చాణ్డాలశ్చ వరాహశ్చ కుక్కుటః శ్వా తథైవ చ |
రజస్వలా చ షణ్డశ్చ నైక్షేరన్నశ్నతో ద్విజాన్ ||

చండాలుడు, ఊర పంది, కోడి, కుక్క,
బహిష్టు స్త్రీ, నపుంసకుడు భోజనం చేస్తున్న బ్రాహ్మణుని చూడరాదు

— మనుస్మృతి 3.239

ఒక్క దొంగచూపు మాత్రమే కాదు, ఈ తొమ్మిదేళ్ల బాలుడి పాపం మరింత పొగరుతో కూడినది. ఇంద్ర కుమార్ మేఘ్వాల్ అనే 3వ తరగతి విద్యార్థి తన దాహాన్ని ఆపుకోలేకపోయాడు. దళితుడైన ఆ బాలుడు అగ్రవర్ణ అధ్యాపకుల కోసం విడిగా ఉంచిన కుండ నుండి నీళ్ళు తాగాడు.

శిక్ష పడింది. రాజస్థాన్‌లోని సురానా గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్‌లో, 40 ఏళ్ల అగ్రవర్ణ ఉపాధ్యాయుడు చైల్ సింగ్ ఎలాంటి కనికరం లేకుండా ఆ బాలుడ్ని కొట్టాడు.

25 రోజుల తర్వాత, సహాయం కోసం 7 ఆసుపత్రులను సందర్శించిన తర్వాత, భారత స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు, జాలోర్ జిల్లాకు చెందిన ఈ చిన్నపిల్లవాడు అహ్మదాబాద్ నగరంలో తుది శ్వాస విడిచాడు.

ప్రతిష్ఠ పాండ్య చదువుతున్న కవితను వినండి

జాడీలో పురుగులు

అనగనగా ఒక బడిలో
ఒక కూజా ఉండేది
ఆ బడిలో దైవసమానుడైన గురువుండేవాడు
అక్కడ మూడు నిండు సంచులు -
ఒకటి బ్రాహ్మణునికి
ఒకటి క్షత్రియునికి
యింకొకటి దళితులు తెచ్చే రూపాయి బిళ్ళకి

అనగనగా ఒక ఎక్కడాలేని ఊరిలో
ఆ కూజా ఒక పసివానికి నేర్పింది కదా -
"దప్పిగొనడమొక నేరం.
నీ గురువొక ద్విజుడు,
జీవితమొక చెరగని గాయపుమచ్చ,
పసివాడా, నువ్వు - జాడీలో బంధింపబడ్డ ఒక పురుగువి."

ఈ జాడీకొక వింత పేరుంది: సనాతన దేశం
"నీ చర్మమొక పాపం,
పిల్లవాడా, నీదొక పాపిష్టి జాతి."
అయినా,
పిడచకట్టుకుపోయిన తన పలుచని నాలుక తడుపుకునేందుకు
ఆ అందమైన కూజాలోంచి ఒక్క చుక్క నీళ్లు తాగాడు

పాపం!
తట్టుకోలేనంత దప్పిక అది,
అప్పటికీ గ్రంథాలు చెప్పనే చెప్పాయి కదా:"ఇవ్వు, ప్రేమించు, పంచు" అని?
ధైర్యం చేసి చేతులు చాచాడు
చల్లని ఆ కూజాని ముట్టుకున్నాడు
దైవ సమానుడు గురువు,
తొమ్మిదేళ్ళ పసివాడు వీడు.

ఒక గుద్దుతో ఒక తన్నుతో
బలమైన ఒక కర్రతో
పేరులేని ఒక ఉగ్రత్వంతో
దారికొచ్చాడా పసివాడు
తీయని వెటకారంలా నవ్వుకొన్నాడా దైవ సమానుడు.

ఎడమకన్ను మీద గాయాలు,
కుడికన్ను నిండా క్రిములు,
నల్లగా కందిపోయిన పెదాలు,
ఆ గురువు ఆనందానికన్నట్టు.
పవిత్రమైనది అతని దాహం.
పరిశుద్ధమైనది అతని ధర్మం
మృత్యువు సంచలించే కుహరం అతని హృదయం.

ఒక నిట్టూర్పుతో
ఒక 'ఎందుకు?' అన్న ప్రశ్నతో
ఉవ్వెత్తున ఎగసిన ద్వేషంతో
అణగని ఆక్రోశంలో ఆ దాహానికొక పేరివ్వబడింది.
ఒక శ్మశానకీటకంలా తరగతి గదిలోని నల్లబల్ల మూలిగింది.

అనగనగా ఒక బడిలో
ఒక మృతదేహముండేది.
యెస్సార్! యెస్సార్! మూడు నిండు చుక్కలు!
ఒకటి మందిరానికి
ఒకటి రాజుకి
ఒకటి దళితులు మునిగే కూజాకి.

వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం: కె. నవీన్ కుమార్

Joshua Bodhinetra

జాషువా బోధినేత్ర కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో ఎంఫిల్ చేశారు. అతను PARIకి అనువాదకుడు, కవి, కళా రచయిత, కళా విమర్శకుడు, సామాజిక కార్యకర్త కూడా.

Other stories by Joshua Bodhinetra
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli
Translator : K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.

Other stories by K. Naveen Kumar