ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

కనిపించే పని, కనిపించని మహిళలు

ఆమె కొండ వాలు మీదుగా పైకి వస్తోంది, తలపైనున్న భారీ బరువు ఆమె ముఖాన్ని కప్పేసింది. కనిపించే పని వెనుక  కనిపించని స్త్రీ. ఒడిశాలోని మల్కన్‌గిరిలోని ఈ భూమిలేని మహిళకు ఇది కేవలం మరో రోజు శ్రమ మాత్రమే. నీరు, వంటచెరకు, పశువుల మేత తీసుకురావడం- ఇవి స్త్రీ జీవితంలో మూడో వంతు భాగాన్ని హరించే మూడు పనులు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు తమ కుటుంబం కోసం నీరు, వంటచెరుకు సమకూర్చడానికి రోజుకు ఏడు గంటల సమయం వరకు వెచ్చిస్తారు. పశువల మేతను సేకరించడానికి కూడా సమయం పడుతుంది. గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మంది మహిళలు ఆ మూడు వస్తువులను సేకరించేందుకు ప్రతిరోజూ అనేక కిలోమీటర్లు నడుస్తారు.

మహిళలు తలపై మోసే బరువులు చాలా భారీగా ఉంటాయి. మల్కన్‌గిరిలో ఒక కొండవాలుపైకి వెళ్తున్న ఆదివాసీ మహిళ తలపై దాదాపు 30 కిలోల బరువున్న కట్టెలున్నాయి. ఆమె ఇంకా మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంది. చాలామంది మహిళలు ఇంటికి నీటిని మోసుకురావడానికి కూడా ఇదే విధంగా ఇంతలేసి దూరాలు లేదా ఇంకా ఎక్కువ దూరాలు కూడా ప్రయాణిస్తారు.

వీడియో చూడండి : ' ఆమె తలపై మోస్తున్న వస్తువులు ఆమె శరీరం కంటే కూడా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి '

మధ్యప్రదేశ్‌లోని ఝాబువాకు చెందిన ఈ మహిళ చెక్క దుంగలపై నిల్చుని చుట్టూ గోడలేమీ లేని బావి నుంచి నీరు తోడుతోంది. బావిలోకి బురద, దుమ్ము చేరకుండా వుండేందుకు దానిపైన ఆ దుంగల్ని పరిచివుంచారు. ఆ దుంగలు ఒకదానికొకటి కట్టి కూడా లేవు. ఆమె ఏ కాస్త పట్టు జారినా 20 అడుగుల లోతున్న ఆ బావిలోకి పడిపోతుంది. కాలు పక్కకు జారితే, ఆ దుంగల కిందపడి కాళ్ళు నలుగుతాయి.

అడవులను నరికేసిన చోట, లేదా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, ఈ ప్రయత్నం మరింత భయంకరంగా ఉంటుంది. అక్కడ ఇటువంటి పనుల కోసం ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిల్లో ఈ మహిళలు ఒక్కసారికే ఎక్కువ మోతాదులో నీటిని మోయడానికి ప్రయత్నిస్తారు.

రోజులు బాగున్న సమయాల్లో కూడా ఇవి చాలా కష్టమైన పనులు. కానీ లక్షలాది మంది ప్రజలు గ్రామాల్లో ఉండే ఉమ్మడి భూమిని (గ్రామకంఠాలు) కోల్పోతున్నందున, ఈ సమస్యలు మరింత జటిలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గ్రామ ఉమ్మడి స్థలాలు ఎక్కువగా ప్రైవేటీకరించబడుతున్నాయి. దీంతో పేదలు, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శతాబ్దాలుగా, వారు ఈ ఉమ్మడి భూముల నుండి పెద్ద మొత్తంలో తమకు అవసరమైన వస్తువులను పొందుతున్నారు. ఇప్పుడు ఈ స్థలాలను కోల్పోవడం అంటే, ఇతర విషయాలతోపాటు, చెరువులు, దారులు, పచ్చిక బయళ్ళు, వంటచెరుకు, కలప, పశువులకు మేత, నీరు కోల్పోవడం అన్నమాటే. అంటే, ఫలాలను పొందగలిగే చెట్లు, మొక్కలతో నిండిన పచ్చని భూభాగాన్ని కోల్పోవడమని అర్థం.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ పేదవారైన స్త్రీపురుషులను ఒకేలా ప్రభావితం చేస్తోంది. కానీ ఈ భూముల నుండి నిత్యావసరాలను సేకరించేది ఎక్కువగా మహిళలే. ఉమ్మడి భూమి లేకుంటే దళితులు, భూమిలేని కూలీల వంటి ఇతర వెనుకబడిన సమూహాలు ఎక్కువగా దెబ్బతింటాయి. హర్యానా వంటి రాష్ట్రాల్లో, అగ్రవర్ణాల నేతృత్వంలోని పంచాయతులు- అటువంటి ఉమ్మడి భూములను ఫ్యాక్టరీలు, హోటళ్లు, బ్రూవరీలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు, నివాస కాలనీల నిర్మాణానికీ లీజుకు ఇచ్చాయి.

ట్రాక్టర్లతో పాటు, కోతయంత్రాలు ఇప్పుడు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఉపయోగించబడుతుండటంతో, భూ యజమానులకు తక్కువమంది కూలీలు అవసరమవుతున్నారు. కాబట్టి ఒకప్పుడు గ్రామంలోని పేద కూలీలు ఉండేందుకూ, వారి జీవనానికీ సహాయపడిన గ్రామ ఉమ్మడి భూములను ఇప్పుడు అమ్మేసెయ్యవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఉమ్మడి భూములను విక్రయించడాన్ని పేదలు వ్యతిరేకించినప్పుడు, భూ యజమానులు వారిని కుల ప్రాతిపదికన ఆర్థిక బహిష్కరణ చేయడం తరచుగా కనిపిస్తుంది. ఉమ్మడి భూమిని కోల్పోవడం వలన, సాంఘిక  బహిష్కరణల ఫలితంగా మహిళలు చాలా చోట్ల బహిర్భూమికి వెళ్ళే ప్రదేశాలను కూడా కోల్పోతున్నారు. ఇప్పుడు వారిలో చాలామందికి ఇదే పెద్ద సమస్య.

ఇంధనం, పశుగ్రాసం, నీరు సేకరించడం లక్షలాది మంది ఇళ్ళను నిలబెడుతోంది. అయితే ఈ పనుల్లో నిమగ్నమైన వారు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli