"ఇది నా వాయిద్యం కాదు," అప్పుడే తన భార్య బాబురీ భోపీతో కలిసి తయారుచేసిన రావణ్‌హత్థా ని పైకెత్తి చూపిస్తూ అన్నారు కిషన్ భోపా.

"అవును, నేను దీన్ని వాయిస్తాను. కానీ ఇది నాది కాదు," అంటారు కిషన్. "ఇది రాజస్థాన్ గౌరవం."

రావణ్‌హత్థా వెదురుతో తయారుచేసే తీగలు, కమాను కలిగిన ఒక సంగీత వాయిద్యం. తరతరాలుగా కిషన్ కుటుంబం ఈ వాయిద్యాన్ని తయారుచేసి, వాయిస్తున్నారు. అతను ఈ వాయిద్యపు మూలాలను హిందూ పౌరాణిక గ్రంథమైన రామాయణంలోవిగా గుర్తిస్తారు. రావణ్‌హత్థా అనే పేరు లంకకు రాజైన రావణుడి నుండి వచ్చిందని ఆయన చెప్తారు. చరిత్రకారులు, రచయితలు కిషన్‌తో ఏకీభవిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకొని దీవెనలు అందుకోవడానికి రావణుడు ఈ పరికరాన్ని సృష్టించినట్టుగా వాళ్ళు చెప్తారు

రావణ్‌హత్థా : ఎపిక్ జర్నీ ఆఫ్ ఏన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్ రాజస్థాన్ అనే పుస్తకాన్ని రాసి, 2008లో ప్రచురించిన డా. సునీర కసలీవాల్, " రావణ్‌హత్థా తీగలు, కమాను కలిగిన వాయిద్యాలలో అతి పురాతనమైనది," అంటారు. దీనిని వాయులీనాన్ని పట్టుకున్నట్టే పట్టుకుని వాయిస్తారు కాబట్టి, ఈ వాయిద్యం వాయులీనం, చెలో వంటి వాయిద్యాలకు పూర్వరూపం అని అనేకమంది పండితులు నమ్ముతారు.

దీనిని తయారుచేయడం కిషన్, బాబురీల రోజువారీ జీవితాలతో చాలా దగ్గరగా ముడిపడిపోయింది. ఉదయపుర్ జిల్లా, గిర్వా తెహసిల్ , బర్‌గాఁవ్ గ్రామంలోని వారి ఇంటి చుట్టుపక్కల ప్రదేశమంతా రావణ్‌హత్థా తయారుచేసేందుకు అవసరమైన వెదురు దుంగలు, కొబ్బరి టెంకలు, మేక చర్మం, దారాలతో నిండిపోయి ఉంటుంది. వారు రాజస్థాన్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసిన నాయక్ సముదాయానికి చెందినవారు.

నలబై ఏళ్ళు దాటిన వయసులో ఉన్న ఈ దంపతులు ప్రతి ఉదయం 9 గంటలకల్లా తమ ఊరిని వదిలి ఉదయపుర్ నగరంలోని ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలమైన గణగౌర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కిషన్ రావణ్‌హత్థా ను వాయిస్తుండగా, బాబురీ ఆభరణాలను అమ్ముతుంటారు. రాత్రి 7 గంటలకల్లా తమ సరంజామానంతా మూటగట్టుకొని, ఇంటివద్ద ఉండే పిల్లల దగ్గరకు తిరుగుప్రయాణమవుతారు.

ఈ చిత్రంలో రావణ్‌హత్థా ను ఎలా తయారుచేస్తారో, ఈ వాయిద్యం ఎలా వారి జీవితాలను తీర్చిదిద్దిందో, ఇంకా ఈ కళను జీవించి ఉండేలా చేయడానికి వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించీ కిషన్, బాబురీలు మనకు వివరిస్తారు.

ఈ చిత్రాన్ని చూడండి: రావణ పరిరక్షణ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Urja
Text Editor : Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Other stories by Riya Behl
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli