ఏడాది మొత్తంలో ఎక్కువకాలం ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం చూపించే రణ్ భూమిలో, వర్ష ఋతువులో వచ్చే వానలు నిజంగా ఒక వేడుకే. దహించివేసే వేడిమి నుంచి సాంత్వననిచ్చే ఈ ఋతువు కోసం ప్రజలు ఆతురతతో ఎదురుచూస్తుంటారు. మహిళ దైనందిన జీవితంలో ప్రేమ కలిగించే తెరపికి ఇక్కడ వర్షం ఒక రూపకం (మెటఫర్) కావటంలో ఆశ్చర్య మేమీ లేదు

అయితే, వర్షఋతువులో కురిసే వానల ప్రణయ వైభవాలు కచ్చీ జానపద సంగీతంలో అనుపమానమైనవేమీ కావు. నాట్యమాడే నెమళ్ళు, నల్లని మబ్బులు, వర్షం, తన ప్రియుని కోసం పరితాపం చెందే యువతివంటి ప్రతీకలు భారతదేశంలోని శాస్త్రీయ, ప్రసిద్ధ, జానపద సంగీతాల సంప్రదాయాల వర్ణపటలంలోనే కాక, వివిధ శైలులకు చెందిన వర్ణచిత్రాలలోనూ సాహిత్యంలోనూ మనకు అదేపనిగా పదేపదే కనిపిస్తాయి

అయినప్పటికీ, ఇవన్నీ గుదిగుచ్చిన ఈ పాటను అంజార్‌కు చెందిన ఘెల్జీభాయ్ గుజరాతీలో పాడటాన్ని ఇక్కడ విన్నప్పుడు ఇవే ప్రతీకలు ఈ ఋతువులోని తొలకరుల తాజా శోభను మనకోసం తీసుకురావటంలో విజయం సాధించాయని తెలుస్తుంది.

అంజార్‌కు చెందిన ఘెల్జీభాయ్ పాడుతున్న పాటను వినండి

Gujarati

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહૂલો કરે ઘનઘોર,
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
નથડીનો વોરનાર ના આયો સાહેલડી (૨)
વારી વારી વારી વારી, વારી વારી કરે છે કિલોલ.
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
હારલાનો વોરનાર ના આયો સાહેલડી (૨)
વારી વારી વારી વારી, વારી વારી કરે છે કિલોલ.
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
મેહૂલો કરે ઘનઘોર
જૂઓ હાલો કળાયેલ બોલે છે મોર (૨)

తెలుగు

నల్ల నల్ల మబ్బులల్లో మెరుపు మెరిసిందదుగో!
నల్ల నల్ల మబ్బులల్లో మెరుపు మెరిసిందదుగో!
వానకారు మొయిళ్ళెంత బరువైనాయో చూడు
ఆ నెమలి పాట పాడుతోంది చూడు మరి
పింఛమిప్పి చూపుతోంది చూడు మరి (2)
నల్ల నల్ల మబ్బులల్లో మెరుపు మెరిసిందదుగో!
ముక్కుపుడక నాకిచ్చెటోడు రాలేదింకేమి చెలీ
ముక్కుపుడక నాకిచ్చెటోడు రాలేదింకేమి సఖీ
మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ
ఆ నెమలి పాట పాడుతోంది చూడు మరి
పింఛమిప్పి చూపుతోంది చూడు మరి (2)
మెడదండ నాకిచ్చెటోడు రాలేదింకేమి చెలీ!
మెడదండ నాకిచ్చెటోడు రాలేదింకేమి సఖీ!
ఆ నెమలి పాట పాడుతోంది చూడు మరి
పింఛమిప్పి చూపుతోంది చూడు మరి (2)
నల్ల నల్ల మబ్బులల్లో మెరుపు మెరిసిందదుగో!
వానకారు మొయిళ్ళెంత బరువైనాయో చూడు

PHOTO • Labani Jangi

పాట స్వరూపం : సంప్రదాయ జానపద గీతం

శ్రేణి : ప్రేమ, విరహ గీతాలు

పాట : 7

పాట శీర్షిక : కాళి కాళి వాదళిమా వీజళీ జబోకే

స్వరకర్త : దేవళ్ మెహతా

గానం : ఘెల్జీ భాయ్ అంజార్

ఉపయోగించిన వాయిద్యాలు : డోలు, హార్మోనియం, బాంజో, తంబూరా

రికార్డు చేసిన సంవత్సరం : 2012, కెఎమ్‌విఎస్ స్టూడియో


సామాజిక రేడియో సుర్‌వాణి ద్వారా రికార్డ్ అయిన ఈ 341 పాటలు, కచ్ మహిళా వికాస్ సంగఠన్ (కెవిఎమ్ఎస్) ద్వారా PARIకి లభించాయి.

ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
పాట అనువాదం: రమాసుందరి

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli
Translator : Ramasundari

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రమాసుందరి మాతృక మాసపత్రిక సంపాదకవర్గ సభ్యురాలు.

Other stories by Ramasundari