షన్ 5, వ్యభిచార ప్రయోజనాల నిమిత్తం వ్యక్తిని లేదా వ్యక్తులను తార్చే, ప్రేరేపించే వారికి జరిమానా విధిస్తుంది. "వ్యక్తి ఇష్టానికి లేదా పిల్లలకి వ్యతిరేకంగా చేసే నేరాలకు గరిష్టంగా  పద్నాలుగు సంవత్సరాలు లేదా యావజ్జీవ శిక్ష విధించవచ్చు. "ITPA ప్రకారం, “పిల్లలు” అంటే 16 ఏళ్ళు నిండనివారు.

ఆమె అక్రమ రవాణాలో బికాస్ స్పష్టమైన పాత్ర ఉన్నప్పటికీ, అతనికి వ్యతిరేకంగా అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు లేకపోవటంతో, ఈ చట్టాల పూర్తి పర్యవసానాలను అతను ఎదుర్కొనే అవకాశం లేదు.

Komal's self harming herself was a way to cope with what was happening to her, she says
PHOTO • Karan Dhiman

తనకు జరుగుతున్న దానిని ఎదుర్కోవటానికి తనకు తానే హాని చేసుకోవడం ఒక మార్గం అని కోమల్ చెప్పింది

ఆమెను సిలిగురికి తీసుకువెళ్ళిన సుమారు మూడేళ్ళ తర్వాత, పోలీసులు చేసిన ఒక దాడిలో ఆమెను ఖాల్‌పారా నుంచి రక్షించారు. ఒక CWC కోర్టులో తనను హాజరుపరచడం, 15 రోజులపాటు ఒక మైనర్ల ఆశ్రయంలో తనను ఉంచటం ఆమె గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఆమెను ఇంటికి వెళ్ళటానికి ఏ తోడూ లేకుండా అసోమ్ వెళ్ళే రైలెక్కించారు - మరోసారి, ఈ 2024లో పంపుతున్నట్లుగానే.

కోమల్ వంటి అక్రమ రవాణాకు గురైన పిల్లలను ఇళ్ళకు పంపించడంలో 2015లోనూ, 2024లో కూడా అనుసరించాల్సిన పద్ధతిని అనుసరించలేదు.

' వ్యాపార సంబంధమైన లైంగిక దోపిడీ ', ' బలవంతపు శ్రమ ' కోసం జరిగే అక్రమ రవాణా నేరాలను పరిశోధించే ప్రభుత్వ ప్రామాణిక నిర్వహణా ప్రక్రియల (SOPలు) కోసం బాధితుల వయసును నిర్ధారించేందుకు జనన ధృవీకరణ పత్రం, పాఠశాల సర్టిఫికేట్, రేషన్ కార్డ్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ పత్రాన్ని పొందేందుకు ఒక దర్యాప్తు అధికారి (IO) అవసరం ఉంటుంది. అలాంటివారు అందుబాటులో లేకున్నా, లేదా పూర్తిస్థాయిలో లేకున్నా బాధితులను "కోర్టు ఆదేశాలపై వయస్సు నిర్ధారణ పరీక్ష" కోసం పంపవచ్చు. అలాగే, లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టం (POCSO), 2012 లోని సెక్షన్ 34 (2) ప్రకారం, పిల్లల వాస్తవ వయస్సును గుర్తించేందుకు, “అలాంటి నిర్ణయానికి గల కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయడం” కోసం ఒక ప్రత్యేక న్యాయస్థానం అవసరం.

కోమల్ జనన ధృవీకరణ పత్రాన్ని ఆమెను దిల్లీలో రక్షించిన పోలీసులు తోసిపుచ్చారు. ఆమెను ఎన్నడూ చట్టబద్ధమైన వైద్య పరీక్ష మెడికో-లీగల్ కేస్ (MLC) కోసం తీసుకువెళ్ళలేదు, DM ముందుకు కానీ CWC ముందుకు గానీ ఆమెను హాజరుపెట్టలేదు. ఆమె అసలైన వయసును నిర్ధారించేందుకు ఎముక-దృఢత్వ పరీక్ష ను చేసే ప్రయత్నాలు జరగలేదు.

బాధితులకు పునరావాసం కల్పించడం లేదా వారి కుటుంబాలతో కలపటం గురించి అధికారుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్లయితే, ముందుగా "ఇంటిని గురించిన పరిశీలన సరైనవిధంగా జరిగిందని" నిర్ధారించడం దర్యాప్తు అధికారి (IO) లేదా CWC బాధ్యత. "బాధితులను ఇంటికి తిరిగి పంపించేట్లయితే, వారు సమాజంలో తిరిగి కలిసిపోవడానికి అవసరమైన అంగీకారాన్ని, అవకాశాలను" అధికారులు గుర్తించి, నమోదు చేయాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులు తిరిగి అదే పనిప్రదేశానికి వెళ్ళకూడదు లేదా "మరింత ప్రమాదకర పరిస్థితులకు" గురికాకూడదు. ఆమెపై అత్యాచారం, అక్రమ రవాణా జరిగిన అసోమ్‌కే ఆమెను తిరిగి పంపటమంటే దీనిని స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇంటి పరిస్థితుల గురించి పరిశీలన జరగలేదు; కోమల్ కుటుంబం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు, లేదా సెక్స్ ట్రాఫికింగ్‌లో మైనర్ బాధితురాలిగా ఆమెకు పునరావాసం కలిగించడంలో మద్దతు కోసం ఏదైనా ఒక ఎన్‌జిఒని కూడా సంప్రదించలేదు.

Komal says she enjoys creating reels on classic Hindi film songs and finds it therapeutic as well
PHOTO • Karan Dhiman

క్లాసిక్ హిందీ సినిమా పాటలపై రీల్స్‌ను రూపొందించడం తనకు చాలా ఇష్టమని, అది స్వస్థత చేకూర్చే విధంగా కూడా ఉంటుందని కోమల్ చెప్పింది

ఇంకా, ప్రభుత్వ ఉజ్వల పథకం ప్రకారం అక్రమ రవాణా, లైంగిక దోపిడీలకు గురైన బాధితులకు తప్పనిసరిగా కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన శిక్షణతో సహా "తక్షణ, దీర్ఘకాలిక పునరావాస సేవలను, ప్రాథమిక సౌకర్యాలు/అవసరాలను" అందించాలి. బాధితుల జీవితాల్లో మానసిక మద్దతు ప్రాముఖ్యాన్ని గురించి సెక్స్ ట్రాఫికింగ్ కేసులతో వ్యవహరించడంలో అనుభవం ఉన్న పిల్లల కౌన్సెలర్ ఆనీ థియోడర్ కూడా నొక్కి చెప్పారు. "బాధితులను తిరిగి సమాజంలోకి చేర్చిన తర్వాత, లేదా వారి సంరక్షకులకు అప్పగించిన తర్వాత కూడా వారికి కౌన్సెలింగ్ కొనసాగించడం అతిపెద్ద సవాలు," అని ఆమె చెప్పారు.

దిల్లీ వ్యభిచార గృహాల నుండి 'రక్షించిన' తర్వాత, ఆమెకు పునరావాసం కల్పించే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు, కోమల్‌కు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. "సంవత్సరాల తరబడి గాయంతో బాధపడుతున్న వ్యక్తి కేవలం రెండు మూడు నెలల కౌన్సెలింగ్ సెషన్‌లతో, కొన్ని సందర్భాల్లో రెండు రోజుల కౌన్సెలింగ్ సెషన్‌లతోనూ ఎలా కోలుకుంటారు?" అని కౌన్సెలర్ ఆనీ అడుగుతారు. బాధితులు గాయాన్ని మాన్పుకోవాలని, కోలుకోవాలని, వారి కష్టాలను గురించి బయటకు తెలియజెప్పాలని ఆశించడంలో వ్యవస్థ కఠినంగా ఉంటుందని, ఎందుకంటే ప్రధానంగా వారు (ఏజెన్సీలు) కోరుకోవటం వలన అనీ ఆమె అన్నారు.

ప్రభుత్వ ఏజెన్సీలు రక్షించబడిన బాధితుల బలహీనమైన మానసిక ఆరోగ్యాన్ని మరింత ప్రకోపింప చేస్తాయని చాలామంది నిపుణులు విశ్వసిస్తున్నారు. వారిని మళ్ళీ అక్రమ రవాణాకు గురయ్యేలా లేదా తిరిగి పడుపు వృత్తిలోకి వచ్చేలా అవి బలవంతపెడతాయి. "నిరంతరం ప్రశ్నించడం, వారిపట్ల చూపించే ఉపేక్షా భావం వల్ల బాధితులు అంతకుముందు తాము అనుభవించిన ఆ బాధను తిరిగి అనుభవిస్తున్నట్లుగా భావిస్తారు. ఇంతకుముందు అక్రమ రవాణాదారులు, వ్యభిచార గృహాల యజమానులు, తార్చేవాళ్ళు, ఇతర నేరగాళ్ళు వారిని వేధింపులకు గురిచేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు అదే పని చేస్తున్నాయి,” అని ఆనీ ముగించారు.

*****

మొదటిసారి రక్షించబడినప్పుడు కోమల్ వయసు 13 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు. రెండవసారి, బహుశా ఆమెకు 22 ఏళ్ళు ఉండొచ్చు; ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రక్షించబడి, దిల్లీని వదిలి వెళ్ళిపోయేలా చేస్తున్నారు. 2024, మే నెలలో ఆమె అసోమ్ వెళ్ళే రైలు ఎక్కింది-- అయితే ఆమె అక్కడికి క్షేమంగా చేరిందా? ఆమె తన తల్లితో కలిసి జీవిస్తుందా, లేదా మరేదైనా రెడ్-లైట్ ప్రాంతంలో కనిపిస్తుందా?

భారతదేశంలోని లైంగిక, జెండర్-ఆధారిత హింస (SGBV) నుండి బయటపడినవారి సంరక్షణ కోసం సామాజికంగా, సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ఉన్న అడ్డంకులపై దృష్టి సారించే దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఈ కథనం ఒక భాగం. ఇది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండియా అందించిన ప్రోత్సాహంలో భాగం.

వారి గుర్తింపును కాపాడేందుకు రక్షించబడినవారి పేర్లను, వారి కుటుంబ సభ్యుల పేర్లను మార్చడమైనది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Pari Saikia

ఆగ్నేయాసియా, ఐరోపాల నుండి మానవ అక్రమ రవాణా గురించి డాక్యుమెంట్ చేస్తోన్న పరి సైకియా ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె 2023, 2022, 2021లకు జర్నలిజం ఫండ్ యూరప్ ఫెలోగా ఉన్నారు.

Other stories by Pari Saikia
Illustration : Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Other stories by Priyanka Borar

2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.

Other stories by Anubha Bhonsle
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli