“భదోహి తివాచీల జిల్లా. ఇక్కడ అది తప్ప వేరే పని లేదు,” అని 40లలో వయసున్న నేత కార్మికుడు అఖ్తర్ అలీ చెప్పారు. "నేను నా బాల్యాన్ని ఇక్కడే గడిపాను, ఆ విధంగానే నేతపని నేర్చుకున్నాను." అయితే, తివాచీల తయారీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో అలీ ఇప్పుడు బట్టలు కుట్టే పనిని చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ డివిజన్‌లో ఉన్న భదోహి జిల్లా దేశంలోనే అతిపెద్ద తివాచీలు నేసే సమూహానికి కేంద్రంగా ఉంది. ఈ సమూహంలో మీర్జాపూర్, వారణాసి, ఘాజీపూర్, సోన్‌భద్ర, కౌశాంబి, అలహాబాద్, జౌన్‌పూర్, చందౌలీ జిల్లాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ పెద్ద సంఖ్యలో మహిళలతో సహా దాదాపు 20 లక్షల మంది గ్రామీణ కళాకారులకు ఉపాధిని కల్పిస్తోంది.

ఇక్కడ నేత ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే, పోగులను చేతితో ముడివేసి నిలువు మగ్గాలపై తివాచీలను నేస్తారు. ఈ ముడులు చదరపు అంగుళానికి 30 నుండి 300 వరకు ఉంటాయి. ఈ ప్రక్రియ, ఉపయోగించే ముడి పదార్థాలు - ఉన్ని, పత్తి, పట్టు దారాలు - కనీసం రెండు శతాబ్దాలుగా మార్పులేకుండా ఒకే విధంగా ఉన్నాయి. మగ్గాలపై చేతితో ముడులు వేసే నైపుణ్యాన్ని ఈ హస్తకళాకారులు తమ పిల్లలకు వారసత్వంగా అందజేస్తూవస్తున్నారు.

వారి నేత పద్ధతుల ప్రత్యేక స్వభావానికి గుర్తింపుగా, భదోహి కార్పెట్‌లకు 2010లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ - జి ఐ) ధృవీకరణ లభించింది. ఈ గుర్తింపు పరిశ్రమకు ఊతం ఇస్తుందని భావించినప్పటికీ, ఇది తివాచీ నేతకారుల వ్యాపారాన్ని మెరుగుపరచడంలో సహాయపడలేదు.

ఉదాహరణకు, 1935లో స్థాపించిన ముబారక్ అలీ అండ్ సన్స్ భదోహి తివాచీలను బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆర్డర్లు పడిపోవడంతో 2016లో వారు తమ దుకాణాన్ని మూసివేశారు. ఈ ఎగుమతుల సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ యజమాని అయిన ముబారక్ మనవడు 67 ఏళ్ల ఖాలిద్ ఖాన్ మాట్లాడుతూ, “మా తాత, నాన్న ఈ వ్యాపారమే చేసేవారు. బ్రిటీష్‌వారి కాలంలో మొదలైన మా వ్యాపారం, తివాచీలను ‘మేడ్ ఇన్ బ్రిటీష్ ఇండియా’ అనే ముద్రతో ఎగుమతి చేసేవారు." అన్నారు.

వీడియో చూడండి: మసకబారుతున్న భదోహి తివాచీల అస్తిత్వం

భారతదేశంలో తివాచీల నేత శతాబ్దాల నాటిదని చెబుతారు. చారిత్రక పత్రాల ప్రకారం, ఈ కళ మొఘల్ యుగంలో, ముఖ్యంగా 16వ శతాబ్దంలో అక్బర్ పాలనలో అభివృద్ధి చెందింది. చేతితో పోగులను ముడివేసి తయారుచేసే తివాచీలు, ప్రధానంగా ఉన్నితో నేసిన తివాచీల భారీ ఉత్పత్తి 19వ శతాబ్దం నుండి భదోహి ప్రాంతంలో ప్రారంభమైంది.

ఇక్కడ తయారైన తివాచీలు ఇప్పుడు ప్రపంచమంతటికీ వెళుతున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే తివాచీలలో దాదాపు 90 శాతం తివాచీలు ఎగుమతి అవుతున్నాయి. దేశం నుండి జరిగే ఎగుమతుల్లో అమెరికా సగానికి పైగా వాటాను కలిగి ఉందని కార్పెట్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. 2021-22లో భారతదేశం నుండి తివాచీల ఎగుమతి విలువ 2.23 బిలియన్ డాలర్లు (రూ. 16,640 కోట్లు). ఇందులో చేతితో తయారుచేసిన తివాచీల విలువ 1.51 బిలియన్ డాలర్లు (రూ. 11,231 కోట్లు) ఉంది.

కానీ భదోహి తివాచీ నేత పరిశ్రమ చౌకైన ప్రత్యామ్నాయాల నుండి- ముఖ్యంగా చైనా వంటి దేశాలలో యంత్రాలపై తయారుచేసిన నకిలీ తివాచీల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. “తివాచీల నకిలీలు ఇప్పుడు మార్కెట్లో సులభంగా అందుబాటులోకి వచ్చాయి. వ్యాపారవేత్తలు లేదా, డబ్బున్నవారు అవి నిజమైనవా లేదా నకిలీవా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు,” అని చైనా గురించి మాట్లాడుతూ అలీ వివరించారు

మరో భదోహి నివాసి, 45 ఏళ్ల ఊర్మిళా ప్రజాపతి కూడా తివాచీ నేసే కళను వారసత్వంగా పొందినవారిలో ఉన్నారు. కానీ ఆదాయం తగ్గిపోవడం, ఆరోగ్య సమస్యల వలన కష్టతరమైన ఈ వృత్తిని ఆమె వదులుకోవలసి వచ్చింది. “మా నాన్న నాకు ఇంట్లో తివాచీలు నేయడాన్ని నేర్పించారు. మేం స్వతంత్రంగా పనిచేసి సంపాదించుకోవాలని ఆయన కోరుకునేవారు. నాకు కళ్లలో నీళ్లు తిరిగేవి. నేయడం మానేస్తే నా కంటి చూపు మళ్ళీ బాగవుతుందని కొంతమంది సలహా ఇచ్చారు. అందుకే నేయడం మానేశాను," అన్నారు ఊర్మిళ.

ప్రస్తుతం కళ్లద్దాలు వాడుతోన్న ఊర్మిళ మళ్లీ తివాచీలు నేయడం మొదలుపెట్టాలనే ప్రణాళికతో ఉన్నారు. భదోహిలోని ఇతరులలాగే, తన కళాత్మక వారసత్వం గురించి ఆమె గర్వపడతారు. కానీ ఈ వీడియోలో చూపినట్లుగా- తగ్గిపోతున్న ఎగుమతులు, అనిశ్చిత మార్కెట్లు, ఫలితంగా సంప్రదాయ వృత్తుల నుండి కార్మికులు తరలిపోవడం- ఇవన్నీ కలిసి తివాచీలు నేసే ముఖ్యమైన జిల్లాగా భదోహీకి ఉన్న శతాబ్దాల నాటి ఖ్యాతిని కోల్పోయే ప్రమాదంలో పడేశాయి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mohammad Asif Khan

మొహమ్మద్ ఆసిఫ్ ఖాన్ న్యూఢిల్లీలో జర్నలిస్టు. ఈయనకు మైనారిటీ సమస్యలు, సంఘర్షణ నివేదికలపై ఆసక్తి ఉంది.

Other stories by Mohammad Asif Khan
Sanjana Chawla

సంజనా చావ్లా న్యూఢిల్లీకి చెందిన జర్నలిస్టు. ఆమె పని, భారతదేశ సమాజంలోని సంస్కృతి, లింగం, మానవ హక్కుల సూక్ష్మబేధాలను విశ్లేషిస్తుంది.

Other stories by Sanjana Chawla
Text Editor : Sreya Urs

శ్రేయా అరసు బెంగళూరులో ఉండే స్వతంత్ర రచయిత, సంపాదకురాలు. ప్రింట్, టెలివిజన్ మీడియాలో ఆమెకు 30 ఏళ్ల అనుభవం ఉంది.

Other stories by Sreya Urs
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli