ఈ పగుళ్ళపై మీడియాలో వార్తలే వార్తలు. చమోలీ జిల్లాలోని ఒక కొండపై ఉన్న తమ పట్టణం కుంగిపోతుండటాన్ని గురించి రోజూ ఓ కొత్త వార్త చదువుతోందామె. గ్రామాలలో విచ్చుతున్న నెర్రెలనూ, పట్టణాలలో వెల్లువెత్తుతున్న నిరసనలనూ చూడ్డానికి పాత్రికేయులు పోటెత్తుతున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని కిందటివారం వాళ్లొచ్చి చెప్పిప్పుడు ఆమె తన చిన్న ఇంటిని వదిలేసి వెళ్లడానికి ససేమిరా అంది. వాళ్ళనే ఈడ్చి పడెయ్యనివ్వు. ఆమెకేం భయంలేదు..

అవి పగుళ్ళు మాత్రమే కావని, ఏదో సరికొత్త దురాశ ఊరి నేలగుండా సొరంగాల్ని తవ్విందని అనుకుంటోందామె. పర్వతాలను దురాక్రమిస్తున్న కొత్త ప్రాజెక్టులు, రహదారులు మాత్రమే కాదు; మరేదో లోతైనది లోకవిరుద్ధమైనది. ఇప్పటికే విభజన జరిగిపోయింది. పర్వతాల లతకు వేలాడుతున్న స్వప్నాన్ని వెంటాడుతూ వారు, ప్రకృతికి భూలోక దేవతలకు తమంతట తామే దూరమయ్యారు. అదొక మాంత్రిక లత. ఆ వెర్రి భ్రమకు ఎవరిని నిందించాలి?

ప్రతిష్ఠ పాండ్య పద్యం చదవడాన్ని వినండి

PHOTO • Labani Jangi

పగుళ్లు

ఒకరోజులో జరిగింది కాదిది
సన్నని బహుసన్నని పగుళ్లెన్నో
దాక్కునే ఉన్నాయింకా
ఇప్పుడిప్పుడే నెరుస్తున్న ఆమె వెంట్రుకల్లా
లేదా కళ్ళకింది సన్నని గీతల్లా
ఊరికీ కొండకోనలకూ అడవులకూ నదులకూ నడుమ
కంటికి కనిపించని చిన్నచిన్న బీటలు
కాసింత పెద్ద నెర్రెలు మెల్లగా క్రమంగా విచ్చినపుడు
ఓ పిట్టగోడో, కొంత సుతిమెత్తని సున్నం పూతో
బిడ్డలకు జన్మనిస్తున్నట్టు చీలినపుడు
అనుకుంటుందామె కూలకుండా నిలబెట్టొచ్చులే అని

ఇంతలో
పెద్దపెద్ద పగుళ్లు ప్రత్యక్షం
అద్దాల్లాంటి గోడల్లోంచి
ఉగ్రనారసింహుడి మిర్రిగుడ్లలా
ఆమె ముఖంలోకి మొండిగా జంకులేకుండా క్రూరంగా తేరిచూస్తూ

ఆమెకు తెలుసు
ఆ నెర్రెల రూపురేఖలు గమనాలు
అడ్డంగా నిలువుగా మెట్లుమెట్లుగా
అవి విచ్చుకునే అరుదైన తావులు
ఇటుకల మధ్యని గచ్చుపరుపులపై
సిమెంటుపలకలలో, ఇటుక కట్టడాలపై
గోడల్లో పునాదుల్లో
కేవలం జోషీమఠ్‌లోనే కాదు
ఈ బీటలు నలుమూలలా
కొండల మీదుగా దేశం మీదుగా వీధుల మీదుగా
మహమ్మారిలా వ్యాపించి
తన కాళ్లకింది భూమిని చేరి
దెబ్బతిన్న తన దేహాత్మలను కప్పేయడమూ
ఆమె చూసింది

వదిలివెళ్ళడానికిప్పుడు సమయం మించిపోయింది
ఎక్కడికీ వెళ్ళడానికి లేదు
దేవతలు కూడా లేచి వెళ్ళిపోయారు

ప్రార్థనకు సమయం లేదు
పాత నమ్మకాలు పట్టుకువేళ్లాడటానిక్కూడా సమయం లేదు
దేన్నయినా కాపాడుకోవడానికీ సమయం మించిపోయింది
నెర్రెలను సూర్యరశ్మితో పూడ్చడం వ్యర్థం
వేడి మంటపై కరిగే సాలిగ్రామాల్లా
బద్దలవుతోన్న చీకటి
తెలియని కోపంలో పెను విద్వేషంలో
సర్వస్వం స్వాహా

ఇంటి వెనకాల లోయలో
విషబీజాలను చల్లిందెవరు?
గుర్తుచేసుకోడానికి ప్రయత్నించిదామె
ఈ తీగకు చీడగాని పట్టిందా?
దాని మూలాలు ఆకాశంలోకిగాని వ్యాపించాయా?
ఈ విషపు తీగపై ఎవరి రాజభవనం నిలబడగలదు?
ఆ మహాకాయుడు కనిపిస్తే ఆమె గుర్తుపడుతుందా?
ఆమె చేతుల్లో
గొడ్డలి పట్టుకునే సత్తువింకా ఉందా?
మోక్షమెక్కడని వెతకాలి?
అలసిసొలసిన ఆమె మళ్లీ నిద్రకు ప్రయత్నిస్తూ

విశాలంగా తెరచివున్న కళ్ళను
పైకీ కిందకూ కదుపుతూ
కలవంటి అచేతనావస్థలో
పాతగోడలపై అల్లుకుంటున్న
మాంత్రిక లతలకేసి…

అనువాదం: వికాస్

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Illustration : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : Vikas

వికాస్ తెలుగు ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Other stories by Vikas