ఆ దేశం కోట్లాది మంది ప్రజలు కలలు గన్న స్వప్నం. దాని కోసం ప్రాణాలు బలిపెట్టినవారు కూడ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయనకు కూడ కలలు వస్తున్నాయి. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక మూక ఊడిపడి, ఒక మనిషిని సజీవంగా దహనం చేసినట్టు పీడకలలు. కాని ఆయన వాళ్లను ఆపలేకపోతున్నాడు. ఈసారి కలలో ఆయన ఒక ఒంటరి ఇల్లు చూశాడు. వరండాలో ఒక గుంపు. శోకాలు పెడుతున్న కొద్ది మంది స్త్రీలు. బట్టల్లో చుట్టిన రెండు మృతదేహాల ముందు కదలిక లేకుండా నిలబడిన కొందరు పురుషులు. మృతదేహాల పక్కన స్పృహ తప్పి పడిపోయిన ఒక స్త్రీ. మృతదేహాల వైపు నిస్తేజంగా చూస్తూ కూచున్న ఒక చిన్నారి పాప. చాలకాలంగా ఈ కలలు కంటున్నందుకు ఆయన అపరాధ భావనతో కుంగిపోయాడు. చాల రోజులకిందనే ఈ పీడకలలను ఆపవలసింది. ఈ కలల ప్రపంచానికి బైట, తన దేశం అప్పటికే ఒక శ్మశానవాటికగా మారిపోయిందని ఆయనకు తెలుసు. కాని ఈ కలలు కనకుండా ఉండడమెట్లాగో, ఈ స్థితి నుంచి బైట పడడం ఎట్లాగో ఆయనకింకా కచ్చితంగా తెలియదు.
तो यह देश नहीं…
1.
एक हाथ उठा
एक नारा लगा
एक भीड़ चली
एक आदमी जला
एक क़ौम ने सिर्फ़ सहा
एक देश ने सिर्फ़ देखा
एक कवि ने सिर्फ़ कहा
कविता ने मृत्यु की कामना की
2.
किसी ने कहा,
मरे हुए इंसान की आंखें
उल्टी हो जाती हैं
कि न देख सको उसका वर्तमान
देखो अतीत
इंसान देश होता है क्या?
3.
दिन का सूरज एक गली के मुहाने पर डूब गया था
गली में घूमती फिर रही थी रात की परछाई
एक घर था, जिसके दरवाज़ों पर काई जमी थी
नाक बंद करके भी नहीं जाती थी
जलते बालों, नाखूनों और चमड़ी की बू
बच्ची को उसके पड़ोसियों ने बताया था
उसका अब्बा मर गया
उसकी मां बेहोश पड़ी थी
दो लोग जलाए गए थे
4.
अगर घरों को रौंदते फिरना
यहां का प्रावधान है
पीटकर मार डालना
यहां का विधान है
और, किसी को ज़िंदा जला देना
अब संविधान है
तो यह देश नहीं
श्मशान है
5.
रात की सुबह न आए तो हमें बोलना था
ज़ुल्म का ज़ोर बढ़ा जाए हमें बोलना था
क़ातिल
जब कपड़ों से पहचान रहा था
किसी का खाना सूंघ रहा था
चादर खींच रहा था
घर नाप रहा था
हमें बोलना था
उस बच्ची की आंखें, जो पत्थर हो गई हैं
कल जब क़ातिल
उन्हें कश्मीर का पत्थर बताएगा
और
फोड़ देगा
तब भी
कोई लिखेगा
हमें बोलना था
అంటే ఇది దేశం కాదు
1.
ఒక చెయ్యి గాలిలోకి ఎగిరింది
ఒక నినాదం పైపైకి ఎగసింది
ఒక సమూహం ముందుకు కదిలింది
ఒక మనిషి సజీవ దహనమయ్యాడు.
ఒక సమూహం వేదననే అనుభవించింది.
ఒక దేశం కేవలం చూస్తుండి పోయింది.
ఒక కవి వ్యక్తం చేశాడంతే,
ఒక కవిత అంతమైపోయింది.
2.
చనిపోయిన మనిషి కళ్ళు
కిందుమీదవుతాయని
ఎవరో అన్నారు.
అందువల్ల అవి వర్తమానాన్ని చూడలేవు
గతాన్నే చూస్తుంటాయి.
మరి ఒక మనిషే ఒక దేశమవుతుందా
అని మరొకరు అడిగారు.
3.
దినం సూర్యుడు సందు మలుపులో మలగిపోయాడు
రాత్రి నీడలు వీథుల్లో పచార్లు చేశాయి
అక్కడ ఒకానొక ఇల్లు, ద్వారం మీద నాచు పెరుగుతూ.
ఉహు, ముక్కు మూసుకున్నా సరే
మాంసం కాలుతున్న వాసన
మీ ఊపిరితిత్తుల్లో నిండకుండా
ఆ ఇల్లు దాటి వెళ్లలేరు.
వాళ్ల అబ్బా చనిపోయాడనీ,
వాళ్ల అమ్మ స్పృహ తప్పి పడి ఉందనీ,
ఒక గోవు రక్షించబడిందనీ,
ఇద్దరు మనుషులు సజీవంగా తగులబెట్టబడ్డారనీ
ఆ పాపకు పొరుగింటివాళ్లు చెప్పారు.
4.
ఇక్కడ ఇళ్లను నేలమట్టం చెయ్యడానికి
ఒక అధికారిక నిబంధన ఉంది
మనుషులను కొట్టిచంపడాన్ని అనుమతించే
చట్టం ఒకటుంది
ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం
మనుషులను తగులబెట్టి చంపొచ్చు.
ఇది దేశమని ఎవరన్నారు?
ఇది ఒక శ్మశానవాటిక
5.
రాత్రి గడిచిపోయాక ఉదయం రానప్పుడు
మనం మాట్లాడి ఉండవలసింది.
అధికారం అణచివేత అయినప్పుడు
మనం మాట్లాడి ఉండవలసింది.
హంతకుడు
హతుల దుస్తులేవో చూస్తున్నప్పుడు,
ఏం తింటున్నారో వాసన చూస్తున్నప్పుడు,
ముసుగు లాగివేస్తున్నప్పుడు,
ఇంటి కొలతలు తీసుకుంటున్నప్పుడు,
మనం మాట్లాడి ఉండవలసింది.
కళ్ళు రాళ్లయిపోయి
కూచున్న ఆ చిన్నారి పాప.
ఆమె కళ్ళలో
కశ్మీరీ రాళ్లు దాచిపెట్టిందని
వాటిని పేల్చివేయాల్సి ఉందని
రేపు వాళ్లంటారు.
అప్పుడు కూడ, బహుశా,
ఎవరో ఒకరంటారు,
అయ్యో, మనం మాట్లాడి ఉండవలసింది అని!
అనువాదం: ఎన్. వేణుగోపాల్