అనగనగా, ఒకానొక కాలంలో, లాలాలాండ్ అనే మహత్వపూర్ణ రాజ్యంలో, మోరేంద్ర దీన అనే భగవత్ స్వరూపుడైన చక్రవర్తి తన ఉక్కు (పోషకాహార లోపపు) పిడికిళ్ళతో పాలన సాగిస్తుండేవాడు. ఆయన తాను తినేవాడు కాదు, ఎవరినీ తిననిచ్చేవాడు కాదు. అందువల్లనే ఆయనకు మహత్తరమైన పోషకాహార లోపం ఉండేది. అదే ఆయన సర్థత అని చెప్పుకునేవారు. ఏమిటీ, సమర్థత అని రాసే బదులు ఒక అక్షరం జారిపోయిందంటారా? అయ్యయ్యో, ఎంతమాత్రమూ కాదు, ఆ అక్షరాన్ని వేలం పాటలో అగౌనీ దాతమ్‌కు అమ్మేశారు. ఆయన ఎవరంటారా? పశ్చిమరాజ్యాల మరుగుజ్జు భగవంతుడాయన.

ఒకరోజు మహాఘనత వహించిన చక్రవర్తిగారి పైశాచిక పూజారి అషామిత్‌కు ఒక పగటి కల వచ్చింది. కొండల మీది నుంచి వచ్చిన హురాం గాధిల్ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడట. అమ్మయ్యో, ఎంత భయంకరమైన శకునం! హురాలు ఒక ఆటవిక జాతి. వాళ్లు ప్రజాస్వామ్యం, వగైరా వగైరా దురాచారాలు పాటిస్తారు. హడావుడిగా మంత్రగాళ్ళ మండలి సమావేశమయింది. తెలుసా, వాళ్ళు ఒక మాంత్రిక పరిష్కారాన్ని కనిపెట్టారు. బాండ్ల అధిదేవత అయిన మాగౌత పరిశుద్ధమైన పేడతో ఒక 108 అడుగుల పొడవైన సాంబ్రాణి కడ్డీని తయారు చేయాలట.

అందుకని మాగౌత గర్భాన్ని ఖాళీ చేశారు. అవసరమైన బాండ్లన్నిటినీ పోగేశారు. చిట్టచివరికి కడ్డీ ముట్టించారు. అబ్బ ఏమి వాసన! రైతులను అసహ్యించుకునే, జిత్తులమారితనాన్ని ప్రేమించే తియ్య తియ్యని వాసన. ఆ గుగ్గిలం వాసన ఆకలిగొన్న ఆకాశం నిండా అలముకుంటుంటే అగౌనీతో, అషామిత్‌తో కలిసి చక్రవర్తి దీన నాట్యం చెయ్యడం ప్రారంభించాడు. ఓహ్, దుశ్శకునం తప్పిపోయిందా, లేక, తప్పిపోలేదేమో, ఎవరికి తెలుసు? మనకు తెలిసిందల్లా, ఆ తర్వాత ఎప్పుడూ లాలాలాండ్ సుఖంగా జీవించిందని (జీవించలేదని) మాత్రమే...

లిమరిక్కుల గానం చేస్తోన్న జాషువాను వినండి

చక్రవర్తి చిరకాలం జీవించాలి!

1)
కామ్ తోనూ తన్ను తోనూ ప్రాస కలిసేదేమిటి?
గీతమా? స్తోత్రమా? లేక హాస్యపు లిమరిక్కా?
అది తయారైనది పేడతో
ఈవీఎంల దొంగాటతో
ఊదుబత్తీ నూటెనిమిది అడుగులతో

2)
కోటి మంది అవుననగా, పిడికెడు కాదులతో
అది కాలిందీ కాలిందీ నలబై ఐదు రోజులలో
ఏ దేవుడికో తెలియదు
నిండారా భక్తితో
శంభూకుడి తల ఎప్పుడూ తెగిపడుతుంది

3)
బాబ్రీ సమాధిలో ఎదుగుతుంది సామ్రాజ్యం
వాట్సప్, గోమాత, బజరంగ్ భాయీలతో
కానీ ఏమిటి ఆ వాసన?
అది స్వర్గమా, నరకమా?
చెప్పండి, చెప్పండి, దేశానికి తెలియాలి!

4)
నూటెనిమిది అడుగుల కాషాయ కడ్డీ –
మేం రాజుకే వోటేస్తాం, కడిగిపెట్టిన మోసానికి కాదు.
మొసలి ఆయన పెంపుడు జంతువు,
కెమెరాలూ, సర్దుకోండి!
నూటెనిమిది అడుగులు పొంగిన బుడ్డీ

5)
ఆకలిగొన్న రైతులూ, ఫత్వాలూ,
అల్లర్లూ మార్మోగే మహత్తర లాలాలాండ్
అగరు నిండిన బత్తీ
బుల్డోజర్ కింద బస్తీ
కమ్మీలూ ఖాంగ్ లూ, వారికేమి తెలుసు?


అనువాదం: ఎన్ వేణుగోపాల్

Poems and Text : Joshua Bodhinetra

జాషువా బోధినేత్ర కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో ఎంఫిల్ చేశారు. అతను PARIకి అనువాదకుడు, కవి, కళా రచయిత, కళా విమర్శకుడు, సామాజిక కార్యకర్త కూడా.

Other stories by Joshua Bodhinetra
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Illustration : Atharva Vankundre

Atharva Vankundre is a storyteller and illustrator from Mumbai. He has been an intern with PARI from July to August 2023.

Other stories by Atharva Vankundre
Translator : N. Venugopal

ఎన్. వేణుగోపాల్ తెలుగులో వెలువడే రాజకీయార్థిక, సామాజిక మాస పత్రిక 'వీక్షణం'కు సంపాదకులుగా ఉన్నారు.

Other stories by N. Venugopal