"నీ నుంచే పొందానమ్మా
నా యీ జీవితాన్ని
నేను మొదట మాట్లాడింది
నీ భాషలోనే
నీ స్నేహ హస్తాన్ని అందుకునే నేను
నా మొదటి అడుగు వేశాను
నీ చేతిని పట్టుకునే ఓ అమ్మా
నా అభ్యాసం సాగింది
నీ చేతిని పట్టుకునే
నే రాయడం నేర్చుకున్నా"
కొల్‌కతాలోని గరియాహాట్ మార్కెట్‌లో మోహన్ దాస్ నడుపుతోన్న వీధి పుస్తకాల దుకాణంలో ఈ పద్యం ఒక ప్రదర్శనగా కనిపిస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, ఆ పద్యాన్నే కాక ఇంకా ఎన్నో పద్యాలను రాసింది, ఆ దుకాణాన్ని నడిపించే ఆయనే.
" నిజేర్ కాజ్‌కే భాలోబాషా ఖూబీ జరూరీ ఆర్ అమార్ జొన్యే అమార్ ప్రొథొమ్ భాలోబాషా హోచ్చే అమార్ బొయి " (మన పనిని మనం ప్రేమించడం చాలా ముఖ్యం, అలాగే నా పుస్తకాలే నా మొదటి ప్రేమ)” అని మణిమోహన్ దాస్ (52) అనే కలం పేరుతో రాసే ఆయన అన్నారు.
హేరంబచంద్ర కళాశాల నుంచి కామర్స్‌లో పట్టభద్రుడైనప్పటికీ, మోహన్‌కు ఉద్యోగం దొరకలేదు. దీంతో ఆయన దాదాపు మూడు దశాబ్దాల క్రితమే గరియాహాట్‌లోని వీధులలో పుస్తకాలు, వార్తాపత్రికలు మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు.
అనుకోకుండా ఈ వ్యాపకంలోకి వచ్చినప్పటికీ, ఈ వృత్తిని మార్చుకోవాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. "ఇది (పుస్తకాలను అమ్మడం) డబ్బు సంపాదనకు ఒక మార్గమనే కాదు, అంతకంటే ఇందులో చాలా విషయం ఉంది." అంటారాయన. "పుస్తకాలంటే నాకు చాలా మక్కువ."
దక్షిణ కొల్‌కతాలోని గోల్‌పార్క్ ప్రాంతంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక కూడలిలో ఉన్న మోహన్ పుస్తకాల దుకాణం, గరియాహాట్ మార్కెట్లో ఉండే దాదాపు 300 దుకాణాలలో ఒకటి. శాశ్వత దుకాణాలతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దుకాణాలతో నిండివుండే ఈ మార్కెట్లో రుచికరమైన తినుబండారాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, బట్టలు, పుస్తకాలు, బొమ్మలు వంటివెన్నో అమ్మకానికి ఉంటాయి.
ఈ వీధిలో ఉండే తనవంటి తాత్కాలిక దుకాణదారులతో పాటు శాశ్వత దుకాణదారులంతా ఒక కుటుంబం లాంటివారని మోహన్ అంటారు. "దుకాణాల సొంతదారులు మావంటివారిని (వీధి వ్యాపారులు) ఇక్కడ ఉండనివ్వరు అనే అపోహ ఒకటి జనంలో ఉంది. కానీ అన్నివేళలా నిజం కాదు," అంటారాయన. వాళ్ళంతా ఒకరికొకరు తమ మధ్యాహ్న భోజనాలను పంచుకుంటారు, స్నేహితులు కూడా.
మోహన్ పనివేళలు దీర్ఘంగా ఉంటాయి. ఆయన ఉదయం 10 గంటలకు తన దుకాణాన్ని తెరిచి, రాత్రి 9 గంటలకు మూస్తారు - అంటే, వారంలో ప్రతి రోజూ రోజుకు 11 గంటల పని. ఆయన తన పనిని చాలా ఇష్టపడతారు కానీ ఆ పని ద్వారా వచ్చే డబ్బు పట్ల ఆయనకు అంత సంతోషం ఉండదు. ఆ ఆదాయం అతన్నీ అతని కుటుంబాన్నీ పోషించడానికి చాలదు. " కొఖొనో తకా పాయ్, కొఖొనో అబార్ ఏక్ బేళా ఖాబారేర్ మోతోనో తకా పాయినా (కొన్నిసార్లు సంపాదన బానే ఉంటుంది. మరికొన్ని సార్లు ఒక్కపూట భోజనానికి సరిపోయేంత కూడా సంపాదించలేం)" అంటారు మోహన్. ఆయన ఐదుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషించాలి.
పుస్తకాలమ్మే ఈ కవి కలకత్తా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చదువుతోన్న తన కుమార్తె పౌలోమి ఉజ్జ్వల భవిష్యత్తును గురించి కలలు కంటుంటారు. తాను ఆర్థిక వనరులు సమకూర్చుకొని, తన చెల్లెళ్ళయిన ప్రతిమ, పుష్పల పెళ్ళిళ్ళు కూడా జరిపించాల్సి ఉందని ఆయన చెప్పారు.
తన జీవనోపాధి అస్థిరంగా ఉన్నప్పటికీ, ఆయన ఆశను పోగొట్టుకోకుండా ప్రయత్నిస్తుంటారు, “మమ్మల్ని ఎవరైనా ఇక్కడి నుండి తరలించగలరని నేను భయపడను. మేం (వీధి వ్యాపారులు) చాలామందిమి ఉన్నాం, మా జీవనోపాధి కూడా ఈ వీధిపైనే ఆధారపడి ఉంది. మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించడం అంత సులభం కాదు." అంటారాయన. కానీ ప్రయత్నాలైతే జరిగాయి.
"నాకేం చేయాలో పాలుపోలేదు," అన్నారు మోహన్, 1996 నాటి 'ఆపరేషన్ సన్‌షైన్'ను గుర్తుచేసుకుంటూ. నగరంలోని కొన్ని ప్రాంతాల నుంచి వీధి వ్యాపారులను తొలగించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, మునిసిపాలిటీ అధికారులు ఈ 'ఆపరేషన్ సన్‌షైన్'ను చేపట్టారు.
అప్పుడు మోహన్ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమిలో భాగస్వామి అయిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో సభ్యుడిగా ఉండేవారు. తాను పార్టీ కార్యాలయానికి వెళ్ళి, ఆ ప్రయత్నాలను అమలుచేయవద్దని అక్కడి అధికారులను అభ్యర్థించిన సంగతినీ, అధికారులు సంప్రదింపులకు ఒప్పుకోకపోవడాన్నీ ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేకమంది వీధివ్యాపారుల దుకాణాలను మునిసిపాలిటీ అధికారులు కూల్చివేయడానికి ముందే తమ దుకాణాలలోని వస్తువులను కాపాడుకోగలిగిన కొద్దిమందిలో మోహన్ కూడా ఒకరు.
"అది ప్రభుత్వం చాలా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. ఆ ఒక్క రాత్రిలో అనేకమంది ప్రజలు తమ సర్వస్వాన్నీ కోల్పోయారనే వాస్తవాన్ని ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదు," అన్నారు మోహన్. నెలల తరబడీ పోరాటం సాగించి, కలకత్తా హైకోర్టులో పిటీషన్ వేసిన తర్వాతనే మోహన్, ఇంకా కొంతమంది వీధివ్యాపారులు మళ్ళీ తమ దుకాణాలను తెరవగలిగారు. ఇదంతా 1996, డిసెంబర్ 3న హాకర్స్ సంగ్రామ్ కమిటీలో భాగమైన దక్షిణ కలకత్తా హాకర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంఘంలో మోహన్ సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘటనల తర్వాత తాను మార్క్సిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చేశాననీ, అప్పటి నుంచీ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేదనీ, మోహన్ చెప్పారు.
*****
" ఆజ్‌కల్ ఆర్ కేవూ బొయీ పొరేనా (ఈ రోజుల్లో పుస్తకాలనెవరూ చదవటంలేదు)," గూగుల్ వలన తాను అనేకమంది కొనుగోలుదారులను పోగొట్టుకున్నానని ఆరోపణగా చెప్పారు మోహన్. "ఇప్పుడు గూగుల్ అనేది వచ్చిపడింది. జనం తమకు కావలసిన సరైన సమాచారం కోసం అలా చూడగానే అది వాళ్ళకు దొరికిపోతుంది." కోవిడ్-19 విపత్తు ఈ పరిస్థితులను మరింత దిగజార్చింది.
"నేను ఏనాడూ కావాలని నా దుకాణాన్ని మూసివేయలేదు, కానీ కోవిడ్ సమయంలో అలా ఖాళీగా కూర్చోవటం తప్ప నాకు మరో అవకాశం లేకపోయింది." ఈ విపత్తు సమయంలో మోహన్ తాను అంతవరకూ పొదుపు చేసినదంతా వాడేయాల్సివచ్చింది. "వ్యాపారం ఇప్పుడు ఎప్పటికంటే కూడా చాలా తగ్గిపోయింది." అన్నారాయన జనవరి 2023లో PARIతో మాట్లాడుతూ.
వీధిలో వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం లైసెన్స్ ఇస్తే ఈ వ్యాపారంలో ఉన్న అనిశ్చితి తగ్గిపోతుందను మోహన్ భావిస్తున్నారు. ఐదేళ్ళ క్రితమే ఆయన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ అది ఇంతవరకూ రాలేదు. లైసెన్స్ లేకపోవటం వలన తనకున్న ఒకే ఒక రక్షణ, హాకర్ల సంఘంలో సభ్యత్వం ఉండటమే అని ఆయన అనుకుంటున్నారు. సభ్యత్వ రుసుముగా ఆయన సంఘానికి వారానికి రూ. 50 కడతారు. మార్కెట్‌లో ఆయన తన దుకాణాన్ని తెరిచేందుకు కూడా ఇది హామీ ఇస్తుంది.
2022 ముగిసేసరికల్లా, వెస్ట్ బెంగాల్ అర్బన్ స్ట్రీట్ వెండర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్‌లీహుడ్ అండ్ రెగులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్) రూల్స్, 2018 ని అమలుచేయాలని కొల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ నిశ్చయించిందని మోహన్ చెప్పారు. వీధివ్యాపారులంతా తమ దుకాణాలను కప్పివుంచే ప్లాస్టిక్ పట్టాలన్నింటినీ తీసివేయాలని అజ్ఞలు జారీ అయ్యాయి. "ఇప్పుడైతే (చలికాలం) మరేమీ ఫరవాలేదు. కానీ వర్షం పడితే మేమేం చేయాలి?" మోహన్ ప్రశ్నించారు.
মা আমার মা
সবচে কাছের তুমিই মাগো
আমার যে আপন
তোমার তরেই পেয়েছি মা
আমার এ জীবন
প্রথম কথা বলি যখন
তোমার বোলেই বলি
তোমার স্নেহের হাত ধরে মা
প্রথম আমি চলি
হাতটি তোমার ধরেই মাগো
চলতে আমার শেখা
হাতটি তোমার ধরেই আমার
লিখতে শেখা লেখা
করতে মানুষ রাত জেগেছ
স্তন করেছ দান
ঘুম পাড়াতে গেয়েছে মা
ঘুম পাড়ানি গান
রাত জেগেছ কত শত
চুম দিয়েছ তত
করবে আমায় মানুষ, তোমার
এই ছিল যে ব্রত
তুমি যে মা সেই ব্রততী
যার ধৈয্য অসীম বল
সত্যি করে বলো না মা কী
হল তার ফল
আমার ব্রতের ফসল যেরে
সোনার খুকু তুই
তুই যে আমার চোখের মনি
সদ্য ফোটা জুঁই ।
ఓ నా ప్రియమైన అమ్మా
అమ్మా, నీ కంటే ప్రియమైనవారు నాకింకెవరూ లేరు
నువ్వు నా సొంతం.
అమ్మా,
నీ నుంచే నేనీ జీవితాన్ని పొందాను
నేను పలికిన మొదటి మాట
నీ భాషలోనే
నీ ప్రేమే ఊతంగా
తొలి అడుగులు వేశాను
నీ చేయి పట్టుకొనే ఓ అమ్మా
నేను నడవడం నేర్చుకున్నాను.
నీ చేయి పట్టుకొనే
రాయడం నేర్చుకున్నాను.
నన్ను పెంచి పోషించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు,
నీ స్తన్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావు.
నన్ను నిద్రపుచ్చడానికి ఓ అమ్మా
ఎన్నెన్నో లాలిపాటలు పాడావు.
నువ్వు గడిపిన లెక్కలేనన్ని నిద్రలేని రాత్రులవలే
నన్ను అనంతంగా ముద్దుల్లో ముంచెత్తావు,
నువ్వో ప్రతిజ్ఞ చేసుకున్నావు
నన్నో మనిషిగా మలచాలని
ప్రతిజ్ఞ తీసుకున్నదానివి నువ్వు
అమ్మా, నీ సహనం నిత్యమైనది,
అమ్మా, ఒక నిజం చెప్పు
దాన్నుంచి నీకేం వచ్చింది?
నా సంకల్పానికి ఫలితం నువ్వు
నా బంగారు కూతురా
నా కంటి వెలుగువు నువ్వే
ఇప్పుడే విరిసిన మల్లెవూ నువ్వే.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి