జామ్‌నగర్ జిల్లా, లాల్‌పుర్ తాలూకాలోని సింగాచ్ గ్రామానికి చెందిన కుటుంబం మాది. రాయడం నాకు కొత్త. కరోనా సమయంలోనే మొదలుపెట్టాను. సంచార జాతులతో పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థలో కమ్యూనిటీ మొబిలైజర్‌గా పనిచేస్తున్నాను. మా సామాజికవర్గంలో చదువుపట్ల అవగాహనను, ఆసక్తినీ కలిగించేందుకు నేను గడచిన తొమ్మిది నెలలుగా గుజరాతీని ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని ఒక బయటి విద్యార్థిగా బి.ఎ. కోర్సు చేస్తున్నాను. మా సామాజికవర్గంలోని స్త్రీలలో విద్యా స్థాయి చాలా ఆందోళనకర స్థాయిలో ఉంది. చదువుకున్న మహిళలు చాలా తక్కువమంది ఉంటారు.

చారణులు, భార్వారులు, అహీర్‌ల మాదిరిగా మేం కూడా సంచారజాతులుగా గొర్రెల పెంపకం చేపట్టి జీవించేవాళ్ళం. యిప్పుడు మాలో చాలామంది సంప్రదాయ వృత్తులను వదిలి పొలాల్లోనూ, పెద్దపెద్ద కంపెనీల్లోనూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కర్మాగారాల్లోనూ, పొలాల్లో కూలీలుగానూ పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. సమాజం ఈ స్త్రీలనూ, వారి పనినీ అంగీకరిస్తుంది కానీ ఒంటరిగా పని చేసే నాలాంటివారికి సామాజిక ఆమోదం లభించడం చాలా కష్టం.

కవి తన కవిత రాస్తుండగా నేపథ్యంలో ప్రతిధ్వనిస్తూ ఒక జంట మధ్య నడిచే ఊహాత్మక సంభాషణ:

భరత్ : విను, నీ ఉద్యోగం కెరీర్ సంగతి సరేగానీ... మా అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలి. నన్నింతవాణ్ణి చేయడానికి వాళ్లెంత కష్టపడ్డారో నీకు తెలియదు..

జస్మిత : అవున్లే, నాకెలా తెలుస్తుంది! నేనింతదాన్నయి రెడీమేడ్‌గా ఉన్నాక మా అమ్మానాన్నలు ఎక్కణ్ణుంచో తెచ్చుకున్నారు మరి.

భరత్ : ఎందుకలా నన్ను ఎగతాళిచేస్తావు? సంపాదించడానికి నేనున్నానని చెప్తున్నానంతే. నువ్వు ఇల్లు చూసుకుంటూ సుఖంగా ఉంటే చాలు. ఇంతకన్నా ఏం కావాలి నీకు?

జస్మిత : నిజమే, నాకంతకన్నా యింకేం కావాలి? నేనొక జీవంలేని వస్తువును కదా. వస్తువులకు కోరికలేం ఉంటాయి? నేను ఇంటిపని చేసుకుంటూ సంతోషంగా ఉండి, నెలాఖరున డబ్బుకోసం నీ దగ్గర చేయిచాస్తాను. ఒకవేళ అప్పుడు నీకు కోపమొస్తే దాన్ని కూడా భరిస్తాను. ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేస్తుంటావు, నేనేమో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొనుంటాను గదా.

భరత్ : పిచ్చిదానిలా మాట్లాడకు. నువ్వు ఈ కుటుంబ గౌరవానివి. నిన్ను బయట కష్టపడేలా చేయలేను.

జస్మిత : అవునవును, నువ్వన్నది నిజమే. బయట పనిచేస్తున్న ఆడవాళ్ళందరూ సిగ్గులేనివాళ్ళూ, వ్యక్తిత్వం లేనివాళ్ళూఅని కదూ నీ అభిప్రాయం, నేనా విషయాన్నే మర్చిపోయాను.

ఇదీ వాస్తవ పరిస్థితి. ప్రతి ఒక్కరూ మా బాధ్యతల గురించి గుర్తు చేసేవారే. ఆమె ఏం చేయాలో చెప్పటానికి అందరూ ఆసక్తి చూపేవాళ్ళే తప్ప ఎవ్వరూ ఆమె ఏం చేయాలనుకుంటుందో అడగరు…

జిగ్నా రబారీ గుజరాతీలో తన కవితను చదువుతోంది, వినండి

ఆ కవిత ఆంగ్లానువాదాన్ని ప్రతిష్ఠ పాండ్యా చదువుతున్నారు, వినండి

హక్కులు

నా హక్కుల్ని రాసి పెట్టుకున్న
కాగితాన్ని పోగొట్టుకున్నాను

నా బాధ్యతలు కళ్ళముందే
స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
నా హక్కులు కనబడకుండాపోయాయి
వాటి కోసం వెతకండి.

నా విధులు ఏమిటన్న స్పృహ నాకుంది
నా హక్కుల్ని కూడా పొందనివ్వండి.

నువ్విదిచెయ్యి, దీన్నిలా చెయ్యి.
అప్పుడప్పుడైనా
నాకేం చేయాలనుందో కూడా అడగండి.

నువ్విది చెయ్యలేవు,
నువ్విది చెయ్యకూడదు.
అప్పుడప్పుడైనా
నీకేది యిష్టమో అది చెయ్యి అని కూడా చెప్పండి

నా అవగాహన అనంతం.
నా లాఘవం శాశ్వతం.
కానీ అప్పుడప్పుడూ
నా కలల్ని మీ అరచేతుల్లో పొదువుకొండి.

ఈ నాలుగ్గోడల గురించి
మీకంటే నాకే బాగా తెలుసు.
అప్పుడప్పుడూ నన్ను
ఆ చిక్కని నీలి ఆకాశంలోకి ఎగరనివ్వండి.

ఇంతకాలం స్త్రీలు ఉక్కిరిబిక్కిరయింది చాలు
నన్ను కనీసం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోనివ్వండి.

నచ్చినది ధరించే స్వేచ్ఛ కాదు
నచ్చిన చోటుకు వెళ్లే స్వేచ్ఛా కాదు.
మీరు యిది కూడా అడగండి
జీవితం నుంచి నేను ఆశిస్తున్నదేమిటని.

అనువాదం: కె. నవీన్ కుమార్

Poem and Text : Jigna Rabari

జిగ్నా రబారి గుజరాత్‌లోని ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లో సహజీవన్‌తో కలిసి పనిచేస్తున్న సామాజిక కార్యకర్త. తన సామాజికవర్గంలో చదువుకున్న కొద్దిమంది మహిళల్లో ఆమె కూడా ఒకరు.

Other stories by Jigna Rabari
Painting : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Translator : K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.

Other stories by K. Naveen Kumar