“ఒక ఏడాదిలోనే మేం చిరుతపులుల వల్ల చాలా జంతువులను కోల్పోతాం. అవి రాత్రిపూట వచ్చి వాటిని లాక్కుపోతాయి,” అని గొర్రెల కాపరి గౌర్ సింగ్ ఠాకూర్ చెప్పారు. స్థానిక రకానికి చెందిన భోటియా జాతి కుక్క షేరూ కూడా వాటిని దూరంగా తరిమేయలేదని అతను చెప్పారు.
హిమాలయాల్లోని గంగోత్రి శ్రేణిలో ఉన్న ఒక పర్వతం పైభాగాన ఆయన మాతో మాట్లాడుతున్నారు. అతను మేపుతున్న జంతువులు ఉత్తరకాశీ జిల్లాలోని సౌరా గ్రామంలోనూ, దాని చుట్టుపక్కల గ్రామాలలోనూ నివసించే ఏడు కుటుంబాలకు చెందినవి. గౌర్ సింగ్ కూడా అక్కడికి 2,000 మీటర్ల దిగువన ఉండే అదే గ్రామానికి చెందినవారు. అతను ఏడాదికి తొమ్మిది నెలలపాటు ఈ జంతువులను చూసుకునేటట్టుగా ఒప్పందం చేసుకుని ఉన్నారు. వర్షం వచ్చినా, మంచు పడినా సరే, అతను వాటిని మేపుకు తీసుకువెళ్ళి, తిరిగి వచ్చాక వాటిని మందవేసి, వాటి సంఖ్య్యను లెక్కిస్తూ ఉండాల్సిందే.
"ఇక్కడ దాదాపు 400 గొర్రెలు, 100 మేకలు ఉన్నాయి" అని మరో గొర్రెల కాపరి, హర్‌దేవ్ సింగ్ ఠాకూర్ (48), పర్వతం మీద చెల్లాచెదురుగా ఉన్న మందను చూస్తూ చెప్పారు. "ఇంకొన్ని ఎక్కువ కూడా ఉండవచ్చు," ఖచ్చితంగా ఎన్నున్నాయో సరిగ్గా లెక్క తెలియని ఆయన కాస్త సందేహంగా జోడించారు. హరదేవ్ గత 15 ఏళ్లుగా ఈ పని చేస్తున్నారు. "కొంతమంది గొర్రెల కాపరులు, సహాయకులు రెండేసి వారాల పాటు వచ్చి మళ్ళీ తిరిగి వెళుతుంటారు. నాలాంటి కొందరు మాత్రం ఇక్కడే ఉంటారు." అని అతను వివరించారు.
ఇది అక్టోబర్ నెల. ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్ హిమాలయాలలో, గంగోత్రి శ్రేణిలోని 'చులీ టాప్'లో ఉన్న విశాలమైన పచ్చటి గడ్డి మైదానాలను ముద్దాడుతూ, ఎముకలు కొరికే బలమైన చల్లని గాలి వీస్తోంది. మగవాళ్ళు ఒంటికి ఒక దుప్పటిని చుట్టుకుని, ఒకదాన్నొకటి నెట్టుకుంటూ మేస్తున్న గొర్రెల మందలో తిరుగుతున్నారు. ఇది మంచి పచ్చికభూమి అని గొర్రెల కాపరులు చెబుతారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచు చరియ నుండి పుట్టుకొచ్చిన ఒక సన్నని నీటి ప్రవాహం జంతువులకు నీటికి కొరతలేకుండా భరోసానిస్తుంది. ఈ ప్రవాహం రాతి పగుళ్ల గుండా మెలికలు తిరుగుతూ ప్రవహించి, 2,000 మీటర్లకు పైగా దిగువన ప్రవహిస్తున్న భాగీరథి నదికి ఉపనది అయిన భిలంగనా నదిలో కలిసిపోతుంది.
ఎత్తైన పర్వతాలలో వందలాది జంతువులను చూసుకోవడం అనేది ప్రమాదంతో కూడుకున్న పని. చెట్ల వరుసలకు పైగా పెద్దపెద్ద రాళ్ళతో అంచెలంచెలుగా పైకి వ్యాపించి ఉండే ప్రకృతి, వేటాడే రెండు కాళ్ళ, నాలుగు కాళ్ల జంతువులను సులభంగా దాచిపెడుతుంది. ఆపైన గొర్రెలూ మేకలూ చలికిగానీ, లేదా జబ్బుచేసి కూడా చనిపోవచ్చు. “మేం మా చుట్టూ జంతువులను మందవేసుకుని గుడారాలలో ఉంటాం. మా దగ్గర రెండు కుక్కలున్నాయి గానీ, చిరుతపులులు గొర్రెపిల్లల్నీ, మేకపిల్లల్నీ వేటాడతాయి.” అని హర్‌దేవ్ చెప్పారు. ఆ మందలో ఆయనకు 50 గొర్రెలు, గౌర్ సింగ్‌కు దాదాపు 40 గొర్రెలు ఉన్నాయి.
గొర్రెల కాపరులు, వారి ఇద్దరు సహాయకులు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచి, బలహీనంగా అరుస్తున్న జంతువులను కదిలించి, వాటిని పర్వతం పైకి తోలతారు. గొర్రెల మందలను విడగొట్టడంలో వారికి షేరూ ఒక పెద్ద సహాయం. ఇలా విడగొట్టడం వలన మంద లోని ప్రతి జంతువుకూ మేత దొరుకుతుంది
ఈ మంద పచ్చని పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ రోజుకు 20 కిలోమీటర్లు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తుంది. ఎత్తైన ప్రదేశాలలో, గడ్డి సాధారణంగా శాశ్వతంగా ఏర్పడిన మంచు పొరల కింద కనిపిస్తుంది. కానీ నీళ్ళు ప్రవహించే సమయంలో అలాంటి పచ్చిక బయళ్లను కనుక్కోవడం ఒక సవాలుగానే ఉంటుంది. గడ్డి కోసం వెతుకుతూ గొర్రెల కాపరులు 100 కి.మీ దూరానికి పైగా ఉత్తరంవేపుకు ప్రయాణం చేసి, భారత-చైనా సరిహద్దు దగ్గరకు చేరతారు.
గొర్రెల కాపరులు సాధారణంగా చిన్న చిన్న గుడారాలలో ఉంటారు. కొన్నిసార్లు చన్నీ ని - పశువుల కోసం పైకప్పుగా ప్లాస్టిక్ షీట్ వేసి కట్టిన రాతి ఆవరణ -ఉపయోగిస్తారు. పచ్చికభూముల అన్వేషణలో వారు పైపైకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు పలుచగా ఉంటాయి. వాళ్ళు తమ సమయాన్నీ, శక్తినీ ఉపయోగించి పైకీ కిందకీ ఎక్కుతూ దిగుతూ వంట కోసం ఎండిన కలపను సేకరిస్తారు.
“మేము సంవత్సరానికి తొమ్మిది నెలలు మా ఇళ్లకు దూరంగా ఉంటాం. ఇక్కడికి (చులీ టాప్) రావడానికి ముందు ఆరు నెలల పాటు గంగోత్రికి సమీపంలోని హర్షిల్‌లో ఉన్నాం; రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాం. చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడిక కిందకు దిగి, మా ఇళ్లకు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది,” అని ఉత్తరకాశీ జిల్లా, భట్వాడీలోని సౌరా సమీపంలోని కుగ్రామమైన జమలో నివాసి హర్‌దేవ్ చెప్పారు. అతనికి సౌరాలో ఒక బిఘా (ఎకరంలో ఐదవ వంతు) కంటే కొంచెం తక్కువ భూమి ఉంది. అతని భార్య, పిల్లలు ఆ భూమిని చూసుకుంటారు. దానిలో వారు సొంత వాడకం కోసం ధాన్యం, రాజ్మా పండిస్తారు.
మంచు కారణంగా ఎటూ తిరగలేని పరిస్థితి ఏర్పడే మూడు శీతాకాలపు నెలలలో గొర్రెల కాపరులతోపాటు వారి గొర్రెల మందలు కూడా తమ తమ గ్రామాల్లోనూ, ఆ చుట్టుపక్కలా ఉండిపోతారు. మందల యజమానులు తమ జంతువులను సమీక్షించి, వాటి సంఖ్యను లెక్కతీసుకుంటారు. ఒక జంతువు పోతే ఆ నష్టాన్ని మందల యజమానులు తమ గొర్రెలను కాసేందుకు గొర్రెల కాపరులకు నెలవారీగా చెల్లించే 8,000-10,000 రూపాయల నుండి మినహాయించుకుంటారు. సహాయకులకు మాత్రం డబ్బుకు బదులుగా, 5-10 మేకలను లేదా గొర్రెలను ఇస్తారు.
ఒక గొర్రె, లేదా మేక ఉత్తరకాశీ వంటి చిన్న పట్టణాలలో, జిల్లా ప్రధాన కార్యాలయాలలో రూ. 10,000కు అమ్ముడుపోతుంది. “ సర్కార్ (ప్రభుత్వాధికారులు) మా కోసం ఏదైనా చేయవచ్చు; మా గొర్రెలనూ, మేకలనూ అమ్ముకోవడానికి శాశ్వత స్థలాన్ని ఇవ్వవచ్చు. అలా చేస్తే, మాకు మంచి ధరను పొందడంలో అది సహాయపడుతుంది,” అని జలుబుతో బాధపడుతున్న గౌర్ సింగ్ చెప్పారు. తనలాంటి పశువుల కాపరులకు వైద్య సహాయం సులభంగా అందుబాటులో ఉండదనీ, వ్యాధి లక్షణాలను తగ్గించడానికి మందుబిళ్ళల కోసం బాటసారులపై ఆధారపడతామనీ, ఆయన చెప్పారు.
"ఈ పని కోసం నేను హిమాచల్ ప్రదేశ్ నుండి కాలినడకన 2,000 కి.మీలకు పైగా ప్రయాణంచేసి వచ్చాను" అని సిమ్లా జిల్లాలోని డోడ్రా-కవర్ తహసీల్‌కు చెందిన సహాయకుడు గురు లాల్ (40) చెప్పారు. "మా గ్రామంలో ఉద్యోగాలు లేవు." అన్నారు దళితుడైన లాల్. తొమ్మిది నెలలు ఈ పనిచేస్తే, తనకి 10 మేకలు వస్తాయని ఆయన చెప్పారు. అతను తన గ్రామంలోని భార్య, 10 ఏళ్ల కొడుకు ఉన్న ఇంటికి తిరిగి వచ్చాక ఆయన ఈ గొర్రెలను అమ్మడమో, లేదా పెంచడమో చేస్తారు.
ఉద్యోగావకాశాలు లేకపోవడమే హర్‌దేవ్ సింగ్‌ను కూడా పశువులకాపరిని చేసింది. "మా ఊరివాళ్ళు హోటళ్ళలో పనిచేయడం కోసం ముంబై వెళ్తుంటారు. ఇక్కడ మా పర్వతాలలో వాతావరణం ఉంటే బాగా వేడిగానూ, లేదంటే బాగా చలిగానూ ఉంటుంది. రోజువారీ చేసే కూలీ పని కన్నా ఈ పని చాలా కష్టమైనది కావడంతో ఈ పని చేయడానికి ఎవరూ సిద్ధపడరు. కానీ, చేయడానికి మాకు వేరే పనేదీ"?" అని ఆయన అడుగుతారు.
ఈ కథనాన్ని తయారుచేయడంలో ఇతోధికంగా సహాయం చేసిన అంజలి బ్రౌనె, సంధ్యా రామలింగంలకు కథకురాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి