అది 2021 జూలై నెలలో పొగమంచు నిండిన ఒక ఉదయం, రైతు శివరామ్ గవారీ, భీమాశంకర్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దుల్లో ఉన్న తన పొలం వద్దకు వచ్చి, తన ఐదు గుంఠల (సుమారు 0.125 ఎకరాలు) వరి పంటలో సగం మాయం కావడాన్ని గమనించారు. మిగిలిన పంట నేలకు తొక్కేసి ఉంది..

"నేను ఇంతకు ముందెన్నడూ అలాంటిది చూడలేదు," అని ఆయన చెప్పారు. ఆనాడు పొందిన దిగ్భ్రాంతి ఇంకా ఆయన మనసులో తాజాగా ఉంది. ఆయన అడవిలోకి దారితీసిన జంతువుల పాదముద్రలను అనుసరించగా, అకస్మాత్తుగా గవా ( బోస్ గౌరస్ , కొన్నిసార్లు ఇండియన్ బైసన్ లేదా అడవిదున్న అని పిలుస్తారు) కనిపించింది. పశు సంబంధిత జాతుల్లో అతి పెద్దదైన అడవిదున్న, చూడటానికి వెగటుపుట్టించేలా ఉంటుంది. మగ అడవిదున్నలు ఆరు అడుగులకు మించిన పొడవు, 500- 1,000 కిలోగ్రాముల మధ్య బరువు ఉంటాయి.

భారీగా ఉండే అడవిదున్నల మంద పొలాలను తొక్కినప్పుడు పంటలు, చిన్న మొక్కలు కూడా పూర్తిగా నాశనం కావడమే కాకుండా పొలంలో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడతాయి. “ గవా ఇప్పటికి మూడేళ్ళుగా ప్రతి పంటకాలంలో నా పైరును నాశనం చేస్తున్నాయి. ఇక వ్యవసాయాన్ని వదిలేయటం తప్ప నాకు గత్యంతరం లేదు," అన్నారు శివరామ్. 2021 నుంచి గవా మంద తిరుగుతూన్న డాఁన్‌లోని తన రేకుల కప్పు ఇంటి ముందు ఆయన కూర్చునివున్నారు.

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Aavishkar Dudhal

ఎడమ: పుణేలోని డాఁన్ గ్రామంలో గవా (అడవిదున్న) దాడుల కారణంగా పంట నష్టపోయిన రైతుల్లో శివరామ్ గవారీ ఒకరు. కుడి: భారీగా ఉండే అడవిదున్నలు పొలాలను తొక్కడం వల్ల పంటలు, చిన్న మొక్కలు కూడా పూర్తిగా నాశనం కావడమే కాకుండా వాటి వల్ల పొలంలో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడతాయి

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Aavishkar Dudhal

ఎడమ: తమ పంటలు నష్టపోతామనే ఆందోళనతో ఉన్న చాలామంది రైతులు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే హిర్‌డా అనే పండును సేకరించి, విక్రయించే వృత్తిలోకి మారారు. కుడి: రైతులు తమ ప్రధాన ఆదాయ వనరుగా వంటచెరుకును కూడా విక్రయిస్తారు

మహారాష్ట్రలోని భీమాశంకర్ వన్యప్రాణుల అభయారణ్య పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక స్థిరనివాసాలలో ఈ గ్రామం కూడా ఒకటి. ఈ అభయారణ్యంలో జింకలు, అడవిపందులు, సాంబర్ జింకలు, చిరుతపులి, అరుదుగా పులులు ఉన్నాయి. ఇప్పుడు అరవైల వయసులో ఉన్న శివరామ్, తన జీవితమంతా అంబెగాఁవ్‌లోనే గడిపారు. వన్యప్రాణులు అడవి నుంచి బయటకు రావడం వల్ల జరిగే పంట నష్టం ఇంతగా ఎన్నడూ జరగలేదని ఆయన చెప్పారు. "ఆ జంతువులను పట్టుకొని ఇక్కడినుంచి తీసుకెళ్ళిపోవాలి," అని ఆయన సూచించారు.

వరుసగా మూడో ఏడాది కూడా పంటలు చేతికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన, ఏడాది నుంచి పొలం సాగు చేయడం మానేశారు. అనేకమంది ఇతర రైతులు కూడా తమ భూమిని బీడు పెట్టారు. తమ ప్రధాన ఆదాయ వనరుగా వాళ్ళు వంటచెరుకును, ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే హిర్‌డా అనే పండ్లను సేకరించి, విక్రయిస్తున్నారు. మనుషులు-అడవిదున్నల మధ్య సంఘర్షణను తగ్గించడం కోసం 2023 నాటి ఒక కేంద్ర ప్రభుత్వ నివేదిక కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అడవులు తగ్గిపోవడం, వాతావరణ మార్పుల కారణంగా ఆహారం, ఆవాసాలను కోల్పోవడమే ఈ జంతువులు ఇలా పంటల మీద పడడానికి కారణమని ఆ నివేదిక పేర్కొంది.

*****

2021లో, డాఁన్ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిదున్నల మంద చిన్నగా కేవలం మూడు, నాలుగు దున్నలతో మాత్రమే ఉండేది. 2024లో వాటి సంఖ్య రెట్టింపు అయింది, వాటి దండయాత్రలు కూడా పెరిగాయి. పొలాలు ఖాళీగా ఉండడంతో అవి గ్రామాల్లో పడి తిరుగుతూ స్థానికుల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయి.

గ్రామంలో ఎక్కువమంది రైతులు తమ బతుకుతెరువు కోసమే పంటలు సాగు చేస్తారు. కొండ పాదాల వద్ద అక్కడక్కడా సమతలంగా ఉండే బయలు భూములలోనే వారు వ్యవసాయం చేస్తారు. అది కొద్ది ఎకరాల భూమి మాత్రమే. కొంతమంది రైతులు తమ సొంత బావులు తవ్వుకున్నారు; ఇక్కడ వ్యవసాయం వర్షాధారం కాబట్టి కొద్దిమంది రైతులకు సొంత బోరుబావులు ఉన్నాయి. అడవిదున్నల దాడులు వారి వార్షిక పంటఫలాలను, ఆహార భద్రతను దెబ్బతీశాయి.

బుధా గవారీ తన ఇంటి పక్కనే ఉన్న మూడు గుంఠల భూమిలో సాగు చేస్తున్నారు. గ్రామంలోని ఇతరుల మాదిరిగానే ఆయన వర్షాకాలంలో రాయ్‌భోగ్ వంటి స్థానిక వరి రకాన్ని, శీతాకాలంలో మసూర్ (ఎర్ర కంది), హర్‌బరా (శనగలు) లాంటి కాయధాన్యాలను పండిస్తారు. “నేను నా పొలంలో కొత్తగా మొలిచిన మొక్కలను నాటాలనుకున్నాను. కానీ అవి [ గవా ] ఈ మొక్కలను సర్వనాశనం చేసేయటంతో నా పంట మొత్తం పోయింది. నా కుటుంబం తినే ప్రధాన పంటను కోల్పోయాను. బియ్యం లేకుంటే ఈ ఏడాది అంతా గడవటం మాకు కష్టమే," అని 54 ఏళ్ళ ఆ రైతు అన్నారు.

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Aavishkar Dudhal

ఎడమ: బుధా గవారీ కొత్తగా సాగు చేసిన చిన్న మొక్కలను తన పొలంలో నాటాలని అనుకున్నారు, కానీ ఇంతలోనే 'గవా ఈ మొక్కలను నాశనం చేసింది, నా పంట మొత్తం పోయింది,' అని ఆయన అన్నారు. కుడి: 'అదనపు ఆదాయ వనరుగా MNREGA మాకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. మేం బావుల వంటి నీటి భండారాలను కట్టుకునేవాళ్ళం,' అని ఆయన కుమారుడు బాలకృష్ణ అన్నాడు

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Balkrushna Gawari

ఎడమ: బుధాకు చెందిన మూడు గుంఠల పొలం. కుడి: ఆయన పొలంలో అడవిదున్నలు చేసిన చిన్న చిన్న గుంతలు

బుధా, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగ జాబితాలో ఉన్న కోయి మహదేవ్ సముదాయానికి చెందినవారు. “నేను నా ఉత్పత్తులు వేటినీ అమ్మను. నేను అమ్మగలిగేంత పండించలేను,” అని ఆయన చెప్పారు. ఆయన తన పంట వార్షిక విలువ రూ. 30,000 - 40,000 వరకు ఉండొచ్చని అంచనా వేశారు. పంటను పండించడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.10,000 నుంచి 15,000. మిగిలే పంట ఐదుగురు సభ్యులున్న ఆయన కుటుంబాన్ని ఏడాది పాటు పోషించడానికి సరిపోదు. వరిపంట నష్టం జరగకపోయి ఉంటే ఆయన కుటుంబ ఆహార భద్రతకు భరోసా ఉండేది.

శివరామ్, బుధాలిద్దరూ పంట నష్టం తర్వాత అటవీ శాఖను సంప్రదించి పంచనామా (పరిశోధనా నివేదిక) నమోదు చేశారు. ఆరు నెలలు దాటిన తర్వాత శివరామ్‌కు రూ. 5,000, బుధాకు రూ.3,000 నష్టపరిహారంగా లభించింది. ఇది వాళ్ళు పొందిన నష్టంలో 10 శాతం కంటే తక్కువ. "నాకు జరిగిన పంట నష్టం కోసం నేను ఒక ప్రభుత్వ కార్యాలయం నుండి మరొక దానికి తిరగడానికే రూ. 1,000 - 1,500 ఖర్చు చేశాను," అని బుధా తెలిపారు. అయితే వ్యవసాయశాఖ నిర్దేశించిన నిబంధనలను పాటించడంలేదని ఉప సర్పంచ్‌ సీతారామ్ గవారీ పేర్కొన్నారు.

“అదనపు ఆదాయ వనరుగా MNREGA మాకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. మేము బావులలాంటి నీటి భండారాలను నిర్మించుకునేవాళ్ళం," అని బుధా కుమారుడు బాలకృష్ణ గవారీ అన్నాడు. MNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పని తగ్గిపోవడంతో డాఁన్ రైతులు మంచర్, ఘోడేగాఁవ్ పరిసర ప్రాంతాలలోని ఇతరుల పొలాల్లో కూలీలుగా పని చేస్తున్నారు. సహ్యాద్రి కొండల మీది నుంచి దిగువకు సమృద్ధిగా నీరు పారుతుంది కాబట్టి ఇక్కడ పొలాలు మరింత సారవంతంగా ఉంటాయి. అంతగా శ్రద్ధ పెట్టనవసరం లేని వరై (ఊదలు), సావా (సామలు) వంటి సంప్రదాయ పంటల దిగుబడి వాళ్ళకు కొంత జీవనోపాధిని కల్పించింది.

*****

తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న జంతువుల జనాభా, అసహజమైన వాతావరణ సంఘటనల వల్ల జంతువులకు ఆహార కొరత ఏర్పడిందని స్థానిక కార్యకర్త, అఖిలభారత కిసాన్ సభ పుణే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అమోల్ వాఘ్మారే చెప్పారు. "ఈ జంతువులు ఆహారం, నీళ్ళ కోసం వెతుక్కుంటూ అడవిలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఉండొచ్చు," అని ఆయన అన్నారు. సందర్భవశాత్తూ, 2021లో అడవిలో ఆహారం తక్కువగా దొరికే వేసవి ప్రారంభంలో ఈ అడవిదున్నలు కనిపించాయని డాఁన్ ప్రజలు అంటున్నారు.

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Aavishkar Dudhal

డాఁన్‌ ఉప సర్పంచ్‌ సీతారామ్ గవారీ (ఎడమ) పలుమార్లు అటవీ విభాగాన్ని ఆశ్రయించారు. అడవిదున్నల రాకపోకలను నిరోధించేందుకు గ్రామం (కుడి) సమీపంలో కంచె నిర్మించాలని అటవీ విభాగం ప్రతిపాదించినప్పటికీ, 'ప్రజల జీవనోపాధి అడవితో ముడిపడి ఉన్నందున ఇది ఆమోదయోగ్యం కాద'ని ఆయన అన్నారు

PHOTO • Aavishkar Dudhal
PHOTO • Balkrushna Gawari

ఎడమ: అడవిదున్నల దాడి నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి కొంతమంది రైతులు తమ పొలాల చుట్టూ కంచెలు వేసుకున్నారు. కుడి: తమకు జరిగిన నష్టంలో 10 శాతంకన్నా తక్కువ నష్టపరిహారం తమకు అందిందని నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తెలిపారు

“డాఁన్ సమీపంలోనూ, పరిసర ప్రాంతాల్లో కూడా అటవీ శాఖకు చెందిన చౌకీలు చాలా తక్కువగా ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు చాలామంది అక్కడికి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాలూ కాలో నివసిస్తున్నారు,” మనుషులు-జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించడంలో అటవీ శాఖ పాత్ర గురించి మాట్లాడుతూ డా. వాఘ్మారే అన్నారు. “చిరుతపులులు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం వంటి అత్యవసర పరిస్థితుల్లోనే వాళ్ళు [అధికారులు] రావడానికి చాలా సమయం పడుతోంది. రాత్రిపూట గ్రామాలకు రావడానికి కూడా వాళ్ళు వెనుకాడతారు," అని ఆయన అన్నారు.

గవా దాడి వలన పంటను నష్టపోయిన గ్రామ ఉప సర్పంచ్ సీతారామ్ గవారీ, ఆ విషయాన్ని తాను పలుమార్లు అటవీశాఖ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. చాలాసార్లు డిపార్ట్‌మెంట్ వెంటపడిన తర్వాత, అడవిదున్నలను అడ్డుకోవడానికి గ్రామ సమీపంలో కంచెను నిర్మించాలని వాళ్ళు ప్రతిపాదించారు. "ప్రజల జీవనోపాధి అడవితో ముడిపడి ఉన్నందున ఇది మాకు ఆమోదయోగ్యం కాదు," అని సీతారామ్ అన్నారు.

ఆకలితో ఉన్న అడవిదున్నలు ఇప్పటికీ ఆ చుట్టుపక్కల కనిపిస్తుంటాయి. దాంతో శివరామ్, మిగతా గ్రామస్థులు రాబోయే పంటల కాలంలో పంట వేయటానికి తమ భూమిని సిద్ధం చేయలేదు. “ప్రతి సంవత్సరం అదే వినాశనాన్ని చవిచూడటంలో అర్థంలేదు. ఇప్పటివరకు పడిన బాధలు చాలు,” అని ఆయన అన్నారు.

అనువాదం: రవి కృష్ణ

Student Reporter : Aavishkar Dudhal

ఆవిష్కార్ దుధాళ్ సావిత్రిబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. వ్యవసాయిక సముదాయాల గతిశీలతను అర్థం చేసుకోవడంలో గాఢమైన ఆసక్తి కలిగిన ఆయన, PARIతో తన ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ కథనాన్ని నివేదించారు.

Other stories by Aavishkar Dudhal
Editor : Siddhita Sonavane

Siddhita Sonavane is Content Editor at the People's Archive of Rural India. She completed her master's degree from SNDT Women's University, Mumbai, in 2022 and is a visiting faculty at their Department of English.

Other stories by Siddhita Sonavane
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna