గోకుల్ అనునిత్యం నిప్పుతో పనిచేస్తారు. ఆయన ఇనుమును ఎర్రగా కాల్చి, దానిని సుత్తెతో సాగగొట్టి కావలసిన ఆకారంలోకి మలుస్తారు. ఎగసిన నిప్పు రవ్వలు ఆయన వేసుకున్న బట్టలకూ బూట్లకూ రంధ్రాలు చేస్తాయి; ఆయన చేతులపై ఉన్న కాలిన గాయాలు భారత ఆర్థిక వ్యవస్థ చక్రాలను కదిలించడంలో ఆయన పడే శ్రమకు సాక్ష్యంగా నిలుస్తాయి.
బడ్జెట్ గురించి విన్నారా అని అడిగినప్పుడు, " క్యా హుందా హై [అంటే ఏంటది]?" అన్నారతను.
పార్లమెంటులో 2025 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన 48 గంటల లోపే అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కానీ బాగడియా సముదాయానికి చెందిన ఈ సంచార కమ్మరి గోకుల్‌కి మాత్రం ఏమీ మారలేదు.
"నే చెప్తున్నా వినండి, ఎవరూ మాకోసం ఏమీ చేసింది లేదు. దాదాపు 700-800 ఏళ్ళుగా ఇలాగే సాగిపోతోంది. మా తరతరాలన్నీ పంజాబ్ మట్టిలోనే సమాధి అయ్యాయి. ఎవ్వరూ మాకేమీ ఇవ్వలేదు," నలభైల వయసులో ఉన్న ఆ కమ్మరి చెప్పారు.
పంజాబ్‌లోని మొహాలీ జిల్లా, మౌలీ బైద్వాన్ గ్రామంలో ఒక ఝోప్‌డీ [తాత్కాలికంగా కట్టుకొన్న గుడిసె]లో గోకుల్ బసచేస్తున్నారు. ఆయన ఇక్కడ తన తెగవారితో కలిసి ఉంటున్నారు. వీరి తెగ మూలాలు రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందినవి.
"వాళ్ళిప్పుడు మాకు ఇచ్చేదేంటి?," అని ఆయన ఆశ్చర్యపడుతున్నారు. గోకుల్ వంటి జనానికి ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన మాత్రం తాను కొనే ప్రతి ఇనుప ముక్కకు 18 శాతం ప్రభుత్వానికి తప్పకుండా చెల్లిస్తున్నారు; అచ్చుపోసేందుకు ఇనుమును కాల్చడానికి ఉపయోగించే బొగ్గుకు చెల్లించే ఐదు శాతం కూడా. తాను ఉపయోగించే పనిముట్లైన ఒక సుత్తె, కొడవలి కోసం, ఇంకా తాను తినే తిండిలోని ప్రతి గింజకూ కూడా ఆయన ప్రభుత్వానికి వెల చెల్లిస్తున్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి