'ఎవరికి తెలుసు, సరికొత్త ముసుగులో ఎమర్జెన్సీ మళ్ళీ రావచ్చు
ఈనాటి నిరంకుశాధిపత్యం ప్రజాస్వామ్యంగా పేరు మార్చుకుంటుంది’

భిన్నాభిప్రాయాలను అణచివేసి, అసమ్మతివాదుల నోరు నొక్కడమో లేదా నిర్బంధించటమో లేదా రెండూనో జరుగుతోన్న ఈ కాలంలో, పైపైకి ఎగరేసిన ఎరుపు, ఆకుపచ్చ, పసుపు జెండాలతో  రైతులు, వ్యవసాయ కూలీలు - కిసాన్, మజ్దూర్ - రామ్‌లీలా మైదానంలోకి నడిచి వస్తుండగా ఆ నిరసన గీతంలోని ఈ పంక్తులు మరోసారి నిజమయ్యాయి.

ఎఐకెఎస్ (అఖిల భారత కిసాన్ సభ), బికెయు (భారతీయ కిసాన్ యూనియన్), ఎఐకెకెఎమ్ఎస్ (ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంగఠన్), ఇతర సంస్థలు, సమూహాలకు చెందిన వ్యవసాయదారులు మార్చి 14, 2024న జరిగిన కిసాన్ మజ్దూర్ మహా పంచాయితీలో పాల్గొనేందుకు ఎస్‌కెఎమ్ (సంయుక్త కిసాన్ మోర్చా) ఏకీకరణ వేదిక క్రింద ఈ చారిత్రక మైదానంలో సమావేశమయ్యారు.

“మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది, కానీ అవి ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పుడు వారు ఆ హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి . వర్నా హమ్ లడేంగే, ఔర్ లడ్తే రహేంగే [వారు ఈ హామీలను నెరవేర్చకపోతే, మేం పోరాడుతాం, పోరాడుతూనే ఉంటాం],” అని కలాఁ గ్రామానికి చెందిన మహిళా రైతు ప్రేమమతి PARIతో చెప్పారు. ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; రైతుల ఉత్పత్తి వాణిజ్యం మరియు వర్తకం (ప్రమోషన్ మరియు సులభతరం చేయటం) చట్టం, 2020 ; నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020 గురించి ఆమె ఇక్కడ ప్రస్తావించారు.

"మూడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనలప్పుడు కూడా మేమిక్కడ ఉన్నాం," అని ఆమె జోడించారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా నుంచి మహాపంచాయత్‌కు వచ్చిన ముగ్గురు మహిళల్లో ప్రేమమతి ఒకరు. వారు రైతుల సంఘమైన భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు)తో జతకట్టారు. "ఈ ప్రభుత్వం వర్ధిల్లుతోంది, కానీ వారు రైతులను మాత్రం నాశనం చేశారు," అని ఆమె ఆగ్రహంతో అన్నారు.

PARIతో మాట్లాడిన మహిళలందరూ 4-5 ఎకరాల భూమిపై పనిచేసుకునే చిన్న రైతులు. భారతదేశ వ్యవసాయంలోని 65 శాతం పనిని మహిళా రైతులు, కూలీలు చేస్తారు, కానీ కేవలం 12 శాతం మంది మహిళా రైతుల పేరున మాత్రమే భూమి ఉంది.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: ఎడమ నుండి కుడికి, ఉత్తర్ పరదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా నుంచి వచ్చిన, బికెయు రైతులు ప్రేమమతి, కిరణ్, జశోద. కుడి: మార్చి 14, 2024న దిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన రైతులు

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: పంజాబ్ నుంచి వచ్చిన మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు. కుడి: ‘కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్!’ అంటూ నినాదాలిస్తోన్న పంజాబ్ రైతులు

రైతుల కోసం దేశం (నేషన్ ఫర్ ఫార్మర్స్) ఉద్యమం చొరవతో ఏర్పాటైన కిసాన్ మజ్దూర్ కమిషన్ (కెఎమ్‌సి), మహిళలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించింది. మార్చి 19, 2024న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో వారు కెఎమ్‌సి అజెండా 2024ను విడుదల చేశారు: “మహిళలను రైతులుగా గుర్తించి వారికి భూమిపై హక్కులు కల్పించాలి, కౌలు భూములపై ​​వారి కౌలు హక్కులను పరిరక్షించాలి.” ఇంకా ఆ అజెండాలో, “వ్యవసాయ పని ప్రదేశాలలో పిల్లల కోసం క్రెష్, సంరక్షణా సౌకర్యాలను అందించాలి," అని కూడా ఉంది.

సంవత్సరానికి రూ. 6,000 ఆదాయం వచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి రాష్ట్ర పథకాల్లో మహిళా రైతులను విస్మరించారు. అయితే దీనిని వ్యవసాయ భూమి యజమానులకు మాత్రమే కేటాయించారు. ఈ పథకం వలన కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు.

జనవరి 31, 2024న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2.25 లక్షల కోట్లు (రూ. 2,250 బిలియన్లు) ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద బదిలీ చేసిందనీ, అందులో రూ. 54,000 కోట్లు (రూ. 540 బిలియన్లు) మహిళా లబ్ధిదారులకు చేరాయనీ చెప్పారు.

అంటే, పురుషులకు వచ్చే ప్రతి మూడు రూపాయలకు మహిళా రైతులకు వచ్చేది ఒక రూపాయి మాత్రమే అని దీని అర్థం. కానీ గ్రామీణ భారతదేశంలో చాలా ఎక్కువమంది మహిళలు పొలాలలో పనిచేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు - 80 శాతం మంది జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు - ఈ జెండర్ అన్యాయం మరింత భయంకరంగా తెలుస్తుంది.

వేదిక పైనుండి మాట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు మేధా పాట్కర్, మునుపటి నిరసనల సమయంలో తరచుగా వినిపించిన ఒక నినాదాన్ని పునరుద్ఘాటించారు: “ నారీ కే సహియోగ్ బినా హర్ సంఘర్ష్ అధూరా హై [మహిళల భాగస్వామ్యం లేని ప్రతి పోరాటం అసంపూర్ణమే].”

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కపియాల్ గ్రామం నుంచి వచ్చిన రైతు చిందర్‌బాల (మధ్యలో కూర్చున్నవారు). కుడి: 'నారీ కే సహియోగ్ బినా హర్ సంఘర్ష్ అధూరా హై [మహిళల భాగస్వామ్యం లేని ప్రతి పోరాటం అసంపూర్ణమే]'

మహిళలుగా, రైతులుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న అనేక మంది మహిళా నిరసనకారులు ఆమె మాటలను స్వాగతించారు. మహాపంచాయత్‌లో మహిళలు పెద్ద సంఖ్యలో - మూడవ వంతు మంది - ఉన్నారు. "మోదీ ప్రభుత్వంతో మాకు తగాదా ఉంది. వారు తమ వాగ్దానాలను నిలబెట్టుకోలేదు,” అని పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా, కపియాల్ గ్రామానికి చెందిన చిందర్‌బాల అనే మహిళా రైతు చెప్పారు.

"మేమంతా మూడు నాలుగు కిల్లా ల (ఎకరాలు) పొలమున్న రైతులం. విద్యుత్ చాలా ఖరీదైనది. వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా బిల్లును (విద్యుత్ సవరణ) వెనక్కి తీసుకోలేదు," అన్నారామె. దిల్లీ సరిహద్దుల వద్ద 2020-21లో జరిగిన నిరసనలలో రైతులుగా, కూలీలుగా మహిళలు తమ హక్కులను గురించి నొక్కి చెప్పేందుకు పురుషులతో భుజం భుజం కలిపి నిలిచారు.

*****

ఉదయం 11 గంటలకు మహాపంచాయత్ ప్రారంభమయింది. ఇంతలోనే ఆ మైదానమంతా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన రైతులు, కూలీలతో నిండిపోయింది.

పంజాబ్ నుండి వచ్చిన అనేకమంది పురుష రైతులలో ఒకరైన భటిండా జిల్లాకు చెందిన సర్దార్ బల్జిందర్ సింగ్, “మేం రైతులుగా మా హక్కులను అడగడానికి ఇక్కడకు వచ్చాం. మా కోసం మాత్రమే కాదు, మా పిల్లల కోసం, ఇంకా భవిష్యత్తు తరాల కోసం పోరాడటానికే మేమిక్కడ ఉన్నాం," అని PARIతో అన్నారు.

కార్యకర్త మేధా పాట్కర్ వేదిక పైనుండి మాట్లాడుతూ, “ప్రకృతిపై ఆధారపడి జీవిస్తోన్న - రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, పశుపోషకులు, అటవీ సేకరణ చేసేవారు, వ్యవసాయ కూలీలు, ఆదివాసులు, దళితులు - ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను. మనమందరం మన జల్, జంగిల్ ఔర్ జమీన్ [నీరు, అడవి, భూమి]లను కాపాడుకోవాలి," అన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్)గా ఏర్పాటైన రైతు సంఘాల నాయకులు 25 మంది వేదికపై ఉన్న రెండు వరుసల కుర్చీలను ఆక్రమించారు. ఈ నాయకులలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. మొదటి వరుస మధ్యలో ముగ్గురు మహిళలు మాత్రమే ప్రముఖంగా కూర్చునివున్నారు. వారు: పంజాబ్‌లోని బికెయు ఉగ్రహాణ్‌కు చెందిన హరీందర్ బిందు; మధ్యప్రదేశ్‌కు చెందిన కిసాన్ సంఘర్ష్ సమితి (కెఎస్ఎస్) నుంచి ఆరాధన భార్గవ; మహారాష్ట్ర నుండి, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్ఎపిఎమ్)కు చెందిన మేధా పాట్కర్.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కె ఎమ్)గా ఏర్పడిన రైతు కూలీ సంఘాల నాయకులు. కుడి: వేదికపై కూర్చున్నవారు, ఎడమ నుండి కుడికి, పంజాబ్‌లోని బికెయు ఉగ్రహాణ్‌కు చెందిన హరీందర్ బిందు; మధ్యప్రదేశ్‌కు చెందిన కిసాన్ సంఘర్ష్ సమితి (కెఎస్ఎస్) నుంచి ఆరాధన భార్గవ; మహారాష్ట్ర నుండి, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ఎన్ఎపిఎమ్)కు చెందిన మేధా పాట్కర్.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: ఆ మహాసమావేశాన్ని తన ఫోన్ కెమెరా ద్వారా చిత్రిస్తోన్న పంజాబ్‌కు చెందిన ఒక రైతు. కుడి: భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రైతులు, కూలీలు

వక్తలు ఎస్‌కె ఎమ్ ప్రధాన డిమాండ్లను పునరుద్ఘాటించారు. వాటిలో ముఖ్యమైనది, హామీనిచ్చే సేకరణతో పాటు అన్ని పంటలకు C2 + 50 శాతం వద్ద ఎమ్ఎస్‌పి (కనీస మద్దతు ధర)కి చట్టబద్ధమైన హామీ. C2 అనేది రైతుల యాజమాన్యంలోని భూమిపై ఉపయోగించిన పెట్టుబడి విలువ, భూమిని లీజుకు తీసుకున్న అద్దె, కుటుంబ, కూలీల ఖర్చుతో సహా అసలు ఉత్పత్తి వ్యయాన్ని సూచిస్తుంది.

ప్రస్తుతం, రైతుల కోసం జాతీయ కమిషన్ నివేదిక లో ప్రొఫెసర్ ఎమ్ఎస్. స్వామినాథన్ సిఫార్సు చేసిన విధంగా, 23 పంటలకు కనీస మద్దతు ధర, విత్తనాలు విత్తే కాలానికి ముందు భూమి అద్దెను పరిగణనలోకి తీసుకోదు, లేదా అదనపు 50 శాతాన్ని కూడా చేర్చదు: “కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి) సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి. రైతుల "ఇంటికి తీసుకువెళ్ళే నికర ఆదాయం" ప్రభుత్వోద్యోగులతో పోల్చదగినదిగా ఉండాలి."

విత్తనోత్పత్తిని కార్పొరేట్ స్వాధీనం చేసుకోవడం, ఆఫ్రికన్ దేశాల్లో పెద్ద కంపెనీలు వ్యవసాయాన్ని నియంత్రించడం, కోవిడ్ విజృంభించిన సమయంలో కూడా ధనికుల ఆదాయాలు అనేక రెట్లు పెరగడం గురించి కూడా పాట్కర్ మాట్లాడారు. కూరగాయలతో సహా అన్ని పంటలకు న్యాయమైన ధర ఇవ్వాలన్న రైతుల డిమాండ్‌ను ఆర్థిక భారం పడుతోందన్న సాకుతో ప్రభుత్వం నెరవేర్చలేదు. "అతి సంపన్నుల సంపదపై చాలా కొద్దిగా, అంటే రెండు శాతం పన్ను విధిస్తే, అన్ని పంటలకు సులభంగా కనీస మద్దతు ధరను ఇవ్వవచ్చు," అని ఆమె చెప్పారు.

రైతులందరికీ సమగ్ర రుణమాఫీ చేయాలనేది దీర్ఘకాలిక డిమాండ్‌గా ఉంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత డిసెంబర్ 9, 2021న సంయుక్త కిసాన్ మోర్చాతో చేసుకున్న ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు హామీ కూడా ఇచ్చింది. కానీ అది జరగలేదు.

వెన్ను విరుస్తోన్న అప్పుల వలన రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతోన్న విషయం కనిపిస్తూనే ఉంది. అప్పులభారంతో కుంగిపోయి 2014-2022 మధ్య ఒక లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాయితీలను ఉపసంహరించటం, ప్రతిఫలాన్నిచ్చే ఆదాయాలను తిరస్కరించటం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రక్రియను తప్పుగా అమలు చేయడం వంటి ప్రభుత్వ విధానాల వల్ల వారు ఈ స్థితికి నెట్టబడ్డారు. రుణమాఫీ ఒక ఉపకారం అయ్యేది, కానీ అది కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.

'ఎవరికి తెలుసు, సరికొత్త ముసుగులో ఎమర్జెన్సీ మళ్ళీ రావచ్చు, ఈనాటి నిరంకుశాధిపత్యం ప్రజాస్వామ్యంగా పేరు మార్చుకుంటుంది’ అని ఒక కవి పాడుతుండగా, రైతులు, కార్మికులు రామ్‌లీలా మైదానంలోకి కవాతు చేస్తూ సాగారు

వీడియో చూడండి: మార్చి 14, 2024న కొత్త దిల్లీలో జరిగిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ వద్ద నిరసనల నినాదాలు, పాటలు

మహాపంచాయత్‌లో, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ మాట్లాడుతూ, “గత పదేళ్ళలో, 4.2 లక్షల మంది రైతులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది దేశంలో నెలకొన్న తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని సూచిస్తుందనీ," అన్నారు.

2022లో, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) వారి భారతదేశంలో ప్రమాదాల మరణాలు, ఆత్మహత్యలు (ADSI) 2022 నివేదిక, మొత్తం 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలను నమోదు చేసింది. అందులో 33 శాతం (56,405) ఆత్మహత్యలు రోజువారీ వేతనజీవులు, వ్యవసాయ కూలీలు, రైతులు చేసుకున్నవి.

ఈ ఆత్మహత్యల కారణంగా 2016 నుండి 2021 వరకు ప్రయివేటు బీమా కంపెనీలు రూ. 24,350 కోట్ల సంపదతో లాభపడ్డాయి. ఎంచుకున్న 13 కంపెనీలలో, ప్రభుత్వం నుండి పంటల బీమా వ్యాపారాన్ని చేజిక్కించుకున్న 10 కంపెనీలు ఇవి. మరో బొనాంజాలో, బడా కార్పొరేట్ సంస్థలు రూ. 14.56 లక్షల కోట్ల (2015 నుండి 2023 వరకు) రుణమాఫీని పొందాయి.

ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో  రూ. 1,17,528.79 కోట్లను వ్యవసాయానికి కేటాయించింది. ఈ మొత్తంలో, 83 శాతాన్ని వ్యక్తిగత లబ్ధి ఆధారిత ఆదాయ మద్దతు పథకాలకు కేటాయించింది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఇవ్వడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. మొత్తం రైతులలో దాదాపు 40 శాతం ఉన్న కౌలు రైతులు ఈ ఆదాయ మద్దతును పొందలేరు. భూమిలేని వ్యవసాయ కూలీలు, భూమి తమ పేరు మీద లేకపోవటం వలన పొలాల్లో పనిచేసే మహిళా రైతులు కూడా ఈ ప్రయొజనాలను పొందలేరు.

గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు MNREGA ద్వారా  లభించే ఇతర నిధులు కోతపడ్డాయి. ఇందుకు కేటాయించిన బడ్జెట్ వాటా 2023-24లో 1.92 శాతం ఉండగా, 2024-25లో 1.8 శాతానికి పడిపోయింది.

ఈ సమస్యలనూ, డిమాండ్‌లన్నింటినీ 2024, మార్చి 14న రామ్‌లీలా మైదానంలోని వేదికపై నుండి రైతు సంఘాలు మారుమోగించాయి.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: రామ్‌లీలా మైదానంలో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక రైతుకు చికిత్సనందిస్తోన్న వైద్య బృందం. ఈ బృందం కర్నాల్ నుండి అలసిపోయే ప్రయాణం చేసి వచ్చింది. కుడి: 'అణచివేతతో చేసే ప్రతి సంఘర్షణకు, పోరాటానికి పిలుపునివ్వటమే మా నినాదం' అని ఉద్వేగభరితంగా చెప్తూ ఎగురుతోన్న జెండా

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ఎడమ: చాలా దూరం కవాతు చేసిన తర్వాత హరియాణా నుండి వచ్చిన రైతులకు కొంచెం విశ్రాంతి, ప్రశాంతి. కుడి: కొత్త దిల్లీలోని ఎత్తైన భవనాల నేపథ్యంలో, రామ్‌లీలా మైదానంలో తమ బలమైన పాదాలకు విశ్రాంతినిస్తోన్న పంజాబ్‌కు చెందిన ముగ్గురు వృద్ధ రైతులు

ఈ మైదానం ఏటేటా జరిగే రామాయణ ఇతిహాసం నాటక ప్రదర్శనలకు వేదికగా ఉంటుంది. ప్రతి సంవత్సరం, కళాకారులు నవరాత్రి ఉత్సవాలలో చెడుపై మంచి, అసత్యంపై సత్యం సాధించిన విజయాల గురించిన సన్నివేశాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. కానీ ఈ మైదానాన్ని 'చారిత్రక' మైదానం అని పిలవడానికి అది సరైన కారణం కాదు. అయితే ఆ సరైన కారణం ఏమిటి?

భారత స్వాతంత్ర్య పోరాటం జరుగుతోన్న సమయంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకుల ప్రసంగాలను సాధారణ భారతీయులు ఇక్కడే విన్నారు. 1965లో, భారతదేశ రెండవ ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ఈ మైదానాల నుండే జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. 1975లో, ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ జయప్రకాష్ నారాయణ్ సాగించిన భారీ ర్యాలీ ఇక్కడ జరిగింది; ఇది జరిగిన కొద్దికాలానికే 1977 సాధారణ ఎన్నికలలో ప్రభుత్వం పడిపోయింది. 2011లో అవినీతి వ్యతిరేక భారతదేశం ఉద్యమం నిరసనలు ఈ మైదానం నుండే ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉద్యమం నుండే నాయకుడిగా ఎదిగారు. ఈ కథనాన్ని ప్రచురిస్తోన్న సమయానికి, 2024 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు, అవినీతి ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని అరెస్టు చేసింది.

నవంబర్ 30, 2018న ఇదే రామ్‌లీలా మైదానం నుండి దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు కిసాన్ ముక్తి మోర్చా కోసం ఢిల్లీకి వచ్చి, పార్లమెంట్ వీధికి పాదయాత్ర చేసి, తమ డిమాండ్లపై 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2018లో ప్రభుత్వం మరో వాగ్దానం చేసింది. అది కూడా నెరవేరలేదు.

ఈ చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలోని రైతులు, వ్యవసాయ కూలీల కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ తమ డిమాండ్ల కోసం పోరాటాన్ని కొనసాగించాలనీ, డిసెంబర్ 9, 2021న సంయుక్త కిసాన్ మోర్చాకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కేంద్రంలోని ప్రస్తుత బిజెపి పాలన నిర్ద్వంద్వంగా నిరాకరించడానికి నిరసనగానూ తీర్మానం చేసింది.

ప్రేమమతి మాటల్లో చెప్పాలంటే, “మేం మా సంచులు, పరుపులతో దిల్లీకి తిరిగి వస్తాం. ధర్నా పే బైఠ్ జాయేంగే. హమ్ వాపస్ నహీ జాయేంగే జబ్ తక్ మాంగే పూరీ నా హో [మేం నిరసనకు కూర్చుంటాం. మా డిమాండ్‌లు నెరవేరే వరకు మేం తిరిగి వెళ్ళేదిలేదు].”

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Other stories by Ritayan Mukherjee

నమితా వైకర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రచయిత, అనువాదకురాలు, మేనేజింగ్ ఎడిటర్. ఈమె, 2018లో ప్రచురించబడిన 'ది లాంగ్ మార్చ్' నవల రచయిత.

Other stories by Namita Waikar
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli