పచ్చని కొండలు, చిన్న చిన్న జలపాతాలు, స్వచ్ఛమైన గాలి... ఈ నేపథ్యంలో ఓ యువకుడు తన గేదెలు గడ్డి మేయడాన్ని చూస్తున్నాడు.

"మీరేదైనా సర్వే చేస్తున్నారా?" నేనతన్ని సమీపిస్తున్నప్పుడు అడిగాడతను

"లేదు," అన్నాను. పోషకాహార లోపం సంఘటనలను నమోదు చేయడానికి వచ్చానని చెప్పాను.

మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లా మొఖాడా తాలూకా లో మేమున్నాం. ఇక్కడ పొషకాహార లోపం వలన 5, 221 మంది పిల్లలు అతి తక్కువ బరువుతో ఉన్నారనీ, ఈ పిల్లల సంఖ్య రాష్ట్రంలోనే రెండవ స్థానమనీ ఈ నివేదిక లో గుర్తించారు.

మేం రాజధానీ నగరం ముంబై నుండి 157 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం కానీ, ఇక్కడి పచ్చటి ప్రకృతి దృశ్యం మరేదో ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపించేలా ఉంది!

రోహిదాస్ మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగల జాబితాలోని కా ఠాకూర్ సముదాయానికి చెందినవాడు. పాలఘర్ జిల్లా జనాభాలో 38 శాతం మంది ఆదివాసీ తెగలవారే. గేదెలను కాచుకునే ఈ కుర్రవాడు తన వయసెంతో చెప్పలేకపోయాడుగానీ, చూస్తే దగ్గరదగ్గరగా ముప్పయ్యేళ్ళున్నట్టున్నాడు. భుజానికి వేలాడుతున్న ఒక గొడుగు, మెడచుట్టూ తిప్పి చుట్టిన తువ్వాలు, చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉన్నాడు. గడ్డి మేస్తోన్న తన రెండు పశువులను చూసుకుంటూ ఉన్నాడు. "ఒక్క వానల కాలంలోనే వీటికి తినటానికి కడుపునిండా గడ్డి దొరుకుతుంది. వేసవి కాలాల్లో అవి బాగా తిరగాల్సి (మేత కోసం) ఉంటుంది," రోహిదాస్ చెప్పాడు.

Rohidas is a young buffalo herder in Palghar district's Mokhada taluka.
PHOTO • Jyoti
One of his buffaloes is seen grazing not too far away from his watch
PHOTO • Jyoti

ఎడమ: పాలఘర్ జిల్లా మొఖాడా తాలూకాకు చెందిన యువ గేదెల కాపరి రోహిదాస్. కుడి: అతని కంటికి కనిపించే దూరంలోనే గడ్డి మేస్తోన్న అతని గేదెల్లో ఒకటి

"మా ఇల్లు అదిగో అల్లక్కడ, దమ్‌తేపారాలో" ఎదురుగా ఉన్న కొండల్లో కనిపిస్తోన్న ఒక గూడెంవైపు చూపిస్తూ అన్నాడు రోహిదాస్. అక్కడున్న చెట్ల తోపులో ఒక 20-25 ఇళ్ళు కనిపిస్తున్నాయి. అక్కడ నివాసముండేవారు ఇళ్ళకు చేరాలంటే బాఘ్ నదీపాయ మీద కట్టిన చిన్న వంతెనను దాటాలి. "మేము ఈ నీళ్ళనే (నదీపాయ నుంచి వచ్చే) తాగుతాం, ఇంటి అవసరాలకు వాడుకొంటాం. మా పశువులు కూడా ఇవే నీళ్ళు తాగుతాయి," రోహిదాస్ చెప్పాడు.

వేసవి నెలలలో వాఘ్ నది ఎండిపోవటం మొదలవుతుందనీ, అప్పుడు జనాలకు తాగే నీటికి ఇబ్బంది అవుతుందనీ అతనన్నాడు.

"ఈ నెల(జూలై) వంతెన నీటిలో మునిగిపోయింది. ఎవరైనా మావైపుకు రావటంగానీ, మా వైపు నుంచి ఎవరైనా బయటకు పోవటంగానీ జరగలేదు," అని గుర్తుచేసుకున్నాడతను

ఈ కాలంలో దమ్‌తెపారా గూడెంలో జీవితం చాలా కష్టంగా ఉంటుందని రోహిదాస్ చెప్పాడు. “రోడ్డు లేదు, గాడీ (ప్రభుత్వ బస్సు) లేదు, షేర్ జీపులు కూడా చాలా తక్కువ. ఏదైనా వైద్యపరమైన అత్యవసరస్థితి ఎదురైతే చాలా కష్టం,” అన్నాడతను. మొఖాడా ప్రభుత్వ ఆసుపత్రి అక్కడికి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

అటువంటి సమయాల్లో ఇక్కడివారు గర్భిణీ స్త్రీలను, ఇతర రోగులను వెదురు బొంగులకు దుప్పటితో కట్టిన డోలీ పై మోయవలసి ఉంటుంది. వారి ఈ కష్టాలకు తోడు, అంతంతమాత్రంగా ఉండే నెట్‌వర్క్ కవరేజీ వలన అంబులెన్స్‌ను పిలవడం కూడా అసాధ్యంగా ఉంటోంది.

Rohidas lives with his family in a small hamlet called Damtepada on a hill in Mokhada.
PHOTO • Jyoti
He and other villagers must cross this stream everyday to get home
PHOTO • Jyoti

ఎడమ: రోహిదాస్ మొఖాడాలోని ఒక కొండపై ఉన్న దమ్‌తెపారా అనే చిన్న గూడెంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. కుడి: అతనితోపాటు అతని గ్రామస్థులంతా ఇంటికి చేరాలంటే ఈ నదీపాయను దాటడం తప్పనిసరి

రోహిదాస్ కానీ, అతని ముగ్గురు అన్నలు కానీ ఎన్నడూ బడికి వెళ్లలేదు. ఈ నివేదిక ప్రకారం కా ఠాకూర్ సముదాయంలోని పురుషులు 71.9 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. కానీ రోహిదాస్, “ పారా (గ్రామం)లో 10వ తరగతి పూర్తి చేసిన కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. కానీ వారందరూ నేను చేసే పనినే చేస్తారు. తేడా ఏమిటి?" అని అడుగుతాడు.

కొన్ని నెలల క్రితమే రోహిదాస్‌కు పెళ్ళయింది. అతని భార్య బోజి, అతని తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులు, వారి భార్యలు, పిల్లలు- అంతా కలిసి వారి ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ఎకరాల అటవీ భూమిలో ఖరీఫ్ వరి పంటను సాగు చేస్తారు. "భూమి మా పేరు మీద లేదు," అని రోహిదాస్ చెప్పాడు

అక్టోబరు, నవంబర్ నెలల మధ్య పంట కోతల తర్వాత, కుటుంబం మొత్తం అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠానే జిల్లా, భివాండి తాలూకా లోని ఇటుక బట్టీలలో పని చేయడానికి వలస వెళుతుంది. "ఇటుక బట్టీల ద్వారా సంపాదించుకున్నది మాకు సాగు ఖర్చుకు వస్తుంది," అని అతనన్నాడు. ఖరీఫ్ సాగు, పంటకోత, వలసల మధ్య ఏటా తరలివెళ్లే పాలఘర్‌లోని అనేక ఆదివాసీ కుటుంబాల వలెనే అతని కుటుంబ అనుభవం కూడా విలక్షణమైనది.

జూలై 21, 2022న ద్రౌపది ముర్ము భారతదేశపు మొదటి ఆదివాసీ అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ముర్ము ఒడిశాలోని సంతాలి ఆదివాసీ వర్గానికి చెందినవారు, ఈ ఉన్నత పదవిని అధిరోహించిన రెండవ మహిళ కూడా.

"మనకు ఆదివాసీ రాష్ట్రపతి ఉన్నారని నీకు తెలుసా?" అతని ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తూ అడిగాను.

"ఎవరికీ తెలుసు? దాని వల్ల వచ్చే తేడా ఏముంది?" అని రోహిదాస్ అడిగాడు. ఆపైన " మలా గురంచ రఖాయచీత్ (నేను నా గేదెలను మేపుకుంటూనే ఉంటాను." అన్నాడు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Other stories by Jyoti
Editor : Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli