నాగరాజ్ బండన్ తన ఇంట్లో వండే రాగి కలి వాసనను గుర్తుతెచ్చుకున్నారు. చిన్నపిల్లాడిగా ఉండగా ఆయన దాని కోసం ప్రతి రోజూ ఎదురుచూసేవాడు.

ఐదు దశాబ్దాల తర్వాత, రాగి కలి ( రాగి పిండితో చేసే వంటకం) అంతకు ముందులా అసలు లేదు. "ఇప్పుడు మనకు లభిస్తోన్న రాగి ఇంతకుముందు ఉన్నంత సువాసనగా గానీ రుచిగా గానీ ఉండటంలేదు," అంటూ, ఇప్పుడు రాగి కలి ని కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇరుల (తమిళనాడులో షెడ్యూల్డ్ తెగల కింద జాబితా అయివుంది) సముదాయానికి చెందిన నాగరాజ్ నీలగిరులలోని బొక్కాపురమ్ గూడేనికి చెందినవారు. ఆయన రాగుల వంటి చిరుధాన్యాల మధ్య పెరిగినవారు. ఆయన తల్లిదండ్రులు రాగులు , చోళమ్ ( జొన్నలు ), కంబూ ( సజ్జలు ) సామై ( సామలు ) వంటివాటిని సాగుచేశారు. కొన్ని కిలోల చిరుధాన్యాలను కుటుంబం తినటం కోసం పక్కన పెట్టి, మిగిలినవాటిని అమ్మకం కోసం ఉంచేవారు.

పెడ్డవాడై, వ్యవసాయం చేపట్టిన నాగరాజ్, తన తండ్రికి వచ్చిన దిగుబడి కంటే తన కాలానికి వస్తోన్న దిగుబడి చాలా తక్కువగా ఉండటాన్ని గమనించారు. "మాకు కేవలం తినటానికి మాత్రమే సరిపోయేంత [ రాగులు ] వస్తాయి, కొన్నిసార్లు అన్నికూడా రావు," అని ఆయన PARIతో చెప్పారు. తనకున్న రెండెకరాల పొలంలో రాగుల ను పండించడాన్ని కొనసాగించిన ఆయన, అందులో చిక్కుళ్ళు, వంకాయల వంటి కూరగాయలను అంతరపంటలుగా వేశారు.

ఇతర రైతులు కూడా ఈ మార్పును గమనించారు. తన తండ్రికి 10-20 బస్తాల రాగుల దిగుబడి వచ్చేదని మారి చెప్పారు. అయితే, తన రెండెకరాల పొలం నుంచి ఇప్పుడు కేవలం 2-3 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోందని ఈ 45 ఏళ్ళ రైతు చెప్పారు.

నీలగిరులలో 1948-49లో ఉన్న 1,369 హెక్టార్ల రాగుల సాగు 1998-99 నాటికి 86 హెక్టార్లకు తగ్గిపోయినట్లు చూపిస్తోన్న అధికారిక సంఖ్యలు నాగరాజ్, మారిల అనుభవాలలో ప్రతిబింబిస్తున్నాయి.

చివరగా తీసిన పంటల గణన (2011) ప్రకారం, జిల్లాలో చిరుధాన్యాల సాగు కేవలం ఒక హెక్టారు భూమిలోనే సాగుతోంది.

PHOTO • Sanviti Iyer

గత కొన్ని దశాబ్దాలుగా నీలగిరులలో రాగుల సాగు క్షీణించిపోయిందని గుర్తించిన రైతులు మారి (ఎడమ), సురేశ్ (మధ్యలో), నాగరాజ్ (కుడి). జిల్లాలో చిరుధ్యాన్యాల సాగు కేవలం ఒక హెక్టారు భూమిలోనే సాగుతోందని 2011 నాటి పంటల గణన చెప్తోంది

PHOTO • Sanviti Iyer
PHOTO • Sanviti Iyer

నాగరాజ్ బండన్ పొలం (ఎడమ), మారి పొలం (కుడి). 'ఇప్పుడు మనకు లభిస్తోన్న రాగి ఇంతకుముందున్న వాటంత సువాసనతోనూ, రుచిగానూ ఉండటంలేదు,' అంటారు నాగరాజ్

"పోయిన ఏడాది నాకు రాగు లేమీ పండలేదు," జూన్ 2023లో తాను విత్తిన రాగి విత్తనాల గురించి నాగరాజ్ చెప్పారు. "నేను విత్తనాలు నాటకముందు వర్షం కురిసింది కానీ ఆ తర్వాత వర్షం లేదు. దాంతో విత్తనాలు ఎండిపోయాయి."

ఇప్పుడు కొత్త విత్తనాలను వాడుతుండటం వలన రాగి మొక్కలు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయని మరో ఇరుల రైతు సురేశ్ చెప్పారు. "ఇంకెంతమాత్రం వ్యవసాయం మీద ఆధారపడలేం," అన్నారతను. ఆయన కొడుకులిద్దరూ వ్యవసాయాన్ని వదిలేసి కోయంబత్తూరులో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు.

వర్షపాత నమూనాలు మరింత అస్తవ్యస్తంగా మారిపోయాయి. "ఇంతకుముందు ఆరు నెలల పాటు [మే నెల చివరి నుండి అక్టోబర్ ప్రారంభం వరకు] వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు వాన ఎప్పుడు వస్తుందో చెప్పలేం; డిసెంబర్‌లో కూడా వానలు పడొచ్చు," వర్షాలు లేకపోవటం వల్లనే దిగుబడి తగ్గిపోవడానికి కారణమని నిందిస్తూ అన్నారు నాగరాజ్. "మనం ఇకపై వర్షాల మీద ఎంతమాత్రం ఆధారపడలేం."

పశ్చిమ కనుమల దక్షిణ భాగాన ఉన్న నీలగిరి జీవావరణ రిజర్వ్ ప్రాంతాన్ని జీవవైవిధ్యానికి ఆటపట్టు అని యునెస్కో (UNESCO) గుర్తించింది. కానీ స్థానికేతర జాతులకు చెందిన మొక్కలను పరిచయం చేయటం, ఎత్తున ఉన్న చిత్తడి నేలలను తోటలుగా మార్చటం, వలస పరిపాలన కాలంలో తేయాకు తోటలను సాగుచేయటం "ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించింది," అని పశ్చిమ కనుమల జీవావరణ సభ్యమండలి (Western Ghats Ecology Panel) 2011లో వెలువరించిన పత్రం తెలియచేసింది.

నీలగిరులలోని మోయార్ నది వంటి ఇతర జల వనరులు అక్కడికి చాలా దూరంలో ఉన్నాయి. అతని బొక్కాపురమ్ గ్రామం ముదుమలై టైగర్ రిజర్వ్‌కు చెందిన తటస్థ ప్రాంతంలో ఉండటం వలన అటవీ అధికారులు బోరు బావులను తవ్వనివ్వరు. అటవీ హక్కుల చట్టం 2006 వచ్చినప్పటి నుండి అనేక విషయాలు మారిపోయాయని బొక్కాపురానికే చెందిన మరో రైతు బి. సిద్దన్ అన్నారు. "2006కు ముందు మేం అడవిలోంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కనీసం అడవి లోపలికి మమ్మల్ని అడుగైనా పెట్టనివ్వడంలేదు," అని ఈ 47 ఏళ్ళ రైతు అన్నారు.

"ఈ వేడికి ఇంక రాగి పంట పెరిగేదెలా," అని నాగరాజ్ అడుగుతారు.

భూమిపై వచ్చిన నష్టాన్ని తగ్గించుకోవడానికి, జీవిక కోసం మసినగుడి, ఇంకా చుట్టుపక్కల ఉన్న గూడేలలో ఉండే ఇతరుల పొలాల్లో నాగరాజ్, దినసరి కూలీగా పనిచేస్తారు. "నేను రోజుకు 400-500 [రూపాయలు] సంపాదించగలను, కానీ అది నాకు పని దొరికినప్పుడే," అన్నారతను. ఆయన భార్య నాగి కూడా దినసరి కూలీగానే పనిచేస్తారు. జిల్లాలోని ఇతర మహిళల వలెనే ఆమె కూడా సమీపంలోని తేయాకు తోటలలో పనిచేస్తూ రోజుకు రూ. 300 సంపాదిస్తారు.

PHOTO • Sanviti Iyer
PHOTO • Sanviti Iyer

తన పొలంలో ఇప్పుడు కొత్త విత్తనాలను ఉపయోగించడం వలన రాగి మొక్కలు (ఎడమ) చాలా నెమ్మదిగా ఎదుగుతున్నాయని సురేశ్ చెప్పారు. అటవీ హక్కుల చట్టం 2006 వచ్చినప్పటి నుండి చాలా విషయాలలో మార్పు వచ్చిందని బి. సిద్దన్ (కుడి) చెప్పారు: '2006కు ముందు మేం అడవిలోంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కనీసం అడవి లోపలికి మమ్మల్ని అడుగైనా పెట్టనివ్వడంలేదు'

*****

తాము ఇష్టపడినట్లే ఏనుగులు కూడా రాగుల ను ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోందని ఈ రైతులు హాస్యంగా అన్నారు. " రాగుల వాసన వాటిని [ఏనుగులు] మా పొలాలవైపుకు లాక్కొస్తుంది," అన్నారు సురేశ్. బొక్కాపురమ్ గూడెం పశ్చిమ, తూర్పు కనుమల మధ్య ఏనుగులు తిరుగాడే సిగూర్ ఎలిఫెంట్ కారిడార్ కిందకు వస్తుంది.

తమ చిన్నతనంలో ఇంత తరచుగా ఏనుగులు తమ పొలాలలోకి వచ్చినట్టుగా వారికి గుర్తులేదు. "అయితే మేం ఏనుగులను నిందించడం లేదు," అన్నారు సురేశ్. "వర్షాలు కురవక పోవటం వలన అడవులు ఎండిపోతున్నాయి. ఇక ఏనుగులు ఏం తింటాయి? తిండి కోసం వెతుక్కుంటూ అవి తమ అడవిని బలవంతంగా వదిలిరావల్సి వస్తోంది." గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ చెప్పినదాని ప్రకారం, నీలగిరి జిల్లా 2002 నుండి 2022 మధ్యలో 511 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది.

రంగయ్య పొలం బొక్కాపురానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేల్‌భూతనాథన్ అనే గూడెంలో ఉంది. ఆయన సురేశ్ మాటలతో ఏకీభవించారు. ఏభయ్యేళ్ళు దాటిన రంగయ్య ఒక ఎకరం భూమిలో సాగుచేస్తున్నారు. అయితే ఆయన భూమికి పట్టా లేదు. "1947కు ముందే మా కుటుంబం ఈ భూమిపై సాగుచేసింది," అన్నారతను. సోలిగ ఆదివాసీ అయిన రంగయ్య తన భూమికి దగ్గరలో ఒక సోలిగ ఆలయాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఏనుగుల కారణంగా రంగయ్య తన భూమిలో రాగులు , ఇతర చిరుధాన్యాలను సాగుచేయడాన్ని కొన్నేళ్ళుగా నిలిపేశారు. "అవి [ఏనుగులు] వచ్చి మొత్తం తినేసి పోయేవి," అన్నారాయన. "ఏనుగు ఒకసారి పొలంలోకి వచ్చి రాగుల ను రుచి చూసిందంటే, అది మళ్ళీ మళ్ళీ తిరిగివస్తుంది." అందువల్లనే చాలామంది రైతులు రాగుల ను, ఇతర చిరుధాన్యాలను పెంచటం మానేశారని ఆయన అన్నారు. వాటి స్థానంలో రంగయ్య క్యాబేజి, చిక్కుళ్ళు వంటి కూరగాయలను పెంచటం మొదలుపెట్టారు.

రాత్రివేళల్లో రైతులు తమ పొలాలకు కాపలాగా ఉండాలనీ, పొరపాటున నిద్రపోతే ఏనుగులు వచ్చి హాని చేస్తాయేమోనని భయపడుతుంటారనీ రంగయ్య చెప్పారు. "ఏనుగుల భయంతో రైతులు రాగి పంటను వేయడంలేదు."

రాగి వంటి చిరుధాన్యాలను తాము ఎన్నడూ బజారు నుంచి కొని తెచ్చుకోలేదనీ, తాము పండించినవాటినే తిన్నామనీ ఈ రైతు చెప్పారు. ఇప్పుడు వాటిని పండించటం మానేయటం వలన, వాటిని తినటం కూడా మానేశారు.

PHOTO • Sanviti Iyer
PHOTO • Sanviti Iyer

మేల్‌భూతనాథన్ గూడేనికి చెందిన సోలిగ ఆదివాసీ రైతు రంగయ్య. ఒక స్థానిక ఎన్‌జిఒ ఆయనకూ మరికొంతమంది రైతులకూ వారి పొలాలను ఏనుగుల నుంచీ ఇతర జంతువుల నుంచీ రక్షించుకోవటం కోసం సౌరవిద్యుత్ కంచెలను ఇవ్వటంతో ఇటీవలే తిరిగి రాగి పంటను సాగుచేయటం మొదలుపెట్టారు

PHOTO • Sanviti Iyer
PHOTO • Sanviti Iyer

రంగయ్య తన పొలానికి దగ్గరలో ఒక సోలిగ ఆలయాన్ని (ఎడమ) కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్‌జిఒకు ఆరోగ్య క్షేత్ర సమన్వయకర్తగా పనిచేస్తోన్న ఆనైకట్టి గ్రామానికి చెందిన లలితా మూకసామి (కుడి). 'చిరుధాన్యాల సాగు సన్నగిల్లటంతో, మాకు ఎన్నడూ అలవాటులేని విధంగా రేషన్ దుకాణాల నుండి ఆహారాన్ని కొనుక్కోవాల్సివచ్చింది,' అన్నారామె

ఒక స్థానిక ఎన్‌జిఒ ఆయనకూ మరికొంతమంది రైతులకూ వారి పొలాలను ఏనుగుల నుంచీ ఇతర జంతువుల నుంచీ రక్షించుకోవటం కోసం సౌరవిద్యుత్ కంచెలను ఇచ్చారు. రంగయ్య ఇటీవలే తిరిగి తన పొలంలోని సగభాగంలో రాగి పంటను సాగుచేయటం మొదలుపెట్టారు. మిగిలిన సగంలో కూరగాయల సాగును కొనసాగిస్తున్నారు. గత పంట కాలంలో ఆయన చిక్కుళ్ళు, వెల్లుల్లిని మార్కెట్‌లో అమ్మి రూ. 7,000 ఆదాయంగా పొందారు.

చిరుధాన్యాల సాగు తగ్గిపోవటమంటే ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వస్తుందని అర్థం. "చిరుధాన్యాల సాగు సన్నగిల్లటంతో, మాకు ఎన్నడూ అలవాటులేని విధంగా రేషన్ దుకాణాల నుండి ఆహారాన్ని కొనుక్కోవాల్సివచ్చింది," అని స్థానిక ఎన్‌జిఒకు ఆరోగ్య క్షేత్ర సమన్వయకర్తగా పనిచేస్తోన్న గ్రామవాసి లలితా మూకసామి అన్నారు. ఆ రేషన్ దుకాణాలు ఎక్కువగా బియ్యాన్నీ గోధుమలనూ అమ్ముతాయని కూడా అన్నారామె.

"నా చిన్నతనంలో రోజుకు మూడుసార్లు రాగి కలి తినేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో దాన్ని ఎప్పుడో తప్ప తినటంలేదు. మేం సులభంగా తయారయ్యే అరిసి సాపాట్ (బియ్యంతో వండే ఆహారం) తింటున్నాం," అన్నారామె. ఆనైకట్టి గ్రామానికి చెందిన ఇరుల ఆదివాసీ సముదాయానికి చెందిన ఈ మహిళ గత 19 ఏళ్ళుగా తమ సముదాయంతో పనిచేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోవడానికి మారిపోతున్న ఆహారపు అలవాట్లే కారణం కావచ్చని ఆమె అన్నారు.

భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (IIMR), "వీటిలో ఉండే కొన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులను నివారించడంతో పాటు క్షీణతా (degenerative) వ్యాధుల నివారణకు అవసరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి," అని ఒక నివేదిక లో పేర్కొంది. తెలంగాణాకు చెందిన ఈ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)లో భాగం.

" రాగులు , తెనై (కొర్రలు) ప్రధానంగా ఉండేవి. మేం వాటిని ఆవాల ఆకులు, కాట్టు కీరై [అడవి పాలకూర]తో కలిపి తినేవాళ్ళం," అన్నారు రంగయ్య. వీటిని తాను చివరగా ఎప్పుడు తిన్నారో ఆయనకు గుర్తులేదు: "మేమిప్పుడు అసలు అడవిలోకే వెళ్ళటంలేదు."

ఈ కథనాన్ని రాయటంలో సహాయం చేసినందుకు కీస్టోన్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీరామ్ పరమశివన్‌కు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Sanviti Iyer
Editor : Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli