ఎళిల్ అన్న జ్ఞాపకం నన్ను గట్టిగా పట్టుకుని, అద్భుత శక్తితో ఒక ప్రవాహం వెంట నన్ను లాక్కుపోతుంది. అది నన్ను పాటలు పాడే నీడలతో నిండిన రంగురంగుల అడవులకు, నాట్యాలు చేసే ఎత్తైన చెట్ల మధ్యకు, జిప్సీ రాజుల కథలలోకి, పర్వత శిఖరానికీ తీసుకుపోతుంది. అక్కడ నుండి ప్రపంచం ఒక కలలా కనిపిస్తుంది. అప్పుడు, అకస్మాత్తుగా, అన్న నన్ను నక్షత్రాల మధ్యనున్న చల్లని రాత్రి గాలిలోకి విసిరేస్తారు. నేను మట్టిగా మారే వరకూ నన్ను నేల వైపుకు నెట్టివేస్తారు

ఆయన మట్టితో తయారైనవాడు. ఆయన జీవితమే అంత. ఆయనొక విదూషకుడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక చిన్నపిల్లవాడు, ఒక నటుడు - మట్టిలాగే ఎటైనా మలుచుకునేందుకు అనువైనవారు. ఎళిల్ అన్న నన్ను మట్టి నుంచి తయారుచేశారు.

ఆయన పిల్లలకు చెప్పే రాజుల కథల్లోనే నేనూ పెరిగాను. కానీ ఇప్పుడు నేను ఆయన కథను చెప్పాలి, ఆ మనిషి వెనుక ఉన్న వ్యక్తి గురించీ, ఆయన ఛాయాచిత్రాల గురించీ... ఐదేళ్లకు పైగా నాలో నివసిస్తున్న కథను చెప్పాలి.

*****

ఆర్. ఎళిల్అరసన్ విదూషకులకు రాజు, చుట్టూ ఎగురుతుండే ఎలుక, ముఖం చిట్లిస్తున్న రంగురంగుల పక్షి, సింహం చుట్టూ తిరుగుతుండే మరీ అంత చెడ్డది కాని తోడేలు- ఇదంతా కూడా ఆ రోజుటి కథపై ఆధారపడి ఉంటుంది. 30 సంవత్సరాలకు పైగా తమిళనాడు అంతటా అడవుల, నగరాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు తన వీపుపై ఉండే పెద్ద ఆకుపచ్చ సంచిలో ఆయన మోసుకుతిరుగుతున్న కథలవి!

అది 2018. మేం నాగపట్టిణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్నాం. గజ తుపాను వల్ల నేలకూలిన చెట్ల నుండి నరికిన దుంగలు చెల్లాచెదురుగా పడి, పాఠశాల ఆవరణను ఒక పాడుబడిన రంపపు మిల్లులా కనిపించేలా చేస్తున్నాయి. కానీ తమిళనాడులో తుఫానుకు ఘోరంగా ప్రభావితమైన జిల్లాలోని ఈ బడి ఆవరణ తన నిర్జనమైన, దెబ్బతిన్న రూపాన్ని ఒక మూల నుండి ఉత్సాహంగా వినిపించే పిల్లల నవ్వులతో పూర్తిగా మార్చేసుకుంటుంది.

"వందానే తేన్న పారుంగా కట్టియక్కారన్ ఆమా కట్టియక్కారన్. వారాన్నే తేన్న పారుంగా" (చూడు, విదూషకుడు వచ్చేశాడు, అవును, విదూషకుడు వచ్చేస్తున్నాడు, చూడు)

PHOTO • M. Palani Kumar

పిల్లలను నాటకానికి సిద్ధంచేసే ముందు వారితో కూర్చొని వారి అభిరుచుల గురించి ప్రశ్నలు అడుగుతున్న ఎళిల్ అన్న

PHOTO • M. Palani Kumar

2018 లో వచ్చిన గజ తుఫాను చేసిన విధ్వంసం తర్వాత , నాగపట్టిణంలో ఆయన నిర్వహించిన ఆర్ట్ క్యాంప్ పిల్లలనూ , వారి నవ్వులనూ తిరిగి తరగతి గదిలోకి తీసుకువచ్చింది

తెలుపు, పసుపు రంగులు వేసిన ముఖం పైన, మూడు ఎరుపు చుక్కలు - ముక్కుపై ఒకటి, బుగ్గలపై రెండు. తలపై విదూషకుడి టోపీగా మారిన ఆకాశనీలం రంగు ప్లాస్టిక్ సంచి, పెదవులపై ఒక తమాషా పాట, ఒక నిర్లక్ష్యపు లయతో కదిలే అవయవాలు - అతనొక విరగబడే అల్లరి నవ్వులా కనిపిస్తారు. చేసే హల్ చల్ సంగతి మామూలే. జవ్వాజీ కొండల్లోని చిన్న ప్రభుత్వ పాఠశాలలోనైనా, చెన్నైలోని ఆడంబరంగా కనిపించే ప్రైవేట్ పాఠశాలలోనైనా, ఆదివాసీ పిల్లల కోసం సత్యమంగళం అడవుల్లో(ఈరోడ్ జిల్లా)  దారీతెన్నూ లేని ప్రదేశంలో ఉన్న బడైనా, లేదా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నడిచే బడైనా- ఏదైనా ఎళిల్ అన్న కళా శిబిరాలు(ఆర్ట్ క్యాంపులు) ఇలాగే మొదలవుతాయి. ఒక పాటతోనో, ఒక చిన్న స్కిట్‌తోనో ఒక్కసారిగా అన్న ప్రవేశించడంతోనే, పిల్లలు తమ సంకోచాలన్నీ వదిలేసి పరిగెత్తుతూ, ఆడుతూ, నవ్వుతూ ఆయనతో కలిసి పాడుతూ వచ్చేస్తారు.

శిక్షణ పొందిన కళాకారుడైన అన్న , పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ఎన్నడూ ఆందోళన చెందరు. అసలాయన ఏమీ కావాలని - ప్రత్యేక హోటల్ గానీ, బస గానీ ఏర్పాటు చేయలేదనో, ప్రత్యేక పరికరాలు లేవనో - ఇలా ఏమీ అడగరు. ఆయన కరెంటు, లేదా నీరు, ఫాన్సీ క్రాఫ్ట్ పరికరాల్లాంటివి ఏమీ లేకుండా కూడా పని చేసేవారు. అతను పిల్లలను కలవడం, వారితో సంభాషణలు చేయడం, వారితో పని చేయడం వంటివాటి పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తారు. మిగతా వాటికి వేటికీ అంత ప్రాథాన్యం ఉండదు. మీరు అతని జీవితం నుండి పిల్లలను తీసివేయలేరు. పిల్లల విషయానికి వస్తే అతనే ఆకర్షణా, పనితనం కలిగిన వ్యక్తి కూడా.

ఒకసారి సత్యమంగళంలోని ఒక గ్రామంలో ఇంతకు ముందు ఎన్నడూ రంగుల మొహమే ఎరుగని పిల్లలతో కలిసి పనిచేశారు. మొదటిసారిగా వారి ఊహ నుండి వచ్చే దేన్నో సృష్టించడానికి రంగులను ఉపయోగించడంలో, వారొక కొత్త అనుభవాన్ని పొందటంలో, ఆయన వారికి సహాయం చేశారు. తన కళా పాఠశాల కళిమణ్ విరల్‌గళ్ (ఫింగర్స్ ఆఫ్ క్లే- మట్టి వేళ్ళు)ను ప్రారంభించినప్పటి నుండి గత 22 సంవత్సరాలుగా పిల్లల కోసం అవిశ్రాంతంగా ఈ అనుభవాలను సృష్టిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురికావడం నేను ఎన్నడూ చూడలేదు. పిల్లలతో కలిసి పనిచేయడం, తనను తానెప్పుడూ వారికోసం సిద్ధంగా ఉంచుకోవడమే ఆయన ఆరోగ్య పరిరక్షణ.

30 సంవత్సరాల క్రితం, అంటే 1992లో చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుండి ఆర్ట్స్ లో తన బ్యాచిలర్ డిగ్రీని అన్న పూర్తి చేశారు. "నా సీనియర్లు, చిత్రకారులు తిరు తమిళ్ సెల్వన్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ ప్రభాకరన్, చిత్రకారులు శ్రీ రాజ్‌మోహన్‌లు నా కళాశాల జీవితంలో డిగ్రీని పూర్తి చేయడంలో నాకు చాలా సహాయపడ్డారు. టెర్రకోట శిల్పకళలో కోర్సు పూర్తిచేసిన తర్వాత, కళాత్మక కార్యకలాపాలపై ప్రయోగాలు చేయడానికి చెన్నైలోని లలిత కళా అకాడమీలో చేరాను." అంటూ తన కళాశాల రోజులను అన్న గుర్తుచేసుకున్నారు. తన శిల్పకళా స్టూడియోలో కూడా ఆయన కొంతకాలం పనిచేశారు

"కానీ నేను చేసిన కళాకృతులు అమ్ముడుపోవడం ప్రారంభించినప్పుడు, అవి సాధారణ ప్రజలకు చేరడం లేదని నేను గ్రహించాను. అప్పుడే నేను జనాలతో కలిసి కళాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టాను. తమిళనాడులోని ఐదు గ్రామీణ ప్రాంతాలే (కొండలు, సముద్రతీరం, ఎడారి ప్రాంతం, అడవి, పంటపొలాలు) నేను కోరుకునే ఆ ప్రదేశాలు అని నిర్ణయించుకున్నాను. నేను నా పిల్లలతో కలిసి మట్టినీ, హస్తకళలనూ ఉపయోగించి బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాను.” అని ఆయన అన్నారు. ఆయన పిల్లలకు కాగితం ముసుగులు, మట్టి ముసుగులు, మట్టి నమూనాలు, డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు, గ్లాస్ పెయింటింగ్‌లు, ఓరిగామి ఎలా తయారు చేయాలో నేర్పించడం ప్రారంభించారు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ : ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో చిన్నారులకు తొలిసారిగా పరిచయమైన రంగుల మాయాజాలం . కుడి : కృష్ణగిరి జిల్లాలోని కావేరిపట్టిణంలో పిల్లలు అట్టపెట్టెలను , వార్తాపత్రికలను ఉపయోగించి జింక కిరీటాలను తయారుచేస్తున్నారు

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ : కావేరిపట్టిణంలో వర్క్ షాప్ చివరి రోజున ప్రదర్శించిన నాటకం కోసం తాము తయారుచేసిన శిరస్త్రాణాలను ధరించిన పిల్లలు . కుడి : పెరంబళూర్ లోని పిల్లలు ఒక్కొక్కటీ ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణతో తాము తయారు చేసిన మట్టి ముసుగులను ప్రదర్శిస్తున్నారు

బస్సు, వ్యాన్ లేదా అందుబాటులో ఉండే ఎలాంటి రవాణా సాధనంలోనైనా మేం ప్రయాణించినప్పుడల్లా, మేం మోసుకుపోయే అతిపెద్ద సామాను పిల్లల కోసం తీసుకువెళ్ళే వస్తువులే అయివుంటాయి. డ్రాయింగ్ బోర్డులు, పెయింట్ బ్రష్‌లు, రంగులు, ఫెవికాల్ ట్యూబ్‌లు, బ్రౌన్ బోర్డ్, గ్లాస్ పెయింట్స్, పేపర్, ఇంకా అనేక ఇతర వస్తువులతో ఎళిల్ అన్న పెద్ద ఆకుపచ్చ సంచి నిండిపోతుంది. ఆయన మమ్మల్ని చెన్నైలోని అన్ని పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉండేవారు - ఎల్లిస్ రోడ్ నుండి ప్యారీస్ కార్నర్ వరకు, ట్రిప్లికేన్(తిరువల్సికేణి) నుండి ఎగ్మోర్ వరకు. అక్కడొక ఆర్ట్‌కు సంబంధించిన వస్తువులుండే స్టోర్‌ ఉంటుంది. అప్పటికే మా కాళ్లు నొప్పులు పుడుతుంటాయి, మా బిల్లు కూడా 6-7 వేల వరకూ అయివుంటుంది.

అన్న దగ్గిర ఎప్పుడూ తగినంత డబ్బు ఉండేది కాదు. స్నేహితుల నుండి, తాను చేసే చిన్న చిన్న ఉద్యోగాల నుండి, ప్రైవేట్ పాఠశాలలలో చేసిన తన స్వంత పని నుండి సేకరించిన డబ్బుతో వికలాంగులైన పిల్లలకూ, ఆదివాసీ పిల్లలకూ ఉచిత కళా శిబిరాలను నడిపిస్తూ ఉంటారు. ఎళిల్ అన్న తో కలిసి ప్రయాణించిన ఐదేళ్లలోనూ ఆయన జీవితాసక్తిని కోల్పోవడమన్నది నేనెన్నడూ చూడలేదు. తన కోసం ఏదైనా పొదుపు చేసుకోవాలని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. పొదుపు చేయడానికి తన వద్ద ఏదో మిగిలి ఉందని కాదు; తాను ఏం సంపాదించినా నాలాంటి సహ కళాకారులతో పంచుకునేవారు

కొన్నిసార్లు, కొనడానికి బదులుగా, విద్యావ్యవస్థ వారికి నేర్పించడంలో విఫలమైందని తాను భావించిన వాటిని పిల్లలకు నేర్పించడానికి కొత్త కొత్త వస్తువులను అన్న కనుగొనేవారు. వాళ్ళు కూడా కళాకృతులను తయారు చేయడానికి స్థానిక వస్తువులను ఉపయోగించుకునేలా ఆయన చేసేవారు. మట్టి సులభంగా దొరుకుతుంది, ఆయన తరచుగా దానినే ఉపయోగించేవారు. కానీ ఆయన తానే స్వయంగా మట్టిని బొమ్మలు చేసేందుకు అనువుగా తయారు చేసేవారు- అందులో ఉండే అవక్షేపాలను, రాళ్లను తొలగించడం, గడ్డలను పగలగొట్టడం, వాటిని కరిగించడం, జల్లెడ పట్టడం, ఎండబెట్టడం- ఇవన్నీ. మట్టి ఆయననూ, ఆయన జీవితాన్నీ నాకు గుర్తుచేస్తుంది. పిల్లల జీవితాలతో పెనవేసుకున్న ఆయన జీవితం ఏ రకంగా మలుచుకోవడానికైనా అనువైనది. ముసుగులు ఎలా తయారు చేయాలో పిల్లలకు ఆయన నేర్పించడాన్ని చూడటం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ప్రతి మాస్క్‌ మీదా ప్రత్యేకమైన వ్యక్తీకరణ ఉంటుంది, కానీ పిల్లల ముఖాలన్నీ స్వచ్ఛమైన ఆనందాన్నే వ్యక్తీకరిస్తూ ఉంటాయి.

పిల్లలు మట్టిని తీసుకుని మాస్క్‌ గా మలచినప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. పిల్లలను వారి జీవితాలకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించేలా చేసేవారు ఎళిల్ అన్న . వారి అభిరుచుల గురించి అడుగుతూ, వాటిని అనుసరించమని వారిని ప్రోత్సహించేవారు. తమ ఇంటిలో నీటి కొరతను ఎదుర్కొంటున్న కొంతమంది పిల్లలు, నీటి ట్యాంకులను తయారుచేసేవారు. మరికొందరు ఏనుగులను ఎంపిక చేసుకుంటారు. కానీ అడవులలోని పిల్లలు తొండాలను ఎత్తివున్న ఏనుగులను సృష్టిస్తారు. ఇది దళసరి చర్మం కలిగివుండే ఆ జంతువులతో వారికున్న అందమైన అనుబంధాన్ని సూచిస్తుంది

PHOTO • M. Palani Kumar

బంకమట్టి ఎప్పుడూ ఎళిల్ అన్నను , పిల్లలతో ఆయన జీవితాన్ని నాకు గుర్తుచేస్తుంది . ఆయన స్వయంగా మట్టి వంటివాడు , మలచుకొనేందుకు అనువైనవాడు . నాగపట్టిణంలోని పాఠశాలలో మాస్క్ లు ఎలా తయారు చేయాలో ఆయన పిల్లలకు నేర్పించడం చూస్తుంటే చాలా మజాగా ఉంటుంది

PHOTO • M. Palani Kumar

తాము సృష్టించే కళాకృతులలో తాము జీవించే స్వంత ప్రపంచం నుండి చిత్రాలనూ ఆలోచనలనూ పిల్లలు తీసుకువచ్చేలా ఆయన చేస్తారు . సత్యమంగళంలోని ఆదివాసీ కుగ్రామానికి చెందిన పిల్లాడు , తాను చూసిన విధంగా , తొండం ఎత్తివున్న మట్టి ఏనుగును తయారుచేశాడు

తాను నిర్వహించే ఆర్ట్ క్యాంపులలో ఉపయోగించే సామగ్రి గురించి ఆయన జాగ్రత్తగా ఆలోచించేవారు. పరిపూర్ణత కోసం ఆయనకుండే తపన, పిల్లలకు సరైన రకమైన సామగ్రిని పంపిణీ చేయాలనుకునే ఆయన శ్రద్ధ, ఆయన్ని మాకు హీరోని చేసింది. శిబిరంలో ఉండగా ప్రతి రాత్రి, ఎళిల్ అన్న , ఇంకా కొంతమంది కలిసి మరుసటి రోజుకు అవసరమైన వస్తువులను, సామగ్రిని రూపొందించేవారు. దృష్టిలోపం ఉన్న పిల్లలకు శిబిరాన్ని నిర్వహించబోయే ముందు, వారితో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడానికిగాను అన్న తన కళ్లకు గంతలు కట్టుకునేవారు. వినికిడి లోపం ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చే ముందు తన చెవులను మూసివేసుకునేవారు. ఆయన తన విద్యార్థుల అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన విధానం నా ఛాయాచిత్రాల కోసం అధ్యయనం చేయవలసిన విషయాలతో నిమగ్నమయ్యేలా నన్ను ప్రేరేపించింది. కెమెరా మీటను నొక్కడానికి ముందు, ఆ విషయంతో సంబంధాన్ని కలిగివుండటం నాకు చాలా ముఖ్యం.

ఎళిల్ అన్న కు బెలూన్‌ల మాయాజాలం అర్థమైంది. ఆయన బెలూన్‌లతో ఆడే ఆటలు చిన్నవయసు పిల్లలతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎల్లప్పుడూ సహాయపడతాయి. ఆయన - గుండ్రంగా పెద్దగా ఉండేవి, పొడవాటి పాముల్లాంటివి, మెలితిప్పినవి, ఈలలు వేసేవి, నీళ్లతో నిండినవి - ఇలాంటి రకరకాల బెలూన్‌లను తన సంచిలో ఉంచుకునేవారు. అవి పిల్లలలో చాలా ఉత్సాహాన్ని నింపేసేవి. ఆపైన ఎలాగూ పాట లు ఉండనే ఉంటాయి.

“నేను పనిచేసే సమయంలో, పిల్లలకు నిరంతరం ఆటలు, పాటలు అవసరమని గ్రహించాను. సామాజిక సందేశాలను కలిగి ఉన్న పాటలతో, ఆటలతో ముందుకు వచ్చాను. పిల్లలను నాతో కలిసి పాడేలా చేస్తాను” అని అన్న అన్నారు. ఆయన ఎక్కడ వున్నా ఆ ప్రదేశం వెలిగిపోయేది. ఆదివాసీ గ్రామాలలోని పిల్లలకు శిబిరం నిర్వహణ ముగిసిన తర్వాత ఆయనను అక్కడినించి వెళ్ళనివ్వడం చాలా కష్టంగా ఉండేది. ఆయన్ని పాటలు పాడమని అడిగేవారు. ఆయన కూడా అలుపన్నది లేకుండా పాడేవారు. పిల్లలు ఆయన చుట్టూచేరి ఉండటం వల్లనే ఆయనకు పాడేందుకు పాటలు కూడా ఉంటాయి.

ఆయన తన పిల్లలతో మంచి సంబంధాలలో ఉండేందుకు ప్రయత్నించే విధానం, విద్యార్థుల అనుభవాలను అర్థం చేసుకోవడం, నేను నా ఛాయాచిత్రాలతో సంబంధమున్న వ్యక్తులతోనూ, విషయాలతోనూ నిమగ్నమయ్యేలా నన్ను ప్రేరేపించింది. మొదట్లో, ఫోటోగ్రఫీపై నా అవగాహన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు, నేను తీసిన ఛాయాచిత్రాలను ఎళిల్ అన్న కు చూపించాను. ఆ ఫ్రేమ్‌లలో ఉన్న వ్యక్తుల దగ్గరకు నా ఛాయాచిత్రాలను తీసుకెళ్లమని ఆయన చెప్పారు. "వాళ్ళు (ప్రజలు) నీ నైపుణ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడమెలాగో నీకు నేర్పిస్తారు." అని ఆయన నాతో అన్నారు.

PHOTO • M. Palani Kumar

శిబిరం ముగిసిన తర్వాత ఎళిల్ అన్న వెళ్ళిపోవాలని పిల్లలు అస్సలు కోరుకోరు . ‘ పిల్లలకు నిత్యం పాటలు , ఆటలు అవసరం . నేను వారిని నాతో కలిసి పాడేలా చేస్తాను '

PHOTO • M. Palani Kumar

సేలంలో , వినికిడి మరియు మాట్లాడే లోపం ఉన్న పిల్లల కోసం ఉన్న పాఠశాలలో బెలూన్ల ఆట ఆడుతున్నారు

శిబిరాలలో పిల్లలు ఎల్లప్పుడూ తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఉంటారు. వారు వేసిన చిత్రాలు, ఒరిగామి, చేసిన మట్టి బొమ్మలు ప్రదర్శనలో ఉంటాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను, తోబుట్టువులను ప్రదర్శనకు తీసుకొచ్చి సగర్వంగా తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఎళిల్ అన్న, అది వారికి ఒక వేడుకగా మారేలా చేసేవారు. ఆయన ప్రజలను కలలు కనేలా చేశారు. నా మొదటి ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఆయన పెంచిన అలాంటి ఒక కల! అతని శిబిరాల నిర్వహణ ద్వారా పొందిన ప్రేరణ నుండే నేను దానిని నిర్వహించగలిగాను. అయితే, అందుకోసం నా దగ్గర డబ్బేమీ లేదు.

నా దగ్గర కొంత డబ్బు చేరినప్పుడల్లా నా ప్రింట్‌లను సిద్ధంచేసి ఉంచుకోమని అన్న నాకు సలహా ఇచ్చేవారు. నేనింకా చాలా అభివృద్ధిలోకి వస్తానని అనేవారు. నా గురించీ, నా పని గురించీ ఆయన జనాలకు చెప్పేవారు. ఆ తర్వాత ఆయన చేసినదంతా నాకు ఉపయోగంలోకి రావడం మొదలయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎళిల్ అన్న బృందంలోని రంగస్థల కళాకారుడు, కార్యకర్త అయిన కరుణ ప్రసాద్ నాకు ప్రారంభ మూలధనంగా 10,000 రూపాయలనిచ్చారు. వాటితో నేను మొదటిసారిగా నా ఫోటోలను ప్రింట్ చేసుకోగలిగాను. నా ఛాయాచిత్రాలకు చెక్క ఫ్రేమ్‌లను ఎలా తయారుచేయాలో అన్న నాకు నేర్పించారు. ఆయనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండేది; అది లేకుండా నేను నా మొదటి ప్రదర్శనను చేయగలిగి ఉండేవాడిని కాదు.

ఆ ఛాయాచిత్రాలు తర్వాత రంజిత్ అన్న(పా. రంజిత్)కూ, ఆయన నీలమ్ ప్రొకల్చరల్ సెంటర్‌కు చేరాయి. అలా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాలకూ చేరుకున్నాయి; అయితే ఈ ఆలోచన మొట్టమొదటిసారి మొలకెత్తిన ప్రదేశం ఎళిల్ అన్న శిబిరమే. నేను ఆయనతో ప్రయాణాన్ని ప్రారంభించిన మొదట్లో నాకు చాలా విషయాలు తెలియవు. ఆయనతో చేసిన ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. కానీ ఆయన, విషయాలు తెలిసినవారికీ, తెలియని వారికీ మధ్య ఎన్నడూ వివక్ష చూపలేదు. వ్యక్తులను తన దగ్గరకు తీసుకువచ్చేలా ఆయన మమ్మల్ని ప్రోత్సహించేవారు. వారు తక్కువ ప్రతిభావంతులైనా ఆయనకేమీ ఫరవాలేదు. "మనం వారికి కొత్త విషయాలను పరిచయం చేద్దాం, వారితో కలిసి ప్రయాణం చేద్దాం" అని చెప్పేవారు. అతను ఒక వ్యక్తిలో ఉండే లోపాలను ఎన్నడూ చూడలేదు; ఆయన కళాకారులను తీర్చిదిద్దేది ఈ విధంగానే!

ఆయన పిల్లల నుండి కళాకారులను, నటులను కూడా తయారుచేశారు. "మేం వినికిడి లోపం ఉన్న పిల్లలకు కళారూపాలను అనుభూతి చెందడాన్ని - పెయింట్ చేయడం, మట్టి నుండి జీవితాలను సృష్టించడం వంటివాటిని - నేర్పుతాం. దృష్టిలోపం ఉన్న పిల్లలకు సంగీతాన్నీ, నాటక కళనూ నేర్పిస్తాం. మట్టితో త్రిమితీయ(3D) శిల్పాలను చెక్కడం కూడా నేర్పిస్తాం. ఇది దృష్టిలోపం ఉన్న పిల్లలు కళను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలు ఇలాంటి కళారూపాలను నేర్చుకుంటున్నప్పుడు, సమాజంపై అవగాహనలో భాగంగా వాటిని నేర్చుకుంటే, వారు కూడా స్వతంత్రులుగా అనుభూతిచెందడాన్ని మనం చూడగలం.

PHOTO • M. Palani Kumar

తంజావూరులోని దృష్టిలోపం కలిగిన పిల్లలకు చెందిన పాఠశాలలో ఎళిల్ అన్నతో తమ సమయాన్ని ఆస్వాదిస్తున్న పిల్లలు . ఆయన శిబిరాన్ని ప్రారంభించడానికి ముందు దృష్టిలోపం ఉన్న పిల్లలను అర్థం చేసుకుని , వారితో మెలగడం కోసం తన కళ్లకు గంతలు కట్టుకుంటారు . వినికిడి లోపం ఉన్న పిల్లలతో పని చేస్తున్నప్పుడు కూడా ఆయన తన చెవులకు బిరడా బిగించేస్తారు

PHOTO • M. Palani Kumar

కావేరిపట్టణంలో ఓయిల్ అట్టం అనే జానపద నృత్యాన్ని అభ్యసిస్తున్న పిల్లలు . ఎళిల్ అన్న అనేక జానపద కళారూపాలను పిల్లలకు పరిచయం చేస్తారు

పిల్లలతో కలిసి పనిచేస్తున్నపుడు, “గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు, ప్రత్యేకించి అమ్మాయిలు, పాఠశాలలో కూడా చాలా సిగ్గుపడుతుంటారు. వాళ్ళు ఉపాధ్యాయులను ప్రశ్నలు అడగడానికి గానీ, సందేహాలు అడగడానికి గానీ సంకోచిస్తారు," అని ఆయన గ్రహించారు. అతనిలా అంటారు: “నేను వారికి రంగస్థలం (థియేటర్) ద్వారా బహిరంగంగా మాట్లాడగలిగేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం నేను నాటకరంగ కార్యకర్త అయిన కరుణ ప్రసాద్ దగ్గర క్లాసులు తీసుకున్నాను. కళాకారుడైన పురుషోత్తమన్ మార్గదర్శకత్వంలో, మేం పిల్లలకు థియేటర్‌లో శిక్షణ ఇవ్వడాన్ని ప్రారంభించాం."

ఆయన తన పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి, ఇతర దేశాల నుండి వచ్చిన కళాకారుల నుండి తాను నేర్చుకున్న వివిధ కళారూపాలను కూడా అనువర్తించే ప్రయత్నం చేస్తారు. పిల్లలు తమ స్వంత పరిసరాలకు సన్నిహితంగా ఉండేలా చేయడానికి ఆయన కృషిచేస్తారు. “మేం మా శిబిరాల్లో భాగంగా పర్యావరణ చిత్రాలను ప్రదర్శిస్తాం. మేం వారికి జీవితాన్ని అర్థం చేసుకునే కళను నేర్పుతాం - ఎంత చిన్నదైనా సరే; అది పక్షి అయినా, పురుగు అయినా కూడా. వారు తమ పరిసరాలలో ఉన్న మొక్కలను గుర్తించడం, వాటి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం, అలాగే భూమిని గౌరవించడం, దానిని పరిరక్షించడాన్ని కూడా నేర్చుకుంటారు. జీవావరణ శాస్త్రం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పే నాటికలను నేను తెస్తాను. వాళ్ళు మన మొక్కల, జంతువుల చరిత్రను తెలుసుకుంటారు. ఉదాహరణకు, సంగం సాహిత్యంలో 99 రకాల పువ్వుల గురించి ప్రస్తావించారు. పిల్లలు వాటిని బొమ్మగీసేలా, వాటి గురించి పాటలు పాడేలా, మన పురాతన సంగీత వాయిద్యాలను వాయించేలా మేము పిల్లలకు నేర్పిస్తాం." అని ఎళిల్ అన్న వివరించారు. నాటకాల కోసం కొత్త పాటలు సృష్టించేవారు. కీటకాల గురించీ, జంతువుల గురించీ కథలు తయారు చేసేవారు.

ఎళిల్ అన్న ఎక్కువగా ఆదివాసీ, తీరప్రాంత గ్రామాల పిల్లలతో పనిచేశారు. అయితే కొన్నిసార్లు ఆయన పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలతో కలిసి పని చేశాక, వారికి జానపద కళలు, జీవనోపాధిపై అవగాహన లేకపోవడాన్ని ఆయన గమనించారు. ఆయన తర్వాత డోలు వాయిద్యాన్ని ఉపయోగించే పఱై, కాలికి గజ్జె కట్టుకుని ప్రదర్శించే శిలంబు, పులి ముసుగులను ఉపయోగించి చేసే నృత్య రూపకమైన పులితో సహా జానపద కళలకు సంబంధించిన సాంకేతికతలను చేర్చి పని చేయడం ప్రారంభించారు. "ఈ కళారూపాలను పిల్లల్లోకి తీసుకెళ్లడం, వాటిని సంరక్షించడం చాలా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కళారూపాలు మన పిల్లలను సంతోషంగా, స్వేచ్ఛగా ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నేను నమ్ముతున్నాను.” అని ఎళిల్ అన్న చెప్పారు.

ఐదు నుండి ఆరు రోజుల పాటు జరిగే శిబిరాల్లో ఎప్పుడూ ఒకరి కంటే ఎక్కువ మంది కళాకారులు బృందంలో ఉంటారు. గాయకుడైన తమిళరసన్, చిత్రకారుడైన రాకేశ్ కుమార్, శిల్పి ఎళిల్ అన్న , జానపద కళాకారులైన వేల్‌మురుగన్, ఆనంద్ వంటి వారందరూ ఒకే జట్టులో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. "వాస్తవానికి, మా జట్టులో ఫోటోగ్రాఫర్‌లు కూడా ఉన్నారు. వారు మా పిల్లలకు వారి జీవితాలను ఛాయాచిత్రాలలో డాక్యుమెంట్ చేయడాన్ని నేర్పిస్తారు" అని అన్న నా ఛాయా కార్యకలాపాలను సున్నితంగా సూచిస్తూ చెప్పేవారు.

PHOTO • M. Palani Kumar

నమ్మక్కల్ జిల్లా, తిరుచ్చెంగోడులో శిబిరం చివరి రోజైన ప్రదర్శన రోజు పఱై ఆట్టం కోసం ఫ్రేమ్ డోలును వాయిస్తున్న పిల్లలు

PHOTO • M. Palani Kumar

తంజావూరులో , ఫోటోలు తీస్తున్న పాక్షికంగా కనుచూపు ఉన్న అమ్మాయిలు

అందమైన క్షణాలను ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు. పిల్లలూ పెద్దలూ నవ్వే క్షణాలు! నా స్వంత తల్లిదండ్రులతో అలాంటి క్షణాలను పునఃసృష్టి చేయడానికి ఆయన నాకు సహాయం చేశారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడూ, ఫోటోగ్రఫీపై ఆసక్తి ఏర్పడినప్పుడూ నన్ను కూడా మా తల్లిదండ్రులతో కలిసి ఉండమని ఎళిల్ అన్న నాతో చెప్పారు. ఆయనకు తన తల్లితో ఉన్న అనుబంధం గురించిన కథలను నాతో పంచుకున్నారు; తండ్రి మరణం తర్వాత ఆమె అతన్నీ, అతని నలుగురు తోబుట్టువులను ఒంటిచేత్తో ఎలా పెంచుకొచ్చారో చెప్పారు. తన తల్లి చేసిన పోరాటాన్ని తెలియజేసే ఈ సంభాషణల ద్వారానే ఎళిల్ అన్న , నన్ను పెంచడంలో నా తల్లిదండ్రులు చేసిన కృషి గురించి నేను ఆలోచించేలా చేశారు. అలా నేను నా తల్లికి విలువనిచ్చాను, ఆమెను ఫోటో తీసి, ఆమె గురించి రాశాను .

ఎళిల్ అన్న తో కలిసి నా ప్రయాణాన్ని ప్రారంభించాకనే నేను నాటకాలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింట్ చేయడం, రంగులను సృష్టించడం నేర్చుకోవడంతో పాటు పిల్లలకు ఫోటోగ్రఫీని నేర్పించడం కూడా ప్రారంభించాను. ఇది పిల్లలకూ, నాకూ మధ్య సంభాషణల ప్రపంచాన్ని తెరిచింది. నేను వారి కథలను విన్నాను, వారి జీవితాలను ఛాయాచిత్రాలలో డాక్యుమెంట్ చేశాను. వారితో మాట్లాడి, వారితో కలిసి ఆడుతూ, పాడుతూ ఫోటోగ్రాఫ్‌లు తీసుకున్నప్పుడు, అది ఒక రకమైన వేడుకగా మారింది. నేను వాళ్ళతో కలిసి వారి ఇళ్లకు వెళ్లి, వారితో కలిసి భోజనం చేసి, వారి తల్లిదండ్రులతో మాట్లాడాను. నేను వారితో సంభాషించిన తర్వాత, వారితో జీవితాన్నీ, సమయాలనూ పంచుకున్న తర్వాత ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఏదో మాయాజలం జరుగుతుందని నేను గ్రహించాను.

గత 22 సంవత్సరాలలో, ఎళిల్ అన్న కళిమణ్ విరల్గళ్‌ను ప్రారంభించినప్పటి నుండి ఆయన తాకిన ప్రతి జీవితానికీ ఒక మాయాజాలాన్నీ, వెలుగునూ తీసుకురాగలిగారు. “మేం ఆదివాసీ పిల్లలకు విద్యాసంబంధమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాం. విద్య ప్రాముఖ్యతను వారికి బోధిస్తున్నాం. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యను కూడా నేర్పిస్తాం. ఆత్మరక్షణ కోసం శిక్షణ పొందినప్పుడు పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని మనం చూస్తాం,” అని ఆయన చెప్పారు. మన పిల్లలపై నమ్మకముంచడం, వారిలో హేతుబద్ధమైన ఆలోచనను దృఢపరచడం, భావ ప్రకటనా స్వేచ్ఛను పెంపొందించడం చేయాలనేదే ఆయన ఆలోచన.

"అన్ని జీవితాలు సమానమని మేం నమ్ముతున్నాం, ఆ విషయాన్నే మేం వారికి బోధిస్తాం" అని ఆయన చెప్తారు. "వారి ఆనందం నుంచే నేనూ నా ఆనందాన్ని పొందుతాను."

PHOTO • M. Palani Kumar

కోయంబత్తూరులోని ఒక పాఠశాలలో పిల్లల చిరునవ్వులతో గదిని నింపేసిన అద్దం అనే రంగస్థల అభ్యాసానికి నాయకత్వం వహిస్తున్న ఎళిల్ అన్న

PHOTO • M. Palani Kumar

నాగపట్టిణంలో పక్షుల గురించి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్న ఎళిల్ అన్న , అతని బృందం

PHOTO • M. Palani Kumar

తిరువణ్ణామలైలో మాస్క్ లు , దుస్తులూ ధరించి , రంగులు వేసిన ముఖాలతో లయన్ కింగ్ అనే నాటకాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు

PHOTO • M. Palani Kumar

సత్యమంగళంలో పిల్లలతో ఎళిల్ అన్న . మీరు అతని జీవితం నుండి పిల్లలను తీసివేయలేరు . పిల్లల విషయానికి వస్తే ఆయన ఆకట్టుకునే కార్యశూరుడైన వ్యక్తి

PHOTO • M. Palani Kumar

జవ్వాజి కొండలలో , తాము తయారు చేసిన కాగితం మాస్క్ లతో పోజులిస్తున్న పిల్లలు

PHOTO • M. Palani Kumar

చుట్టుముట్టిన కాగితం సీతాకోకచిలుకల మధ్య ఒక పాప . వీటిని కాంచీపురంలోని వినికిడి లోపంతో పాటు మాట్లాడలేని పిల్లల కోసం ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఓరిగామి శిక్షణా శిబిరంలో తయారుచేశారు

PHOTO • M. Palani Kumar

పెరంబళూరులో , వేదిక అలంకరణ కోసం పిల్లలు స్వంతంగా పోస్టర్లు గీస్తున్నారు . వేదికను కాగితంతోనూ , వస్త్రంతోనూ తయారుచేశారు

PHOTO • M. Palani Kumar

జవ్వాజి కొండలలో చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలను ఉపయోగించి జంతువుల నమూనాలను తయారుచేస్తున్న ఎళిల్ అన్న , పిల్లలు

PHOTO • M. Palani Kumar

నాగపట్టిణంలోని ఒక పాఠశాల ఆవరణలో పిల్లలతో కలిసి కూర్చొని ఉన్న ఎళిల్ అన్న

PHOTO • M. Palani Kumar

కాంచీపురంలోని వినికిడి లోపం కలిగిన పిల్లల కోసం ఉన్న పాఠశాల హాస్టల్‌కు చెందిన పిల్లలు పాత సిడిలతో ప్రాపర్టీలను తయారుచేస్తున్నారు

PHOTO • M. Palani Kumar

సేలంలోని ఒక పాఠశాలలో తాము తాయారుచేసిన కళాకృతులను ప్రదర్శిస్తోన్న పిల్లలు

PHOTO • M. Palani Kumar

సత్యమంగళంలో నిర్వహించిన శిబిరంలో రూపొందించిన కళాఖండాలను , ప్రదర్శన రోజున చూసేందుకు రావలసిందిగా గ్రామానికి స్వాగతం పలుకుతున్న పిల్లలతో ఎళిల్ అన్న

PHOTO • M. Palani Kumar

కావేరిపట్టిణంలో ప్రదర్శన రోజున జానపద నృత్యమైన పొయ్ కాల్ కుదురై ఆట్టంను పరిచయం చేస్తున్న ఎళిల్ అన్న . పొయ్ కాల్ కుదురై , లేదా నకిలీ కాళ్ళ గుర్రంను కాగితం అట్టలనూ , గుడ్డనూ ఉపయోగించి తయారుచేస్తారు

PHOTO • M. Palani Kumar

కావేరిపట్టిణంలో శిబిరం చివరి రోజున , ‘ పప్రపా బై బై , బై బై పప్రపా ' అంటూ అరుస్తున్న ఎళిల్ అన్న బృందం , పిల్లలు

వీడియో చూడండి: నాగపట్టిణంలో పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతున్న ఆర్. ఎళిల్ అరసన్

ఈ వ్యాసాన్ని అనువాదం చేయడంలో చేసిన కృషికి కవితా మురళీధరన్‌కు, ఇన్‌పుట్‌లను అందించిన అపర్ణ కార్తికేయన్‌కు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

తాజా కలం: ఈ వ్యాసం ప్రచురణకు సిద్ధమవుతున్న సమయంలోనే, జూలై 23, 2022న, ఆర్. ఎళిల్అరసన్‌కు గుయెన్-బారీ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి ఉపరితల నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కండరాల బలహీనతకూ, పక్షవాతానికీ దారితీస్తుంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది. యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Other stories by M. Palani Kumar
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli