PHOTO • Pranshu Protim Bora

"అస్సామ్ మన చుట్టూరానే ఉంది," అంటూ ఈ వీడియోలో సన్తో తాఁతి పాడాడు. ఈ 25 ఏళ్ల యువకుడు ఝూమూర్ శైలిలో సంగీతాన్నీ సాహిత్యాన్నీ సమకూర్చాడు. ఈ పాట సన్తో తన ఇంటిగా చెప్పుకునే అస్సామ్‌లోని కొండలనూ పర్వతాలనూ సూచిస్తుంది. తాఁతి అస్సామ్‌లోని జోర్‌హాట్ జిల్లా, సికోటా టీ ఎస్టేట్‌లోని ఢేకియాజులి డివిజన్‌లో నివసిస్తున్నాడు. ఒక సైకిళ్ళు మరమ్మత్తు చేసే దుకాణంలో పని చేస్తున్న తాఁతి క్రమం తప్పకుండా తన సంగీతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

ఝూమూర్ అనేది ఒక ప్రసిద్ధ స్థానిక సంగీత శైలి. తాఁతి ఈ పాటలో డోలు దరువు గురించీ, మురళీరవం లోని శ్రావ్యతను గురించీ పేర్కొన్నాడు. ఈ పాటలను సాదరీ భాషలో పాడారు. మధ్య, దక్షిణ, తూర్పు భారతదేశం - బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ - నుండి అస్సామ్‌లోని తేయాకు తోటలలో పనిచేయడం కోసం వలస వచ్చిన అనేక ఆదివాసీ సమూహాలు ఈ పాటలను పాదతాయి.

ఈ ఆదివాసీ సమూహాలు తమలో తాము కలిసిపోవడంతో పాటు స్థానిక సముదాయాలతో కూడా కలిసిపోయాయి. వ్యవహారంలో వీరిని 'తేనీటి తెగలు'గా సూచిస్తారు. అస్సామ్‌లో నివసిస్తున్న వీరి సంఖ్య ఆరు మిలియన్ల వరకూ ఉంటుందని అంచనా. వారి వారి మూల రాష్ట్రాలలో షెడ్యూల్డ్ తెగలుగా వీరు గుర్తించబడినప్పటికీ, ఇక్కడ వారికి ఆ హోదాను నిరాకరించారు. వీరిలో 12 లక్షల మంది వరకూ రాష్ట్రంలోని దాదాపు వెయ్యికి పైగా ఉన్న తేయాకు తోటలలో పనిచేస్తున్నారు.

ఈ వీడియోలో నాట్యం చేస్తున్నవారు తేయాకు తోటల కార్మికులు: సునీతా కర్మకార్, గీతా కర్మకార్, రూపాలి తాఁతి, లఖీ కర్మకార్, నికితా తాఁతి, ప్రతిమా తాఁతి, అరొతి నాయక్.

సన్తో తాఁతి ఇతర వీడియోలను చూడటానికీ, అతని జీవితం గురించి తెలుసుకోవడానికీ 2021 సెప్టెంబర్‌లో PARI ప్రచురించిన దుఃఖం, శ్రమ, ఆశలతో కూడిన సన్తో తాఁతి పాటలు చూడండి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Himanshu Chutia Saikia

అస్సాం రాష్ట్రమ్ లో జోర్హాట్ జిల్లా లో ఉండే హిమాన్షు చుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, సంగీతకారుడు, ఛాయాచిత్రగ్రహకుడు, విద్యార్థి నాయకుడు. అతను 2021లో PARI ఫెలో.

Other stories by Himanshu Chutia Saikia
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli