ఖాండవ వనాన్ని దహించాలనే అగ్ని దేవుడి ప్రయత్నానికి భగ్నం కలిగించేందుకు ఇంద్రుడు మరోసారి ఉధృతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. దాంతో అగ్ని దేవుడు కోపగించి ఇంద్రుడిని ఓడించాలని అనుకున్నాడు. అందుకు సాయం చేసే వారి కోసం చూశాడు.

మరో వైపు ఇంద్రప్రస్థ నగరంలో, అర్జునుడికి సుభద్రతో పెళ్లి జరుగుతోంది. రాచరిక వివాహాలలో ఉండే ఆర్భాటాలన్నింటినీ కూడదీసుకుని ఆ వేడుక చాలా సమయం పాటు కొనసాగింది. వేడుక పూర్తి అయిన తర్వాత, అర్జునుడు, కృష్ణుడు దగ్గర్లోని ఖాండవ వనానికి తమ భార్యలతో కలిసి విశ్రాంతి కోసం వెళ్లారు. వనంలో విహరిస్తున్నప్పుడు అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషం ధరించి వాళ్ల దగ్గరికి వచ్చాడు. తన ఆకలి తీర్చడంలో సాయం చేయమని కృష్ణుడిని, అర్జునుడిని కోరాడు. యజ్ఞ యాగాదులలో మితిమీరి నేతిని భుజించినందు వల్ల తనకు అజీర్తి కలిగిందనీ, తాజా ఆకుపచ్చ కాయగూరలను కలిగిన అడవిని తింటే తనకు మేలు చేస్తుందని చెప్పాడు.

"ఎన్నో అడవి జంతువులు, చెట్లు ఉన్న ఈ ఖాండవ వనాన్ని మించింది ఏముంటుంది? దానిని భుజిస్తే నా ఒంట్లో సత్తువ తిరిగి చేరి, మళ్లీ యవ్వనవంతుడిని అవుతాను" అని అగ్ని దేవుడు చెప్పాడు.

కానీ తన కోరిక తీరకుండా చేయాలని ఇంద్రుడు పంతం పట్టినట్టు ఉన్నాడు. అగ్ని దేవుడికి సాయం కావాలి. ఒక బ్రాహ్నణుడి కోరికను మన్నించకుండా అతడిని ఉట్టి చేతులతో తిరిగి పంపడం సముచితం కాదని కృష్ణుడికి, అర్జునుడికి తెలుసు. అగ్ని దేవుడికి సాయం చేస్తామని వారిరువురూ మాటిచ్చారు. అగ్ని దేవుడు వనాన్ని నిప్పుతో ఆక్రమించసాగాడు. భారీ మంటలు చెలరేగి ఆకలితో ముందుకు సాగాయి. కృష్ణుడు, అర్జునుడు ఆ వనం పొలిమేరల వద్ద నిలబడి, భయంతో పారిపోతోన్న ప్రతి ప్రాణిని చంపుతూ ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నారు. భూమ్యాకాశాలకు భగభగమండే మంటలు ప్రకాశవంతమైన రంగులద్దాయి.

– మహాభారతంలో ఆదిపర్వంలోని ఖాండవ వన దహన ఘట్టాన్ని రూపాంతరం చేసి రాసినది.

అన్షు మాలవియ ఈ కవితను చదివి వినిపించారు, దానిని ఇక్కడ వినండి

ఖాండవ వనం

ఖాండవ వనం తగలబడిపోతోంది, ధర్మరాజా!
దట్టమైన నల్లని పొగ
అడవినుండి పైకెగసి
మా ముక్కుపుటల్లోకి అడవి జంతువుల
వేగంతో ఎగబాకి, శ్వాసకోశలలోని శూన్యాన్ని ఆక్రమిస్తోంది

చీకట్లో నిప్పు కణాల లాగా కళ్లు మండుతున్నాయి
భయంతో నాలుకలు బిగుసుకుపోయాయి
ఎండు ద్రాక్షలలా మారిపోయిన మా
ఊపిరితిత్తుల నుండి నల్లటి చిక్కటి పసరు కారుతోంది.

దేశం ఊపిరి ఆడక తల్లడిల్లుతోంది!
యోగిరాజా!

ఖాండవ వనం అగ్నికి ఆహుతి అవుతోంది!!
నగరంలోని ధనికులు దురాశతో ఇచ్చిన నైవేద్యాన్ని ఆరగించినా,
పాలకులు కుంచిత బుద్ధితో ఆహుతిచ్చిన వనాన్ని ఆక్రమించినా,
అది చాలక, బ్రాహ్మణ వేషంలో అత్యాశాపరుడైన అగ్ని దేవుడు
ఇంకా ఇంకా ఆక్సిజన్ కావాలని ఆబగా అరుస్తున్నాడు.
తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు
పచ్చని చెట్ల రక్తాన్ని తాగాలని ఉవ్విళ్లూరుతున్నాడు
మాడిపోయిన జంతు శవాల కోసం లొట్టలేస్తున్నాడు
మండే మానుల చిటపట శబ్దాల వెనుక నుండి వస్తోన్న
మానవుల ఆర్తనాదాలు అతడికి వినసొంపుగా ఉన్నాయి

"తథాస్తు" అని అన్నాడు కృష్ణుడు.
నీ కోరిక సిద్ధిస్తుంది.

"ఆ పని పూర్తి చేస్తాం" అని అర్జునుడు
తన మీసం మెలేస్తూ చెప్పాడు --
ఖాండవ వనం తగలబడిబోతోంది...

ఖాండవ వనం తగలబడిబోతోంది
యోగేశ్వరా!"

ఊపిరి అందక, జంతువులు
కేకలు పెడుతూ పరుగులు తీస్తున్నాయి
తప్పించుకుంటోన్న పక్షుల రెక్కలు పట్టుకుని
అగ్ని దేవుడు వాటిని తిరిగి మంటల్లోకి పడేస్తున్నాడు;

భిల్, కోల్, కిరాట్, నాగ్ --
అడవుల్లో ఉండే అనాగరికమైనవిగా ముద్ర వేసిన జాతులు,
అరణ్యాన్ని వదిలి పరిగెడుతున్నాయి,
కాస్తంత ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతూ
తీవ్రమైన క్షోభతో కిందపడుతున్నాయి."

త్రాహిమాం !
కాపాడండి! ఎవరైనా కాపాడండి!

మత్తెక్కిన కళ్లతో ఆ అడవి పొలిమేరల్లో
కృష్ణుడు నిలబడి ఉన్నాడు
మంటల నుండి తప్పించుకునేందుకు
ప్రయత్నిస్తూ పరిగెత్తే వారందరినీ
అర్జునుడు దీక్షగా
తిరిగి మంటల నరకంలోకి పడేస్తున్నాడు

మహాభారత విజయ యోధులారా
మాకంటూ కాస్తంత ఆక్సిజన్‌ను ఇవ్వండి!
ఈ భారత దేశం మీదే
ఈ మహాభారతం మీదే
ఈ భూమి, ఈ సంపద
ఈ ధర్మం, ఈ నియమాలు
గడిచిన కాలం
రాబోయే కాలం
అంతా, అంతా మీదే
మధుసూదనా, మాకు కావాల్సిందల్లా
ఒకే ఒక్క ఆక్సిజన్ సిలిండర్!
అగ్నికి ఆజ్యం కాదు ఈ ఆక్సిజన్
మా జీవనాధారం ఇది

నువ్వు చెప్పింది గుర్తు తెచ్చుకో
అగ్ని ఆత్మను దహింపజాలదు!
కానీ ఈ అడవే మాకు ఆత్మ వంటిది
అదే ఇప్పుడు తగలబడిపోతోంది
ఖాండవ వనం తగలబడిబోతోంది
గీతేశ్వరా!
మహా చితి మంటలాగా
ధూ ధూ ధూ
అంటూ శబ్దం చేస్తూ ఆహుతైపోతోంది!"

సూచీ

ఆది పర్వం : మహాభారతంలోని అధ్యాయాలు 214 నుండి 219 వరకు ఉండే భాగం. ఎగువన, ఈ కవితకు పరిచయపూర్వకంగా పేర్కొన్న ఘట్టం ఈ పర్వానికి చెందినది.

ధర్మరాజు : యుధిష్ఠిరుడిని సూచిస్తుంది.

యోగిరాజా, యోగేశ్వరా, మధుసూధనా, గీతేశ్వరా : ఇవన్నీ కృష్ణుడిని సూచిస్తాయి.

అనువాదం : శ్రీ రఘునాథ్ జోషి

Poem and Text : Anshu Malviya

అన్షు మాలవియ ఒక హిందీ కవి. ఇప్పటిదాకా ఆయన కవితలు మూడు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన అలహాబాద్‌కు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యకర్త కూడా. పట్టణ పేద ప్రజల, అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేయడంతో పాటు, భారతదేశపు మిశ్రమ వారసత్వంపై పరిశోధన చేస్తున్నారు.

Other stories by Anshu Malviya
Paintings : Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Other stories by Antara Raman
Translator : Sri Raghunath Joshi

శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు

Other stories by Sri Raghunath Joshi