ఒక్కసారి అలా వంచి ఇలా తిప్పగానే, లాలీపాప్ ఆకారంలో ఉండే కట్ క్యేటి చేసే ర్యాట్-ఎ-టాట్-టాట్ శబ్దం బెంగళూరు వీధుల్లోకి ఈ బొమ్మలు అమ్మేవారు వచ్చారని సూచిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉండే చిన్నబిడ్డలంతా ఈ బొమ్మనొకదాన్ని కావాలని కోరుకుంటారు. వీధుల్లోనూ, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దా సర్వత్రా కనిపించే ఈ మెరిసే గిలక్కాయ బొమ్మను అక్కడికి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ఒకచోటి నుండి మరోచోటికి ప్రయాణాలు సాగించే అమ్మకందారులు ఈ నగరానికి తీసుకువచ్చారు. "మా చేతితయారీ బొమ్మలు అంత దూరం ప్రయాణించడం మాకు సంతోషంగా ఉంది" అని ఈ బొమ్మల తయారీదారు ఒకరు గర్వంగా చెప్పారు. "మేం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం... కానీ మా బొమ్మ మాత్రం ఎక్కడికైనా ప్రయాణిస్తుంది. ఇది అదృష్టం."

ముర్షిదాబాద్‌లోని హరిహరపారా బ్లాక్‌లోని రామ్‌పారా గ్రామంలో, కట్ క్యేటి (బెంగాలీ భాషలో కొట్ కొటి అని కూడా పిలుస్తారు) తయారీలో స్త్రీపురుషులిద్దరూ పాల్గొంటారు. గ్రామంలోని వరి పొలాల నుండి తెచ్చిన మట్టి, మరొక గ్రామం నుండి కొనుగోలు చేసి తెచ్చిన పొట్టి వెదురు కర్రలు కట్ క్యేటి ని తయారు చేయడానికి ఉపయోగపడతాయని రామ్‌పారాలోని తన ఇంట్లో వాటిని తయారుచేసే తపన్ కుమార్ దాస్ చెప్పారు. అతని కుటుంబం మొత్తం దాని తయారీలో పాల్గొంటుంది. దీని తయారీలో వారు రంగులు, వైర్, రంగు కాగితాలు, పాత ఫిల్మ్ రీళ్ళను కూడా ఉపయోగిస్తారు. “ఒక అంగుళం పరిమాణంలో కత్తిరించిన రెండు ఫిల్మ్ ముక్కలను వెదురు కర్ర మధ్యలో ఉన్న పగులులోకి చొప్పిస్తారు. దీనితో నాలుగు రెక్కలు తయారవుతాయి,” అని కొన్నేళ్ళ క్రితం కొల్‌కతాలోని బరాబజార్ నుండి పెద్దమొత్తంలో పాత ఫిల్మ్ రీళ్ళను కొనుగోలు చేసిన దాస్ చెప్పారు. ఈ రెక్కలు కట్ క్యేటి కి కదిలికనూ, శబ్దాన్నీ ఇస్తాయి.

సినిమా చూడండి: కట్‌క్యేటి - ఒక బొమ్మ కథ

"మేం వాటిని తీసుకువచ్చి అమ్ముతాం... కానీ అది ఏ చిత్రంలోది (ఫిల్మ్ రీలు ముక్కలో ఉన్నది) అని మేం గమనించం," అని ఒక బొమ్మల విక్రేత వివరిస్తారు. రీళ్ళలో బంధించివున్న ప్రముఖ సినీ తారలు చాలామంది కొనుగోలుదారుల, అమ్మకందారుల దృష్టికి రారు. "ఈయన మా బెంగాల్‌కు చెందిన రంజిత్ మల్లిక్," అని మరొక బొమ్మల విక్రేత కట్ క్యేటి ని చూపిస్తారు. “నేను చాలామందిని చూశాను. ప్రసేన్‌జిత్‌, ఉత్తమ్‌ కుమార్‌, ఋతుపర్ణ, శతాబ్ది రాయ్‌... ఇలా చాలామంది సినీ కళాకారులు ఇందులో ఉన్నారు."

ఈ బొమ్మలు అమ్మేవాళ్ళకు - వారిలో చాలామంది వ్యవసాయ కూలీలు - బొమ్మలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఇంటి దగ్గర వెన్నువిరిగేలా కష్టపడినా, తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేయటం కంటే బొమ్మలు అమ్మడాన్నే వారు ఇష్టపడతారు. వారు బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి అక్కడే నెలల తరబడి ఉంటారు, ప్రతిరోజూ 8-10 గంటలు కాలినడకన తిరుగుతూ తమ వస్తువులను అమ్ముకుంటారు. చిన్నదైనా కానీ చక్కగా అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాపారాన్ని 2020లో వచ్చిన కోవిడ్-19 విజృంభణ తీవ్రంగా దెబ్బతీసింది. ఇందుకు రైళ్ళే ప్రధాన రవాణా విధానం కావటంతో, లాక్‌డౌన్ ఈ బొమ్మల ఉత్పత్తిని నిలిపివేసింది. చాలామంది బొమ్మల అమ్మకందారులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లవలసి వచ్చింది.

సినిమాలోని ప్రధాన పాత్రలు: కట్ క్యేటి తయారీదారులు, అమ్మకందారులు

దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్: యశస్విని రఘునందన్

ఎడిటింగ్, సౌండ్ డిజైన్: ఆర్తి పార్థసారథి

కొన్ని మార్పులతో ‘ది క్లౌడ్ నెవర్ లెఫ్ట్’ అన్న పేరుతో రూపొందించిన ఇదే చిత్రం - రోటర్‌డామ్, కాసెల్, షార్జా, పెసారో, ముంబై వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. వాటిలో ముఖ్యమైనది పారిస్‌లో జరిగిన ఫిలావ్ చిత్రోత్సవంలో అందుకున్న బంగారు పతకం .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Yashaswini Raghunandan

యశస్విని రఘునందన్ 2017 PARI ఫెలో. బెంగళూరు కేంద్రంగా పనిచేసే చిత్ర నిర్మాత.

Other stories by Yashaswini Raghunandan
Aarthi Parthasarathy

ఆర్తి పార్థసారథి బెంగళూరుకు చెందిన సినీ నిర్మాత, రచయిత. ఆమె అనేక షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలతో పాటు కామిక్స్, షార్ట్ గ్రాఫిక్ స్టోరీలకు పనిచేశారు.

Other stories by Aarthi Parthasarathy
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli