తెరచిపెట్టిన అరచేతిలో కొబ్బరికాయ, పొడవుగా చాచిన చెయ్యి... పూజారి ఆంజనేయులు ముద్దలాపురం పొలాల మీదుగా నడుస్తున్నారు. ఆ కొబ్బరికాయ గిరగిరా తిరిగి వొరిగి పడిపోవటం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. అది పడింది. ఇదే అంటూ మాకు హామీ ఇచ్చి, ‘X’ గుర్తుపెట్టారు. "ఇక్కడ మీకు నీరు పడుతుంది. సరిగ్గా ఈ ప్రదేశంలోనే మీరు బోరుబావి వెయ్యండి, మీరే చూస్తారు," అనంతపూర్ జిల్లాలోని ఈ గ్రామంలో ఆయన మాతో ఈ మాటలు చెప్పారు.
ఆ పక్క ఊరిలోని మరో పొలంలో రాయులు ధోమతిమ్మన ముందుకువాలి నడుస్తున్నారు. ఆయన రెండు చేతులలతో పట్టుకొనివున్న పెద్ద పంగల కర్ర ఆ రాయలప్పదొడ్డిలో నీరు ఉన్నచోటుకు దారిచూపిస్తుంది. "ఆ కర్ర పైకెగిరినప్పుడు, అదే నీటి తావు," అంటూ వివరిస్తాడాయన. తన పద్ధతి "90 శాతం విజయవంతం అవుతుందని" రాయులు వినయంగా చెప్పుకుంటారు.
అనంతపురంలోని వేరొక మండలంలో, చంద్రశేఖర్ రెడ్డి యుగాలుగా తత్వవేత్తలను కలవరపరుస్తోన్న ప్రశ్నతో తలపడ్డారు. మరణం తర్వాత జీవితం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తనకు తెలుసునని రెడ్డి నమ్ముతారు. "నీరే జీవితం," అంటారాయన. అలాగే శ్మశానవాటికలో నాలుగు బోరుబావులు దించారు. అతని పొలంలో మరో 32 ఉన్నాయి. ఆయన తన జంబులదిన్నె గ్రామం అంతటా విస్తరించి ఉన్న నీటి వనరులను 8 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌తో అనుసంధానించారు.
మూఢనమ్మకాలు, గుప్తశక్తులు, దేవుడు, ప్రభుత్వం, సాంకేతికత, కొబ్బరికాయలు- ఇవన్నీ నీటి కోసం అనంతపురం చేస్తోన్న తీరని అన్వేషణలో తమ సేవలను అందించాయి. వాటన్నిటి సేవలు కలిపినా కూడా ఏమంత ఆకట్టుకునే ఫలితాలు లేవు. అయితే పూజారి ఆంజనేయులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.
సౌమ్యుడూ, నెమ్మదస్తు డుగా కనిపించే ఈయన తన పద్ధతి విఫలం కాదని చెప్పారు. ఆయన సాక్షాత్తూ దేవుడి నుండి తన నైపుణ్యాలను పొందారు. "ప్రజలు తగని సమయంలో దీన్ని చేయమని నన్ను బలవంతం చేసినప్పుడు మాత్రమే అది మమ్మల్ని నిరాశపరుస్తుంది," అని ఆయన చెప్పారు (దేవుడు ఒక్కో బోరుబావి పాయింట్‌కి 300 రూపాయలు వసూలు చేస్తాడు). ఇక తన అరచేతిలో కొబ్బరికాయ ఊగుతూ ఉండగా మనల్ని పొలాల్లోకి తీసుకెళతాడు.
అయితే, సంశయవాదులు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ పద్ధతిని ప్రయత్నించినా ఫలించకపోవటంతో అసంతృప్తి నిండిన ఒక రైతులాగా. "మేం కనిపెట్టిన ఏకైక నీరు ఆ …* కొబ్బరికాయలో ఉన్నదే!" దిగాలుగా చెప్పారాయన
ఇంతలో రాయులు చేతిలోని కొమ్మ పైకి ఎగిరింది. అతను నీటిని ఖచ్చితంగా కనుక్కున్నాడు. అతనికి ఒకవైపున చెరువు, మరోవైపున పనిచేస్తోన్న బోరుబావి ఉన్నాయి మరి. తనకు దేవుడిపై నమ్మకం లేదని రాయులు చెప్పారు. అయితే చట్టం సంగతి వేరే. "ఈ నైపుణ్యాల ప్రదర్శన, మోసం కింద నన్ను కోర్టులో నిలబెట్టదు, అవునా?" అంటూ అతను మా హామీని కోరాడు. అతని విజయాల రేటు, ప్రభుత్వ నీటి సర్వేయర్ల కంటే అధ్వాన్నంగా ఏమీ ఉండదని మేమతనికి హామీ ఇచ్చాం.
భూగర్భజల శాఖలోని భూగర్భ శాస్త్రవేత్తల రికార్డు, వాటినలా అనవచ్చనుకుంటే, చాలా నిరాశాజనకంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇష్టానుసారంగా కూడా ఉంది. మీ కార్యాలయం బయట నీటి శకునాలు చెప్పేవారిగా ప్రైవేట్‌గా పనిచేస్తూ చక్కనైన మొత్తాలను వసూలు చేయడం మరింత సమంజసంగా ఉంటుంది. అంతేకాక, మీరు 'నిపుణుడు' అనే ట్యాగ్‌తో వస్తే, స్థిరమైన ఖాతాదారులు మీకు ఖచ్చితంగా దొరుకుతారు. మేం వెళ్ళిన ఆరు జిల్లాల్లో, నిపుణులు గుర్తించిన చాలా పాయింట్లు విఫలమయ్యాయి. బోరుబావులు కూడా 400 అడుగుల లోతుకు పడిపోయాయి. కాబట్టి పూజారి, రాయులు పెరుగుతున్న నీటి శకునకారుల సైన్యంలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే అనుకోవాలి.
ఈ దైవిక వ్యాపారంలో ఉన్న వారందరివీ వారికే స్వంతమైన సంప్రదాయేతర పద్ధతులు. వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. వింతగా కనిపించే వారి టెక్నిక్‌లలో కొన్నింటిని గురించి నల్గొండలోని ది హిందూ పత్రికకు చెందిన ఒక యువ రిపోర్టర్, ఎస్. రాము జాబితా చేశారు. ఈ శకునకారులు 'ఒ' పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌కు చెందినవారై ఉండాలనే నిబంధన ఒకటి ఉంది. మరికొందరు పాములు తమ నివాసాలను ఏర్పరచుకునే ప్రదేశాల క్రింద నీటి కోసం వెతుకుతారు. నీటి విపరీతాలలో అనంతపురం వాటా దానికి ఉంది
నాలుగు వరుస పంటల వైఫల్యాలను చవిచూసిన జిల్లాలో, పైకి కనిపించే నిరర్థకత వెనుక మనుగడ కోసం ఒక భయంకరమైన పోరాటం ఉంది. రెడ్డి స్మశానవాటికలో వేసిన బోరుబావులు కూడా ఆయన ఆశించిన దానికంటే తక్కువ దిగుబడినిస్తున్నాయి. మొత్తం మీద ఈ గ్రామాధికారి (విఒ) నీటి కోసం పదిలక్షల రూపాయలకు పైగా వెచ్చించారు. ఆయన అప్పులు నెలనెలా పెరిగిపోతున్నాయి. "గత వారం, నేను ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాను," అని ఆయన చెప్పారు. “నేనిలా కొనసాగించలేను. మాకు కొంచెం నీరు ఉండాలి.”
కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు, తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాల మధ్య, ఆపదలో ఉన్నవారిని ఆదువటానికి ఆంధ్రప్రదేశ్‌లోని వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది. రైతుల ఆత్మహత్యల వల్ల చాలా దారుణంగా దెబ్బతిన్న ఈ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ, గడచిన ఏడేళ్ళలో 'అధికారిక' గణన ప్రకారం ఈ ఆత్మహత్యల సంఖ్య 500కు పైగా ఉంది. అయితే, ఇతర స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ సంఖ్య అంతకంటే అనేక రెట్లు ఎక్కువ.
హెల్ప్‌లైన్‌కు రెడ్డి కాల్ చేయటం స్పష్టమైన హెచ్చరిక సిగ్నల్‌గా ఉపయోగపడాలి. ఆయన చాలా హానికి లోనవుతోన్న సమూహంలో, సరాసరి ప్రమాదభరితమైన స్థితిలోనే ఉన్నారు. నీటి కోసం కలలు కంటూ అప్పుల ఊబిలో తలమునకలుగా కూరుకుపోతున్నారు. ఆయన భారీగా పెట్టుబడి పెట్టిన తోటల పెంపకం శిథిలావస్థకు చేరుకుంది. ఆయన వేసిన అనేక బోరుబావుల పరిస్థితి కూడా అలాగే ఉంది.
అమిత సంపన్నులు ఈ రకమైన సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి బాగా సిద్ధంగా ఉన్నారు. సాగు కంటే తమ బోరుబావులు, పంపులతో తీసిన నీటిని అమ్ముకోవడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే ‘నీటి ప్రభువుల’ ఆధిపత్యం వలన ప్రైవేట్ నీటి మార్కెట్లు వేగంగా పుట్టుకొచ్చాయి.
నిరాశకు గురైన రైతులు తమ పొలాలను ‘తడపటం’ కోసం ఒక ఎకరానికి 7,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టి కొనుగోలు చేయవచ్చు. దీనర్థం, అక్కడ ఉన్న ఏ కాస్త నీటినైనా సమర్థవంతంగా అమ్ముకోగలిగినవారి నుంచి డబ్బు చెల్లించి కొనుక్కోవటం. మీరు పొలాన్ని తడపటం కోసం ట్యాంకర్ ద్వారా కూడా ఆ నీటిని కొనుగోలు చేయవచ్చు.
అటువంటి నేపథ్యంలో, వాణిజ్యం త్వరగా సమాజం నెత్తికెక్కుతుంది. "ఇవన్నీ ఒక్క ఎకరా సాగుకయ్యే ఖర్చులను ఏమి చేస్తుందో మీరు ఊహించగలరా?" అని అడిగారు రెడ్డి. నీటి శకునం చెప్పేవారు కూడా హైవేలపై ఎక్కడంటే అక్కడ తిరుగుతున్న బోరుబావులు తవ్వే రిగ్గులతో కలిసి తమ అద్భుతాలను ప్రదర్శిస్తారు. ఒకటి మరొక దానికి దారులు తెరుస్తుంది. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. హిందూపూర్ పట్టణంలో నివాసముండే 1.5 లక్షల మంది జనం తాగునీటి కోసం సంవత్సరానికి 8 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఒక స్థానిక నీటి ప్రభువు మున్సిపల్ కార్యాలయం చుట్టూ పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించాడు
మూఢనమ్మకాలు, గుప్తశక్తులు, దేవుడు, ప్రభుత్వం, సాంకేతికత, కొబ్బరికాయలు - ఇవన్నీ నీటి కోసం అనంతపురం చేస్తోన్న తీరని అన్వేషణలో తమ సేవలను అందించాయి. వాటన్నిటి సేవలు కలిపినా కూడా ఏమంత ఆకట్టుకునే ఫలితాలు లేవు
ఎట్టకేలకు వర్షాలు మొదలైనట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు జల్లులు పడితే నాట్లు ముందుకు సాగుతాయి. దీనర్థం ఆశలు తిరిగి చిగురించడం, ఆత్మహత్యలు తగ్గిపోవడం. సమస్యకు పరిష్కారమయితే, చాలా దూరంగానే ఉంది. మంచి పంటకు గొప్ప స్వాగతం లభిస్తుంది, కానీ ఉక్కిరిబిక్కిరి చేసే ఇతర సమస్యలను తెరపైకి తెస్తుంది.
"విచిత్రమేమిటంటే, మంచి పంట కొత్త ఆత్మహత్యలకు దోహదపడుతుంది," అని అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ జీవావరణ కేంద్రం సంచాలకులు మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. “ఒక రైతు ఎక్కువలో ఎక్కువగా ఆ పంటపై రూ. 1 లక్ష సంపాదిస్తాడు. కానీ అతను తీర్చడానికి అనేక సంవత్సరాల పంట నష్టం వలన చేసిన రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల వరకూ అప్పులుంటాయి. సంక్షోభం వలన ఆలస్యమైన చాలా వివాహాలను ఇప్పుడు జరిపించాల్సి ఉంటుంది
“అప్పుడిక భయంకరంగా పెరిగిపోయిన కొత్త పెట్టుబడి ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ హామీలన్నింటినీ రైతు ఎలా నెరవేరుస్తాడు? రాబోయే కొద్ది నెలల్లో ఋణదాతల నుండి ఒత్తిడి అపారంగా ఉంటుంది. అప్పుల నిలుపుదల ఎప్పటికీ ఉండబోదు.”
ఇక్కడి రైతుల సమస్యల విషయానికి వస్తే వర్షాలెప్పుడూ పడవు కానీ కుమ్మరిస్తాయి. రైతులు నీటి కోసం కలలు కంటూ అప్పుల ఊబిలో తలమునకలుగా కూరుకుపోతున్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి