రాత్రివేళ మంచి నిద్ర పోవడమనేది షీలా వాఘ్మారేకి ఒక సుదూర జ్ఞాపకం.

"కొన్ని సంవత్సరాలుగా నేను రాత్రుళ్ళు నిద్రపోలేకపోతున్నాను..." నేలపై పరచివున్న మెత్తని గోధడీ (బొంత)పై కాళ్ళు కత్తెరవేసుకుని కూర్చునివున్న 33 ఏళ్ల షీలా చెబుతున్నారు. ఎరుపెక్కిన కనుకొలుకులతో ఉన్న ఆమె కళ్ళు తీవ్రమైన నొప్పితో మండుతున్నాయి. ఆమె తన దీర్ఘంగా సాగే రాత్రుల గురించి వివరిస్తున్నప్పుడు, దుఃఖాన్ని అణచుకొనే ప్రయత్నంలో, ఆమె శరీరం వెక్కిళ్ళతో కదలిపోతోంది. “రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఊపిరాడకుండా ఉంది."

షీలా మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, రాజురి ఘోడ్కా అనే గ్రామ శివార్లలో నివసిస్తున్నారు. ఈ గ్రామం బీడ్ పట్టణానికి 10 కి.మీ. దూరంలో ఉంది. భర్త మాణిక్, ముగ్గురు పిల్లలు కార్తీక్, బాబు, రుతుజలతో ఆమె తన రెండు గదుల ఇటుక ఇంటిలో నివసిస్తున్నారు. రాత్రివేళ వారితో కలిసి నిద్రపోయేటపుడు అణిచిపెట్టిన తన ఏడుపు శబ్దం వారికి నిద్రాభంగం కలిగిస్తుంటుందని ఆమె చెప్పారు. "నా ఏడుపు వారి నిద్రను చెడగొడుతుంది. అప్పుడు నా కళ్ళను గట్టిగా మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేస్తాను."

అయితే నిద్ర రాదు. కన్నీళ్ళూ ఆగవు.

"నేనెప్పుడూ విచారంగా, ఆందోళనపడుతూ ఉంటాను," అంటారు షీలా."ఇదంతా నా పిశ్వీ (గర్భసంచి) తొలగించిన తర్వాత ప్రారంభమయింది. దాంతో నా జీవితం ఎప్పటికీ మారిపోయింది." 2008లో ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించినప్పటికి ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలే. అప్పటి నుంచీ ఆమె తీవ్రమైన కుంగుబాటు, నిద్రలేని రాత్రులు, చెప్పనలవికాని చికాకులు, శారీరక నొప్పులను ఇంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు.

PHOTO • Jyoti

రాజురి ఘోడ్కా గ్రామంలోని తన ఇంటిలో షీలా వాఘ్మారే . ' నేనెప్పుడూ విచారంగా , ఆందోళనపడుతూ ఉంటాను'

"ఒకోసారి ఏ కారణం లేకుండా పిల్లలమీద కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రేమగా ఏదైనా అడిగినా సరే, నేను వాళ్ళని కేకలు వేస్తాను,” నిస్సహాయంగా చూస్తూ చెప్పారు షీలా. "నేను ప్రయత్నిస్తుంటాను. చిరాకు పడకుండా ఉండటానికి నిజంగా ప్రయత్నిస్తాను. అయినా నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు.”

12 ఏళ్ళ వయసుకే మాణిక్‌తో పెళ్ళి అయిన షీలా, 18 ఏళ్ళు రాకముందే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు.

సుమారు 8 లక్షల మంది చెఱకు కోత కార్మికులలోని ఊస్-తోడ్ కామ్‌గార్ (బాల కార్మికులు)లలో షీలా, మాణిక్‌లు కూడా ఉన్నారు. వీరంతా ఆరు నెలల చెఱకు పంట కోతలకాలంలో మరఠ్వాడా ప్రాంతం నుండి వలస వచ్చి, అక్టోబర్ నుండి మార్చి వరకూ పశ్చిమ మహారాష్ట్ర, కర్ణాటకలలోని చెఱకు పొలాల్లోనే నివాసముంటూ పని చేస్తారు. సొంత భూమి లేని షీలా, మాణిక్‌లు మిగిలిన సంవత్సరమంతా వారి గ్రామంలోనో లేదా సమీపంలోని గ్రామాలలోనో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. వీరు నవ బౌద్ధ (నియో బౌద్ధ) సమాజానికి చెందినవారు.

షీలాకు గర్భాశయ శస్త్రచికిత్స జరిగిన తర్వాత వచ్చిన ఈ వ్యాధుల అనుభవం, మహారాష్ట్రలోని ఈ ప్రాంతంలో అరుదైన సంఘటనేమీ కాదు. బీడ్‌ జిల్లాలో చెఱకు కోసే ఆడవారిలో అసాధారణ రీతిలో అధిక సంఖ్యలో గర్భాశయాలను ఎందుకు తొలగిస్తున్నారో పరిశోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఆ మహిళలలో మానసిక క్షోభ ఒక సాధారణ రుగ్మత అని ఈ కమిటీ కనుగొంది.

ఆ సమయంలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న డాక్టర్ నీలమ్ గోర్హే అధ్యక్షతన, ఈ కమిటీ జూన్-జూలై 2019లో ఒక సర్వే నిర్వహించింది. జిల్లాలో కనీసం ఒక్కసారైనా చెఱకు కోయడానికి వలస వచ్చిన 82,309 మంది మహిళలను ఈ కమిటీ కవర్ చేసింది. గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్న 13,861 మంది స్త్రీలలో 45 శాతానికి పైగా - అంటే 6,314 మంది - ఆ తరువాత నిద్రపోవడంలో ఇబ్బందులు, నైరాశ్యం, నిహిలిస్టిక్ (ప్రతికూలమైన) ఆలోచనలు,  కీళ్ళ నొప్పి, వెన్నునొప్పి వంటి అనేక మానసిక, శారీరక బాధలను అనుభవిస్తున్నారు.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

తన పిల్లలు కార్తీక్ , రుతుజలతో ( కుడివైపు ) షీలా . చెఱకు పంట కోతల సమయంలో కుటుంబమంతా వలసపోతుంది

హిస్టెరెక్టమీ అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది స్త్రీల ఆరోగ్యంపై స్వల్ప మరియు దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది- అని ముంబైకి చెందిన గైనకాలజిస్ట్, వి.ఎన్. దేశాయ్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న డాక్టర్ కోమల్ చవాన్ చెప్పారు. "వైద్య పరిభాషలో మేం దీన్ని సర్జికల్ మెనోపాజ్ (శస్త్ర చికిత్స ద్వారా రుతుక్రమం ఆగిపోయే స్థితి) అని పిలుస్తాం," అని డాక్టర్ చవాన్ చెప్పారు.

షీలాకు శస్త్రచికిత్స జరిగిన మొదటి సంవత్సరాల్లో కీళ్ల నొప్పులు, తలనొప్పి, వెన్నునొప్పి, ఎప్పుడూ అలసటగా ఉండటం వంటి అనేక శారీరక రుగ్మతలను అనుభవించారు. "ప్రతి రెండు-మూడు రోజులకూ నాకు నొప్పి వస్తుంటుంది" అని ఆమె చెప్పారు.

నొప్పి తగ్గించే పూత మందులు, నోటి మందులు కాసేపు మాత్రమే ఉపశమనాన్నిస్తాయి. “నేను నా మోకాళ్లకు, వెన్నునొప్పికి ఈ పూతమందును రాసుకుంటాను. నెలలో రెండు ట్యూబ్‌లు వాడతాను,” ఒక్కోటీ రూ. 166ల ఖరీదు చేసే డైక్లోఫెనాక్ జెల్ ట్యూబ్‌ని చూపిస్తూ చెప్పారామె. అవికాక డాక్టర్ సూచించిన మాత్రలు కూడా ఉన్నాయి. తీవ్రమైన అలసట నుంచి బయటపడేందుకు నెలకు రెండుసార్లు, ఆమెకు నరాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని ఎక్కిస్తారు.

ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రైవేట్ క్లినిక్‌లో డాక్టర్‌కు చూపించుకోవడానికీ, మందులకూ ఆమెకు ప్రతి నెలా రూ. 1,000-2,000 ఖర్చవుతాయి. బీడ్‌లోని సివిల్ హాస్పిటల్ ఆమె గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆమె దానికి బదులుగా ఈ క్లినిక్‌కి నడవడానికే ఇష్టపడతారు. “ గాడీ ఘోడా [రవాణా] మీద అంత ఖర్చు చేసి, అంత దూరం ఎవరు వెళ్తారు?” అని ఆమె అంటారు.

మానసిక కల్లోలాన్ని నియంత్రించడంలో ఈ మందులేం ఉపయోగపడవు. "ఇన్ని కష్టాలతో బ్రతకడంలో ఏమైనా అర్థం ఉందా?"

హిస్టెరెక్టమీ వలన ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత శారీరక దుష్ప్రభావాలతో పాటు తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్)నూ, ఆందోళననూ ప్రేరేపిస్తుంది- అని ముంబైకి చెందిన మానసిక వైద్యులు డాక్టర్ అవినాష్ డి సౌసా చెప్పారు. హిస్టరెక్టమీ, లేదా సరైన పద్ధతిలో పనిచేయని అండాశయాలకు సంబంధించిన వ్యాధుల తీవ్రత మారుతూ ఉంటుంది- అని ఆయన అంటారు."ఇది ఒక కేసు నుండి మరో కేసుకు భిన్నంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలకు ఇవి తీవ్రంగా ఉంటాయి, మరికొంతమంది స్త్రీలలో ఎటువంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

డైక్లోఫెనాక్ జెల్ వంటి నొప్పి తగ్గించే పూత మందులు , నోటి మాత్రలు షీలాకు క్షణికమైన ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి . ' నేను నెలకు రెండు ట్యూబులను ఉపయోగిస్తాను'

శస్త్రచికిత్స తర్వాత కూడా, షీలా మాణిక్‌తో కలిసి చెఱకు కోయడానికి పశ్చిమ మహారాష్ట్రకు వలస వెళ్లడాన్ని కొనసాగించారు. సాధారణంగా ఆమె తన కుటుంబంతో కలిసి బీడ్ నుండి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్‌లోని చెఱకు క్రషింగ్ ఫ్యాక్టరీ వరకూ వెళ్తారు.

"మేము రోజుకు 16 నుండి 18 గంటలు పనిచేసి, రెండు టన్నుల చెఱకును కోసేవాళ్ళం" అని షీలా తనకు శస్త్రచికిత్స జరగడానికి ముందరి రోజులను గుర్తుచేసుకున్నారు. కోసి కట్టలు కట్టిన ప్రతి టన్నుకు ' కోయతా ' (ఒక జంట)కు రూ. 280 చొప్పున చెల్లిస్తారు. కోయతా అనే పదానికి అసలైన అర్థం, 7 అడుగుల ఎత్తు వరకూ పెరిగే గట్టి చెఱకు కాండాలను నరకడానికి ఉపయోగించే వంపు తిరిగిన కొడవలి అని. కానీ వాడుకలో, ఇది చెఱకును కలిసి కోసే జంటను సూచిస్తుంది. లేబర్ కాంట్రాక్టర్లు నియమించిన ఇద్దరు సభ్యుల యూనిట్‌కు ముందే ఏకమొత్తంగా డబ్బు చెల్లిస్తారు.

“ఆరు నెలల తర్వాత, మేము దాదాపు రూ. 50,000 నుండి రూ. 70,000 వరకు సంపాదిస్తాం,” అని షీలా చెప్పారు. ఆమె గర్భాశయాన్ని తొలగించినప్పటి నుండి, ఈ జంటకు ఒక రోజులో ఒక టన్ను చెఱకును నరకడం, కట్టలు కట్టడం పూర్తి చేయడం కూడా కష్టంగా ఉంటోంది. "నేను భారీ బరువును ఎత్తలేను, మునుపటిలా వేగంగా చెఱకును నరకనూలేను."

అయితే షీలా, మాణిక్‌లు వారి ఇంటిని బాగుచేయడం కోసం 2019లో సంవత్సరానికి అడ్వాన్స్‌గా 30 శాతం వడ్డీకి, రూ. 50,000 తీసుకున్నారు. కాబట్టి ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వారు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. "ఇది ఎప్పటికీ అంతం కాదు," అని షీలా అన్నారు.

*****

చెఱకు పొలాల్లో వెన్ను విరిగేలా పనిచేయడమనేది మహిళలకు వారి నెలసరి సమయంలో చాలా సవాలుగా ఉంటుంది. పొలాల్లో మరుగుదొడ్లు గానీ బాత్‌రూమ్‌లు గానీ ఉండవు కాబట్టి, వారి నివాస ఏర్పాట్లు కూడా ప్రాథమికంగానే ఉంటాయి. కోయతాలు , కొన్నిసార్లు వారి పిల్లలతో కలిసి, చెఱకు కర్మాగారాలకూ, పొలాలకూ సమీపంలోని గుడారాలలో నివసిస్తున్నారు. " పాలీ [ఋతుస్రావం] సమయంలో పని చేయడం చాలా కష్టం," అని షీలా గుర్తుచేసుకున్నారు.

ఆ ఒక్కరోజు వేతనాన్ని జరిమానా కింద ముకద్దం (లేబర్ కాంట్రాక్టర్) జమచేసుకుంటాడు కాబట్టి ఇక్కడ ఒక్క రోజు సెలవు కూడా ఖర్చుతో కూడుకున్నదే.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమవైపు : చెఱకు పొలాల్లో పనికోసం వలస వెళ్లినప్పుడు షీలా కుటుంబానికి చెందిన వస్తువులను మోసుకెళ్లే ట్రంకు పెట్టె . కుడివైపు : దృఢమైన చెఱకు కాండాలను నరికేందుకు ఉపయోగించే వంపుతిరిగిన కొడవలి లేదా కోయతా , కలిసి చెఱకును నరికే జంటలను కూడా సూచిస్తుంది

చెఱకును నరికే మహిళలు తాము వాడేసిన కాటన్ పెట్టీకోట్‌లతో తయారుచేసిన గుడ్డ ప్యాడ్‌లను ధరించి పనికి వెళ్తారని షీలా చెప్పారు. వారు దానిని మార్చకుండా రోజుకు 16 గంటలు పని చేస్తారు. "నేను ఆ రోజు పనంతా ముగిశాక దాన్ని మార్చేదాన్ని," అని ఆమె చెప్పారు. "ఆ గుడ్డ రక్తంతో పూర్తిగా నానిపోయి, అందులోంచి రక్తపు చుక్కలు కారుతుండేవి."

సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు, ఉపయోగించిన గుడ్డ ప్యాడ్‌లను ఉతకడానికి తగినంత నీరు గానీ, వాటిని ఆరబెట్టడానికి తగిన స్థలం గానీ లేకపోవడంతో, ఆమె తరచుగా తడిగా ఉన్న ప్యాడ్‌లను ఉపయోగించేవారు. “అది వాసన వచ్చేది. కానీ చుట్టూ చాలామంది పురుషులు ఉండటంతో, వాటిని ఎండలో ఎండబెట్టడం అసౌకర్యంగా ఉండేది." ఆమెకు శానిటరీ ప్యాడ్స్ గురించి తెలియదు. "నా కుమార్తెకు పీరియడ్స్ రావడం ప్రారంభించినప్పుడే నాకు వాటి గురించి తెలిసింది" అని ఆమె చెప్పారు.

ఆమె తన 15 ఏళ్ల కూతురు రుతుజా కోసం శానిటరీ ప్యాడ్‌లను కొనుగోలు చేస్తున్నారు. "నేను ఆమె ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనుకుంటున్నాను."

పుణె కేంద్రంగా పనిచేస్తున్న మకామ్ అనే మహిళా సంఘాల కూటమి 2020లో మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాల్లో 1,042 మంది చెఱకు కోతదారులను ఇంటర్వ్యూ చేసి, సర్వే నివేదికను విడుదల చేసింది. ఈ మహిళా సంఘాల కూటమి మహిళా రైతుల సమస్యలపై న్యాయం కోసం పనిచేస్తుంది. చెఱకును నరికే మహిళలలో 83 శాతం మంది తమ పీరియడ్స్ సమయంలో గుడ్డను ఉపయోగిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఈ గుడ్డ ప్యాడ్‌లను ఉతకడానికి 59 శాతం మందికి మాత్రమే నీరు అందుబాటులో ఉంది. దాదాపు 24 శాతం మంది తడి ప్యాడ్‌లనే తిరిగి ఉపయోగిస్తున్నారు.

అధిక రక్తస్రావం, బాధాకరమైన పీరియడ్స్ వంటి స్త్రీ జననేంద్రియ సమస్యలు మళ్ళీ మళ్ళీ రావడానికి అపరిశుభ్రమైన పద్ధతులను పాటించడమే కారణం. "నా పొత్తికడుపులో తరచుగా నొప్పి వచ్చేది; యోని నుంచి చిక్కని తెల్లని స్రావం అయ్యేది" అని షీలా చెప్పారు.

బహిస్టు సమయంలో అపరిశుభ్రత వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. మామూలు మందులతో వాటికి చికిత్స చేయవచ్చునని డాక్టర్ చవాన్ చెప్పారు. "గర్భసంచి తొలగింపు అనేది ఎన్నటికీ మొదటి ఎంపిక కాకూడదు; క్యాన్సర్, గర్భసంచి జారిపోవడం లేదా గర్భసంచిలో కణుతులు ఉన్నప్పుడే చేయాల్సిన చివరి ప్రయత్నం అది."

PHOTO • Labani Jangi

చెఱకు పొలాల్లో వెన్ను విరిగేలా పనిచేయడమనేది మహిళలకు వారి నెలసరి సమయంలో చాలా సవాలుగా ఉంటుంది. పొలాల్లో మరుగుదొడ్లు గానీ బాత్‌రూమ్‌లు గానీ ఉండవు కాబట్టి, వారి నివాస ఏర్పాట్లు కూడా ప్రాథమికంగానే ఉంటాయి

మరాఠీలో తన సంతకం పెట్టడం తప్ప చదవడం గానీ రాయడం గానీ రాని షీలాకు ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయనే ఆలోచనే లేదు. అనేకమంది చెఱకు నరికే మహిళా కార్మికుల మాదిరిగానే, ఆమె కూడా నొప్పిని తగ్గించడానికి మందులు తీసుకోవాలనే ఆశతో బీడ్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. తద్వారా తన పీరియడ్స్ సమయంలో కూడా పనిని కొనసాగించవచ్చుననీ, లేబర్ కాంట్రాక్టర్‌కు జరిమానాలు చెల్లించకుండా ఉండొచ్చనీ ఆమె భావించారు.

ఆసుపత్రిలో ఒక వైద్యుడు ఆమెకు క్యాన్సర్ వచ్చే అవకాశం గురించి హెచ్చరించాడు. “రక్త పరీక్ష, సోనోగ్రఫీ చేయలేదు. నా గర్భాశయంలో రంధ్రాలు ఉన్నాయనీ, ఐదారు నెలల్లో నేను క్యాన్సర్‌తో చనిపోతాననీ చెప్పాడు,” అని షీలా గుర్తుచేసుకున్నారు. ఆమె భయపడి, శస్త్రచికిత్స చేయించుకోవడానికి అంగీకరించింది. "అదే రోజున, కొన్ని గంటల తర్వాత, డాక్టర్ నా తొలగించబడిన పిశ్వీ ని ఈ రంధ్రాలను చూడమంటూ నా భర్తకు చూపించాడు." అని ఆమె చెప్పారు.

షీలా ఆసుపత్రిలో ఏడు రోజులు గడిపారు. మొత్తం అయిన ఖర్చులు రూ. 40,000 కోసం మాణిక్, వారు పొదుపు చేసుకున్న డబ్బుతోపాటు బంధువుల నుంచీ, స్నేహితుల నుంచీ రుణం తీసుకున్నారు.

"ఈ శస్త్రచికిత్సలు చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతాయి" అని చెఱకు కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి బీడ్ కేంద్రంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త అశోక్ తాంగ్డే చెప్పారు. "ఎటువంటి వైద్యపరమైన కారణం లేకుండా వైద్యులు గర్భాశయ శస్త్రచికిత్స వంటి తీవ్రమైన శస్త్రచికిత్సను ఎలా చేస్తారో కానీ, అది చాలా అమానుషం."

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సర్వే చేసి, 90 శాతం మంది మహిళలు ప్రైవేట్ వైద్యశాలలలోనే ఈ శస్త్రచికిత్స చేయించుకున్నట్లుగా ధృవపరచింది.

రాబోయే దుష్ప్రభావాల గురించి షీలాకు ఎటువంటి వైద్య సలహా లేదు. "నేను పీరియడ్స్ నుండి విముక్తి పొందాను, అయితే నేనిప్పుడు నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నాను" అని ఆమె అన్నారు.

వేతనాలలో కోత భయం, లేబర్ కాంట్రాక్టర్ల అణిచివేసే నియమాలు, ప్రైవేట్ సర్జన్ల లాభాపేక్షల మధ్య చిక్కుకుపోయిన బీడ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా చెఱకు కార్మికులకు చెప్పుకునేందుకు ఒకే రకమైన కథనాలు ఉన్నాయి.

*****

PHOTO • Jyoti

వంటగదిలో వంట చేస్తోన్న లతా వాఘ్మారే . పనిలోకి వెళ్ళేముందే ఆమె ఇంట్లో పనంతా ముగిస్తారు

షీలా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలోని కాఠోడా గ్రామానికి చెందిన లతా వాఘ్మారే కథ కూడా భిన్నంగా ఏమీ లేదు.

“నాకు జీవించాలనిపించడం లేదు," అన్నారు 32 ఏళ్ల లత. ఈమెకు 20 ఏళ్ళ వయసులో గర్భాశయ శస్త్రచికిత్స జరిగింది.

తన భర్త రమేశ్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ, “ఇప్పుడు మా మధ్య ప్రేమ అనేదేమీ లేదు," అన్నారామె. శస్త్రచికిత్స అయిన ఒక సంవత్సరం తర్వాత, ఆమెలో చిరాకు పెరిగి, మరింత దూరం జరగడంతో పరిస్థితులు మారడం ప్రారంభించాయి.

"అతను దగ్గరగా వచ్చినప్పుడల్లా నేనతనిని దూరంగా నెట్టేస్తాను. అప్పుడింక గొడవలూ అరుపులూ" అంటారు లత. ఆమె నిరంతరం అతని లైంగిక వాంఛలను తిరస్కరించడం వలన, తన భర్త కోరికలు చచ్చిపోయాయని ఆమె చెప్పారు. "అతనిప్పుడు నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు."

వ్యవసాయ కూలీ అయిన ఆమె పనికి వెళ్లే ముందు తన రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసుకుంటారు. తన సొంత గ్రామంలోనో లేదా సమీప గ్రామాల్లోని ఇతరుల పొలాల్లోనో పనిచేస్తూ రోజుకు రూ. 150 సంపాదిస్తారు. ఆమె మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు; తరచుగా తలనొప్పి కూడా వస్తోంది. ఉపశమనం కోసం, ఆమె మాత్రలు వేసుకోవటమో, ఇంటి వైద్యం ప్రయత్నించటమో చేస్తారు. "అతనికి దగ్గరగా వెళ్లాలని నాకెలా అనిపిస్తుంది?" అంటారామె.

13 ఏళ్ల వయసులో పెళ్లయిన లతకు, ఏడాదిలోనే కొడుకు ఆకాశ్ పుట్టాడు. 12వ తరగతి వరకు చదువుకున్న ఆకాశ్ తల్లిదండ్రులతో కలిసి చెఱకుకు పొలాల్లో పనికి వెళ్తుంటాడు.

PHOTO • Jyoti

చెఱకు నరికే పని కోసం వలస వెళ్లని రోజులలో లత తన గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తారు

లతకు తర్వాత ఒక పాప పుట్టింది. అయితే ఆ చిన్నారి ఐదు నెలల వయసులో చెఱకు తోటలో ట్రాక్టర్ కింద పడి నలిగి చనిపోయింది. పసిపిల్లలకుగానీ, పిల్లలకు గానీ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో, చెఱకు కోసే జంటలు పని చేస్తున్నప్పుడు పొలాల సమీపంలోని వెల్లడి భూమిలో తమ పిల్లలను వదిలివేయాల్సి వచ్చేది.

ఆమె ఆ విషాదం గురించి వివరించలేకపోయారు.

"నాకు పని చేయాలనిపించదు, ఏమీ చేయకుండా కూర్చోవాలనిపిస్తుంది" అని ఆమె చెప్పారు. ఏ పని పట్ల ఆమెకు ఆసక్తి లేకపోవడం కొన్ని పొరపాట్లకు దారి తీస్తుంది. "కొన్నిసార్లు నేను పాలు లేదా సబ్జీ (కూర)ని స్టవ్ మీద పెడతాను. అది పొంగిపోయినా, మాడిపోయినా నేను పట్టించుకోను."

తమ కుమార్తెను కోల్పోయినప్పటికీ, లత, రమేశ్‌లకు చెఱకు కోత సీజన్‌లో వలసపోకుండా ఉండే పరిస్థితి లేదు.

లతకు తర్వాత అంజలి, నికిత, రోహిణి అనే ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఆమె తనతో పాటు పిల్లలను పొలాలకు తీసుకెళ్లడం కొనసాగించారు. “మేం పని చేయకపోతే, పిల్లలు ఆకలితో చనిపోతారు. మేం పనికి వెళ్తే ప్రమాదాల్లో చనిపోతారు. తేడా ఏముందీ? అని లత ఉదాసీనంగా చెప్పారు.

కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు మూసివేయడం, ఇంట్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఆన్‌లైన్ విద్యను అభ్యసించడం అసాధ్యం కావడంతో, ఆమె కుమార్తెల చదువు అర్ధంతరంగా ముగిసింది. అంజలికి 2020లో వివాహం జరిగింది. నికిత, రోహిణిలకు తగిన వరుల కోసం ఇప్పటికే అన్వేషణ మొదలయింది.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమవైపు : తన పిల్లలు నికిత , రోహిణిలతో లత . కుడివైపు : వంటగదిలో పనిచేస్తోన్న నికిత . ' నాకు చదువుకోవాలని ఉంది , కానీ ఇప్పుడు చదువుకోలేను ,' అంటోంది నికిత

"నేను ఏడవ తరగతి వరకు చదివాను," అని నికిత చెప్పింది. మార్చి 2020 తర్వాత ఆమె రోజు కూలీకి వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించింది. చెఱకును కోయడానికి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తోంది. “నేను చదువుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడింక చదవలేను. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు” అని ఆమె చెప్పింది.

నీలమ్ గోర్హే నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు ప్రకటించి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా, వాటి అమలు మాత్రం నెమ్మదిగా సాగుతోంది. చెఱకు కొట్టేవారికి పని ప్రదేశంలో స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక గృహాలను అందించాలనే ఆదేశాలు కాగితంపైనే మిగిలిపోయాయని షీలా, లతలు ధృవీకరిస్తున్నారు.

"ఏం మరుగుదొడ్డి, ఏం ఇల్లు?!" వారి పని పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు అనే ఆలోచనను షీలా కొట్టిపారేశారు. "ఎప్పుడూ ఇంతే."

కమిటీ చేసిన మరొక సిఫార్సు ఏమిటంటే, ఆశా(ASHA) వర్కర్లతో అంగన్ వాడీ వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయడం. వారు చెఱకు నరికే మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలరు.

PHOTO • Jyoti

కాఠోడా గ్రామంలోని లత ఇంటిలో

వేతనాలలో కోత భయం, లేబర్ కాంట్రాక్టర్ల అణిచివేసే నియమాలు, ప్రైవేట్ సర్జన్ల లాభాపేక్షల మధ్య చిక్కుకుపోయిన బీడ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా చెఱకు కార్మికులకు చెప్పుకునేందుకు ఒకే రకమైన కథనాలు ఉన్నాయి

గ్రామంలోని ఆశా కార్యకర్త ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా అని అడిగినప్పుడు, “ఎవరూ రారు. దీపావళి తర్వాత ఆరు నెలల పాటు మేము చెఱకు పొలాల్లోనే ఉంటున్నాం. ఇల్లు మూసేసి ఉంటుంది." అని లత చెప్పారు. ఒక నవ బౌద్ధ కుటుంబంగా, కాఠోడా గ్రామం అంచున ఉన్న 20 కుటుంబాల దళిత సెటిల్‌మెంట్‌లో నివసిస్తున్నందున, వారు మామూలుగానే గ్రామస్థుల వివక్షకు గురవుతారు. "మమ్మల్ని అడగడానికి ఎవరూ రారు." అన్నారామె.

గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిక్షణ పొందిన గైనకాలజిస్టుల కొరత, బాల్య వివాహాలు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీడ్‌కు చెందిన కార్యకర్త తాంగ్డే అన్నారు. "అలాగే కరవు ఉంది, ఉపాధి అవకాశాలు లేవు. చెఱకు కార్మికుల సమస్యలు కేవలం వలసలకే పరిమితం కావు." అంటూ అతను కొనసాగింపుగా అన్నారు.

ఇదిలా ఉండగా, షీలా, లత వంటి వేలాది మంది మహిళలు ప్రస్తుత చెఱకు పంట సీజన్‌లో, ఇంటి నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికి గుడారాలలోనే నివసిస్తున్నారు. ఇప్పటికీ పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. గుడ్డ ప్యాడ్‌లనే ఉపయోగిస్తున్నారు.

"నేనింకా చాలా సంవత్సరాలు గడపాలి," అని షీలా అన్నారు. "ఎలా జీవించాలో నాకు తెలియటంలేదు."

PARI, కౌంటర్‌మీడియా ట్రస్ట్ సంస్థల దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్,  గ్రామీణ యువతుల, బాలికల జీవితాలను గురించి వారి అనుభవాల గురించీ వారి మాటల్లోనే సేకరించిన నివేదిక ఇది. దీనివలన ఎవరూ అంతగా పట్టించుకోని, కానీ ముఖ్యమైన ఆ బడుగు యువతుల జీవితాల గురించి మనకు తెలుస్తుంది. ఈ నివేదిక పాప్యులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించబడుతున్న బృహత్ ప్రయత్నంలో భాగం.

ఈ వ్యాసాన్ని తిరిగి ప్రచురించాలనుకుంటున్నారా? [email protected] కు రాయండి. [email protected] కు సిసి చేయండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Other stories by Jyoti
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli