క్వీర్ వ్యక్తులను లింగ గుర్తింపు, లింగ వ్యక్తీకరణ, లైంగికత, లైంగిక ధోరణుల వర్ణపటలాలను బట్టి గుర్తిస్తారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వెశ్చనింగ్/క్వీర్, ఇంటర్‌సెక్స్, అలైంగిక లాంటి మరెన్నో సమూహాలను కలిపి తరచుగా LGBTQIA+ అనే ఒకే సమూహంగా వర్గీకరిస్తారు. సామాజికంగా, అధికారికంగా పూర్తి ఆమోదం పొందటం కోసం వీరు చేస్తున్న ప్రయాణం ఒక పోరాటం. ఈ సంకలనంలోని కథనాలు క్వీర్ కమ్యూనిటీకి ప్రాథమిక హక్కులు అందుబాటులో లేకపోవడాన్ని ప్రధానాంశంగా చూపిస్తాయి. వ్యక్తిగత, వృత్తిగత ప్రదేశాలలో, సామాజిక అంగీకారం, న్యాయం, గుర్తింపు, స్థిరమైన భవిష్యత్తు కోసం వీరు నిరంతరం పోరాడాల్సి వస్తోంది. భారతదేశపు నలుమూలలకు చెందిన ఈ కథనాలు, క్వీర్ ప్రజల సంఘటిత ఉత్సవాలను, ఒంటరితనాలను, పోరాటాల స్వరాలను ముందుకు తీసుకువచ్చాయి.