ఆమె శక్తికి సరిపోలేలా ఆమె తాత ఆమెకు 'పులి'అని పేరు పెట్టారు. ఇప్పటికీ కె. బానుమతి ఓడరేవులో ఆ పేరుతోనే అందరికీ తెలుసు. ఆమె ఇక్కడ, ఈ సముద్రం ఒడ్డున, 40 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నారు. వ్యర్థాలను జీవనోపాధిగా మలచుకోవడం - చేపల అవశేషాలను సేకరించి, వాటిని రకాలవారీగా పేర్చి, అమ్మడం ఆమె పని. కానీ తమిళనాడులోని కడలూర్ చేపల రేవులో పని చేస్తున్న పులి, ఇంకా అనేకమంది ఇతర మహిళలు ప్రభుత్వ విధానాలలో కార్మికులుగా గుర్తించబడరు, వారికి ఎటువంటి భద్రతా వలయాలూ వర్తించవు.
"నేను దాదాపు 35 సంవత్సరాల వయస్సులో ఇక్కడకు వచ్చి చేపలను వేలం వేయడం ప్రారంభించాను" అని ఇప్పుడు 75 సంవత్సరాల వయస్సులో ఉన్న పులి చెప్పారు. నగరానికి తూర్పున ఉన్న కడలూర్ పాతపట్నం ఓడరేవులో, చేపల పడవలు ఒడ్డుకు చేరిన తర్వాత, వేలంపాటదారులు వ్యాపారులను వేలం కోసం పిలుస్తారు. వారు పడవ మీద పెట్టుబడి పెట్టివుంటే, అమ్మకాలలో 10 శాతం కమీషన్‌గా అందుకుంటారు (సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు ఇది ఐదు శాతంగా ఉండేది). సంవత్సరాల క్రితం పులి హార్బర్‌కు వచ్చినప్పుడు, ఆమె బంధువులు ఆమెకు ఈ పనిని పరిచయం చేసి, రెండు పడవలలో పెట్టుబడి పెట్టడానికి ఆమెకు సుమారు రూ. 50,000లు అప్పుగా ఇచ్చారు. అప్పటినించి ఆమె అనేక గంటలు శ్రమించి పనిచేసి, తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించారు. వయసు పెరిగాక, పులి వేలంపాటలో పాల్గొనడం మానేసి, ఆ పనిని తన కుమార్తెకు అప్పగించారు.
పాట కోసం వ్యాపారులను ఆహ్వానించే వేలం పాటదారులు, అటూ ఇటూ పచార్లు చేసే వ్యాపారులు, సరుకును ఒక దగ్గర నుంచి మరో చోటికి మోసుకెళ్ళేవాళ్ళు, మంచు గడ్డలను పగలగొట్టే యంత్రాలు, వచ్చే పోయే లారీలు, సరుకును అమ్ముతున్న వ్యాపారులు- వీటన్నిటితో రద్దీగా ఉండే ఓడరేవు సాధారణంగా శబ్దాలతో మారుమోగిపోతుంటుంది. ఇది కడలూరు జిల్లాలోని ఒక ప్రధాన చేపలరేవు. పులి స్వగ్రామమైన సొత్తికుప్పంతో సహా మరో నాలుగు పొరుగు మత్స్యకార గ్రామాల మత్స్యకారులు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం వరకు, ఈ ఐదు గ్రామాలకు కలిపి హార్బర్‌లో 256 యాంత్రీకరించిన బోట్లు, 822 మోటార్‌తో నడిచే బోట్లు ఉన్నాయని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Central Marine Fisheries Research Institute) పేర్కొంది. (ఇటీవలి డేటా అందుబాటులో లేదు.)
చేపల వ్యర్థాలను (పొలుసులు, తలలు, చేపల తోకలు, రొయ్యల పైపెంకులు, ఇంకా ఇతరభాగాలు), చేపలతోపాటు వలలో చిక్కుబడే సముద్రపు గవ్వలు, రొయ్యలు, స్క్విడ్ ఇంకా చిన్న చేపలు (ఎరగా ఉపయోగపడేవి), వంటివాటిని సేకరించి విక్రయించే తన పనిని గురించి ప్రస్తావిస్తూ, "నేను నా కళార్ వ్యాపారాన్ని కూడా అదే సమయంలో ప్రారంభించాను. దీనిని తమిళంలో కళివు మీన్ అని, వాడుకగా కళార్ అని పిలుస్తారు. ఈ ఓడరేవులో చేపల వ్యర్థాలను సేకరించి, ఫారం కోళ్ళ ఆహారం తయారీదారులకు విక్రయించే దాదాపు 10 మంది మహిళల్లో పులి ఒకరు. ఇది నమక్కల్ వంటి పొరుగు జిల్లాలలో చాలా పెద్ద పరిశ్రమగా ఉంది. తాను అమ్మకం ప్రారంభించినప్పుడు ఒక కిలో కళార్ 7 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు వీటి ధర- చేపలైతే కిలో రూ. 30, చేప తలలైతే రూ. 23, పీతల వ్యర్థాలు కిలో 12రూ.లుగా ఉంది.
పులికి 16 ఏళ్ల వయసులో నాగపట్టణం జిల్లాలోని ఒక మత్స్యకారుడితో పెళ్ళయింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు, కానీ ఆమె భర్త కుప్పుసామి చాలా క్రూరుడు. దాంతో సొత్తికుప్పంలోని పంచాయతీ నాయకుడైన ఆమె తండ్రి, పిల్లలను తీసుకుని పుట్టింటికి తిరిగి రమ్మని ఆమెను కోరాడు. మూడు సంవత్సరాల తరువాత ఆమె, వేలంపాటదారుగా పనిచేసే తన తల్లిని కూడా కోల్పోయింది. "అప్పుడు నా బంధువులు నన్ను వేలంపాట నిర్వహించమని అడిగారు" అని పులి చెప్పారు. "నా పిల్లల కోసం నాకు డబ్బు అవసరమైంది."
చేపల వ్యర్థాల ( కళార్ )కి ఉప్పు పట్టించడం, ప్యాకింగ్ చేయడం, అమ్మకాలు సాగించటం వంటి పనులతో, ఆమె ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హార్బర్‌లోనే ఉంటారు. కళార్ వాసనను తగ్గించడానికి మొదటి రోజు ఉప్పు పట్టిస్తారు. రెండవ రోజు దానిని ఎండబెట్టి, మెష్ (వలలాంటి) సంచులలో ప్యాక్ చేస్తారు. ఆమె ఈ సంచులను హార్బర్‌లో ఒక్కొక్కటి 4 రూ.లకు కొంటారు. ఒకోసారి ఆమె నారతో చేసిన ఉప్పు బస్తాలను ఒక్కొక్కటి 15రూ.లకు కొని, ఈ ప్యాకింగ్‌కు ఉపయోగిస్తారు.
ఒక్కో చేపల వ్యర్థాల ( కళార్ ) బస్తా 25 కిలోల బరువుంటుందని పులి చెప్పారు. అంతకుముందు ఆమె వారానికి ఇటువంటి 4-5 బస్తాలను విక్రయించేవారు. కానీ కోవిడ్ -19 ఉధృతం వలన, అలాగే రింగుల వలల వాడకంపై నిషేధం ఉండటంతో, చేపలు పట్టడం, చేపల వ్యాపారం స్థాయి తగ్గింది. ఆమె ఇప్పుడు నమక్కల్ నుండి వచ్చే కొనుగోలుదారులకు వారానికి రెండు సంచులను విక్రయిస్తున్నారు. దీంతో వారానికి ఆమెకు దాదాపు రూ. 1,250 ల ఆదాయం వస్తోంది.
కడలూరు ఓడరేవులో వేలం నిర్వహించేవారు, అమ్మకందారులు, చేపలను ఎండబెట్టడం లేదా కళార్ ను వేరు చేయడం వంటి అన్ని పనుల్లో నిమగ్నమై ఉండే మహిళలు, తమ రోజువారీ ఆదాయంలోని అనిశ్చితి గురించి మాట్లాడుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో చాలా మంది యువతులు మత్స్య పరిశ్రమకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దానివలన, సాధారణంగా వృద్ధ మహిళలే హార్బర్‌లో పనిచేస్తారు.
"నేను చేపల వ్యర్థాల ( కళార్ ) కోసం ఏమీ చెల్లించను," అని పులి చెప్పారు. "నేను హార్బర్‌లో చేపలు కోసే స్త్రీల నుండి ఈ రద్దీని సేకరిస్తాను." ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆమె, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేపలను కోసి, పొలుసులనూ ఇతర వ్యర్ధాలను చేపలమ్మేవారి దగ్గరనుంచీ, ఇంకా ఇతరుల నుంచీ సేకరించడం ప్రారంభిస్తారు. ఈ వ్యర్థాల కోసం పులి ఏమీ చెల్లించనప్పటికీ, ఆమె కొన్నిసార్లు చేపలమ్మేవారి కోసం, శుభ్రంచేసేవారికోసం శీతల పానీయాలు కొనుగోలు చేస్తారు. "వారు పనిచేసే ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి నేను వారికి సహాయం చేస్తాను. వారితో మాట్లాడతాను, మా కష్టసుఖాలను పంచుకుంటాము," అని ఆమె చెప్పారు.
కడలూరు ఓడరేవులోని మహిళలు చేపల అమ్మకాలు, ప్రాసెసింగ్ పనులకు నేరుగా సంబంధించిన అనేక విధాలైన పనులలో నిమగ్నమై ఉంటారు. పరోక్షంగా వారు మత్స్య కార్మికులకు మంచుగడ్డలు, టీ, వండిన ఆహారాన్ని విక్రయించడం వంటి వివిధ సహాయ కార్యక్రమాలలో కూడా ఉన్నారు. నేషనల్ ఫిషరీస్ పాలసీ 2020 ప్రకారం, చేపల పెంపకానికి సంబంధించి, చేపల పంట అనంతర కార్యకలాపాలలో 69 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పనులను లెక్కలోకి తీసుకున్నట్లయితే, మత్స్య పరిశ్రమ రంగాన్ని ప్రధానంగా మహిళా రంగంగా చూడవచ్చు.
మత్స్య పరిశ్రమలో పని పరిస్థితులను మెరుగుపరచడానికి సహకార సంఘాలు, పథకాలు (స్కీములు), ఇతర చర్యల ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని 2020 పాలసీ గుర్తించింది. ఏది ఏమైనప్పటికీ, మత్స్య పరిశ్రమలో అటువంటి పథకాల దృష్టి సాధారణంగా యాంత్రీకరణపై తప్ప చేపలు పట్టిన తర్వాతి(పోస్ట్-హార్వెస్ట్) పనులలో నిమగ్నమైన మహిళల రోజువారీ సమస్యలపైన ఉండదు.
ఇంకా, చేపల పెంపకంలో మహిళలకు సహాయపడే చర్యలకు బదులుగా, తీరప్రాంతాలలో మార్పులు, మూలధన పెట్టుబడులు, ఎగుమతి-కేంద్రీకృత విధానాలకు ప్రోత్సాహం పెరిగిపోవడంతో మహిళలు ఈ వ్యాపారంలో మరింత అట్టడుగుకు నెట్టబడ్డారు. సహజంగానే, ఈ మార్పులు, విధానాలు ఈ రంగంలో మహిళల సహకారాన్ని ఏమాత్రం గుర్తించవు. స్థూల-అవస్థాపన (మాక్రో-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)లో పెట్టుబడులు పెరగడం, 1972లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీని(మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ - ఇది ఎగుమతులను ప్రోత్సహించి, చిన్నస్థాయి చేపల వేటను నిరుత్సాహపరిచింది) ఏర్పాటు చేయడం వంటి ఇతర దశలు పరిశ్రమలోకి ప్రవేశించే మహిళల స్థాయి మరింత దిగజార్చేందుకు తోడ్పడ్డాయి. కొత్త పడవలు, పరికరాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం ప్రారంభమై, 2004 సునామీ తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది.
కాలక్రమేణా, ఎక్కువ మంది స్థానిక మహిళలు పంట-అనంతర కార్యకలాపాల నుండి మినహాయించబడ్డారు. చేపల అమ్మకం, వినియోగదారుల కోసం చేపలను శుభ్రం చేయడం, చేపలను ఎండబెట్టడం, లేదా వ్యర్థాలను తొలగించడం వంటి తమ పనులకు అవసరమైన స్థలం ఓడరేవులో లేకపోవడం గురించి కడలూరు మహిళలు మాట్లాడారు. కొంతమంది మహిళా విక్రేతలకు మాత్రమే ప్రభుత్వ సంస్థలు ఐస్ బాక్సులను అందజేశాయి. అలాగే, కొన్ని గ్రామాలలో, పట్టణాలలో మాత్రమే మార్కెట్లలో వారి కోసం స్థలాలను కేటాయించారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, దూర ప్రాంతాలలో చేపలను అమ్మేందుకు వారు తరచుగా చాలా దూరాలు నడిచి వెళ్తుంటారు.
"నేనిక్కడే ఈ రేవువద్ద ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నాను, తద్వారా నేను నా వ్యాపారానికి దగ్గరగా ఉన్నాను" అని పులి చెప్పారు. కానీ వర్షం పడినప్పుడు ఆమె మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సొత్తికుప్పంలోని తన కొడుకు ముత్తు ఇంటికి వెళ్తారు. 58 ఏళ్ళ ముత్తు హార్బర్‌లో మత్స్యకారుడు. ప్రతిరోజూ పనికి వచ్చేటపుడు తల్లికి ఆహారం తీసుకొస్తారు. ఆమెకు ప్రతి నెలా 1,000 రూ.లు వృద్ధాప్య పింఛను వస్తుంది. పులి, తన చేపల పని ఆదాయంలో ఎక్కువ భాగాన్ని తన పిల్లలకు పంపుతారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరంతా తమ 40ల్లో, 50ల్లో ఉన్నారు, కడలూరు జిల్లాలోనే మత్స్య రంగంలో పనిచేస్తున్నారు. "నేను నాతో ఏమి తీసుకెళ్ళబోతాను?" అని ఆమె అడుగుతారు. "ఏమీ లేదు."
యు . దివ్య ఉత్తిరన్ సహకారంతో
అనువాదం: సుధామయి సత్తెనపల్లి