గ్రామీణ భారతదేశంలో చాలామంది వైకల్యం లేదా విభిన్న సామర్థ్యంతో జీవిస్తున్నారు. పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉండటంతో పాటు, సామాజిక లేదా రాజ్యం తీసుకునే చర్యలు లేదా రాజ్యం పనిచేయకపోవటం వల్ల కూడా వైకల్యం వస్తుంది - ఉదాహరణకు, ఝార్ఖండ్‌లో యురేనియం గనులకు సమీపంలో ఉండటం, లేదా మరాఠ్వాడాలో ప్రజలను ఫ్లోరైడ్ కలిపిన భూగర్భ జలాలను తాగేలా చేసే దారుణమైన కరవులు. కొన్నిసార్లు అనారోగ్యం లేదా వైద్య సంబంధ నిర్లక్ష్యం వల్ల వైకల్యం వస్తుంది - లక్నోలో వ్యర్థ పదార్థాలు సేకరించే కార్మికురాలిగా పనిచేసే పార్వతీ దేవికి కుష్టు వ్యాధి కారణంగా వేళ్ళు దెబ్బతిన్నాయి, మిజోరమ్‌కు చెందిన దేబహల చక్మా ఆటలమ్మ [చికెన్ పాక్స్] పోయటంతో అంధురాలయ్యారు. పాల్ఘర్‌కు చెందిన ప్రతిభా హిలిమ్ గ్యాంగ్రీన్ కారణంగా నాలుగు అవయవాలను కోల్పోయారు. కొందరి వైకల్యం మేధోపరమైనది - శ్రీనగర్‌కు చెందిన చిన్నారి మొహసిన్ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతుండగా, మహారాష్ట్రలోని ప్రతీక్ డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఇలాంటి అనేక సందర్భాలలో పేదరికం, అసమానత, కొరవడిన ఆరోగ్య సేవలు, వివక్ష వలన ఈ సవాళ్ళు తీవ్రమవుతాయి. వైకల్యంతో జీవిస్తున్న వ్యక్తుల గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన PARI కథనాలివి