కొత్తగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో మా ఆదివాసీలకు మావైన స్వంత పద్ధతులు ఉన్నాయి. మేం నదులు, అడవులు, పుట్టినవారికి సంబంధించిన భూమి, వారంలోని రోజులు, ఒక నిర్దిష్టమైన తేదీ, లేదా పుట్టినవారి పూర్వీకుల నుండి కూడా ఈ పేర్లను అరువు తీసుకుంటాం. కానీ, కాలక్రమేణా, మేం కోరుకున్న విధంగా పేరు పెట్టుకునే హక్కును మా నుండి లాగేసుకున్నారు. ఈ విశిష్టమైన హక్కును వ్యవస్థీకృతమైన మతం, మత మార్పిడులు మానుంచి తీసేసుకున్నాయి. మా పేర్లు మారుతూనే ఉన్నాయి, మళ్లీ మళ్ళీ ఆపాదించబడుతున్నాయి. ఆదివాసీ పిల్లలు చదువుకోసం నగరాలలోని ఆధునిక పాఠశాలలకు వెళ్లినప్పుడు, వ్యవస్థీకృత మతం మా పేర్లను మార్చింది. ఆ పిల్లలు పొందిన సర్టిఫికెట్లు మాపై బలవంతంగా రుద్దిన కొత్త పేర్లతో ఉన్నాయి. ఇలాగే మా భాషలను, మా పేర్లను, మా సంస్కృతిని, మా చరిత్రలను హతమార్చేశారు. ఈ పేరు పెట్టడంలో ఒక కుట్ర దాగివుంది. ఈ రోజున మేం మా మూలాలతో, మా చరిత్రతో ముడిపడి ఉన్న ఆ భూమి కోసం వెతుక్కుంటున్నాం. మా ఉనికితో గుర్తించబడిన ఆ రోజుల కోసం, తేదీల కోసం మేం వెతుక్కుంటున్నాం.

జసింత కెర్‌కెట్టా తన పద్యాన్ని హిందీలో చదువుతున్నారు, వినండి

ఈ పద్యం ఆంగ్లానువాదాన్ని ప్రతిష్ఠ పాండ్య చదువుతున్నారు, వినండి

ఈ పేరు ఎవరిది?

సోమవారం పుట్టానని
నన్ను సోమ్రా అని పిలిచారు
మంగళవారం పుట్టానని
నన్ను మంగళ్ అని, మంగర్ అని, మంగరా అనీ పిలిచారు
బేస్తవారంనాడు పుడితే
నన్ను బిర్సా అని పిలిచారు

వారాల్లో రోజుల్లాగా
నేను కాలం గుండెలపై నించొని ఉండేవాడిని
తర్వాత వాళ్లొచ్చారు
వచ్చి, నా పేరునే మార్చేశారు
నా అస్తిత్వమైన ఆ వారాల్నీ తేదీల్నీ నాశనం చేశారు

యిప్పుడు నా పేరు రమేశ్
లేదా నరేశ్
కాకుంటే మహేశ్
అదీ కాదంటే ఆల్బర్ట్ గిల్బర్ట్ లేదా ఆల్ఫ్రెడ్
నన్ను సృష్టించని నేల మీది పేర్లన్నీ నాకున్నాయి
నాది కాని చరిత్ర కలిగిన నేల మీది పేర్లన్నీ నాకున్నాయి

యిప్పుడు నేను,
వారి చరిత్రలోనే నా చరిత్ర కోసం వెతుకుతున్నాను
కానీ, ప్రపంచపు ప్రతి మూలలోనూ, ప్రతి చోటా
నన్నే హతమార్చడాన్ని చూస్తున్నాను
యింకా,
ప్రతి హత్యకూ ఒక సుందరమైన పేరుండటాన్ని గమనిస్తున్నాను.


వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం: కె. నవీన్ కుమార్

Poem and Text : Jacinta Kerketta

ఒరాన్ ఆదివాసీ సమాజానికి చెందిన జసింతా కెర్కెట్టా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర రచయిత, పాత్రికేయురాలు. ఆమె ఆదివాసీ సంఘాల పోరాటాలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న అన్యాయాలపై దృష్టిని ఆకర్షించే కవయిత్రి కూడా.

Other stories by Jacinta Kerketta
Painting : Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli
Translator : K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.

Other stories by K. Naveen Kumar