దక్షిణ ముంబైలో చిక్కగా, చిక్కురొక్కురుగా అల్లుకున్న ఇరుకు దారుల భులేశ్వర్‌లో మంజూర్ ఆలం షేక్ ప్రతిరోజూ ఉదయం 5 గంటలకంతా మేల్కొని, పనిలోకి వెళ్తారు. సన్నగా, పొడవుగా, తరచుగా గళ్ళ లుంగీ ధరించి ఉండే ఆయన తాను అద్దెకు తీసుకున్న 550-లీటర్ లోహపు బండిని నీటితో నింపేందుకు కావాసజీ పటేల్ ట్యాంక్ వైపుకు నెట్టారు. ఈ ప్రాంతం అతని ఇంటికి ఒక కిలోమీటరు దూరంలోని మీర్జా గాలిబ్ మార్కెట్ సమీపంలో ఉన్న దూధ్ బాజార్‌లో, ఒక పబ్లిక్ టాయిలెట్ మూలన ఉన్న బహిరంగ ప్రదేశంలో ఉంది. అతను తన బండితో దూధ్ బాజార్‌కు తిరిగి వచ్చి, దానిని నిలబెట్టి ఉంచేందుకు ఒక ప్రదేశాన్ని ఎంచుకుని, సమీపంలోని దుకాణాలకూ, ఇళ్లలోని తన ఖాతాదారులకూ నీటిని పంపిణీ చేయడం ప్రారంభిస్తారు.

ఈ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న చివరి తరం భిశ్తీల లో 50 ఏళ్ల మంజూర్ కూడా ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ముంబై నగరంలోని ఈ చారిత్రాత్మక ప్రాంతంలోనివాసముండేవారికి త్రాగడానికి, శుభ్రం చేయడానికి, కడగడానికి అవసరమైన నీటిని మంజూర్ సరఫరా చేస్తున్నారు. కోవిడ్-19 విజృంభణ భిశ్తీల ఈ వృత్తికి అంతరాయం కలిగించే వరకు, భులేశ్వర్‌లో మశక్‌ తో నీటిని సరఫరా చేసే కొద్దిమంది మశక్‌ వాలాల లో మంజూర్ కూడా ఒకరు. దాదాపు 30 లీటర్ల నీటిని మోసుకెళ్లేందుకు రూపొందించిన తోలు సంచిని మశక్ అంటారు.

కానీ 2021లో ప్లాస్టిక్ బకెట్లకు మారిన మంజూర్, మశక్ ద్వారా నీటిని సరఫరా చేసే సంప్రదాయం “ఇప్పుడు చచ్చిపోయింది,” అని చెప్పారు. "వృద్ధులైన భిస్తీలు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుంది, చిన్నవాళ్ళు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవలసి ఉంటుంది" అని అతను చెప్తున్నారు. భిశ్తీలు చేస్తున్న ఈ పని ఉత్తర భారతదేశంలోని ముస్లిం సామాజికవర్గమైన భిశ్తీల సంప్రదాయ వృత్తి యొక్క అవశేషం. ' భిశ్తీ ' అనే పదం పర్షియన్ మూలానికి చెందినది. దీనికి 'నీటి వాహకం' అని అర్థం. ఈ సామాజిక వర్గాన్ని 'నీళ్ళు మోసేవాళ్ళు’ లేదా 'కుండలు మోసేవారు' అనే అర్థాన్నిచ్చే అరబిక్ పదమైన సక్కా(Saqqa) అనే పేరుతో కూడా పిలుస్తారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్(ఇక్కడ వీరిని పఖాలీ అని పిలుస్తారు)లలో భిశ్తీలు ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి)గా వర్గీకరించబడ్డారు.

PHOTO • Aslam Saiyad

దక్షిణ ముంబై, భులేశ్వర్‌లోని CP ట్యాంక్ ప్రాంతం నుండి నీటితో నిండిన తన లోహపు నీటిబండిని నెట్టడానికి మంజూర్‌ఆలం షేక్ (గులాబీ రంగు చొక్కా)కు సహాయం కావాలి. బండిపై ఉన్న అతని మశక్‌ని చూడవచ్చు

“నీటి సరఫరా వ్యాపారాన్ని బిశ్తీలే ఏలేవారు. ముంబైలోని వివిధ ప్రదేశాలలో వారికి ఈ మెటల్ నీటి బళ్ళు ఉన్నాయి. ప్రతి బండి వద్ద దాదాపు 8 నుండి 12 మంది వ్యక్తులు నీటిని పంపిణీ చేసే ఉద్యోగం చేసేవారు." అని మంజూర్ చెప్పారు. ఒకప్పటి భిశ్తీల ఈ సంపన్న వ్యాపారం పాత ముంబైలో క్షీణించడం ప్రారంభించడంతో, వారు ఇతర అవకాశాల కోసం వెతకడం మొదలెట్టారని అతను జోడించారు. గ్రామీణ ఉత్తర ప్రదేశ్, బిహార్‌ల నుండి వలస వచ్చిన కార్మికులు ఇప్పుడు భులేశ్వర్‌లో నెమ్మదిగా వారి స్థానాన్ని ఆక్రమించారు.

మంజూర్ 1980లలో బిహార్ రాష్ట్రం, కటిహార్ జిల్లాలోని తన గ్రామమైన గచ్ రసూల్‌పూర్ నుండి ముంబైకి వచ్చారు. ఈ పనిలో ప్రవేశించడానికి ముందు, ముంబైకి వచ్చిన మొదటి రెండు నెలలు, ఆయన వడ-పావ్‌ ను అమ్మేవారు. పుట్టుకతో భిశ్తీ కాకపోయినప్పటికీ, అతను భులేశ్వర్‌లోని డోంగ్రీ, భిండీ బాజార్ ప్రాంతాలలో నీటి సరఫరా చేసే పనిని చేపట్టారు.

"నేను రాజస్థాన్‌కు చెందిన భిశ్తీ, ముంతాజ్ ద్వారా నియమించబడి శిక్షణ పొందాను" అని మంజూర్ చెప్పారు. "ఆ సమయంలో అతనికి నాలుగు నీటి బండ్లు ఉండేవి. ఒకో బండిని ఒకో మొహల్లా లో ఉంచేవారు. అక్కడి నుండి 7-8 మంది వ్యక్తులు మశక్ ‌లలో నీటిని నింపి, పంపిణీ చేసేవారు."

PHOTO • Aslam Saiyad

కోవిడ్-19 లాక్‌డౌన్‌ల తర్వాత, మంజూర్ మశక్‌ను వదులుకొని నీటిని సరఫరా చేయడానికి ప్లాస్టిక్ బకెట్లకు మారవలసి వచ్చింది

ముంతాజ్‌తో దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేసిన తరువాత, మంజూర్ తానే స్వంతంగా ఒక నీటి బండిని అద్దెకు తీసుకొని పని ప్రారంభించారు. “20 ఏళ్ల క్రితం కూడా మాకు చాలా పని ఉండేది. కానీ ఇప్పుడు ఆ పనిలో 25 శాతం మాత్రమే మిగిలి ఉంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని అమ్మడం ప్రారంభించిన తర్వాత మా వ్యాపారం బాగా దెబ్బతింది,” అని మంజూర్ చెప్పారు. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ తర్వాత బాటిళ్ళలో నీటిని విక్రయించే పరిశ్రమ వేగంగా పెరిగిపోయి, భులేశ్వర్‌లోని భిశ్తీలను తీవ్రంగా దెబ్బతీసింది. 1999 నుంచి 2004 మధ్య, భారతదేశం మొత్తంగా బాటిల్ నీటి వినియోగం మూడు రెట్లు పెరిగింది. పరిశ్రమ టర్నోవర్ 2002లో రూ. 1,000 కోట్లు అని అంచనా.

సరళీకరణ అనేక విషయాలను మార్చింది - చిన్న దుకాణాల స్థానంలో మాల్స్, చాల్‌ల స్థానాన్ని ఎత్తైన భవనాలు ఆక్రమించాయి. ట్యాంకర్లు మోటారు పైపులతో నీటిని సరఫరా చేయడం ప్రారంభించాయి. నివాస భవనాల నుండి నీటికి డిమాండ్ క్రమంగా తగ్గిపోయింది. దుకాణాలు, వర్క్‌షాపులు వంటి చిన్నపాటి వాణిజ్య సంస్థలు మాత్రమే మశక్‌వాలాల పై ఆధారపడి ఉన్నాయి. “భవనాలలో నివసించే వారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవడం ప్రారంభించారు. ప్రజలు నీటి కోసం పైపులైన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు, పెళ్లిళ్లలో బాటిల్ వాటర్ అందించడం ఆనవాయితీగా మారింది, కానీ ఇంతకు ముందు అలా వుండేది కాదు, నీటిని మేమే సరఫరా చేసేవాళ్ళం.” అని మంజూర్ చెప్పారు.

కోవిడ్‌కు ముందు, మంజూర్ ప్రతి మశక్‌ కు (సుమారు 30 లీటర్లు) 15 రూపాయలు సంపాదించేవారు. ఇప్పుడతనికి 15 లీటర్ల బకెట్ నీటిని పంపిణీ చేసినందుకు 10 రూపాయలు వస్తోంది. నీటి బండి అద్దె కోసం నెలకు రూ. 170, నీరు తెచ్చే ప్రదేశాన్ని బట్టి రోజుకు రూ. 50 లేదా రూ. 80 ఖర్చుచేస్తారు. ఆ ప్రాంతంలో బావులు ఉన్న దేవాలయాలు, పాఠశాలలు భిశ్తీల కు నీటిని విక్రయిస్తున్నాయి. "ఇంతకుముందు మేము ప్రతి నెలా కనీసం 10,000-15,000 రూపాయలు ఆదా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకు నెలకు 4,000-5,000 రూపాయలు మాత్రమే మిగులుతోంది" అని మంజూర్ తన వ్యాపారం బాగా ఉన్న సమయంతో ఇప్పటి సమయాన్ని పోల్చిచెప్పారు.

PHOTO • Aslam Saiyad

నీరు పంపిణీ చేసిన తర్వాత (డిసెంబర్ 2020లో) తిరిగి వస్తూ, ఏదైనా ఆర్డర్ తప్పిపోయిందేమోనని తన ఫోన్‌లో తనిఖీ చేసుకుంటున్న మంజూర్. వాడుకగా నీరు పోయించుకునే వారి నుంచి రోజుకు 10-30 ఆర్డర్ల వరకూ ఆయన అందుకుంటారు. కొందరు నీటికోసం స్వయంగా వచ్చి అడిగితే, మరికొందరు ఫోన్ ద్వారా అడుగుతారు

అతని వ్యాపార భాగస్వామి, 50 ఏళ్ల ఆలం (ఈయన తన మొదటి పేరును మాత్రమే ఉపయోగిస్తారు) కూడా బిహార్‌లోని అతని గ్రామానికే చెందినవారు. ఆలం, మంజూర్‌లు ముంబయిలో 3-6 నెలల పాటు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని వారి కుటుంబాలతో కలిసి గ్రామంలో గడుపుతున్నారు. ఇంటివద్ద తమ పొలాలలో పనిచేసుకోవడమో, లేదంటే వ్యవసాయ కూలీలుగానో పని చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా మార్చి 2020లో మొదలై జూన్ 2020 వరకు పొడిగించబడిన లాక్‌డౌన్ సమయంలో, మశక్‌వాలాల కు భులేశ్వర్‌లో కొద్దిమంది ఖాతాదారులు - ఆ ప్రాంతంలోని చిన్న వ్యాపార సంస్థలలో పనిచేసే సహాయక సిబ్బంది - మాత్రమే మిగిలారు. వీరు పగలంతా పనిచేసి, రాత్రుళ్ళు పేవ్‌మెంట్‌ల మీద పడుకునేవారు. కానీ చాలా దుకాణాలు మూతపడటంతో వాటిలో పనిచేసే కార్మికులు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయారు. దాంతో ఇంట్లో తన ఐదుగురు పిల్లలను పోషించాల్సిన మంజూర్ తన కుటుంబానికి పంపడానికి సరిపోయేంత డబ్బు సంపాదించలేకపోయారు. అతను 2021 ప్రారంభంలో నగరంలోని హాజీ అలీ ప్రాంతంలోని ఒక భవనాన్ని కడుతున్న చోట, మేస్త్రీకి సహాయకుడిగా రోజుకు రూ. 600 కూలీకి పని చేయడం ప్రారంభించారు.

మార్చి 2021లో, మంజూర్ తన గ్రామమైన గచ్‌రసూల్‌పూర్‌కు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ అతను వ్యవసాయ కూలీగా రోజుకు రూ. 200 కూలీకి పనిచేశారు. అలా సంపాదించిన డబ్బుతో ఇంటిని బాగుచేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత, ముంబైకి తిరిగి వచ్చి, ఈసారి నల్ బాజార్ ప్రాంతంలో మశక్‌వాలా గా పనిని కొనసాగించారు. ఇంతలో అతని తోలు సంచికి మరమ్మత్తు అవసరం అయింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి మశక్‌ ను సరిచేయాల్సివుంటుంది. దాంతో మంజూర్ దానిని బాగుచేయించడానికి యూనుస్ షేక్ కోసం వెతుక్కుంటూ వెళ్లారు.

PHOTO • Aslam Saiyad

జనవరి 2021లో ముంబైలోని భిండీ బాజార్ ప్రాంతంలో ఒక మశక్‌ను సరిచేస్తున్న యూనుస్ షేక్. అతను కొన్ని నెలల తర్వాత మంచి రోజులకోసం బహరయిచ్ జిల్లాలోని తన ఇంటికి తిరిగివెళ్ళారు

60-70ల మధ్య వయసులో ఉన్న యూనుస్, భిండీ బాజార్‌లో మశక్‌ ను తయారుచేయడం, వాటిని మరమ్మత్తు చేయడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మార్చి 2020లో లాక్‌డౌన్ విధించిన నాలుగు నెలల తర్వాత, యూనుస్ ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలోని తన ఇంటికి తిరిగి వెళ్లారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో ఆయన తిరిగి ముంబైకి వచ్చినప్పుడు, పెద్దగా పని దొరకలేదు. ఈ ప్రాంతంలో కేవలం 10 మంది మశక్‌ వాలాలు మాత్రమే పనిచేస్తున్నారు. కోవిడ్-19 లాక్‌డౌన్‌ల తర్వాత, వారు అతనితో చేయించుకున్న పనికి తక్కువ డబ్బును ఇవ్వడం ప్రారంభించారు. ఎక్కువ ఆశ లేకపోయినా, యూనుస్ 2021 ప్రారంభంలో బహరాయిచ్‌కు తిరిగి వచ్చారు; మళ్ళీ ముంబైకి తిరిగి వెళ్ళలేదు. మశక్ ‌లను చక్కదిద్దే శక్తిని కోల్పోయానని ఆయన అన్నారు.

35 ఏళ్ల బాబు నయ్యర్‌కు, ఇది మశక్ మోసే రోజులకు ముగింపు పలికేసింది. "మరమ్మత్తు చేయటం కుదరకపోవడంతో నేను దాన్ని విసిరిపారేశాను." భిండీ బాజార్‌లోని నవాబ్ అయాజ్ మసీదు చుట్టూ ఉన్న దుకాణాలకు నీటిని సరఫరా చేసేందుకు అతనిప్పుడు ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగిస్తున్నారు. యూనుస్ తన గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత, “ఆరు నెలల క్రితం వరకు ఒక ఐదారుమంది మశక్‌ లు వాడేవారు. ఇప్పుడందరూ బకెట్లు లేదా హండా (అల్యూమినియం కుండ)కు మారారు.” అని  బాబు చెప్పారు.

తన తోలు సంచిని మరమ్మత్తు చేయడానికి ఎవరూ దొరకకపోవడంతో మంజూర్ కూడా ప్లాస్టిక్ బకెట్లకు మారాల్సి వచ్చింది. "యూనుస్ తర్వాత, మశక్‌ ను మరమ్మత్తు చేసేవారు ఇంకెవరూ లేరు," అని మంజూర్ ధృవీకరించారు. బకెట్లలోకి నీటిని ఎత్తి మోసుకుంటూ మెట్లు ఎక్కడం అతనికిప్పుడు చాలా కష్టంగా ఉంటోంది. మశక్‌ తో అది సులువుగా ఉండేది. మశక్‌ లో ఎక్కువ మొత్తంలో నీరు పడుతుంది. దాన్ని భుజానికి తగిలించుకుని తీసుకుపోవచ్చు. "ఇది భిశ్తీలు గా మా పనిలో చివరి దశ" అని బాబు అంచనా వేస్తున్నారు. “ఇందులో డబ్బు లేదు. మోటారు పైపులు మా పనిని లాగేసుకున్నాయి."

PHOTO • Aslam Saiyad

భులేశ్వర్‌లోని సీపీ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న చందారామ్‌జీ ఉన్నత పాఠశాలలో తన నీటి బండిని నింపుకుంటున్న మంజూర్. ఇక్కడి బావులున్న దేవాలయాలు, పాఠశాలలు భిశ్తీలకు నీటిని విక్రయిస్తాయి

PHOTO • Aslam Saiyad

దూధ్ బాజార్‌లో, నీటిని పంపిణీ చేయాల్సిన ప్రాంతం వద్ద తన బండి నుండి నీటిని నింపుకుంటున్న మంజూర్. ఇది డిసెంబర్ 2020 నాటి ఫోటో. అప్పటికతను మశక్‌ని ఉపయోగిస్తున్నారు. దన్ను కోసం సంచీ అడుగుభాగాన్ని కారు టైరుపై ఉంచి, సంచీ మూతిని నీరు బయటకు వచ్చేదగ్గర పెట్టి, అది నిండే వరకు వేచి ఉంటారు

PHOTO • Aslam Saiyad

మశక్‌ను భుజానికి తగిలించుకొని, బ్యాలెన్స్ చేయడానికి సంచీ మూతిని ఒక చేత్తో పట్టుకుంటారు

PHOTO • Aslam Saiyad

భులేశ్వర్‌లోని చిన్నపాటి సంస్థలు మశక్‌వాలాల నుండి నీటిని ఆర్డర్ చేస్తాయి. ఇక్కడ మంజూర్ నల్ బాజార్‌లోని ఓ దుకాణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. అతను ఆ ప్రాంతంలోని నిర్మాణ స్థలాల నుండి కూడా ఆర్డర్లను అందుకుంటారు

PHOTO • Aslam Saiyad

నల్ బాజార్‌లోని శిథిలావస్థలో ఉన్న ఒక పాత మూడంతస్తుల నివాస భవనం చెక్క మెట్లు ఎక్కుతున్న మంజూర్. రెండవ అంతస్తులో నివాసముంటున్నవారికి 60 లీటర్ల నీటిని పంపిణీ చేయాల్సి వచ్చింది. దాని కోసం మంజూర్, తన మశక్‌తో రెండుమూడుసార్లు మెట్లు ఎక్కీ దిగాల్సి వచ్చింది

PHOTO • Aslam Saiyad

దూధ్ బాజార్‌లో నీటి బండిని నెడుతూ, నీటిని పంపిణీ చేయడం నుండి విరామం తీసుకుంటున్న మంజూర్, అతని స్నేహితుడు రజాక్

PHOTO • Aslam Saiyad

ఉదయమంతా కష్టపడి పనిచేసిన తర్వాత మధ్యాహ్నంవేళ ఒక కునుకు తీయటం. దూధ్ బాజార్‌లోని పబ్లిక్ టాయిలెట్ పక్కన ఉన్న బహిరంగ ప్రదేశమే 2020లో మంజూర్ 'ఇల్లు'. అతను ఉదయం 5 నుండి 11 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం భోజనంచేసి ఒక కునుకు తీసిన తర్వాత, ఒంటిగంట నుండి సాయంత్రం 5 గంటలవరకూ పని చేస్తారు

PHOTO • Aslam Saiyad

భిశ్తీ వ్యాపారంలో మంజూర్ భాగస్వామి ఆలం, నల్ బాజార్‌లోని రోడ్డు పక్కనే ఉన్న దుకాణదారులకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి 3-6 నెలలకు, బిహార్లోని తన కుటుంబాన్ని సందర్శించడానికి మంజూర్ వెళ్ళినప్పుడు, ఆలం ఆయననుండి బాధ్యతలు తీసుకుంటారు

PHOTO • Aslam Saiyad

జనవరి 2021లో నల్ బాజార్‌లోని ఒక కార్మికుడికి తన మశక్‌తో నీటిని సరఫరా చేస్తున్న ఆలం

PHOTO • Aslam Saiyad

భిండీ బాజార్‌లోని నవాబ్ అయాజ్ మసీదు దగ్గర బాబు నయ్యర్ తన మశాక్‌తో ఒక దుకాణం ముందర నీళ్ళు పోస్తున్నారు. అతను ఈ ప్రాంతంలో భిశ్తీగా పనిచేస్తున్నారు. చాలామంది దుకాణదారులు తమ దుకాణాల ముందున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి భిశ్తీలను పిలుస్తారు. బాబు, ఆలం, మంజూర్‌లు బిహార్‌లోని కటిహార్ జిల్లా, గచ్‌రసూల్‌పూర్ అనే గ్రామానికి చెందినవారు

PHOTO • Aslam Saiyad

జనవరి 2021లో యూనుస్ షేక్ (ఎడమవైపు)కి తన మశక్‌ను చూపిస్తున్న బాబు. మశక్‌కు మూడు చోట్ల రంధ్రాలు పడటంతో మరమ్మతులు చేయాల్సివచ్చింది. మరమ్మత్తు చేసినందుకు 120 రూపాయలు ఇవ్వాలని యూనుస్ కోరగా, బాబు 50 రూపాయలు మాత్రమే ఇవ్వగలిగారు

PHOTO • Aslam Saiyad

భిండీ బజార్లోని నవాబ్ అయాజ్ మసీదు దగ్గర ఒక భవనం ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని బాబు మశక్‌పై పని చేస్తున్న యూనుస్

PHOTO • Aslam Saiyad

మరమ్మత్తు చేసిన తర్వాత ఐదడుగుల పొడవున్న మశక్‌ ను ఎత్తిపట్టుకున్న యూనుస్ . ఫోటో తీసిన రెండు నెలల తర్వాత , అతను బహరాయిచ్‌ లోని తన ఇంటికి వెళ్ళిపోయి , మళ్ళీ ముంబైకి తిరిగి రాలేదు . ముంబయిలో తన ఆదాయం తగ్గిపోయిందనీ , మశక్‌ లని తయారు చేసేందుకూ , మరమ్మత్తు చేసేందుకూ తనకింక శక్తి లేదనీ అతను చెప్పారు

PHOTO • Aslam Saiyad

బాబు ఇప్పుడు తన ఖాతాదారులకు నీటిని సరఫరా చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగిస్తున్నారు

PHOTO • Aslam Saiyad

యూనుస్ వెళ్లిపోయిన తర్వాత తన మశక్‌ను మరమ్మత్తు చేయడానికి ఎవరూ లేకపోవడంతో మంజూర్ ప్లాస్టిక్ బకెట్లకు మారిపోయారు. ఇప్పుడిక్కడ జనవరి 2022లో, పగటిపూట నల్ బాజార్‌లోని చిన్నచిన్న దుకాణాలలో పనిచేస్తూ, రాత్రివేళ వీధుల్లో నివసించే కార్మికుల కోసం మంజూర్ నీటిని తీసుకువెళ్తున్నారు

PHOTO • Aslam Saiyad

నీటి పంపిణీ తర్వాత, మరోసారి బకెట్లు నింపుకోవడానికి తన బండి వద్దకు తిరిగి వస్తున్న మంజూర్


PHOTO • Aslam Saiyad

బిశ్తీలు చేసే పనులను ఇప్పుడు ట్యాంకర్లు ఆక్రమించుకున్నాయి. ఇవి విద్యుత్ మోటారు సహాయంతో భవనాలకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నాయి

PHOTO • Aslam Saiyad

నల్ బాజార్‌లోని ఓ దుకాణంలో ప్లాస్టిక్ డ్రమ్ములు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు భిశ్తీలలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. వారిప్పుడు తాము అద్దెకు తీసుకునే మెటల్ నీటి బండ్లకు బదులుగా ఈ డ్రమ్ములను ఉపయోగిస్తున్నారు

PHOTO • Aslam Saiyad

నల్ బాజార్‌లో నీటిని పంపిణీ చేసిన తర్వాత మంజూర్ ఆలం షేక్, తన మశక్‌తో ఉన్నప్పటి పాత ఫోటో ఇది. ‘మశక్‌లో నీళ్లు తీసుకువెళ్లే సంప్రదాయం ఇప్పుడు చచ్చిపోయింది’

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Photos and Text : Aslam Saiyad

అస్లాం సయ్యద్ ముంబైలో ఫోటోగ్రఫీ, ఫోటో జర్నలిజంలను బోధిస్తున్నారు.'హల్లు హల్లు' హెరిటేజ్ వాక్ సహ వ్యవస్థాపకులు. అతని ఫోటోగ్రఫీ సిరీస్ మొదటిసారిగా 'ది లాస్ట్ భిశ్తీస్' పేరుతో 2021 మార్చిలో కన్‌ఫ్లుయెన్స్‌లో ప్రదర్శించబడింది. కన్‌ఫ్లుయెన్స్ అనేది లివింగ్ వాటర్స్ మ్యూజియం మద్దతుతో ముంబై నీటి కథలపై జరిగే వర్చువల్ ఎగ్జిబిషన్. ఈయన ప్రస్తుతం ముంబైలో బయోస్కోప్ షోగా తన ఫొటోలను ప్రజెంట్ చేస్తున్నారు.

Other stories by Aslam Saiyad
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli