డెబ్బైల ముది వయస్సును దాటుతున్న ఇతను స్ట్రాబెర్రీలను పండించే ఓ రైతు. పాత మహాబలేశ్వర్‌లోని తన మూడెకరాల పొలంలో తవ్వించిన బావి ఎండిపోయి రాళ్ళుతేలింది. ఎంతో కొంత నీరున్న బోరుబావితోనే, నానా తంటాలు పడుతూ, భార్యతో కలిసి వ్య‌వసాయాన్ని నెట్టుకొస్తున్నారు. అంత కొద్ది నీటిలో కూడా ఈయన తన పొలానికి పక్కనే ఉన్న గుడికి కొన్ని నీళ్ళను సరఫరా చెస్తారు, అది కూదా పూర్తి ఉచితంగా. ఈ పెను కరవు అతని పంటను ఎండగట్టగలిగిందే కాని, అతని ఔదార్యాన్ని కాదు. ఇతని పేరు యూనుస్ ఇస్మాయిల్ నాలబంద్. అమిత సంతోషంతో ఈయన నీళ్ళు వదిలేది కృష్ణామాయి దేవాలయానికి. ఈ దేవాలయం సాతారా జిల్లాలోని కృష్ణా నది మూలానికి సంబంధించిన అతి పురాతన చిహ్నం.

“అసలీ నీరేమైనా నా సొత్తేమిటయ్యా? అంతా ఆ ఊపర్‌వాలా (సర్వశక్తిమంతుడు)దే కదా?" అంటారతను. డెబ్బై ఏళ్ళు దాటిన అతని భార్య రోషన్ నాలబంద్ కూడా ఈ మాటకు ఔనన్నట్టు తలూపుతారు. స్ట్రాబెర్రీలను చిన్న పెట్టెల్లో సర్దుతూ, “వ్యాపారులొచ్చి వీటిని పట్టుకుపోతారు." అన్నారు రోషన్. "ఈ ఏడాది పంట కొరతవల్ల ధర పోయినేడాదికంటే ఎక్కువగానే ఉంది. కానీ తక్కువ దిగుబడి, పంట నాణ్యత తగ్గిపోవడం ఈ ధర పెరుగుదలని సమానం చేశాయి.” ఈ నీటి సంక్షోభం తమనెంతెలా పీడిస్తోందో, తాము చేస్తున్న పనిని ఆపకుండానే, వాళ్ళు మాకు చెబుతూపోయారు. ఒక్క రోషన్ మాత్రమే పని నుండి ఓ నిమిషం విరామం తీసుకుని మాకు మంచినీళ్ళూ, చిరుతిళ్ళూ తెచ్చిపెట్టారు.

కృష్ణామాయి కుండ్ (ఆలయ తటాకం) యూనుస్ నాలబంద్ బోరుబావి నుండి నీరు వచ్చినప్పుడు తప్ప, మిగతా సమయాలలో ఖాళీగా ఉంటుంది. ఈ సారి తటాకం మొత్తం నీళ్ళు లేక ఎండిపోయింది. ప్రసిద్ధ పంచగంగ ఆలయానికి కేవలం కొద్ది నిముషాల నడక దూరంలోనే కృష్ణామాయి ఉంది. ఈ పంచగంగ ఆలయాన్ని కృష్ణా నదితో పాటు కోయ్‌నా, వెణ్ణా, సావిత్రి, గాయత్రి అనే నాలుగు నదుల సంకేత మూలంగా కూడా పిలుస్తారు. నిజమైన నదీ మూలాలు కూడా ఇక్కడి నుండి మరీ అంత దూరంలో లేవు. వాయీ-మహాబలేశ్వర్ ప్రాంతంలోకల్లా కృష్ణామాయియే బహుశా అతి ప్రాచీన దేవాలయం. చిన్నదే అయినా అందమైన దేవాలయం. ఇక్కడి జనం కృష్ణామాయిని జలదేవతగా కొలుస్తారు.

Old couple selling strawberries
PHOTO • P. Sainath
Dry well
PHOTO • P. Sainath

తమ మూడెకరాల పొలంలో ప్రధానంగా స్ట్రాబెర్రీలను పండిస్తున్న చిన్నకారు రైతులైన యూనుస్ నాలబంద్, ఆయన భార్య రోషన్ నాలబంద్. క్రింది చిత్రం: వారి పొలంలో పూర్తిగా ఎండిపోయిన బావి

మే నెలలో నేను, నా స్నేహితుడూ సహోద్యోగీ అయిన జైదీప్ హర్డీకర్, మరికొంతమంది పాత్రికేయులతో కలిసి మహారాష్ట్రలో మేం సందర్శించిన జిల్లాలలోని అనేక నదుల సాంకేతిక మూలాలనూ, వాటి అసలైన మూలాలనూ వెతుక్కుంటూ వెళ్ళాం. ప్రతి నది దిగువ ప్రాంతానికీ ప్రయాణం చేసి, ఆ దారుల్లో నివసిస్తోన్న రైతులతో, కార్మికులతో, ప్రజలతో మాట్లాడాలనేది మా ఆలోచన. వాతావరణానికి సంబంధించిన కరవుకన్నా చాలా పెద్దదైన ఈ నీటి సంక్షోభం వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో వారి మాటల ద్వారానే వినాలనుకున్నాం.

వేసవిలో కొన్ని నదీ భాగాలు ఎండిపోవడం సహజమే కాని, ఇటీవలి కాలంలో నదీ మూలాలతో పాటు ఇదివరకు ఎన్నడూ ఎండిపోని ఇతర నదీ భాగాలు కూడా ఎండిపోతున్నాయి. “మహారాష్ట్రలో ఒకప్పుడు సంవత్సమంతా ప్రవహించిన అనేక నదులు రానురానూ కాలానుగుణంగా ప్రవహించే నదులుగా మారిపోయాయి,” అని పడమటి కనుమల పర్యావరణ నిపుణుల సమితికి చెందిన ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ అన్నారు. “ఇలా జరగడానికి పెద్ద ఎత్తున ఆనకట్టలు కట్టడమూ, ఈ నదుల పరీవాహక ప్రాంతాలలో ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టడమే కారణం.” అని ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత అయిన మాధవ్ పేర్కొన్నారు.

“గత ఆరు దశాబ్దాల్లో, కృష్ణామాయి కుండ్ (తటాకం) నీరులేక ఎండిపోవడాన్ని నేను చూడలేదు” అంటారు నారాయణ ఝాడె. అదికూడా సంవత్సరానికి దాదాపు 2,000 మి.మీ. వర్షం పడే ఈ ప్రాంతంలో! వలస కార్మికునిగా, యాత్రికులకు గైడుగా పనిచేసి రిటైరైన ఝాడె, తన రోజులన్నీ ఈ గుడి దగ్గర కూర్చునే గడుపుతుంటారు. ఈ కరవుకు కారణం కేవలం వాన రాకపోవడం మాత్రమే కాదన్న విషయంపై ఆయనకు ఎంతో స్పష్టత ఉంది. పర్యాటకులు, బయటివారు అయిన ‘మీరే’ దీనికి జవాబు చెప్పాలని అతనంటారు.

“అడవులను నాశనం చేయడం భారీగా జరుగుతోందన్నది నిజమే కాని, దానికి స్థానికులు ఏ మాత్రం కారణం కాదు. మాలో ఎవరన్నా రెండు కొమ్మలు నరికితే, వాళ్ళు జైలుకు పోవడం ఖాయం. కాని బయట నుండి వచ్చిన జనం, చెట్లను నరికి దుంగలను ట్రక్కుల్లో నింపుకుని వెళ్ళిపోతుంటారు.” అన్నారు ఝాడె. పర్యాటకుల గైడుగా పనిచేసిన అనుభవం ఉన్న ఝాడె, హద్దూ అదుపూ లేని పర్యాటకం వల్ల చాలా హాని కలుగుతోందనీ, కొత్తగా మొదలయిన రిసార్టుల వల్ల, ఇతర వాణిజ్య భవనాల వల్ల పచ్చదనపు రక్షణ కవచం రోజురోజుకూ నాశనం అవుతోందనీ తెలిపారు. పర్యాటకులతో కిటకిటలాడే పంచగంగ కంటే నిర్జనంగా ఉండే కృష్ణామాయినే ఆయనిప్పుడు ఇష్టపడతారు.

PHOTO • P. Sainath

పాత మహాబలేశ్వర్‌లోని కృష్ణామాయి దేవాలయం: దాని ఎదురుగా ఉన్న చిన్న ‘కుండం’ జీవన గమనంలో నీరెండిపోయి ఉండడం ఇదే మొదటి సారి

ఆలయం ముందున్న ప్రాంగణం అవతల అందమైన ధోమ్ బల్కావాడి అనే ఆనకట్ట ఉంది. ఇందులో కాస్త నీరుంది కాని, ప్రతి ఏటా ఈపాటికి ఎంత నీరుండేదో అంత మాత్రం లేదు. ఏళ్ళ తరబడి ఆనకట్టలు కట్టడమూ, నీరు ప్రవహించే దిశలను మార్చడమే ఈ పరిణామానికి కారణం. ఇదికాక, ఎప్పటికీ పూర్తికాని నీటి పారుదల పథకాల గందరగోళం కూడా దీని వెనుక ఉంది. ఇవి రాష్ట్ర ‘నీటిపారుదల కుంభకోణం’లో ప్రధానమైనవి.

చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పథకాల నుండి లబ్ది పొందాల్సిన అనేక గ్రామాలు సాతారాలోని ఖటావ్, మాణ్ తహసీల్‌ల లో ఉన్నాయి. ఈ జిల్లాలోని నేర్ ఆనకట్ట, సరస్సు పెద్ద సంఖ్యలో గ్రామాలకు తాగు, సాగునీటి కోసం నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే చెరుకు రైతులు ఈ సరఫరాను కేవలం 19 సమీప గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. నేర్, కృష్ణామాయి నుండి 80 కి.మీ. దిగువకు ఉంది.

మాణ్, ఖటావ్ తెహసీల్‌ లే కాకుండా సాతారా, సాంగ్లీ, సోలాపుర్ జిల్లాలోని దాదాపు 11 తెహసీల్‌ల లో అత్యంత పొడిబారిన నేలలు ఉన్నాయి. ఈ తెహసీల్‌ల లోని ప్రజలు ప్రతి సంవత్సరం దుష్కాల్ పరిషత్‌ (కరవు సమితి)ను సమావేశపరుస్తారు. “ఇతర విషయాలతోపాటు, ఈ 13 తెహసీల్‌ల తో కూడిన ప్రత్యేక 'మాణ్ దేశ్ '(కరవు జిల్లా)ను వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.” అని రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి డా. మారుతి రామకృష్ణ కాట్కర్ తెలిపారు.

“వాళ్ళు ఇప్పుడున్న జిల్లాలు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు” అంటారు కాట్కర్. అయితే కొత్త జిల్లా ఏర్పడడం కోసం ‘విడిపోవడం’ వలన వారికి కలిగే ప్రయోజనం ఏమిటి? పాత జిల్లాలు అవి విడిపోవడాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తాయి, వాటి పట్ల తక్కువ ప్రతిస్పందన కూడా కలిగి ఉంటాయి. కొత్త ‘కరవు జిల్లా’ ఉద్యమ నాయకులలో ఒకరైన ప్రొ. కృష్ణ ఇంగోలేతో, కాట్కర్ మమ్మల్ని ఫోన్‌లో మాట్లాడించారు. ఆ ప్రాంత ప్రజల ఉమ్మడి ప్రయోజనాలే తమను ఒకదానికొకటి ముడిపెట్టాయని, ప్రత్యేక జిల్లా కోసం చేసే ఈ పోరాటం తమ బేరసారాల శక్తిని పెంచుతుందని ఇంగోలే అంటున్నారు..

“ఈ తెహసీల్‌లు సముద్రమట్టానికి 1,000 అడుగుల ఎత్తులో, తక్కువ వర్షపాతం ఉన్న జోన్‌లో ఉన్నాయి” అని కాట్కర్ చెప్పారు. “మాకిక్కడ సంవత్సరానికి 30 కంటే తక్కువ రోజులే వర్షం పడుతుంది. ఇక్కడి చాలామంది జనం వేరే ప్రాంతాలకు వలసపోయారు. ఈ వలస వెళ్ళినవారిలో బంగారం, ఆభరణాల తయారీ కార్మికులు కూడా ఉన్నారు. వారు అక్కడ సంపాదించిన డబ్బును ఇక్కడకు పంపిస్తుండటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది.

Man sitting outside the temple
PHOTO • P. Sainath

కృష్ణామాయి ఆలయంలో నారాయణ ఝాడె. అటవీ నిర్మూలన, పర్యాటకుల రద్దీ పెరిగిపోవటం, నీటి కొరతను పెంచే ఇతర కార్యకలాపాలకు బయటివారైన ‘మీరే’ కారణమని ఈయన వాపోయారు

ఇక్కడ నీటి ఎద్దడి సమస్య ఒకటీ-రెండేళ్ళదేం కాదు. లేదా అది ఒక పెద్ద కరవు వచ్చినందువల్ల ఏర్పడింది కూడా కాదు. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడుతూ వచ్చింది. చాలావరకు మానవ నిర్మితమైనది. పుణేకు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ శరద్ మాండే “ఈ సమస్యను ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక చర్యలేం లేవా?” అని అడుగుతూనే, తన ప్రశ్నకు తానే జవాబు కూడా ఇచ్చారు: “ఆనకట్టల జీవితావధి 80-90 సంవత్సరాలు. పైపులైన్ల జీవితావధి 35-40 సంవత్సరాలు. నీటి శుద్ధి కర్మాగారాల జీవితావధి సుమారు 25-30 సంవత్సరాలు. పంపింగ్ యంత్రాల జీవితావధి 15 సంవత్సరాలు. కానీ ఒక ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు మాత్రమే. అంచేత కేవలం మీరు వెంటవెంటనే చేసే పనులకు తప్ప, దీర్ఘకాలిక చర్యలకు మీకు ఎలాంటి మెప్పుదలా లభించదు.”

2000 నుండి 2010 దాకా సేకరించిన అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యం కేవలం 0.1 శాతం మాత్రమే పెరిగింది. అది కూడా అదే దశాబ్దంలో నీటిపారుదలపై రూ. 70,000 కోట్లు వెచ్చించిన తర్వాత! నీటిపారుదల కుంభకోణంపై విచారణ జరిపిన చితలే కమిటీ కనుగొన్న దాని ప్రకారం, ఈ డబ్బులో సగానికిపైగా పనికిరాని పథకాల పైన వెచ్చించడం జరిగిందని తెలుస్తోంది.

మహారాష్ట్రలోని అధికారిక మరియు సమాచార హక్కు కింద సేకరించిన సమాచారం ప్రకారం, ఒక ఆనకట్ట కోసం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒక నెలలోనే దాని నిర్మాణ వ్యయం 500 శాతం పెరుగుతుంది. లేదా ఆరు నెలల్లో దాదాపు 1,000 శాతం పెరుగుతుంది. గత 30 ఏళ్ళుగా సుమారు 77 ప్రాజెక్టులు ఇలా "నిర్మాణమవుతూ" ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం కలిపితే, అది కొన్ని చిన్న చిన్న భారతీయ రాష్ట్రాల బడ్జెట్‌లన్నీ కలిపితే వచ్చే మొత్తం కంటే కూడా ఎక్కువే అవుతుంది.

PHOTO • P. Sainath

సాతారా జిల్లాలోని నేర్ సరస్సు, ఆనకట్ట: తాగునీటి కోసం ఉద్దేశించిన ఈ సరస్సు నీటిపై సమీపంలోని 19 గ్రామాలకు చెందిన చెరకు రైతులు ఏకాధిపత్యం చలాయిస్తున్నారు

ఇక మహారాష్ట్రలో భూగర్భ జలాలు కూడా రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. పంటకు కావాల్సిన సాగునీటిలో 65 శాతం ఈ భూగర్భజలాల మీదే ఆధారపడివుంది. ఏప్రిల్ 2016లో, మూడు దశాబ్దాలు ఆలస్యంగా, 200 అడుగుల కంటే క్రిందకు బోరుబావుల తవ్వకంపై రాష్ట్రం నిషేధం విధించింది.

కృష్ణా నదీ తీరాన ఉన్న ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య ఉండవల్సినదానికంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ నీటిలో అధికశాతం నిర్మాణ పనులకు మళ్లించబడుతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకూ, వ్యవసాయం నుండి పరిశ్రమలకూ ఈ నీటిని మళ్ళిస్తున్నారు.

వ్యవసాయ రంగంలోనే తీసుకుంటే, చాలా వరకు నీరు చెరకు పంటకే పోతోంది. చివరకు తాగడానికి ఉద్దేశించిన నేర్ సరస్సు నీరు కూడా ఆ పంటకే మళ్లించబడుతోంది. మహారాష్ట్రలో పండించే చెరకులో మూడింట రెండు వంతుల చెరకును ఈ కరువు పీడిత ప్రాంతాల్లోనే పండిస్తున్నారు. చక్కెర కర్మాగారాల విషయాన్ని తీసుకుంటే, “దయచేసి వాటిని అలా పిలవకండి,” అంటూ మాండే ,“అవి ఎమ్మెల్యే కర్మాగారాలు - అవి ఉత్పత్తి చేసేది వారినే!” అని చమత్కరించారు.

చెరకు పంటకు ప్రతీ ఎకరానికి, సంవత్సరానికి 180 ఎకరా-అంగుళాల(ఎకరా-అంగుళం: ఒక ఎకరం పొలానికి అంగుళం లోతున నిండేందుకు అవసరమైన నీరు) నీరు అవసరమౌతుంది. అంటే, వర్షం నీరు కాకుండా దాదాపు 18 మిలియన్ లీటర్ల నీరును ఈ పంట తీసుకుంటుంది. ఎకరం హైబ్రిడ్ జొన్నను సాగుచేయడానికి ఇందులో కేవలం 10 శాతం నీరు సరిపోతుంది. అందుకే ఇక్కడి చాలామంది రైతులు చెరకు పంట జోలికి పోవడంలేదు. నీరున్న ప్రాంతాల్లోనే చెరుకు పండిచడం నయమనీ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కాదనీ అంటున్నారు. మహారాష్ట్రలో చెరకు కేవలం 4 శాతం భూమిలో సాగు చేయబడుతున్నా, మొత్తం సాగునీటిలో 70 శాతం నీటిని ఉపయోగిస్తోంది.

“మేము తవ్విన బావి గత ఆరు దశాబ్దాలుగా ఎన్నడూ ఎండిపోలేదు.” అన్నారు మహాబలేశ్వర్‌లోని యూనుస్ నాలబంద్. ఆయన, భార్య రోషన్‌లు స్ట్రాబెర్రీలను ప్యాక్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని స్ట్రాబెర్రీ ఉత్పత్తిలో దాదాపు 80 శాతం వాటా మహాబలేశ్వర్‌దే. నాలబంద్ దంపతులు మాకు కొన్ని స్ట్రాబెర్రీలనూ, కొన్ని నల్ల మల్బరీ పళ్ళనూ బహుకరించారు.

మాకు ఎదురుగా కేవలం వంద గజాల దూరంలో నాలబంద్ దంపతులు ఉచితంగా నీటిని సరఫరా చేసే కృష్ణామాయి దేవాలయం ఉంది. మా వెనక ఈ దంపతులు ఇప్పటికీ సాగు చేస్తున్న మూడెకరాల స్ట్రాబెర్రీ పొలం ఉంది. కానీ నీరు తగ్గిపోతుండటంతో, ఈ మూడెకరాల స్ట్రాబెర్రీ తోట మరపురాని బీటిల్స్ పాటలోని 'స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ ఫరెవర్' (శాశ్వత స్ట్రాబెర్రీ పొలాలు)లా ఉండకపోవచ్చు.

PHOTO • P. Sainath

కరవుకాలంలో నానా తంటాలు పడుతూ వ్యవసాయం కొనసాగిస్తున్న యూనుస్, రోషన్ దంపతులు తమ బోరుబావి నుంచి వచ్చే కొద్దిపాటి నీటిని కృష్ణామాయి ఆలయంతో పంచుకుంటారు

అనువాదం: అజయ్ వర్మ అల్లూరి

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Other stories by P. Sainath
Translator : Ajay Varma Alluri

అజయ్ వర్మ అల్లూరి ద్విభాషా రచయిత, అనువాదకులు. ఆయన తన రచనలకు అనేక బహుమతులనూ, అవార్డులనూ పొందారు. అజయ్ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. (తులనాత్మక సాహిత్యం) చదువుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌కు కన్నడ భాషా సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు.

Other stories by Ajay Varma Alluri