జాకిర్ హుస్సేన్, మహేశ్ కుమార్ చౌధరీలు చిన్ననాటి నుంచి స్నేహితులు. ప్రస్తుతం నలబయ్యవ వడిలో ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పటికీ అంతే దగ్గర స్నేహితులు. ఆజనా గ్రామంలో నివసించే జాకిర్, పాకుర్‌లో భవననిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా మహేశ్ కూడా అదే పట్టణంలో ఒక చిన్న రెస్ట్రాంట్‌ను నడుపుతున్నారు.
"పాకుర్ [జిల్లా] చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం; ఇక్కడి ప్రజల మధ్య మంచి సామరస్యం ఉంది," అన్నారు మహేశ్.
"హిమంత బిశ్వ శర్మ [అస్సామ్ ముఖ్యమంత్రి] వంటి బయటినుంచి వచ్చిన వ్యక్తులే తమ ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు," తన స్నేహితుడి పక్కనే కూర్చుంటూ అన్నారు జాకిర్.
సంథాల్ పరగణా ప్రాంతంలో ఒక భాగమైన పాకుర్, ఝార్ఖండ్‌కు తూర్పువైపు మూలన ఉన్నది. ఇక్కడ 2024, నవంబర్ 20న మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకుముందు 2019లో జరిగిన ఎన్నికలలో, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్ఎమ్) నాయకత్వంలోని కూటమి బిజెపిని మట్టికరిపించింది.
తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో, వోటర్లను ప్రలోభపెట్టేందుకు అస్సామ్ ముఖ్యమంత్రితో సహా ఇంకా కొంతమందిని బిజెపి ఇక్కడకు పంపించింది. ‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదార్లు’ అని ముస్లిమ్ వర్గాలపై ముద్ర వేసిన బిజెపి నేతలు, ప్రజల్లో వారిపట్ల ఆగ్రహాన్ని రెచ్చగొట్టారు.
"మా పక్కింట్లోనే హిందువులు నివసిస్తారు; వాళ్ళు మా ఇంటికి వస్తారు, నేను వాళ్ళింటికి వెళ్తాను," జాకీర్ కొనసాగించారు, "ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే హిందు-ముస్లిమ్ సమస్య ఎప్పుడూ ముందుకు వస్తుంది. లేకపోతే వాళ్ళెట్లా [బిజెపి] గెలుస్తారు?"
జంషెడ్‌పూర్‌లో 2024 సెప్టెంబరులో జరిగిన ర్యాలీలో, ప్రధాని నరేంద్ర మోదీ చొరబాటు సమస్యకు తన రాజకీయ ఊతాన్ని అద్దాడు. “సంథాల్ పరగణా [ప్రాంతం]లో ఆదివాసీ జనాభా వేగంగా తగ్గిపోతోంది. భూములను కబ్జా చేస్తున్నారు. చొరబాటుదారులు పంచాయతీలలో స్థానాలను ఆక్రమిస్తున్నారు," అని ఆయన ప్రజలనుద్దేశించి అన్నాడు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గృహ మంత్రి అమిత్ షాలు కూడా తమ ప్రసంగాలలో ఇదే మాట్లాడారు. "ఝార్ఖండ్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటును నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం, ఆదివాసీ తెగల హక్కులను కాపాడుతాం," అని బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పింది.
రాజకీయ లబ్ధి కోసం బిజెపి ఈ అంశాన్ని వాడుకుంటోందని సామాజిక కార్యకర్త అశోక్ వర్మ మండిపడ్డారు. “ఒక తప్పుడు కథనాన్ని ప్రచారంలో పెట్టారు. సంథాల్ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్య లేనేలేదు,” అని ఆయన అన్నారు. ఛోటా నాగ్‌పూర్, సంథాల్ పరగణా కౌలు చట్టాలు ఆదివాసీ భూముల అమ్మకాలను నియంత్రిస్తున్నాయని, భూముల అమ్మకాల్లో స్థానికుల ప్రమేయమే తప్ప బంగ్లాదేశీయుల ప్రమేయమేమీ లేదని ఆయన పేర్కొన్నారు.
ఝార్ఖండ్‌లోని సంథాల్ పరగణా ప్రాంతంలో 'జనసంఖ్య'ను బంగ్లాదేశ్ చొరబాట్లు మారుస్తున్నాయని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) ఇచ్చిన ఇటీవలి నివేదికను బిజెపి రాజకీయ నాయకులు ఉదహరిస్తున్నారు. ఎన్‌సిఎస్‌టి ఈ నివేదికను గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించగా, తర్వాత దానిని ఝార్ఖండ్ హైకోర్టు ముందుకు తీసుకువెళ్ళారు. అయితే దీనిని ప్రజలకు బహిర్గతం చేయలేదు.
ఎన్‌సిఎస్‌టిపై దర్యాప్తు చేస్తున్న ఒక స్వతంత్ర నిజనిర్ధారణ బృందంలో సభ్యుడైన అశోక్ వర్మ ఈ పరిశోధనలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. పేదరికం, పోషకాహార లోపం, జననాల రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉన్న కారణంగా ఆదివాసీలు ఈ ప్రదేశాన్ని వదిలిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మీడియా దృష్టి పోలరైజేషన్ సమస్య పైన మాత్రమే కేంద్రీకరించడం వలన ప్రయోజనం లేదు. “దీన్ని [టివి] ఆపేసేయండి, సామరస్యం దానంతట అదే తిరిగి వస్తుంది. వార్తాపత్రికలను ఎక్కువగా విద్యావంతులే చదువుతారు, కానీ టీవీని అందరూ చూస్తారు,” అన్నారు జాకిర్.
"సంథాల్ పరగణాలో ముస్లిములు, ఆదివాసులు ఒకే రకమైన సంస్కృతులను, ఆహారపు అలవాట్లను కలిగివున్నారు. వాళ్ళు ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటారు కూడా. మీరు స్థానికంగా జరిగే ఆదివాసీ హాట్ [సంత]కు వెళ్తే, ఈ రెండు సముదాయాలవారు అక్కడుండటాన్ని మీరు చూస్తారు," ఝార్ఖండ్ జనాధికార్ మహాసభ సభ్యుడైన అశోక్ అన్నారు.
*****
2024, జూన్ 17న ముస్లిముల పండుగ బక్రీద్ రోజున పండుగ వేడుకలలో జంతువులను బలి ఇవ్వడంపై గోపీనాథ్‌పుర్‌లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆజనా వలెనే పాకుర్ జిల్లాలోనే ఉన్న ఈ గ్రామంలో కూడా హిందువులు, ముస్లిములు కలిసి ఉన్నారు. ఇరుకైన పంట కాలువకు అటువైపున పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ఉంది. ఇక్కడ నివసించేవారిలో చాలామంది వ్యవసాయంతో ముడిపడి ఉన్న సన్నకారు శ్రామికులు, వ్యవసాయ కూలీలు.
గంధైపుర్ పంచాయతీలోని 11వ వార్డుకు పోలీసులను రప్పించారు. పరిస్థితులు అప్పటికి సద్దుమణిగినా, మరుసటి రోజు మళ్ళీ విరుచుకుపడ్డాయి. "గుంపు రాళ్ళు విసురుతోంది, అన్నిచోట్లా పొగలు కమ్ముకున్నాయి," 100-200 మంది పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి రావడాన్ని గమనించిన స్థానిక నివాసి సుధీర్ గుర్తుచేసుకున్నారు. "వాళ్ళు మోటార్ సైకిళ్ళకు, పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు."
పెద్ద పేలుడు శబ్దం వినిపించినప్పుడు నమిత మండల్ తన కూతురితో కలిసి తమ ఇంటిదగ్గరే ఉన్నారు. "ఉన్నట్టుండి మా ఇంటిమీద రాళ్ళ వర్షం కురిసింది. మేం లోపలికి పరుగెత్తాం," ఇప్పటికీ భయం నిండివున్న గొంతుకతో చెప్పారామె.
అప్పటికే, తలుపులు పగులగొట్టిన కొంతమంది మగవాళ్ళ గుంపు బలవంతంగా లోపలికి చొరబడ్డారు. వాళ్ళు తల్లీ కూతుళ్ళను కొట్టడం మొదలుపెట్టారు. "వాళ్ళు నన్నిక్కడ... ఇక్కడ కొట్టారు," తన నడుమునూ భుజాలనూ చూపించింది 16 ఏళ్ళ ఆ అమ్మాయి, "ఆ నొప్పి ఇంకా ఉంది." వాళ్ళు ఇంటి బయట వేరుగా ఉన్న వంటింటిని కూడా తగులబెట్టారని ఆ ప్రదేశాన్ని చూపిస్తూ నమిత PARIతో చెప్పారు.
ముఫసిల్‌లోని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ కుమార్ ఝా ఈ సంఘటనను కొట్టిపడేశారు, “పెద్దగా నష్టం జరగలేదు. ఒక గుడిసె కాలిపోయింది, చిన్నపాటి విధ్వంసం జరిగింది. ఎవరూ చనిపోలేదు.”
నమిత (32) తన కుటుంబంతో కలిసి ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా, గోపీనాథ్‌పుర్‌లో నివసిస్తున్నారు. అక్కడ తరతరాలుగా జీవిస్తోన్న అనేక కుటుంబాలలో వారి కుటుంబం కూడా ఒకటి. "ఇది మా ఇల్లు, మా భూమి," దృఢంగా చెప్పారామె.
పాకుర్ జిల్లా, గంధైపుర్ పంచాయతీలో భాగమైన గోపీనాథ్‌పుర్ హిందువులు అధికంగా ఉండే ప్రాంతమని జిల్లా కౌన్సిల్ సభ్యురాలైన పింకీ మండల్ చెప్పారు. నమిత భర్త దీపచంద్ కుటుంబం ఐదు తరాలుగా ఇక్కడే నివాసముంటున్నారు. "ఇంతకుముందెప్పుడూ హిందు-ముస్లిముల మధ్య ఉద్రిక్తతలు లేవు, కానీ బక్రీద్ సంఘటన జరిగినప్పటి నుండి పరిస్థితులు ఘోరంగా మారాయి," ఈ సంఘటన జరిగిన రోజున తన మిగిలిన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకువెళ్ళిన 34 ఏళ్ళ దీపచంద్ చెప్పారు
"ఎవరో పోలీసులను పిలిచారు, లేదంటే మాకేం జరిగివుండేదో ఎవరికి తెలుసు," అన్నారు నమిత. ఆ తర్వాతి వారం ఆమె తన ఇంటి కిటికీలకు, తలుపులకు ఇనుప తడికెలు వేయించేందుకు తన అత్తవారి నుండి రూ. 50,000 అప్పుగా తీసుకొన్నారు. "అవి లేకపోతే మాకు రక్షణ ఉన్నట్టుగా అనిపించటంలేదు," దినసరి కూలీగా పనిచేసే దీపచంద్ అన్నారు. "నేను ఆ రోజు పనికి పోకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది," అన్నారతను.
హేమా మండల్ తన వరండాలో కూర్చొని తెందూ (తునికి) ఆకులతో బీడీలు చుడుతున్నారు. "ఇంతకుముందిక్కడ హిందు-ముస్లిమ్ ఉద్రిక్తతలు లేవు, కానీ ఇప్పుడు భయం వదలకుండా ఉంటోంది." కాలువలో నీటి మట్టం ఎండిపోయినప్పుడు, "మళ్ళీ పోరాటాలు జరుగుతాయి," అని కూడా ఆమె అన్నారు. బెంగాల్ సరిహద్దు వైపు నుండి ప్రజలు బెదిరింపుగా అరుస్తారు. "సాయంత్రం ఆరు గంటల తర్వాత, ఈ రహదారి మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది," అన్నారామె.
వివాదానికి కేంద్రంగా మారిన ఆ కాలువ హేమ ఇంటికి దారితీసే రహదారికి సమాంతరంగా ఉంటుంది. మధ్యాహ్నానికే ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోవడంతో పాటు, సాయంత్రం వేళల్లో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకట్లో మునిగిపోయింది.
కాలువ గురించి ప్రస్తావిస్తూ, “ఈ సంఘటనలో పాల్గొన్నవారందరూ అవతలి వైపు నుండి, [పశ్చిమ] బెంగాల్ నుండి వచ్చారు. ఇక్కడి ముస్లిములు హిందువులకు అండగా నిలిచారు," 27 ఏళ్ళ రిహాన్ షేక్ అన్నాడు. కౌలు రైతు అయిన రిహాన్ వరి, గోధుమలు, ఆవాలు, మొక్కజొన్నలను పండిస్తున్నాడు. ఏడుగురు సభ్యులతో కూడిన అతని కుటుంబంలో అతనే ఏకైక సంపాదనాపరుడు.
బిజెపి వాగాడంబరాన్ని తోసిపుచ్చుతూ అతను ఈ విలేఖరిని ఇలా అడిగాడు, “మేం అనేక తరాలుగా ఇక్కడ నివసిస్తున్నాం. అయితే మేం బంగ్లాదేశీయులమా?”
అనువాదం: సుధామయి సత్తెనపల్లి