PARI చలనచిత్ర విభాగానికి - గ్రామీణ భారతదేశంలోని ప్రజలపై వీడియోలు, డాక్యుమెంటరీలు, షార్ట్ క్లిప్‌లు, చలనచిత్రాలు - 2023 సంవత్సరం అత్యంత ప్రతిఫలదాయకమైనది

ఒక ఆన్‌లైన్ జర్నల్‌గా, మన చుట్టూ ఉన్న వార్తలను, సంఘటనలను నిశితంగా పరిశీలించే చిత్రాలను మేం ప్రోత్సహిస్తాం. బిహార్‌లోని మదరసా అజీజియా పై మా చిత్రం, బిహార్‌లోని బిహార్‌షరీఫ్ పట్టణంలో 113 ఏళ్ళ నాటి గ్రంథాలయాన్ని మతపరమైన ప్రేరణతో తగులబెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలించింది. జైసల్మేర్ జిల్లాలో పునరుత్పాదక శక్తిపై తీసిన మా చిత్రం జైసల్మేర్ జిల్లాలోని పవిత్ర వనాలను - ఒరాణ్‌లు - బంజరు భూములు 'గా చూపడం ద్వారా ఈ చిట్టడవులను సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు అప్పగించే సమస్యను లేవనెత్తింది.

అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర దీవులకు చెందిన ఆదివాసీ గేదెల కాపరి ఉల్లాసంగా పాడిన మధురమైన ప్రేమ గీతంతో మా సంవత్సరం ప్రారంభమైంది. సంవత్సరం పొడవునా మేం పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, రాజస్థాన్, ఇంకా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాటలను, నృత్యాలను జోడించడాన్ని కొనసాగించాం.

PARI విసుర్రాయి పాటల (గ్రైండ్‌మిల్ సాంగ్స్) ప్రాజెక్ట్‌పై - దశాబ్దాలుగా సాగిన ఈ అద్భుతమైన పని ప్రయాణాన్ని నమోదు చేస్తూ - తీసిన ఒక చిత్రంతో మేం ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాం.

ఈ సంవత్సరం మేం పుణేలో వ్యర్థాలను సేకరించే మహిళల గొంతుకలను వినిపించే ఒక ముఖ్యమైన చలనచిత్రాన్ని జోడించాం. "చెత్తను తయారుచేసేది మీరైనప్పుడు, మేం ఎలా ‘కచ్రేవాలీ' (చెత్తమహిళ) అవుతాం?" అని ఆ మహిళలు ప్రశ్నిస్తారు. మారుతున్న వాతావరణ ప్రభావం గురించి తీసిన చిత్రాలలో అస్తవ్యస్తంగా మారిన వాతావరణ పరిస్థితుల వలన బాధలుపడుతున్న అల్ఫోన్సో మామిడి సాగుదారుల గురించి ప్రచురించాం.

ఏడాది అంతా మేం వివిధ సామాజిక వర్గాలపై తీసిన చిత్రాలను మా ఆర్కైవ్‌కు జోడిస్తూనే ఉన్నాం: మేడాపురంలో మాదిగ సముదాయంవారు జరిపే ఉగాది ఉత్సవాలపై తీసిన ఈ చిత్రం, దళితుల ఈ కొత్త సంప్రదాయంలోని మనకు తెలియని విషయాలను కళ్ళముందుంచింది. మలబార్ ప్రాంతంలో ప్రస్తుతం కనుమరుగవుతోన్న వివిధ కులాలకూ సముదాయాలకూ చెందిన తోల్‌పావకూత్తు కళ పై తీసిన ఈ చిత్రం తోలుబొమ్మలను ఉపయోగించి ప్రదర్శించే విభిన్న సాంస్కృతిక కథనాలను అందించింది. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి, తుళునాడులో భూత పూజ లో ముఖ్య భాగమైన నాదస్వరం వాద్యకారుడి జీవితాన్ని ఈ చిత్రం అందంగా చిత్రీకరిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి, లోహపు ఆకృతులను తయారుచేయడంలో దాదాపు అంతరించిపోయిన మైనపు పోత సాంకేతికత అయిన డోక్రా గురించి ఈ చిత్రం చిత్రీకరించింది.

ఈ చిత్రాలను చూడండి!

మదరసా అజీజియా జ్ఞాపకాలలో

బిహార్‌షరీఫ్‌లో, ఒక 113 ఏళ్ళ వయసున్న మదర్సాను, దానికి సంబంధించిన గ్రంథాలయానికి చెందిన 4,000 పుస్తకాలనూ తగులబెట్టిన అల్లరిమూకలు

మే 12, 2023 | శ్రేయ కాత్యాయిని

ఒరాణ్ లను రక్షించేందుకు పోరాటం

రాజస్థాన్‌లోని ఒరాణ్‌లను - ప్రభుత్వ రికార్డులలో బంజరు భూములుగా తప్పుగా నమోదైన గడ్డిభూములలో నెలకొని ఉన్న పవిత్ర వనాలు - క్రమంగా ఆక్రమిస్తోన్న సౌర, పవన విద్యుత్ ముఠాలు. అమిత వేగంగా పెరిగిపోతోన్న వాటి ఉనికి పర్యావరణంలోనూ జీవనోపాధులలోనూ తీవ్రమైన మార్పులను తీసుకువస్తోంది.

జూలై 25, 2923 | ఊర్జా


ప్రేమగీతాన్ని పాడుతోన్న ఒక గేదెల కాపరి

సత్యజిత్ మోరాంగ్ అస్సామ్‌లోని మిసింగ్ సముదాయానికి చెందినవారు. ఈ వీడియోలో ఆయన ఐనితమ్ బాణీలో ఒక ప్రేమగీతాన్ని పాడారు ; బ్రహ్మపుత్రా నదిలో ఏర్పడిన ద్వీపాలలో గేదెలను కాయడం గురించి మాట్లాడారు

జనవరి 2, 2023 | హిమాంశు చుటియా సైకియా


గ్రామీణ భారతదేశపు వంటగదుల నుండి పాటలు

వందల గ్రామాలలో విస్తరించి ఉన్న 100,000 పాటలు, 3,000 మంది కంటే ఎక్కువమంది ప్రదర్శకులు ఉన్న విసుర్రాయి పాటల ప్రాజెక్ట్ (GSP), సాధారణ మహిళలు - రైతులు, కార్మికులు, మత్స్యకారులు, ఇంకా కుమార్తెలు, భార్యలు, తల్లులు, సోదరీమణులు - పాడిన విసుర్రాయి పాటలను - 'జాత్యావర్చ్యా ఓవ్యా - సంగ్రహించే ఒక అద్భుతమైన ప్రయత్నం. GSP కవిత్వ వారసత్వం, దాని సృష్టిక్రమంపై ఒక PARI డాక్యుమెంటరీ

డిసెంబర్ 7, 2023 | PARI బృందం


విలువ | మోల్

అక్టోబర్ 2న స్వచ్ఛ్ భారత్ దివస్ సందర్భంగా పుణేలోని వ్యర్థాలను సేకరించే మహిళలపై ఒక చిత్రం

అక్టోబర్ 2, 2023 | కవిత కార్నీరో

ముగిసిపోతోన్న ఆల్ఫోన్సో ప్రస్థానం

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో, అల్ఫోన్సో మామిడి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుండడంపై ఆందోళన చెందుతున్న రైతులు

అక్టోబర్ 13, 2023 | జైసింగ్ చవాన్

మేడాపురంలో ఉగాది వేడుకలు : సంప్రదాయం , శక్తి , గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని మేడాపురంలో ప్రతి ఏటా ఉగాది పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. దేవతా విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువచ్చిన మాదిగ సముదాయంవారు ఈ వేడుకలను నిర్వహిస్తారు

అక్టోబర్ 27, 2023 | నాగ చరణ్

నీడల కథలు : మలబార్ తోల్ పావకూత్తు తోలుబొమ్మలాట

కేరళలోని మలబార్ ప్రాంత గ్రామాలలోని తోలుబొమ్మలాటల రంగస్థలం గురించిన సినిమా

మే 29, 2023 | సంగీత్ శంకర్

తుళునాడు భూతాలు

అరేబియా సముద్రం తీరంలో ఉన్న కర్ణాటకలోని ఈ ప్రాంతంలో, భూత పూజల కోసం వివిధ సముదాయాలు ఒకచోటకు చేరుతాయి. ఈ పూజల సమయంలో ప్రదర్శనలిచ్చే సయ్యద్ నాసిర్, అతని సంగీత బృందం వారసత్వంపై చిత్రం.

ఏప్రిల్ 26, 2023 | ఫైసల్ అహ్మద్

డోక్రా : మారిపోతోన్న కళ

పియూష్ మండల్ కనుమరుగవుతోన్న మైనపు పోత సాంకేతికతను ఉపయోగించి లోహపు బొమ్మలను తయారుచేస్తారు. నైపుణ్యం కలిగిన ఈ డోక్రా కళాకారుడు, ఈ ప్రక్రియలో ఉపయోగించే కీలకమైన ముడి పదార్థాల గురించీ, వాతావరణం గురించీ ఆందోళన చెందుతున్నారు

ఆగస్ట్ 26, 2023 | శ్రేయశీ పాల్


మీరేదైనా చిత్రాన్ని గానీ, వీడియోను గానీ పంపాలనుకుంటే [email protected] కు రాయండి

మేం చేసే పని మీకు ఆసక్తి కలిగిస్తే, మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి [email protected]కు మాకు రాయండి. మాతో కలిసి పనిచేయడానికి ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర రచయితలు, రిపోర్టర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్ర నిర్మాతలు, అనువాదకులు, సంపాదకులు, ఇలస్ట్రేటర్‌లు, పరిశోధకులను మేం స్వాగతిస్తున్నాం.

PARI లాభాపేక్ష లేనిది. మా బహుభాషా ఆన్‌లైన్ జర్నల్‌ను, ఆర్కైవ్‌ను అభిమానించే వ్యక్తుల నుండి వచ్చే విరాళాలపై మేం ఆధారపడతాం. మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి DONATE పై క్లిక్ చేయండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Other stories by Shreya Katyayini
Sinchita Parbat

సించితా మాజీ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత కూడా.

Other stories by Sinchita Parbat

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Urja
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli