“ఇల్లల్లాహ్ కీ షరాబ్ నజర్ సే పిలా దియా, మైఁ ఏక్ గునహ్‌గార్ థా, సూఫీ బనా దియా.
సూరత్ మే మేరే ఆ గయీ సూరత్ ఫకీర్ కీ, యే నజర్ మేరే పీర్ కీ, యే నజర్ మేరే పీర్ కీ...”

[నా సాధువు నా కళ్ళలోకి చూసి అల్లా దివ్యమకరందాన్ని తాగేలా చేశాడు.
అప్పటి వరకూ పాపినైన నన్ను ఆయన ఒక రకమైన సూఫీని చేశాడు.
నా ముఖం ఒక యాచకుని ముఖంలా మెరుస్తోంది
ఓహ్ ఆ చూపు! నా సాధువు కళ్ళలోని ఆ చూపు!]

మణికట్టుకు ఘుంగ్రూలు [మువ్వలు] కట్టుకుని, ఒడిలో పసిపాపలా కూర్చున్న ఢోలక్‌ ని వాయిస్తూ, పుణే నగర సమీపంలోని ఒక దర్గా (ప్రార్థనాస్థలం) వద్ద ఒక కవ్వాల్ పాట పాడుతున్నారు.

బిగ్గరగా, గోపురం పైభాగాన్ని తాకేంత స్పష్టమైన స్వరంతో, మైక్రోఫోన్ గానీ, సహగాయకులు గానీ లేకుండా, ముందర శ్రోతలెవరూ లేకపోయినా, ఆ కవ్వాల్ ఒక్కరుగానే ప్రదర్శన ఇస్తున్నారు.

ఒక కవ్వాలీ తర్వాత మరొకటి. ప్రార్థనల సమయంలో సంగీతం పాడటం లేదా వాయిద్యాలు వాయించడం సరి కాదు కాబట్టి అతను జుహర్ , మగ్రిబ్ నమాజ్ (సాయంకాల ప్రార్థనలు) సమయాలలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు. నమాజ్ ముగియగానే తిరిగి మొదలుపెట్టి దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు అతను పాడుతూనే ఉంటారు.

“నా పేరు అమ్జద్. అమ్జద్ మురాద్ గోండ్. మేం రాజగోండులం. ఆదివాసులం,” అని తనను తాను పరిచయం చేసుకుంటారు. పేరులోనూ, చూపులకూ ముస్లిముగా కనిపించే అమ్జద్ పుట్టుకతో ఆదివాసీ. " కవ్వాలీ మా వృత్తి!" అని ఆయన తెలియజేశారు..

PHOTO • Prashant Khunte

పుణే నగరానికి సమీపంలోని దర్గా వద్ద కవ్వాలీ పాడే అమ్జద్ గోండ్. ప్రార్థనల సమయంలో సంగీతం పాడటం, లేదా వాయిద్యాలు వాయించడం సరి కాదు కాబట్టి అతను జుహర్, మగ్రిబ్ నమాజ్ సమయాలలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు. నమాజ్ ముగియగానీ తిరిగి మొదలుపెట్టి దాదాపు రాత్రి ఎనిమిది గంటల వరకు అతను పాడుతూనే ఉంటారు

కవ్వాలీ ని ఆస్వాదించని వ్యక్తిని నాకు చూపించండి! అందరికీ నచ్చే కళ ఇది," అంటారు పాన్ (కిళ్ళీ) నములుతోన్న అమ్జద్. పాన్ నోటిలో కరిగిపోతుండగా, తన కవ్వాలీ అభిరుచి గురించి చెప్తూ ఆయన ఇలా జోడించారు, “ పబ్లిక్ కో ఖుష్ కర్నే కా. బస్ [ప్రజలను సంతోషపెట్టడానికి, అంతే]!”

‘పావోఁ మేఁ బేడీ, హాథోఁ మేఁ కడా రహనే దో, ఉస్‌కో సర్కార్ కీ చౌఖట్ పే పడా రహనే దో...’ దీన్ని విన్నప్పుడు నాకు ఒక హిందీ చిత్రంలోని ఒక జనరంజకమైన పాట గుర్తుకువచ్చింది.

దర్గా కు వచ్చే భక్తులు అతను కవ్వాలీ కి బాలీవుడ్ బాణీని ఉపయోగించడాన్ని వ్యతిరేకించరు, అంతేకాదు వాళ్ళు అతని గానం విని, కొన్ని డబ్బులు కూడా ఇస్తుంటారు. కొందరు 10, కొందరు 20 రూపాయలు ఇస్తారు. దర్గా సంరక్షకులు చాదర్ సమర్పించి, పూజ్యమైన సాధువు దీవెనలు కోరే భక్తులకు తిల్‌గుల్ (నువ్వులు, బెల్లం) ఇస్తారు. చెడును పారదోలేందుకు ఒక ముజావర్ నెమలి ఈకలతో సవాలీల (భక్తుల) వీపు పైన, భుజాల మీద తడతారు. ఇక్కడ పీర్ల కు(సాధువులకు) డబ్బులు సమర్పిస్తారు, అలాగే కవ్వాల్ (గాయకుడు) కోసం కూడా కొంచెం డబ్బు పక్కన పెడతారు.

దర్గా ను చాలామంది ధనవంతులు సందర్శిస్తారని అమ్జద్ చెప్పారు. సమాధికి వెళ్ళే రహదారిలో సమర్పణ చేసే చాదర్ , చున్రీ లను విక్రయించే అనేక చిన్న దుకాణాలు ఉన్నాయి. ఏ ప్రార్థనా స్థలమైనా అనేకమందికి ఆహారాన్నీ ఉపాధినీ అందిస్తుంది.

హజ్రత్ పీర్ కమర్ అలీ దర్వేశ్ వివక్ష చూపించడు. మనకు దర్గా మెట్లపై భిక్ష కోసం వేడుకునే ఒక ఫకీర్ (యాచకుడు), ప్రజల నుంచి దయనూ డబ్బునూ ఆశించే అంగవికలురు కనిపిస్తారు. తొమ్మిది గజాల చీర కట్టుకునే ఒక వృద్ధ హిందూ మహిళ ఇక్కడికి క్రమం తప్పకుండా వచ్చి హజ్రత్ కమర్ అలీ దర్వేశ్ ఆశీర్వాదాన్ని పొందుతారు. వికలాంగులు, అనాథలు, కవ్వాలులు అందరూ ఆయన కృప మీద ఆధారపడతారు.

అమ్జద్ బిచ్చగాడు కాదు, ఒక కళాకారుడు. ఉదయం 11 గంటలకు అతను సమాధి ముందర ఒక స్థలాన్ని చూసుకుని తన 'వేదిక'ను ఏర్పాటు చేసుకుంటారు. క్రమంగా మెల్లమెల్లగా భక్తులు రావడం ప్రారంభిస్తారు. మధ్యాహ్న సమయానికి, సమాధి చుట్టూ ఉండే తెల్లని పాలరాయి, గ్రానైట్ నేల వేడిగా మారుతుంది. బొబ్బలెక్కించే రాతి వేడిమి నుండి తమ పాదాలను రక్షించుకోవడానికి భక్తులు గెంతుతారు, పరుగులుపెడతారు. ఇక్కడ ముస్లిముల కంటే హిందూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

మజార్ (సాధువు సమాధి) దగ్గరకు వెళ్ళడానికి మహిళలకు అనుమతి లేదు. కాబట్టి, ముస్లిమ్ మహిళలతో సహా అనేకమంది వరండాలో కూర్చుని కళ్ళు మూసుకుని ఖురాన్‌లోని ఆయత్‌ ను పఠిస్తారు. వాళ్ళ పక్కనే సమీప గ్రామానికి చెందిన ఒక హిందూ స్త్రీని ఆత్మ ఆవహించింది. దాన్ని " పీరాచ్ వారా [పీర్ ఆత్మ]," అని ప్రజలు అంటారు.

PHOTO • Prashant Khunte
PHOTO • Prashant Khunte

ఎడమ: పుణే నగరానికి సమీపంలోని ఖేడ్‌శివపూర్‌లోని పీర్ కమర్ అలీ దర్వేశ్ దర్గా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీన్ని పేదలు, ధనవంతులు అందరూ సందర్శిస్తారు. కుడి: మహిళలకు మజార్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి, వాళ్ళలో చాలామంది బయట నిలబడి ప్రార్థనలు చేస్తారు

PHOTO • Prashant Khunte

అమ్జద్ గోండ్ ప్రతి నెలా ఇక్కడికి వస్తుంటారు. ‘ఊపర్‌వాలా భూఖా నహీ సులాతా [ఆ పైవాడు మనల్ని ఆకలితో నిద్రపోనివ్వడు]!’ అంటారతను

ఇక్కడ చిరాగ్ - సమాధి వద్ద ఉండే దీపం - లోని నూనె విషపూరితమైన పాము లేదా తేలు కాటుకు విరుగుడుగా పని చేస్తుందని భక్తుల నమ్మకం. ఈ నమ్మకానికి మూలాలు విషప్రయోగానికి చికిత్స లేని కాలంలో కనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఆసుపత్రులు, వైద్యం ఉన్నాయి, కానీ చాలామందికి ఇప్పటికీ వాటిని భరించే స్తోమత లేదు. ఇప్పటికీ అనేకమంది బాధలు అనుభవించేవారు, పిల్లలు లేని స్త్రీలు, అత్తగారు లేదా భర్తలచే వేధించబడేవారు చాలామంది ఉన్నారు. మరికొందరు తప్పిపోయిన తమ వాళ్ళ కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తారు.

ఈ ప్రార్థనాస్థలానికి మానసిక రుగ్మతలు ఉన్నవారు కూడా పీర్ వద్ద ఆశీస్సులు తీసుకోవడం కోసం వస్తారు. వాళ్ళు ఆశీర్వాదం కోసం వేడుకుంటే, అమ్జద్ కవ్వాలీ వారు కోరుకునే ప్రార్థనకు ఒక రాగాన్ని, లయను అందిస్తుంది. ఇతర ప్రార్థనల మాదిరిగానే ఇవి కూడా మనల్ని ఒక పారవశ్యంలోకి తీసుకువెళతాయి.

అతనెప్పుడైనా పాడటం మానేస్తారా? అతని గొంతు అలసిపోదా? అతని ఊపిరితిత్తులు ఒక జంటహార్మోనియంలా కనిపిస్తున్నాయి. అమ్జద్ రెండు పాటల మధ్య విరామం తీసుకుంటుండగా నేను ఇంటర్వ్యూ కోసం సమయాన్ని కోరుతూ అతన్ని సంప్రదించాను. “ మేరేకూ కుఛ్ దేనా పడేఁగా క్యా? [నేను ఏమైనా ‘చెల్లించాలా?’]" డబ్బును సూచించేలా చేతితో సైగ చేస్తూ అడిగారు అమ్జద్. ఏం చెప్పాలో నాకు తోచలేదు. నేను మరోసారి అతని సమయాన్ని కోరి, అతని గానం వింటూవున్నాను.

కవ్వాలీ అనేది రూహానీ – అంటే అది ఆత్మను తాకుతుంది. సూఫీ సంప్రదాయం దానిని ఆ పరమాత్మునితో ముడిపెట్టింది. రియాలిటీ టాలెంట్ షోలలో మనం వినేది మరొక రకమైనది- రూమానీ లేదా రొమాంటిక్. ఆపైన ఈ మూడో రకం వస్తుంది. దానిని ఖానా బదోశీ అంటారు. జీవనోపాధి కోసం అనేక చోట్లకు తిరుగుతూ జీవించే అమ్జద్ లాంటి వాళ్ళకు అది చేరువైంది.

అమ్జద్ స్వరం గాలిలో ప్రతిధ్వనిస్తోంది.

తాజదార్-ఎ-హరమ్, హో నిగాహ్-ఎ-కరమ్
హమ్ గరీబోం కే దిన్ భీ సంవర్ జాయేంగే...
ఆప్‌కే దర్ సే ఖాళీ అగర్ జాయేంగే

అమ్జద్ పాడుతోన్న చివరి పంక్తికి చాలా లోతైన అర్థం ఉంది. అతనితో మాట్లాడాలనే ఆసక్తి నాలో మరింత పెరిగింది. అతన్ని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక మరుసటి రోజుకు సమయం అడిగి, మళ్ళీ దర్గా కి వెళ్ళాను. మరుసటి రోజు వరకూ నేను పీర్ కమర్ అలీ దర్వేశ్ చరిత్రను తెలుసుకోవటంలో మునిగిపోయాను.

చూడండి: అమ్జద్ గోండ్, కవ్వాలీ సంగీతకారుడు

అమ్జద్ గోండ్ సమాధి ముందర ఒక స్థలాన్ని చూసుకుని తన 'వేదిక'ను ఏర్పాటు చేసుకుంటారు. మెల్లమెల్లగా భక్తులు రావడం ప్రారంభిస్తారు. ఇక్కడ ముస్లిముల కంటే హిందూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది

*****

హజ్రత్ కమర్ అలీ పుణే నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే సింహగడ్ కోట పాదాల వద్ద ఉన్న ఖేడ్‌శివపుర్ అనే చిన్న గ్రామానికి వచ్చాడనేది కథనం. గ్రామంలోని దెయ్యంతో విసిగిపోయిన గ్రామస్థులు హజ్రత్ కమర్ అలీ వద్దకు వెళ్ళి సహాయం కోరారు. పవిత్రుడైన ఆయన దెయ్యాన్ని ఒక రాయిలో బంధించి ఇలా శపించాడు : తా ఖయామత్, మేరే నామ్ సే లోగ్ తుఝే ఉఠా ఉఠా కే పటక్‌తే రహేంగే, తూ లోగోఁ కో పరేశాన్ కియా కర్తా థా, అబ్ జో సవాలీ మేరే దర్బార్ మే ఆయేంగే వో తుజే మేరే నామ్ సే పటకేంగే! [దేవుని తీర్పు రోజు వచ్చేవరకు ప్రజలు నిన్ను ఎత్తి నేలకు కొడతారు. నువ్వు ఇప్పటి వరకు వాళ్ళను వేధించావు, ఇప్పుడు నా ఆశీర్వాదం కోసం వచ్చిన వారందరూ నిన్ను నేలకు కొడతారు]."

సమాధి ముందున్న రాయి 90 కిలోల కంటే ఎక్కువే బరువుంటుంది. దాదాపు 11 మంది వ్యక్తుల బృందం దానిని కేవలం ఒక వేలితో ఎత్తగలుగుతారు. వాళ్ళు పెద్ద స్వరంతో 'యా కమర్ అలీ దర్వేశ్ ' అని జపిస్తూ, బలంకొద్దీ రాయిని కిందకు విసిరికొడతారు.

చాలా గ్రామాలలో దర్గాలు ఉన్నాయి, అయితే ఖేడ్‌శివపుర్‌లో ఉన్నంతగా జనం వాటిలో క్రిక్కిరిసిపోయి ఉండరు. ఈ రాయి గొప్పదనం చాలామందిని ఇక్కడికి తీసుకొస్తుంది; ఈ రద్దీ కారణంగా అమ్జద్ వంటి చాలామందికి కొంచెం ఎక్కువ సంపాదించే అవకాశం లభిస్తుంది. ఔలియా సంతానం లేనివారికి సంతానం కలిగేలా చేస్తుందని భక్తుల నమ్మకం. "మేం మూలికలను ఇచ్చి, సంతానం లేనివారికి పిల్లలు పుట్టేలా చేస్తాం," అని అమ్జద్ నాతో చెప్పారు.

PHOTO • Prashant Khunte

పీర్ కమర్ అలీ దర్వేశ్ దర్గా వద్ద సుమారు 90 కిలోల బరువున్న రాయిని కొందరు వ్యక్తులు కలిసి ఎత్తి నేలకేసి కొడతారు. ఈ ఆచారం అనేక దర్గాలలో కనిపిస్తుంది

*****

అదే ప్రాంగణంలో ఒక మసీదు, దాని ప్రక్కనే ఒక వజూఖానా ఉన్నాయి. అమ్జద్ అక్కడికి వెళ్ళి, శుభ్రంగా కడుక్కొని, తన జుట్టును ముడిగా బిగించి కట్టుకుని, నారింజ రంగు టోపీని ధరించి, మాట్లాడటం ప్రారంభించారు. "నేను ప్రతి నెలా ఇక్కడకు వచ్చి కనీసం ఒక వారం రోజులపాటు ఉంటాను." అతని చిన్నప్పుడు ఇక్కడికి క్రమం తప్పకుండా వచ్చే తన తండ్రికి తోడుగా అమ్జద్ వచ్చేవాడు. “మా అబ్బా [తండ్రి] నన్ను మొదటిసారి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు నాకు 10, 15 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు దాటాయి. కొన్నిసార్లు నేను కూడా నా కొడుకును ఇక్కడికి తీసుకువస్తుంటాను,” అని అతను చెప్పారు.

దర్వేశి సముదాయానికి చెందిన కొందరు దర్గా నేలమాళిగలో చాప మీద నిద్రిస్తున్నారు. అమ్జద్ కూడా తన సంచిని ఒక గోడ దగ్గర పెట్టుకున్నారు. అతను ఒక చాప తీసి నేలపై పరిచారు. తన ఇల్లు జల్‌గాఁవ్ జిల్లా పాచోరాలోని గోండు బస్తీలో ఉందని ఆయన నాతో చెప్పారు.

అమ్జద్ తనను తాను హిందువుగానో లేదా ముస్లింగానో చెప్పుకునే ప్రయత్నం చేయరు. నేను అతని కుటుంబం గురించి అడిగాను. “నాకు నాన్న, ఇద్దరు అమ్మలు. మేం నలుగురు అన్నదమ్ములం. అబ్బాయిలలో నేనే పెద్దవాడిని. నా తర్వాత షారుఖ్, సేథ్, చిన్నవాడు బాబర్. నేను ఐదుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాను." నేను అతనిని వాళ్ళ ముస్లిమ్ పేర్ల గురించి అడిగాను. “మా గోండులకు హిందూ, ముస్లిమ్ రెండు పేర్లూ ఉంటాయి. మాకు మతం లేదు. మాకు కులంపై నమ్మకం లేదు. హమారా ధరమ్ కుఛ్ అల్లగ్ హై [మా మతం కాస్త భిన్నమైనది]. మేం రాజగోండులం," అన్నారతను.

అందరికీ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, సుమారు 300 సంవత్సరాల క్రితం, రాజగోండు ఆదివాసులలో ఒక వర్గం ఇస్లామ్‌లోకి మారింది. వారిని ముసల్మాన్/ముస్లిమ్ గోండ్ అని పిలిచేవాళ్ళు. మహారాష్ట్రలోని నాగపూర్, జల్‌గాఁవ్ జిల్లాల్లో ఈ ముస్లిమ్ గోండు వర్గానికి చెందిన కొంతమందిని చూడొచ్చు. కానీ అమ్జద్‌కు ఈ చరిత్ర తెలియదు.

“మేం ముస్లిములను పెళ్ళి చేసుకోం. గోండుల్ని మాత్రమే పెళ్లాడతాం. నా భార్య చాందనీ గోండు,” అని అతను చెప్పారు. “నా బిడ్డలు లాజో, అలియా, అలిమా. వారంతా గోండులే కదా?" పేర్ల ఆధారంగా మతాన్ని గుర్తించగలమని అమ్జద్ అనుకోరు. ఆయన తన అక్కాచెల్లెళ్ళ గురించి చెబుతూ, “నా పెద్దక్క పేరు నిశోరీ, ఆ తర్వాత రేష్మా. రేష్మా తరువాతివారు సౌసాల్, డిడోలీ. ఇవన్నీ గోండు పేర్లే చూడండి. కానీ అందరికన్నా చిన్నది మేరీ. యే నామ్ తో కిరిశ్చన్ మే ఆతా హై [ఇది క్రిస్టియన్ పేరు]. దానితో సమస్య లేదు. మాకు నచ్చిన పేర్లను మేం అలా పెట్టుకుంటామంతే. నిశోరీకి 45 ఏళ్ళు, చిన్నదైన మేరీకి ముప్పై ఏళ్ళు. వీరంతా గోండు మగవాళ్ళనే పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళెవరూ బడికి వెళ్ళలేదు," అన్నారు.

అమ్జద్ భార్య చందానీకి చదువు లేదు. తన కుమార్తెల చదువు గురించి అడిగినప్పుడు, “నా కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కానీ మా సముదాయంలో ఆడపిల్లలను పెద్దగా చదువుకొమ్మని ప్రోత్సహించరు." అన్నారు.

PHOTO • Prashant Khunte
PHOTO • Prashant Khunte

మహారాష్ట్రలోని పాచోరా నివాసి అమ్జద్ గోండ్. ముస్లిమ్ పేరు, ఆకారాన్ని కలిగి ఉండే ఈ రాజగోండు ఆదివాసీకి మతపరమైన విభజనలపై నమ్మకంలేదు

"నా కొడుకుల్లో ఒకరు నవాజ్, మరొకరు గరీబ్!" ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీని పేదల రక్షకుడైన 'గరీబ్ నవాజ్ ' అని పిలుస్తారు. అమ్జద్ తన కొడుకులకు పేర్లు పెట్టడానికి ఈ రెండు పదాలను ఉపయోగించారు. “నవాజ్‌ వయసు ఇంకా ఏడాది  నిండలేదు! కానీ నేను గరీబ్ బాగా చదువుకునేలా చూస్తాను. నాలా సంచార జీవిని కానివ్వను!” గరీబ్‌కు ఇప్పుడు ఎనిమిదేళ్ళు, 3వ తరగతి చదువుతున్నాడు. కానీ ఈ పిల్లవాడు తన కవ్వాల్ తండ్రితో పాటు తిరుగుతుంటాడు.

అతని కుటుంబంలోని పురుషులందరూ క వ్వాలీ ని తమ వృత్తిగా చేసుకున్నారు.

“మీకు తెలుసా, మా గోండులం ఏదైనా అమ్మగలం, మట్టి ముద్దను కూడా! మేం చెవుల్లో గులిమి తీసి శుభ్రం చేస్తాం. ఖర్జూరాలు అమ్ముతాం. ఘర్ సే నికల్ గయే, తో హజర్-పాంచ్ సౌ  కమాకే చల్తే హై [పని కోసం ఇంటి నుండి బయలుదేరితే, మేం 1,000 లేదా 500 రూపాయలు సంపాదించుకొని తిరిగి వెళ్తాం]!" అన్నారు అమ్జద్. కానీ “మా జనం డబ్బుతో ఆర్భాటం చేస్తారు. వాళ్ళు పొదుపు చేయరు. మాకు ప్రత్యేకమైన వృత్తి లేదు. ఎవరూ ఏ విధమైన ఉద్యోగంలో కూడా లేరు,” అని అమ్జద్ ఫిర్యాదు చేస్తారు.

స్థిరమైన ఆదాయ వనరు లేదా వృత్తి లేకపోవడంతోనే అమ్జద్ తండ్రి కవ్వాలీ ని చేపట్టారు. “మా తాతయ్యలాగే, మా నాన్న కూడా మూలికలు, ఖర్జూరాలు అమ్ముతూ గ్రామాలలో తిరిగేవాడు. సంగీతాన్ని ఇష్టపడే ఆయన కవ్వాలీ దారిని కనుగొన్నాడు. నాన్న ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన వెంటే ఉండేవాణ్ని. ఆయన మెల్లగా కొన్ని కార్యక్రమాలలో పాడటం మొదలుపెట్టాడు. ఆయనను చూసి నేనూ ఈ కళను నేర్చుకున్నాను.’’

"మీరు బడికి వెళ్లలేదా?" నేను అడిగాను.

అమ్జద్ చునా (సున్నం ముద్ద) ఉన్న సంచీ తీసి, వేలికి వచ్చినంత తీసి దాన్ని నాలుకకు రాసుకుంటూ, “నేను రెండు లేదా మూడవ తరగతి వరకు బడికి వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళలేదు. కానీ నాకు చదవడం, రాయడం వచ్చు. నాకు ఇంగ్లీషు కూడా తెలుసు,” అన్నారు. తను ఇంకా చదువుకుని ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళేవాడినని, తను ఆ పని చేయలేదని కూడా బాధపడతారు. " ఉస్ కే వజహ్ సే హమ్ పీచే హై [అందువల్లనే నేను వెనుకబడ్డాను]," అన్నారతను. అమ్జద్ సోదరుల విషయంలో కూడా అదే నిజమయింది. అందరూ చదవడం, రాయడం నేర్చుకోవడం కోసమే బడికి వెళ్ళారు, అంతే. పని వాళ్ళను చదువుకు దూరం చేసింది.

PHOTO • Prashant Khunte

కవ్వాలీని గానం చేస్తున్న అతని స్వరం బిగ్గరగా, స్పష్టంగా ఉంటుంది. మైక్రోఫోన్ గానీ, సహగాయకులు గానీ లేకుండానే అది గోపురం పైభాగాన్ని తాకుతుంది

“మా గ్రామంలో 50 గోండు కుటుంబాలున్నాయి. మిగిలిన వాళ్ళంతా హిందువులు, ముసల్మానులు, 'జై భీమ్' [దళితులు]. గ్రామంలో అందరూ ఉన్నారు," అన్నారు అమ్జద్. “మమ్మల్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని సముదాయాలలో చదువుకున్నవాళ్ళు ఉన్నారు. అయితే నా మేనల్లుడు చదువుకున్నాడు. అతని పేరు శివ." శివ 15 లేదా 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు చదువుకున్నాడు. సైన్యంలో చేరాలని అనుకున్నాడు, కానీ సాధించలేకపోయాడు. ఇప్పుడతను పోలీసుల్లో చేరటం కోసం ప్రయత్నిస్తున్నాడని అమ్జద్ చెప్పారు. అమ్జద్ కుటుంబంలో కనీసం ఒక యువకుడు కెరీర్ గురించీ, చదువు గురించీ ఆలోచిస్తున్నాడు.

అమ్జద్‌కు కూడా తనకంటూ ఓ కెరీర్ ఉంది. "మాకు కెజిఎన్ కవ్వాలీ పార్టీ ఉంది." కెజిఎన్ అంటే ఖ్వాజా గరీబ్ నవాజ్. అతను తన సోదరులతో కలిసి దీన్ని ప్రారంభించారు. వివాహాలు, ఇతర కార్యక్రమాలలో వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు. "మీరు ఎంత సంపాదిస్తారు?" నేను అడిగాను. "అది నిర్వాహకుడిపై ఆధారపడి ఉంటుంది. మాకు 5,000 నుంచి 10,000 రూపాయలు లభిస్తాయి. ప్రేక్షకులు కూడా కొంత డబ్బు ఇస్తారు. మొత్తం మీద మేం ఒక కార్యక్రమం చేస్తే 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తాం,” అమ్జద్ చెప్పారు. సభ్యులందరూ ఆ డబ్బును పంచుకుంటే ఒక్కొక్కరికీ రూ. 2,000-3,000 కంటే ఎక్కువ రాదు. పెళ్ళిళ్ళ సీజన్ అయిపోగానే ఇంకే కార్యక్రమాలు ఉండవు. అప్పుడు అమ్జద్ పుణే వస్తారు.

ఇక్కడ ఖేడ్‌శివపూర్‌లోని హజ్రత్ కమర్ అలీ దర్వేశ్ దర్గా వద్ద అతనెప్పుడూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు. అతను రాత్రిళ్ళు నేలమాళిగలో కాలం గడుపుతారు. “ ఊపర్‌వాలా భూఖా నహీ సులాతా ! [సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆకలితో పడుకోనివ్వడు]” చాలామంది తమ కోరికలు నెరవేరితే విందు భోజనమో లేదా ఏదో ఒకటి తినడానికి ఇచ్చి పోతారు. అతను ఒక వారం పాటు ఇక్కడే ఉండి, కవ్వాలీ ప్రదర్శన చేసి, తద్వారా సంపాదించినదాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తారు. అదీ అతని పని. ఇక్కడ అతని సంపాదన గురించి అడిగినప్పుడు, అది 10,000 - 20,000 మధ్య ఉంటుందని అమ్జద్ చెప్పారు. “అయితే అతిగా ఆశ పడకూడదు. ఒకవేళ మీరు ఎక్కువ సంపాదించినా, ఆ డబ్బును ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి, నేను ఎంత సంపాదిస్తే అంత తీసుకుని ఇంటికి పోతాను!" అని నాతో చెప్పారతను.

"బతకడానికి అది సరిపోతుందా?" అని నేను అడిగాను. “ హాఁ, చల్ జాతా హై! [అవును, నడిచిపోతుంది] మా గ్రామానికి తిరిగి వచ్చాక కూడా నేను పని చేస్తాను,” అని అతను చెప్పారు. అతనికి భూమి గానీ, మరే ఇతర ఆస్తి గానీ లేదు కదా, ఏం పని చేస్తాడా అని నేను ఆశ్చర్యపోయాను.

అమ్జద్ నా ప్రశ్నను సమాధానంగా, “రేడియం పని. నేను ఆర్‌టిఒ [ప్రాంతీయ రవాణా కార్యాలయం] దగ్గరకు వెళ్ళి వాహనాల పేర్లు, నంబర్ ప్లేట్లకు రంగులు వేస్తాను," అని వివరించారు.“ కవ్వాలీ కార్యక్రమాలు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మధ్యలో ఏదైనా పని కోసం వెతకాలని నేను నిర్ణయించుకున్నాను. నేను నా సంచి తీసుకొనిపోయి కొంత రేడియం పెయింట్ కొన్నాను. దారిలో, ఒక వాహనం వద్ద ఆగి, దాన్ని పెళ్ళికూతురిలా అలంకరించాను." ఇది అతను కళను ఉపయోగించుకుని చేసే సైడ్ బిజినెస్. దాని వల్ల అతను కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నారు.

PHOTO • Prashant Khunte
PHOTO • Prashant Khunte

చిన్నతనంలో అమ్జద్ గోండ్, సంగీతకారుడైన తన తండ్రితో కలిసి తిరిగేవాడు. అలా అతను బడికి దూరమయ్యాడు

చాలా తక్కువ జీవనోపాధి అవకాశాలు, ఏ కొద్దిమందో మెచ్చుకునే కళతో, అమ్జద్ సామాజికవర్గానికి ఆశించడానికి పెద్దగా ఏమీ లేవు. కానీ పరిస్థితులు మారతాయి. భారత ప్రజాస్వామ్యం వాళ్ళ జీవితంలో ఆ ఆశను తీసుకొచ్చింది. "మా నాన్న సర్పంచ్ [గ్రామాధికారి]," అని అతను చెప్పారు. "గ్రామానికి ఎన్నో మంచి పనులు చేశాడు. ఇంతకుముందు మేమున్న చోటంతా బురదగా ఉండేది, అయితే ఆయన రోడ్డు నిర్మించాడు.’’

స్థానిక పరిపాలనా సంస్థల్లో ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ అమ్జద్ తన సొంత మనుషులను గురించే కలత చెందుతున్నారు. “ సర్పంచ్‌ ను మించి ఎవరైనా ముందుకువెళ్తారా? కానీ మా వాళ్ళు వినరు. వాళ్ళ చేతిలో కొంత డబ్బు పడగానే చికెన్, చేపలు కొంటారు. డబ్బంతా ఖర్చుపెట్టి సరదా చేస్తారు. భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించరు,” ఫిర్యాదు చేశారతను.

"మీరు ఎవరికి వోటేస్తారు?" వోటింగ్ గోప్యమని పూర్తిగా తెలిసి కూడా నేనీ ప్రశ్న అడిగాను. “ఇంతకుముందు నేను పంజా కు [భారత జాతీయ కాంగ్రెస్ చిహ్నం] వోటు వేశాను. ఇప్పుడు బిజెపి మంచి ఊపులో ఉంది. మా కుల పంచాయితీ తీర్మానం ప్రకారమే మేం వోటు వేయాలి. జో చల్ రహా హై, వయీచ్ చల్ రహా హై [చుట్టూ ఏమి జరుగుతుందో, దాన్నే మేం అనుసరిస్తాం]!. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు," అని అతను చెప్పారు.

PHOTO • Prashant Khunte

చాలా గ్రామాలలో దర్గాలు ఉన్నాయి, అయితే ఖేడ్‌శివపూర్‌లో ఉన్నంత రద్దీ మరెక్కడా ఉండదు. అమ్జద్ వంటి సంగీతకారులకు ఇక్కడ సంపాదించడానికి మంచి అవకాశం ఉంది

"మీరు మద్యం తాగుతారా?" నేను అడిగాను, అతను వెంటనే లేదన్నారు. “లేదు, ఎప్పుడూ తాగలేదు... బీడీలు గానీ మద్యం గానీ ముట్టను. మేరే భాయ్ బీడియా పీతే, పుడియా ఖాతే , [నా సోదరులు బీడీలు తాగుతారు, పొగాకు/ గుట్కా తింటారు]. కానీ నేను చేయను. నాకు అలాంటి దుర్గుణాలు లేవు." ఈ అలవాట్లలో తప్పు ఏమిటో నేను అతని నుంచి తెలుసుకోవాలనుకున్నాను.

“నేను పూర్తిగా భిన్నమైన దారిలో ఉన్నాను! తాగి కవ్వాలీ పాడితే పరువు పోతుంది. ఎవరైనా ఆ పని ఎందుకు చేయాలి? అందుకే నేనెప్పుడూ ఈ అలవాట్లు చేసుకోలేదు," అని అమ్జద్ చెప్పారు.

మీకు ఏ కవ్వాలీ అంటే ఇష్టం? “నాకు సంస్కృతంలో ఉన్నవి ఇష్టం. నాకు వాటిని పాడటం, వినడం కూడా ఇష్టం,” చెప్పారతను. సంస్కృత కవ్వాలీ ? నాకు ఆసక్తి పెరిగింది. “అసలమ్ సాబరీ ‘ కిర్పా కరో మహారాజ్… ’ అని పాడాడు. ఎంత మధురమైన స్వరకల్పన! ఆత్మను తాకేదే నాకు సంస్కృతం. కవ్వాలీ భగవాన్ కే లియే గావో యా నబీ కే లియే, దిల్ కో ఛూ జాయే బస్స్ [కవ్వాలీలను దేవుడి కోసమో లేదా ప్రవక్తల కోసమో పాడాలి. అది మీ హృదయాన్ని తాకితే, అంతే చాలు]!" అతను వివరించారు.

అమ్జద్‌కు 'సంస్కృతం' అంటే హిందూ దేవుతలను స్తుతించే కవ్వాలీ . లిపుల గురించి, భాషల గురించీ కొట్టుకుంటూ ఉండేది మనం మాత్రమే.

మధ్యాహ్నం అవుతుండగానే జనం పోటెత్తుతారు. సమాధి ముందు కొందరు మనుషులు గుంపుగా చేరతారు. కొందరు తలకు టోపీ ధరించి వస్తే, మరికొందరు రుమాలుతో తలను కప్పుకుంటారు. ‘ యా...కమర్ అలీ దర్వేశ్... ’ అంటూ పెద్దగా అరుస్తూ, అందరూ ఆ బరువైన రాయిని చేతి వేళ్ళతో పైకి లేపి, పూర్తి శక్తితో దాన్ని కిందికి విసిరేస్తారు.

దేవుడి కోసం, ప్రవక్తల కోసం అమ్జద్ మురాద్ గోండ్ పాడుతూనే ఉంటారు.

అనువాదం: రవి కృష్ణ

Prashant Khunte

Prashant Khunte is an independent journalist, author and activist reporting on the lives of the marginalised communities. He is also a farmer.

Other stories by Prashant Khunte
Editor : Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Other stories by Medha Kale
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna