అది 1997వ సంవత్సరం.

సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్, మణిపూర్ జట్లు తలపడ్డాయి. ఏటేటా జరిగే ఈ అంతర్రాష్ట్రీయ టోర్నమెంట్‌లో గతంలో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ బెంగాల్ మణిపూర్ చేతిలో ఓడిపోయింది. కానీ వారిప్పుడు తమ పసుపు-మెరూన్ రంగు జెర్సీలు ధరించి ధాటీగా నిలబడివున్నారు. పశ్చిమ బెంగాల్‌, హల్దియా నగరంలోని ఆ దుర్గాచక్ స్టేడియం బెంగాల్ జట్టులోని ఫుట్‌బాల్ క్రీడాకారిణి వందన(బందన) పాల్ సొంతగడ్డ.

విజిల్ ఊదారు, ఆట ప్రారంభమయింది.

అంతకుముందు జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 16 ఏళ్ల ఈ స్ట్రైకర్ హ్యాట్రిక్ సాధించింది. ఆ మ్యాచ్‌లో గోవాపై పశ్చిమ బెంగాల్ గెలిచింది, కానీ పాల్‌కు ఎడమ చీలమండపై గాయమయింది. “నేను అలాగే సెమీ-ఫైనల్‌లో [పంజాబ్‌పై] ఆడాను, కానీ చాలా నొప్పితో ఉన్నాను. ఆ రోజు మేం ఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, నేనసలు నిలబడలేకపోయాను."

పశ్చిమ బెంగాల్‌ జట్టులో అతి పిన్న వయస్కురాలైన పాల్, ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ను బెంచ్ మీద కూర్చొని చూసింది. మ్యాచ్ ముగియడానికి ఇంకా కొన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయి. రెండు జట్లలో ఎవరూ గోల్ చేయలేదు. పశ్చిమ బెంగాల్ జట్టు శిక్షకురాలు (కోచ్) శాంతి మల్లిక్ సంతోషంగా లేరు. ఆమె పడుతున్న ఒత్తిడిని మరింత పెంచుతూ, 12,000 మంది వీక్షించే వీలున్న ఆ  స్టేడియంలో క్రిక్కిరిసిన ప్రేక్షకులలో రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి కూడా ఉన్నారు. మల్లిక్, సిద్ధంగా ఉండమని పాల్‌తో చెప్పారు. “‘నా పరిస్థితి చూడండి, ఎలావుందో’ అని నేను ఆమెకు చెప్పాను. కానీ కోచ్, ‘నువ్వు లేచి ఆడావంటే ఖాయంగా గోల్ పడుతుంది. అలా అని నా మనసు నాకు చెబుతోంది’ అన్నారు," అని పాల్ చెప్పారు.

దాంతో నొప్పిని తగ్గించడానికి గబగబా రెండు ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత, గాయం చుట్టూ ముడతలుగల రబ్బరు పట్టీతో గట్టిగా కట్టు కట్టి, ఆట దుస్తులు ధరించి పాల్ వేచి ఉంది. మ్యాచ్ డ్రా అయింది, గోల్డెన్ గోల్ కోసం అదనపు సమయం ఇచ్చారు- ఇప్పుడు ఏ జట్టు మొదట స్కోర్ చేస్తే ఆ జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంటుంది.

"నేను క్రాస్‌బార్‌ను లక్ష్యంగా చేసుకున్నాను, బంతి కుడివైపుకు తూగింది. కీపర్ ఎగిరి దూకింది. కానీ బంతి ఆమెను దాటి నెట్‌లోకి దూసుకెళ్లింది.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : వందన పాల్ గా ఫుట్ బాల్ ఆడుతున్న బోనీ పాల్ మొదటి ఫోటోలలో ఒకటి . ఇది ఆనందబజార్ పత్రిక స్పోర్ట్స్ సప్లిమెంట్ లో డిసెంబర్ 2, 2012 ప్రచురించబడినది . కుడి : 1998 మహిళల జాతీయ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నందుకు వందనకు AI FF నుండి లభించిన సర్టిఫికేట్

అనుభవజ్ఞుడైన కథకుడికుండే సౌలభ్యంతో పాల్ ఇక్కడే చెప్పటం ఆపారు. "నేను గాయపడిన కాలితోనే షాట్ కొట్టాను," అని ఈ ఫుట్‌బాల్ ఆటగాడు నవ్వుతూ అన్నారు. “కీపర్ ఎంత ఎత్తులో ఉన్నా, క్రాస్‌బార్ షాట్లను కాచుకోవడం కష్టం. నేను గోల్డెన్ గోల్ సాధించాను."

ఆ మ్యాచ్ ముగిసి పాతికేళ్ళు గడిచాయి కానీ, 41 ఏళ్ళ వయసున్న పాల్ ఇప్పటికీ దాని గురించి సగర్వంగా మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. ఒక సంవత్సరం తరువాత పాల్ జాతీయ జట్టులో భాగమయింది. త్వరలో బ్యాంకాక్‌లో జరగబోయే 1998 ఆసియా క్రీడలలో ఆడటానికి వెళ్ళబోతోంది.

ఇప్పటి వరకు, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఇచ్ఛాపూర్ గ్రామానికి చెందిన ఈ ఫుట్‌బాల్ క్రీడాకారిణికి ఒక కలలా సాగిపోయింది: “మా అమ్మమ్మ రేడియోలో [ఫైనల్స్] వ్యాఖ్యానాన్ని వింటోంది. నా కుటుంబంలో ఇంతకు ముందు ఎవరూ ఫుట్‌బాల్‌లో ఈ స్థాయికి చేరుకోలేదు. వాళ్ళంతా నా గురించి గర్వపడేవాళ్ళు."

పాల్ చిన్నతనంలో, ఏడుగురితో కూడిన వారి కుటుంబం గాయ్‌ఘాటా బ్లాక్‌లో ఉన్న ఇచ్ఛాపూర్‌లోని వారి స్వంత ఇంటిలో నివసించేవారు. అక్కడ వారికి రెండు ఎకరాల భూమి ఉంది. అందులో వారు తమ రోజువారీ జీవనం కోసం వరి, ఆవాలు, పచ్చి బఠానీలు, పప్పులు, గోధుమలు పండించేవారు. ఈ భూమిలో కొంత భాగాన్ని అమ్మేశాక, మిగిలిన భూమిని ఆ కుటుంబం పంచుకుంది.

"మా నాన్న టైలర్‌గా పనిచేసేవారు. మా అమ్మ ఆయనకు కుట్టడంలోనూ, ఎంబ్రాయిడరీ చేయటంలోనూ సహాయంగా ఉండేది. మా అమ్మ ఇంకా పగిడీలు (టర్బన్లు - తలపాగాలు), రాఖీలు , కొన్ని ఇతర వస్తువులను కూడా తయారుచేసేది." ఐదుగురు తోబుట్టువులలో చిన్నవారైన పాల్ చెప్పారు. "మేం పిల్లలుగా ఉన్నప్పుడే పొలం పనులు చేసేవాళ్ళం." దాదాపు 70 కోడిపిల్లలనూ, 15 మేకలనూ సంరక్షించే బాధ్యత కూడా ఈ పిల్లలు చేయాల్సిన పనుల్లో ఉండేవి. బడికి వెళ్ళేముందూ, వెళ్ళి వచ్చాక కూడా వీటికోసం గడ్డి కోయాలి.

ఇచ్ఛాపూర్ ఉన్నత పాఠశాలలో పాల్ పదవ తరగతి పూర్తిచేశారు. "అక్కడ అమ్మాయిల ఫుట్‌బాల్ టీమ్ ఉండేది కాదు. అందుకని నేను అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాడ్ని," అన్నారు ఈ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, ఒక గజనిమ్మకాయ(pomelo - Citrus maxima )ను తీసుకుని గదిలోంచి బయటకు వస్తూ. "దీన్ని మేము బతాబి లేదా జాంబురా అని పిలుస్తాం. ఫుట్‌బాల్ కొనడానికి మా దగ్గర డబ్బులుండేవి కావు కాబట్టి, ఈ పండును చెట్టునుంచి విరగ్గొట్టి తీసి, దీనితో ఆడేవాళ్ళం," అన్నారు పాల్. "ఆ విధంగా నేను ఆడటం ప్రారంభించాను."

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : తన కుటుంబానికి చెందిన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న తమ గదిలో కూర్చున్న బోనీ , స్వాతి . కుడి : రెండు గజనిమ్మకాయలు ( ఎడమవైపు ). ఫుట్ బాల్ కొనడానికి అతని కుటుంబానికి డబ్బు లేనందున బోనీ సిట్రస్ జాతి పండుతోనే ఆడుకొనేవారు . ఫోటోలో కుడివైపున బోనీ కోచింగ్ షూలను చూడవచ్చు

అలాంటి ఒక రోజున, ఇచ్ఛాపూర్‌కే చెందిన సిద్‌నాథ్ దాస్ - ఈయన్ని ప్రేమగా బచ్చూ దా (పెద్దన్న) అని పిలుస్తారు - ఫుట్‌బాల్ ఆడుతున్న ఈ పన్నెండేళ్ళ బాలికను గమనించారు. అక్కడికి దగ్గరలో ఉన్న బారాసాత్ పట్టణంలో ఫుట్‌బాల్ ట్రయల్స్ జరుగుతున్నాయని బచ్చూ దా పాల్‌కు చెప్పారు. ఆ విధంగా పాల్ బారాసాత్ జుబక్ సంఘ క్లబ్ జట్టులో సభ్యులయ్యారు. వారితో ఆకట్టుకునే తొలి సీజన్ ఆడిన తర్వాత, కోల్‌కతాలోని ఇతికా మెమోరియల్ క్లబ్‌కు ఆడేందుకు పాల్ ఒప్పందం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూసుకున్నది లేదు

1998 ఆసియా క్రీడల్లో ఆడే జాతీయ జట్టుకు పాల్ ఎంపికయ్యారు. ఫుట్‌బాల్ క్రీడాకారుని పాస్‌పోర్ట్, వీసా దరఖాస్తులు హడావిడిగా వచ్చేశాయి. "మేము విమానాశ్రయంలో ఉన్నాం, బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం" అని ఈ మాజీ ఆటగాడు గుర్తుచేసుకున్నారు. "అయితే వారు నన్ను వెనక్కి పంపించారు."

మణిపూర్, పంజాబ్, కేరళ, ఒడిశాకు చెందిన క్రీడాకారులు ఆసియా క్రీడల కోసం కలిసి శిక్షణ పొందుతున్నప్పుడు పాల్ ఆటతీరును గమనించారు. వారికి పాల్ లైంగికత(జెండర్)పై అనుమానం కలిగింది. దాంతో వారు ఆ విషయాన్ని తమ శిక్షకుల(కోచ్‌లు) దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం త్వరలోనే క్రీడా పాలకమండలి అయిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)కు చేరింది.

“నాకు క్రోమోజోమ్ టెస్ట్ చేయాలని చెప్పారు. ఆ సమయంలో ఆ టెస్టుని నేను బొంబాయి లేదా బెంగళూరులో మాత్రమే చేయించుకోగలను” అని పాల్ చెప్పారు. కొల్‌కతాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నుండి డాక్టర్ లైలా దాస్, పాల్ రక్త నమూనాను ముంబైకి పంపారు. "ఒక నెలన్నర తర్వాత, కార్యోటైప్ పరీక్షను ఉదహరిస్తూ, '46 XY' చూపించిన నివేదిక వచ్చింది. మహిళలకు ఇది '46 XX' ఉండాలి. నేను ఆడటం కుదరదని డాక్టర్ నాకు చెప్పారు [అధికారికంగా]" అని పాల్ అన్నారు.

అప్పుడప్పుడే ఎదుగుతోన్న ఈ ఫుట్‌బాల్ స్టార్ వయస్సు కేవలం 17 సంవత్సరాలు, కానీ ఆటలో తన భవిష్యత్తు ఇప్పుడు సందేహంలో పడింది.

PHOTO • Riya Behl

జూలై 19, 2012 ఆజ్ కాల్ సిలిగురిలో వచ్చిన బోనీ ఫోటో . ఫోటోలో బోనీ , సిలిగురి సబ్ - డివిజన్ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శికి తన బయోడేటాను అందజేస్తున్నారు

పుట్టుకనుంచి శరీరంలో పునరుత్పత్తికి సంబంధించిన అవయవాల ఎదుగుదలను బట్టి మనుషులు స్త్రీలుగా గాని, పురుషులుగా గానీ నిర్ధారించబడతారు. అయితే అనిశ్చిత లైంగికతతో పుట్టినవారి శరీరాలలో ఇది స్పష్టంగా ఉండదు. సామాజిక ధోరణులే కాకుండా వైద్యశాస్త్రం ప్రకారం కూడా వీరిని స్త్రీ లేదా పురుషుడు అని నిర్ధారించలేరు. ఈ తేడా కేవలం శరీరం బైట/లోపల ఉండే లేదా ఉండవలసిన అవయవాలలోనే అన్నిసార్లూ కనిపించదు. క్రోమోజోముల అమరిక, హార్మోనుల తయారీలో హెచ్చుతగ్గులు కూడా ఈ అనిశ్చితిలో భాగమే. ఈ తేడాలు కొందరిలో పుట్టుకనుంచే కనిపిస్తాయి. మరికొందరిలో యుక్తవయసు వచ్చాక కానీ కనిపించవు

***

“నాకు ఒక  గర్భాశయం, ఒక అండాశయం, ఇంకా లోపలివైపున ఒక పురుషాంగం ఉంది. నాకు 'ఇరువైపులకూ' చెందినవి [పునరుత్పత్తి భాగాలు] ఉన్నాయి,” అని ఈ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు చెప్పారు. ఒక్క రాత్రిలో ఈ అథ్లెట్ గుర్తింపును గురించి ఫుట్‌బాల్ సంఘం, మీడియా, ఇంకా పాల్ కుటుంబం కూడా ప్రశ్నించింది.

“ఆ సమయంలో, ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు లేదా అర్థంచేసుకోలేదు. ఇప్పుడు మాత్రమే ప్రజలు బయటకు మాట్లాడుతున్నారు. LGBTQ  సమస్యలను పైకి లేవనెత్తుతున్నారు" అని ఈ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు అన్నారు.

పాల్ ఒక అనిశ్చిత లైంగికత - LGBTQIA+  కమ్యూనిటీలోని ‘I’ - కలిగిన వ్యక్తి. ఇప్పుడతను బోనీ పాల్ అనే పేరుతో ఉన్నారు. “నా శరీరం లాంటి శరీరం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. అథ్లెట్లు, టెన్నిస్  క్రీడాకారులు, ఫుట్‌బాల్ క్రీడాకారులు, నాలాంటి ఆటగాళ్లు చాలామంది ఉన్నారు,” అని తనను తాను మగవాడిగా గుర్తించే బోనీ చెప్పారు. అతడు తన లైంగిక గుర్తింపు, లైంగిక వ్యక్తీకరణ, లైంగికత, లైంగిక ధోరణులపై తన వైఖరి గురించి వైద్య సమాజ సభ్యులతో సహా విభిన్న వ్యక్తులతో మాట్లాడతారు.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : టైమ్స్ ఆఫ్ ఇండియా సిటీ సప్లిమెంట్ లో బోనీపై ప్రచురితమైన ఒక కథనం . కుడి : బోనీ పాల్ ఆధార్ కార్డ్ . అందులో అతని జెందర్ పురుషునిగా పేర్కొనబడింది

పుట్టుకనుంచి శరీరంలో పునరుత్పత్తికి సంబంధించిన అవయవాల ఎదుగుదలను బట్టి మనుషులు స్త్రీలుగా గాని, పురుషులుగా గానీ నిర్ధారించబడతారు. అయితే అనిశ్చిత లైంగికతతో పుట్టినవారి శరీరాలలో ఇది స్పష్టంగా ఉండదు. సామాజిక ధోరణులే కాకుండా వైద్యశాస్త్రం ప్రకారం కూడా వీరిని స్త్రీ లేదా పురుషుడు అని నిర్ధారించలేరు. ఈ తేడా కేవలం శరీరం బైట/లోపల ఉండే లేదా ఉండవలసిన అవయవాల లోనే అన్నిసార్లూ కనిపించదు. క్రోమోజోముల అమరిక, హార్మోనుల తయారీలో హెచ్చుతగ్గులు కూడా ఈ అనిశ్చితిలో భాగమే. ఈ తేడాలు కొందరిలో పుట్టుకనుంచే కనిపిస్తాయి. మరికొందరిలో యుక్తవయసు వచ్చాక కానీ కనిపించవు. వైద్యశాస్త్రజ్ఞులు అనిశ్చిత లైంగిక వైరుధ్యాలు ఉన్న వ్యక్తులలోని ఈ తేడాకు DSD అనే పదాన్ని- (Differences/Disorders of Sex Development – అనిశ్చిత లైంగిక పరిణితి) ఉపయోగిస్తారు.

"DSDని తరచుగా 'లైంగికత సక్రమంగా అభివృద్ధి కాకపోవటం' అని వైద్య సమాజంలో చాలామంది తప్పుగా పేర్కొంటారు," అని ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సతేంద్ర సింగ్ అంటారు. అనిశ్చిత లైంగికత ఉన్న వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన అజ్ఞానం, గందరగోళం కారణంగా, అలా ఉన్న వ్యక్తుల సంఖ్య గురించి ఖచ్చితంగా తెలియటంలేదని ఆయన చెప్పారు.

ప్రతి 2,000 మంది పిల్లలలో కనీసం ఒకరు  “నిపుణులకు సైతం వారిలో స్త్రీ, లేదా పురుష లక్షణాలను గుర్తించడాన్ని కష్టతరం చేసే కలగలిసిన" లైంగిక శరీర నిర్మాణ లక్షణాలతో పుడుతున్నారని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సంబంధించిన సమస్యలపై 2014లో ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది.

వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, "ప్రామాణిక పాఠ్యపుస్తకాలు [దేశంలోని వైద్యశాస్త్ర పాఠ్యాంశాలలో] ఇప్పటికీ 'హెర్మాఫ్రొడైట్ (స్త్రీ, పురుష జననేంద్రియాలు రెండూ కలిగివున్నవారు)', 'అస్పష్టమైన జననేంద్రియాలు' మరియు 'అస్తవ్యస్తతలు (డిజార్డర్స్)' వంటి అవమానకరమైన పదాలను ప్రస్తావిస్తున్నాయి," అని మానవ హక్కుల కార్యకర్త, వైకల్య హక్కుల పరిరక్షకుడు కూడా అయిన డాక్టర్ సింగ్ జోడించారు.

మహిళల జట్టు నుండి తొలగించబడిన తర్వాత, కొల్‌కతా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ద్వారా బోనీకి శారీరక పరీక్షలు జరిగాయి. ఏ మహిళా ఫుట్‌బాల్ జట్టులోనూ పోటీ చేయడానికి తనకు అనుమతి లభించలేదు. "జీవితంలోంచి ఫుట్‌బాల్ లేకుండా పోయినప్పుడు, నాకిక జీవితమే ముగిసినట్లు అనిపించింది. నాకు అన్యాయం జరిగింది” అని బోనీ అంటున్నారు.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : బతాబీ లేదా జాంబురా ( గజ నిమ్మకాయ ) ను పట్టుకున్న బోనీ . అతను ఫుట్ బాల్ ఆడటం ప్రారంభించినప్పుడు , మందపాటి తొక్కని కలిగివుండే పండు ఫుట్ బాల్ కు మంచి ప్రత్యామ్నాయంగా మారింది . కుడి : తన ట్రోఫీలు , సర్టిఫికేట్ లు ఉన్న షోకేస్ ముందు కూర్చున్న బోనీ

2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు తనలో ఆశను నింపిందని ఆయన చెప్పారు. ఇది ఇలా పేర్కొంది: “ఒకరి లైంగిక గుర్తింపును గుర్తించడం అనేది గౌరవానికి సంబంధించిన ప్రాథమిక హక్కుకు గుండెకాయ వంటిది. లైంగికత అనేది ఒక వ్యక్తి భావనలో ప్రధాన భాగంగా, అలాగే ఆ వ్యక్తి గుర్తింపులో అంతర్భాగంగా ఉంటుంది. ఆ విధంగా లైంగిక గుర్తింపుకు చట్టపరమైన గుర్తింపు అంటే మన రాజ్యాంగం క్రింద హామీ ఇవ్వబడిన గౌరవం మరియు స్వేచ్ఛ హక్కులో భాగం." ‘ట్రాన్స్‌జెండర్‌’గా గుర్తింపు ఉన్న వ్యక్తులకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలంటూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, పూజయ మాతా నసిబ్ కౌర్‌జీ మహిళా సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌లపై స్పందిస్తూ ఈ తీర్పు వెలువడింది. ఈ మైలురాయి తీర్పు లైంగికపరమైన గుర్తింపును గురించి విస్తృతంగా చర్చించింది. నాన్-బైనరీ (స్త్రీగానో, పురుషునిగానో గుర్తింపు లేనివారు) లైంగిక గుర్తింపులను చట్టబద్ధంగా గుర్తించడంలో, భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ప్రాథమిక హక్కులను సమర్థించడంలో కూడా ఈ తీర్పు మొదటిది.

ఈ తీర్పు బోనీ పరిస్థితిని ధృవీకరించింది. "నేను మహిళల జట్టులో ఉన్నట్లు నేను భావించాను," అని అతను చెప్పారు. "అయితే, నేను మహిళల జట్టులో ఎందుకు ఆడలేను అని నేను AIFFని అడిగినప్పుడు, అది మీ శరీరం వలన, క్రోమోజోమ్‌ల వలన అని వారు చెప్పారు."

అనిశ్చిత లైంగిక వైవిధ్యాలు ఉన్న క్రీదాకారుల కోసం సెక్స్, జెండర్ పరీక్షల విధానాల ప్రక్రియపై సమాచారాన్ని కోరుతూ కొల్‌కతాలోని SAI నేతాజీ సుభాష్ ఈస్టర్న్ సెంటర్‌కు, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు అనేక సందేశాలు పంపినప్పటికీ, ఇంతవరకూ ఈ రిపోర్టర్‌కు వారినుంచి సమాధానం రాలేదు.

***

ఏదైనా ఒక మార్పు తీసుకురావాలనే నిశ్చయంతో బోనీ, ఏప్రిల్ 2019లో ఇంటర్‌సెక్స్ వ్యక్తులు, వారి మద్దతుదారుల పాన్-ఇండియా నెట్‌వర్క్ అయిన ఇంటర్‌సెక్స్ హ్యూమన్ రైట్స్ ఇండియా (IHRI) వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. ఈ నెట్‌వర్క్ ఇంటర్‌సెక్స్ వ్యక్తుల హక్కులను ప్రోత్సహిస్తుంది, పీర్ కౌన్సెలింగ్‌ను అందిస్తుంది. న్యాయవాదం ద్వారా వారి సవాళ్ళనూ, అవసరాలనూ హైలైట్ చేస్తుంది.

IHRI సభ్యులలో, పిల్లలతో చురుకుగా పనిచేసే ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు కలిగిన ఏకైక వ్యక్తి బోనీ. "పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ, శిశుసంరక్షణ సంస్థల ద్వారా తగిన సమయంలో బోనీ తీసుకున్న చొరవ, సెక్స్ డెవలప్‌మెంట్‌లో తేడాలు ఉన్న చాలామంది యువతకు తమ శరీరాలను, లైంగిక లేదా జెండర్ గుర్తింపును అర్థం చేసుకోవడంలో, వాటిని అంగీకరించడంలో సహాయపడింది. ఇంకా, వారికి అవసరమైన, సాధ్యమైన సహాయాన్ని వారి సంరక్షకులు వారికి అందించడంలో సహాయపడింది" అని పుష్పా ఆచంట చెప్పారు. పుష్ప IHRIకు మద్దతుదారు, సభ్యులు కూడా.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : కోచ్‌గా తన శ్రేష్ఠమైన పనికి 2021 లో వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇచ్చిన అవార్డును బోనీ చదువుతూండగా , చూస్తున్న స్వాతి ( ఎడమవైపు ). కుడి : సాల్ట్ లేక్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కిసలయ జట్టు గెలిచినప్పుడు , వారికి శిక్షణ ఇచ్చినందుకు బోనీని ప్రశంసిస్తూ అక్టోబరు 9, 2017 ఈబేళలో వచ్చిన ఒక కథనం

“యువ అథ్లెట్లలో తమ శారీరక స్వతంత్రప్రతిపత్తి గురించి అవగాహన పెరిగింది. బోనీ విషయానికొస్తే, ఆ సమయంలో ఈ అవగాహన లేదు,” అని అథ్లెట్‌ల హక్కుల కార్యకర్త డాక్టర్ పయోష్ణీ మిత్ర చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లోని గ్లోబల్ అబ్జర్వేటరీ ఫర్ ఉమెన్, స్పోర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి CEO అయిన డాక్టర్ మిత్ర, క్రీడలలో మానవ హక్కుల ఉల్లంఘనలను పరిష్కరించేందుకు ఆసియా, ఆఫ్రికాలలో ఉన్న మహిళా అథ్లెట్లతో కలిసి పనిచేశారు.

"నేను [విమానాశ్రయం నుండి] తిరిగి వచ్చినప్పుడు, స్థానిక వార్తాపత్రికలు నన్ను హింసపెట్టాయి" అని బోనీ గుర్తుచేసుకున్నారు. "'మహిళల జట్టులో ఆడుతున్న ఒక పురుషుడు' - ఇలా వుండేవి కొన్ని వార్తాపత్రికల ముఖ్యాంశాలు." ఇచ్ఛాపూర్‌కు తిరిగి రావడం గురించి బాధాకరమైన వివరాలతో ఇలా చెప్పారు: “నా తల్లిదండ్రులు, తోబుట్టువులు భయపడ్డారు. నా ఇద్దరు సోదరీమణుల అత్తమామలు దీన్ని అవమానంగా భావించారు. నేను ఉదయం ఇంటికి తిరిగి వచ్చాను, కానీ సాయంత్రానికల్లా ఇంటినుండి పారిపోవాల్సి వచ్చింది."

బోనీ జేబులో ఉన్న సుమారు 2 వేల రూపాయలతో పరారయ్యారు. ఇంటి నుండి బయలుదేరిన రోజు జీన్స్ ధరించి, జుట్టును పొట్టిగా కత్తిరించుకున్న సంగతి గుర్తుచేసుకున్నారు. తానెవరో ఎవరికీ తెలియని ప్రదేశాన్ని వెతుక్కోవాలనుకున్నారు.

"నాకు మూర్తులు [విగ్రహాలు] తయారు చేయటం తెలుసు, కాబట్టి నేను ఆ పని చేయడానికి కృష్ణానగర్‌కు పారిపోయాను" అని పాల్ సామాజిక వర్గానికి చెందిన బోనీ చెప్పారు. " హమ్ మూర్తికారీ హై [మేము విగ్రహాలను తయారుచేస్తాం]." ఇచ్ఛాపూర్ గ్రామంలోని తన బాబాయికి చెందిన విగ్రహాల తయారీ యూనిట్‌లో పెరుగుతూ, సహాయం చేసిన అనుభవం అతనికి మట్టి విగ్రహాల, బొమ్మల తయారీకి ప్రసిద్ధిచెందిన కృష్ణానగర్ పట్టణంలో ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలను అందించింది. అతని నైపుణ్యానికి పరీక్షగా ఎండిన వరిగడ్డి, జనపనార తాళ్ళతో విగ్రహాన్ని తయారుచేయమని అడిగారు. రోజుకు రూ.200 చెల్లింపుతో బోనీకి ఉద్యోగం వచ్చింది. అలా తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించారు.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : ఇచ్చాపూర్ లోని తన బాబాయి విగ్రహాల తయారీ కర్మాగారంలో బోనీ . అక్కడ సహాయకుడిగా ఉండి , కళను నేర్చుకున్నారు . కుడి : గడ్డి , జనపనారతో చేసిన మూర్తి ( విగ్రహం ) నిర్మాణం . కృష్ణానగర్ లో ఉద్యోగం కోసం పరీక్ష జరిగినప్పుడు ఇలాంటి విగ్రహాన్నే బోనీ తయారుచేయాల్సి వచ్చింది

తిరిగి ఇచ్ఛాపూర్‌లో. బోనీ తల్లిదండ్రులైన ఆధిర్, నివాలు వారి పెద్ద కుమార్తె శంకరితోనూ, కుమారుడు భోలాతోనూ కలిసి నివసిస్తున్నారు. అప్పటికి మూడు సంవత్సరాలుగా బోనీ ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఒక చల్లని శీతాకాలపు ఉదయం గురించి బోనీ గుర్తుచేసుకున్నారు: “సాయంత్రం వారు [స్థానికులు] నాపై దాడి చేశారు. నేను వేగంగా పరుగెట్టి పారిపోగలిగాను. కానీ నేను వెళ్ళిపోవడాన్ని చూసిన మా అమ్మ ఏడుస్తూవుంది."

తనను తాను భౌతికంగా రక్షించుకోవాల్సి రావడం ఆయనకిది మొదటిసారో, లేదా చివరిసారో కాదు. కానీ ఆ రోజు తనకి తాను వాగ్దానం చేసుకున్నారు. “నేను నా కాళ్లపై నిలబడగలనని అందరికీ చూపించబోతున్నాను. నా శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన చెప్పారు. బోనీ శస్త్రచికిత్సకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

తన పునరుత్పత్తి భాగాలను ఆపరేట్ చేయగల వైద్యుల కోసం అతను శోధించారు. చివరకు తానున్న ప్రదేశం నుంచి రైలులో నాలుగు గంటల దూరంలో ఉన్న కొల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో ఒకరిని కనుగొన్నారు. “ప్రతి శనివారం, డాక్టర్ బి.ఎన్. చక్రవర్తి దాదాపు 10 నుండి 15 మంది వైద్యులతో కూర్చునేవారు. వారందరూ నన్ను పరీక్ష చేశారు,” అని బోనీ చెప్పారు. అతను కొన్ని నెలలపాటు అనేక రౌండ్ల పరీక్షలు చేయించుకున్నారు. "నా డాక్టర్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వ్యక్తులకు ఇలాంటి మూడు ఆపరేషన్లు చేసారు, విజయం సాధించారు కూడా," అని బోనీ చెప్పారు.

కానీ, శరీరాలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయనీ, ఈ ప్రక్రియతో ముందుకు వెళ్లడానికి ముందు తాను తన వైద్యుడితో చాలా సంభాషణలు చేయాల్సి వచ్చిందనీ ఆయన చెప్పారు.

ఈ శస్త్రచికిత్సలకు దాదాపు రూ. 2 లక్షలు ఖర్చవుతుంది. అయితే బోనీ నిశ్చయంతో ఉన్నారు. 2003లో బోనీ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT)ని ప్రారంభించారు. ఇందుకు టెస్టోస్టెరాన్‌ను ప్రేరేపించే ఇంజెక్షన్ అయిన 250 మి.గ్రా. టెస్టోవిరాన్‌ను కొనుగోలు చేయడానికి నెలకు దాదాపు 100 రూపాయలు ఖర్చు చేశారు. మందులకు, వైద్యుల సందర్శనలకు చెల్లించడం కోసం, శస్త్రచికిత్స కోసం డబ్బును కూడబెట్టేందుకు కొల్‌కతాలోనూ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెయింటింగ్ ఉద్యోగాల వంటి రోజువారీ కూలిపనులకు మారారు. కృష్ణానగర్‌లో ఆయన చేస్తున్న విగ్రహాల తయారీ ఉద్యోగానికి ఇది అదనం.

"నాకు తెలిసిన ఒక వ్యక్తి సూరత్‌లోని ఒక కర్మాగారంలో విగ్రహాలను తయారుచేస్తున్నాడు. అందుకే నేను అతనితో కలిసి అక్కడికి వెళ్ళాను" అని బోనీ చెప్పారు. వారంలో ఆరు రోజులపాటు గణేష్ చతుర్థి, జన్మాష్టమి వంటి పండుగల కోసం విగ్రహాలు తయారుచేసి, రోజుకు రూ. 1,000 చొప్పున సంపాదించేవారు.

సాధారణంగా అక్టోబరు-నవంబర్‌ నెలలలో జరుపుకునే దుర్గాపూజ, జగద్ధాత్రి పూజల కోసం అతను ప్రతి సంవత్సరం కృష్ణానగర్‌కు తిరిగి వచ్చేవారు. 2006లో కృష్ణానగర్‌లో కాంట్రాక్టు పద్ధతిలో విగ్రహాల తయారీ కోసం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించే వరకూ ఈ పనులు ఇలాగే కొనసాగాయి." సూరత్‌లో నేను 150-200 అడుగుల పొడవు ఉండే మూ ర్తుల ను ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాను. ఇక్కడ వాటికి మంచి డిమాండ్ ఉంది," అని అతను చెప్పారు. "నేను ఒక కార్మికుడిని సహాయకునిగా తీసుకున్నాను. అలా మేము ఆగస్టు-నవంబర్ మాసాల మధ్య ఎక్కువ గిరాకీ ఉన్న పండుగ సీజన్‌లో పనిచేసి బాగా సంపాదించగలిగాము."

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : బోనీ , స్వాతి . కుడి : ఇచ్ఛాపూర్ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఇంట్లో , తల్లి నివాతో బోనీ

ఈ సమయంలోనే కృష్ణానగర్‌కు చెందిన విగ్రహాల తయారీదారు స్వాతి సర్కార్‌తో బోనీ ప్రేమలో పడ్డారు. స్వాతి చదువు మానేసి, తన తల్లీ నలుగురు తోబుట్టువులతో కలిసి విగ్రహాల అలంకరణ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బోనీకి ఇది ఒత్తిడితో కూడిన సమయం. అతనిలా గుర్తుచేసుకున్నారు, “నేను నా గురించి ఆమెకు చెప్పవలసి ఉంటుంది. అయితే నాకు డాక్టర్ మాట ఇచ్చివున్నారు [నా శస్త్రచికిత్సల విజయం గురించి]. కాబట్టి నేను ఆమెకు చెప్పాలనే నిర్ణయించుకున్నాను."

స్వాతి, ఆమె తల్లి దుర్గ అతనికి బాసటగా నిలిచారు. 2006లో జరిగిన బోనీ శస్త్రచికిత్స కోసం సమ్మతి పత్రంపై స్వాతి సంతకం కూడా చేశారు. మూడు సంవత్సరాల తరువాత, జూలై 29, 2009న బోనీ, స్వాతి వివాహం చేసుకున్నారు.

ఆ రాత్రి బోనీతో తన తల్లి చెప్పిన మాటలను స్వాతి గుర్తుచేసుకున్నారు, “నా కూతురు మీ శరీరంలోని సమస్యను అర్థం చేసుకుంది. అయినా ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకుంది. ఇంక నేనేం చెప్పగలను? తుమీ సాత్ దీబొ, తుమీ థక్బొ [మీరు ఆమెకు తోడుగా ఉంటేనే, మీరూ ఉంటారు].”

***

బోనీ, స్వాతిల సహచర జీవితం ఉన్నచోటుని విడచి వేరేచోటికి వెళ్ళిపోవడంతో ప్రారంభమైంది. కృష్ణానగర్‌లోని ప్రజలు వారిని చాలా అసహ్యంగా మాటలనడటం ప్రారంభించారు. దాంతో ఈ జంట అక్కడికి 500 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న డార్జిలింగ్ జిల్లాలోని మాటిగారాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడైతే తమను ఎవరూ గుర్తించలేరు. బోనీ సమీపంలోని విగ్రహాల తయారీ కర్మాగారంలో పని కోసం వెళ్ళారు. “వారు నా పనిని చూసి, నాకు 600 రూపాయల రోజువారీ వేతనం ఇస్తామని చెప్పారు. నేను అంగీకరించాను,” అని అతను చెప్పారు. "మాటిగారా ప్రజలు నాకు చాలా ప్రేమను ఇచ్చారు," అంటూ అతను, తన చుట్టూ ఉన్న పురుషులు తనను వారిలో ఒకరిగా ఎలా అంగీకరించారో, సాయంకాలాలు చాయ్ దుకాణాల వద్ద వారు ఎలా కలిసి తిరుగుతూ ఉండేవారో గుర్తు చేసుకున్నారు.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : ఇచ్ఛాపూర్ లోని ఒక చాయ్ దుకాణంలో బోనీ . కుడి : స్థానిక వ్యాపారులు పుష్పనాథ్ , దేవ్ నాథ్ ( ఎడమ వైపు ) లతో ; ఒక కలప వ్యాపారి , కొబ్బరి నీళ్లు అమ్మే గోరాంగ్ మిశ్రా ( కుడివైపు ) తో

కానీ బోనీ కుటుంబం వారిని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో ఆ దంపతులు ఇచ్ఛాపూర్‌కు తిరిగి వెళ్ళలేకపోయారు. బోనీ తండ్రి మరణించినప్పుడు కూడా, అంత్యక్రియలకు హాజరు కావడానికి అతనిని అనుమతించలేదు. "కేవలం క్రీడాకారులే కాదు, సమాజం పట్ల భయంతో ఇళ్ళను విడిచిపెట్టని నాలాంటివారు చాలామంది ఉన్నారు" అని అతను ఎత్తిచూపారు.

2016లో కొల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, బోనీ జీవితం ఆధారంగా నిర్మించిన యామ్ బోనీ అనే డాక్యుమెంటరీ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్నప్పుడు, తమ కష్టాలకు గుర్తింపు లభించిందని ఈ జంట భావించారు. ఆ తర్వాత కొద్దికాలానికే, బోనీకి కిసలయ చిల్డ్రన్స్ హోమ్‌లో ఫుట్‌బాల్ కోచ్‌గా ఉద్యోగం లభించింది. ఇది, పశ్చిమ బెంగాల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (WBCPCR) ఆధ్వర్యంలో బారాసాత్ పట్టణంలో నడుస్తున్న బాలుర సంరక్షణ సంస్థ. డబ్ల్యుబిసిపిసిఆర్ చైర్‌పర్సన్ అనన్య చక్రవర్తి ఛటర్జీ మాట్లాడుతూ, "అతను పిల్లలకు ప్రేరణగా ఉంటారని మేం భావించాం," అన్నారు. "మేము బోనీని కోచ్‌గా నియమించినప్పుడు, అతను చాలా మంచి ఫుట్‌బాల్ క్రీడాకారుడనీ, రాష్ట్రానికి అనేక అవార్డులను గెలుచుకొచ్చాడని మాకు తెలుసు. కానీ ఇప్పుడతను పని లేకుండా ఉన్నాడు. కాబట్టి అతను ఎంత మంచి క్రీడాకారుడో అనే విషయం మనం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమని మేం భావించాం,” అన్నారామె.

ఏప్రిల్ 2017 నుండి బోనీ అక్కడ శిక్షణ ఇస్తున్నారు. అతను పెయింటింగ్, శిల్పకళల బోధకుడు కూడా. బోనీ తన గుర్తింపు గురించి పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడుతారు, చాలామందికి మంచి నమ్మకస్తుడు కూడా. కానీ ఇప్పటికీ తన భవిష్యత్తు గురించి ఆయన ఆందోళన చెందుతారు. “నాకు పర్మినెంట్ ఉద్యోగం లేదు. నన్ను పనికి పిలిచిన రోజులకు మాత్రమే నాకు జీతం ఇస్తారు,” అని అతను చెప్పారు. అతను సాధారణంగా నెలకు రూ. 14,000 సంపాదిస్తారు. కానీ 2020లో కోవిడ్-19 వ్యాప్తి తర్వాత, నాలుగు నెలల వరకు ఆయనకు ఆదాయం లేదు.

ఫిబ్రవరి 2020లో, ఇచ్ఛాపూర్‌లోని తన తల్లి ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఇల్లు కట్టుకోవడానికి ఐదేళ్ల వ్యవధిలో తీర్చేలా బోనీ రుణం తీసుకున్నారు. స్వాతి, బోనీ ఇప్పుడు తన సోదరుడు, తల్లి, సోదరితో కలిసి తన తల్లి ఇంట్లోనే నివసిస్తున్నారు. బోనీ తన జీవితంలోని ఎక్కువ భాగం ఆ ఇంటినుంచే పారిపోవలసి వచ్చింది. ఫుట్‌బాల్ ఆటగాడిగా బోనీ సంపాదన అంతా ఈ ఇంటిని నిర్మించడానికే ఖర్చు చేయబడింది. ఇప్పుడక్కడ అతనూ, స్వాతీ ఒక చిన్న బెడ్‌రూమ్‌లో ఉంటున్నారు. వారిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు పూర్తిగా అంగీకరించలేదు. తమ గదికి వెలుపల ఉన్న ఒక చిన్న ప్రదేశంలో గ్యాస్ స్టవ్‌పై వారు తమ భోజనాన్ని వండుకుంటారు.

PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ : ఇచ్ఛాపూర్ లో ఇంకా పూర్తికాని తమ ఇంటి బయట బోనీ , స్వాతి . కుడి : ఇప్పుడు వారుంటున్న చిన్న బెడ్ రూమ్ లో కొలువై ఉన్న బోనీ ట్రోఫీల ప్రదర్శన , ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత కొత్త ఇంటిలో శాశ్వత స్థానం పొందుతుందని జంట ఆశిస్తున్నారు

బోనీ ఇంటికోసం తీసుకున్న మైక్రో హోమ్ లోన్ రూ. 345,000 డబ్బును తిరిగి చెల్లించవలసి ఉంది. ఆ డబ్బును తన జీవితం ఆధారంగా తీసిన సినిమా హక్కులను విక్రయించడం ద్వారా సంపాదించాలని బోనీ ఆశించారు. కానీ ముంబైకి చెందిన చిత్ర నిర్మాత ఆ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. దాంతో బోనీ తన అప్పులను తిరిగి చెల్లించలేకపోయారు.

తన సర్టిఫికెట్లు, మెరుస్తున్న ట్రోఫీలతో నిండివున షోకేస్ ముందు కూర్చున్న బోనీ, అనిశ్చిత లైంగికత ఉన్న వ్యక్తిగా తన జీవితాన్నిగురించి వివరించారు. జీవితం అనిశ్చితితో నిండివుప్పటికీ, అతనూ స్వాతీ వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు, జ్ఞాపికలను ఒక ఎరుపు రంగు సూట్‌కేస్‌లో జాగ్రత్తగా భద్రపరిచారు. దానిని ఆ షోకేస్ పైన ఉంచారు. రెండేళ్ల క్రితం కట్టడం ప్రారంభించిన తమ ఇంటిలో వాటికి శాశ్వత స్థలం ఉంటుందని వారు ఆశిస్తున్నారు.

"నేను ఇప్పటికీ కొన్నిసార్లు ఆగస్టు 15 [స్వాతంత్ర్య దినోత్సవం] రోజున నా గ్రామంలోని క్లబ్‌లతో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడతాను," అని బోనీ చెప్పారు. "కానీ నాకు మళ్లీ భారతదేశం తరపున ఆడే అవకాశం మాత్రం రాలేదు."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Other stories by Riya Behl
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli