అక్కడి తహసిల్ కార్యాలయంలో ఇంకా ఆ జెండాను దాచి ఉంచారు. ప్రతీ ఆగష్టు 18 న ఆ చోట ఆ పతాకాన్ని ఎగరేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని గాజిపూర్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతపు ప్రజలు 1942 లో ఆ ఆగష్టు18 న బ్రిటిషు వారి పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు. మహమ్మదాబాద్ తహశీల్దార్ ఓ సమూహం మీద కాల్పులు జరిపించారు. షేర్ పూర్ గ్రామానికి చెందిన ఎనిమిదిమందిని చంపించారు. ఆ పోయిన వాళ్ళంతా కాంగ్రెస్ నేత శివపూజన్ రాయ్ బృందానికి చెందిన వాళ్ళు. మహమ్మద్ పూర్ తెహసిల్ భవనం మీద త్రివర్ణాన్ని ఎగర వేస్తున్నప్పుడు వాళ్ళందర్నీ కాల్చిచంపారు.

అప్పటికే కుతకుతలాడుతున్న ఆ జిల్లాలో బ్రిటీషు వారు ఆగష్టు పదో తారీఖున 129 మంది నాయకుల మీద అరెస్టు వారెంటు జారీ చేసేసరికి పోరాటం పెల్లుబికింది. పందొమ్మిదో తారీఖు కల్లా గాజిపూర్ ప్రాంతమంతా అప్పటికి స్థానికులు అదుపులోకి తెచ్చుకుని మూడురోజులు ప్రభుత్వాన్ని నడిపారు.

ఆనాటి జిల్లా గజెటీర్.  ‘ గ్రామం తర్వాత గ్రామం పీడన, లూటీ దోపిడీలకు గురి అయ్యాయి. అలానే గ్రామాలన్నింటిని తగలబెట్టారు.’ మిలటరీ దళాలూ, పోలీసు అశ్విక దళాలూ క్విట్ ఇండియా ఆందోళనకారుల్ని నలిపివేసాయి. మరికొద్ది దినాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు నూటయాభై మంది తుపాకీ గుళ్ళకు గురి అయ్యారు. అధికారులూ, పోలీసులూ కలగలిసి ప్రజల నుంచి ముప్పై అయిదు లక్షలు దోచుకున్నారని రికార్డులు చెపుతున్నయి. డెబ్భై నాలుగు గ్రామాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గాజిపూర్ ప్రజలంతా కలిసి నాలుగున్నర లక్షల అపరాధ రుసుము కట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.

షేర్ పూర్ గ్రామం అధికారుల ప్రత్యేకమైన కన్నెర్రకు గురి అయ్యింది. ఆ గ్రామపు దళితులందరిలోకి పెద్దవాడయిన హరిశరణ్ రామ్ అనే ఆయన ఆనాటి విషయాలను జ్ఞాపకం చేసుకొన్నారు : "మనుషుల సంగతి సరేసరి. ఊళ్ళో ఒక్క పిట్ట కూడా మిగల్లేదు. పారిపోగలిగిన వాళ్ళంతా పారిపోయారు. ఊళ్ళో లూటీ అడ్డూ ఆపూ లేకుండా సాగిపోయింది." అది ఒక్క షేర్ పూర్ గ్రామానికే సంబంధించిన విషయం కాదు- మొత్తం గాజిపూర్ ప్రాంతమంతటికీ గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది కదా...1850 ల నుంచీ నీలిమందు కామందుల మీద విరుచుకుపడటం , బ్రిటీషు దొరతనం మీద తిరుగుబాటు చేయ్యడం - అంతటి ఘనచరిత్ర ఉందా ప్రాంతానికి. లాఠీ దెబ్బలూ , బుల్లెట్లూ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆ పాఠాలు నేర్పాయి.

PHOTO • P. Sainath

కొన్ని అమరవీరుల కమిటీలను ‘షహీద్ పుత్ర’ లు నియంత్రిస్తారు.

మహమ్మదాబాద్ తహసీల్ ఆఫీసు ఈనాటికీ రాజకీయ తీర్థయాత్రికుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఆ యాత్రికుల్లో ప్రధానమంత్రులూ, కాబోయే ప్రధానమంత్రులూ ఉన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు ముఖ్యమంత్రులందరూ ఇక్కడికి వచ్చి వెళ్లినవారే. "సామాన్యంగా వారంతా ఆగష్టు 18 న వచ్చి వెళతారు," అంటారు అక్కడి షహీద్ స్మారక సమితి నిర్వాహకులు లక్ష్మణ్ రాయ్. అప్పటి ఎనిమిది మంది అమరవీరుల స్మారక చిహ్నపు బాగోగులు ఈ సమితి చూస్తుంది. ఆనాటి ఆందోళనకారులు చేతబూనిన జెండాను, అది కాస్తంత పిగిలిపోయినా, జాగ్రత్తగా దాచారక్కడ. ఆ జెండాను మాకు చూపించారు లక్ష్మణ్ రాయ్. “ఇక్కడికి వచ్చిన ప్రముఖులంతా ఈ జెండాను పూజించి వెళతారు. ప్రతి ప్రముఖుడూ పూజ చేసే వెళతాడు." అని గర్వంగా చెప్పారు.

ఆ పూజల వల్ల షేర్ పూర్ కు పెద్దగా లాభించిందేం లేదు. వర్గం, కులం, గడిచిపోయిన కాలం, వర్తమానపు ఆర్థిక ఆంశాలు స్వాతంత్య్ర యోధుల వీరోచిత త్యాగాలకు,అప్పటి జ్ఞాపకాలకు విభిన్న వర్ణాలను అద్దుతున్నాయి. “అంతా కలిసి ఎనిమిది మంది అమరవీరులు," చెప్పుకొచ్చారో ఎన్జీవో కార్యకర్త.  “కానీ ఎంత లేదన్నా పది మెమోరియల్ కమిటీలు వెలిసాయిక్కడ," అంటారాయన. ఈ కమిటీల్లో కొన్ని గవర్నమెంటు గ్రాంటుల్తో ఏవేవో సంస్థలను నిర్వహిస్తున్నయి. ఆ మృతవీరుల పుత్ర పౌత్రులు- స్థానికంగా వారిని ' షహీద్ పుత్ర ' అంటారు -వాటిల్లో కొన్నిటిని నియంత్రిస్తూ ఉంటారు.

పూజలు ముగిశాక వాగ్దానాలు కురుస్తాయి. ఇరవై ఒక్క వేల జనాభా ఉన్న ఆ షేర్ పూర్ బృహత్  గ్రామానికి మహిళా కళాశాల ఇప్పించటం ఆ వాగ్దానాల్లో ఒకటి. కానీ అయిదింట నలుగురు నిరక్షరాస్య మహిళలు ఉన్న ఆ గ్రామంలో స్థానికులు ఈ విషయం మీద పెద్ద ఆసక్తి చూపకపోవడాన్ని మనం క్షమించేయవచ్చు.

అది సరే, షేర్ పూర్ త్యాగాల సంగతేమిటి ? ఆ విషయంలో అక్కడి గ్రామస్తులు ఎలుగెత్తి కోరేదేమిటి? ఈ ప్రశ్నలకు మనం చెప్పుకునే సమాధానం మనం ఏ వర్గానికీ ఏ సామాజిక వర్గానికీ చెందిన వాళ్ళము అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. అధికారపూర్వకంగా గుర్తించబడిన ఎనిమిది మంది అమరవీరులు, ' భూమిహర్ ' సామాజిక వర్గానికి చెందినవారు. బ్రిటీషు వారికి, దమనకాండకు ఎదురొడ్డి వీరు చూపించిన సాహస పరక్రమాలు నిస్సందేహంగా స్ఫూర్తిదాయకం. కానీ ఇంత శక్తివంతం కాని సామాజిక వర్గాలకు చెందిన వాళ్లెందరో విభిన్న సందర్భాల్లో ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళని ఇంత ఘనంగా గుర్తుంచుకోవడం లేదు. ఆగష్టు 18 కి ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉదాహరణకు ఆగష్టు 14 న ఆందోళనకారులు నంద్ గంజ్ రైల్వే స్టేషన్ను ఆక్రమించటానికి ప్రయత్నించినప్పుడు , పోలీసు కాల్పుల్లో యాభైమంది ప్రాణాలు పోయాయి. ఆగష్టు 19 - 21 ల మధ్య అంతకు మూడింతల మంది మృతి చెందారు.

PHOTO • P. Sainath

షేర్ పూర్(ఎడమ) లో అమరవీరుని స్థూపం, షేర్పూర్ లో అమరవీరుల స్మారక ప్రవేశద్వారం వద్ద ఉన్న ఫలకం

వీళ్లంతా ఎందుకు ప్రాణాలు ధారపోశారు? "స్వాతంత్య్రం అన్నదే వారి ఏకైక నినాదం " అని నొక్కి వక్కాణిస్తారు కిషన్ దేవ్ రాయ్ ; ఆయన మహమ్మద్ పూర్ లోని ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్. షేర్ పూర్ ప్రాంతపు భూస్వామ్య వర్గపు భూమిహర్ లు అంతా అదే మాట అంటారు. బ్రిటీషు వాళ్ళు 1947 లో దేశం విడిచి వెళ్ళిపోవడంతో వారికి ఆ విషయం ముగిసిందన్నమాట.

కానీ షేర్ పూర్ గ్రామంలోని దళిత వర్గానికి చెందిన బాల్ ముకుంద్ అభిప్రాయం వేరు. ఆ ఆందోళనలు జరిగినప్పుడు ఆయన మంచి యువకుడు. ఆయనా ఆయన సహచర దళిత యువకులూ ఆ పోరాటాన్ని విభిన్న కోణంలోంచి చూపారు. "భూవసతి కలుగుతుందనుకొన్నాం " అంటారాయన.1930 లలో సాగిన కిసాన్ సభ ఉద్యమం ఈ ఆశలకు అంకురం అయింది. మళ్ళా 1952 లో ఉత్తరప్రదేశ్ లో జమిందారీ నిర్మూలనా భూసంస్కరణల చట్టం అమలులోకి వచ్చినపుడు ఆ ఆశలు చిగురించాయి.

కానీ అవి అణగారిపోటానికి పెద్దగా సమయం పట్టలేదు.

గ్రామంలోని మూడువేల అయిదు వందల మంది దళితులూ భూ వసతి లేనివారే. “దున్నుకోడానికి భూమా?", స్థానిక దళిత సమితికి చెందిన రాధేశ్యాం ప్రశ్నిస్తాడు." కనీసం మా ఇళ్ళయినా మా పేరిట లేవు", అంటారాయన. భూమికి సంబంధించిన పరిష్కారాలూ ఒప్పందాలూ జరిగి ముప్ఫై అయిదేళ్ళు గడిచాక ఇదీ పరిస్థితి! స్వాతంత్య్రం పుణ్యమా అని కొన్ని ప్రయోజనాలు కొంతమందికి సిద్ధించిన మాట నిజం. తాము దున్నుకునే భూముల హక్కులు భూమిహర్లకు దాఖలు పడ్డాయి. భూమిలేని నిమ్న కులాల వాళ్ళ పరిస్థితుల్లో అణుమాత్రం మార్పు రాలేదు. “మాకూ మిగతా వాళ్లకు వచ్చినట్టే భూమి హక్కులు వస్తాయని ఆశపడ్డాం " అంటారు హరిశరణ్ రామ్.

“We thought there would be some land for us,” says Bal Mukund, a Dalit who lives in Sherpur. His excitement was short-lived
PHOTO • P. Sainath

"భూవసతి కలుగుతుందనుకొన్నాం”, అన్నారు షెర్పూర్ కు చెందిన బల్ ముకుంద్. ఈయన దళితుడు. అతని ఉత్సాహం కొంతకాలమే నిలిచింది.

1975 లో నిమ్న కులాల వారికి మరోసారి గుణపాఠం చెప్పబడింది. బ్రిటీషు వాళ్ళు ఊరంతటినీ తగలబెట్టి ముప్ఫై మూడేళ్లు గడిచాయో లేదో_ ఆ దళిత బస్తీ మరోసారి మంటల్లో కలిసింది. ఈ సారి అగ్గిరాజేసింది భూమిహర్లు. “కూలీరేట్ల విషయంలో తగాదాలు సాగుతున్న సమయమది”, చెప్పుకొస్తారు రాధేశ్యాం. "వాళ్ళ బస్తీలో జరిగిన ఏదో దుర్ఘటన మా మీద మోపారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ పొలాల్లోనూ ఇళ్లలోనూ మేము పని చేస్తున్న సమయంలోనే ఇటు మా ఇళ్లు తగలబడ్డాయి.” దాదాపు వంద ఇళ్లు నేలమట్టయ్యాయి. కానీ షహీద్ పుత్రులు ఎవరూ ఆ దుర్ఘటనలో పాలు పంచుకోలేదు.

“ఇది జరిగినపుడు పండిట్ బహుగుణ ముఖ్యమంత్రిగా ఉన్నారు," అన్నారు దళిత సమితి నాయకులు శివ్ జగన్ రామ్. ఆయన వచ్చారు. 'మీ కోసం ఇక్కడ న్యూఢిల్లీ నగరమే నిర్మించి పెడతాం,' అని ప్రకటించారాయన. చూడండి ఈ న్యూఢిల్లీ నగరాన్ని. ఈ మురికి వాడలో ఒక్క అంగుళమయినా మాకు చెందుతుంది అన్న లెక్కగానీ పత్రంగానీ లేవు. కూలీరేట్ల తగాదాలు అలానే ఉన్నాయి. మాకు వచ్చే కూలీ గిట్టుబాటు గాక ఇక్కడి జనాలు బీహార్ వెళ్లి కూలి పనులు చేసుకొంటున్నారు, తెలుసా? " అడుగుతారు శివ్ జగన్ రామ్.

నిజానికి అగ్రవర్గాలతోనూ , అధికార వర్గాలతోనూ తగాదా పడటమన్నది అర్థం లేని పని. గత యాభై ఏళ్లుగా పోలీసు వ్యవస్థ దళితులంటే చూపించే ప్రేమలో అణుమాత్రం తేడాలేదు. ముసాహర్ అనే దళిత కులానికి చెందిన దీనానాధ్ వనవాసి అనే కర్కట్ పూర్ గ్రామస్థుడికి ఈ విషయం బాగా అనుభవం. “ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళు జైల్ భరో ఆందోళన జరిపినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వందలాది ఆందోళనకారులు అరెస్టవుతారు. గాజిపూర్ జైలు కిక్కిరిసిన కక్కసు అయిపోతుంది. అపుడు పోలీసులేం చేస్తారూ? వాళ్ళ చేతికి చిక్కిన కొద్దిమంది ముసహర్లను అరెస్టు చేస్తారు. 'దోపిడీకి పథకం వేస్తున్నారు' అనే ఆరోపణ తో. జైలుకు తీసుకెళ్తారు. అక్కడి చెత్త, మల మూత్రాలను వీళ్ళతో శుభ్రం చేయిస్తారు. చేయించి విడుదల చేస్తారు. "

Fifty years into freedom, Sherpur reeks of poverty, deprivation and rigid caste hierarchies
PHOTO • P. Sainath

యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, షెర్ పూర్ -పేదరికం, లేమి, కఠినమైన కుల శ్రేణులతో నిండి ఉంది.

“మేవేదో యాభై ఏళ్లనాటి కథలు చెప్పటం లేదు. ఇవి ఈనాటి విషయాలు," అంటారు గగరన్ గ్రామానికి చెందిన దాసురామ్ వనవాసి. “ఈ మధ్య రెండేళ్ల క్రితం కూడా ఇవన్నీ జరిగాయి,” అంటారాయన. ఇవిగాక ఇలాంటి దారుణాలు ఇంకెన్నో. దాసురామ్ పదోక్లాసు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ముసహర్ కులంలో అక్కడిదాకా చదివిన వాళ్ళు అతి తక్కువ. ఇంటర్లో చేరాడు గానీ సహవిద్యార్థులూ అధ్యాపకుల హేళనలూ వేధింపులూ భరించలేక వదిలేశాడు. అన్నట్టు ఆ ఇంటర్ కాలేజ్ బాబూ జగ్జీవన్ రామ్ పేరు మీద ఉంది.

మేం షేర్ పూర్ గ్రామం వదిలి వచ్చేటప్పుడు మా కాళ్ళు ఆ దళితబస్తీ రోడ్ల మీద నిండిపోయిన కుళ్లూ పెంటల్లో దిగబడి పోయాయి. వర్షాల పుణ్యమా అని రోడ్డు ధ్వంసమయి పోయింది. నిలవ నీరు కుళ్ళూ కంపులో నిండిపోయింది. “మా న్యూ ఢిల్లీ రహదారి," అంటాడు శివ్ జగన్ రామ్.

“ఇక్కడ దళితులకు స్వేచ్ఛా స్వాతంత్య్రలు లేవు. భూమి లేదు, చదువు లేదు, పనులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యాలు లేవు, ఆశలు లేనేలేవు. మా బానిసత్వమే, మా స్వాతంత్య్రం."

అక్కడ తహసీల్ ఆఫీసులో పూజ కొనసాగుతూనే ఉంటుంది.

ఈ కథనం ది టైమ్స్ అఫ్ ఇండియా, ఆగష్టు 25, 1997 న మొదటి సారి ప్రచురితమైంది.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు

కల్లియస్సేరి: సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం


అనువాదం: అమరేంద్ర దాసరి

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Other stories by P. Sainath
Translator : Amarendra Dasari

అమరేంద్ర దాసరి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు. ఆయనకు పుస్తక పఠనం అన్నా ప్రయాణాలన్నా చాలా ఇష్టం. ఆయన కథలు, యాత్రాకథనాలు రాసారు. అనువాదాలు చేశారు.

Other stories by Amarendra Dasari