ఆగస్టు నెల వరకు పన్నా జిల్లాలో వర్షాలు కురుస్తూనేవున్నాయి, కైథాబారో ఆనకట్ట తన పూర్తి సామర్థ్యానికి నిండిపోయింది. ఇది సమీపంలోని పన్నా టైగర్ రిజర్వ్ (PTR)లో ఉన్న కొండల నుండి ప్రవహిస్తుంది.

సురేన్ ఆదివాసీ ఒక సుత్తె తీసుకొని ఆనకట్ట వద్దకు వచ్చారు. ఆయన వడివడిగా ప్రవహిస్తోన్న నీటి వైపుకు, ఏదైనా కొత్త రాళ్ళు గానీ, చెత్త గానీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయేమోనని జాగ్రత్తగా చూశారు. వేగంగా ప్రవహిస్తున్న నీటిని మరింత మెరుగ్గా పారేలా చేసేందుకు ఆయన సుత్తెని ఉపయోగించి అడ్డుగా ఉన్న రెండు రాళ్ళను పక్కకు తప్పించారు.

"నీరు సరిగ్గా ప్రవహిస్తుందో లేదో చూడటానికి నేనిక్కడికి వచ్చాను," అని ఆయన PARIతో చెప్పారు. "అవును, అది చక్కగా పారుతోంది," బిల్‌పురా గ్రామానికి చెందిన ఆ చిన్న రైతు తల ఊపారు. కొద్ది మీటర్ల దూరాన దిగువకు ఉన్న తన వరి పంట ఎండిపోదని ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ చిన్న ఆనకట్ట మీదుగా చూపు సారిస్తూ ఆయన, “ఇదొక గొప్ప వరం. వరి పండించొచ్చు, గోధుమలు కూడా. ఇంతకుముందు నేను ఇక్కడున్న నా ఎకరం పొలానికి నీళ్ళు పారించి, వ్యవసాయం చేయలేకపోయేవాడిని," అన్నారు.

ఆనకట్టను నిర్మించడంలో సహాయం చేయటం ద్వారా బిల్‌పురా ప్రజలు తమకు తామే అందించుకున్న ఆశీర్వాదమది.

సుమారు వెయ్యిమంది ప్రజలు నివసించే బిల్‌పురా గ్రామంలో ఎక్కువమంది గోండ్ ఆదివాసులైన (షెడ్యూల్డ్ తెగలు) రైతులే. అందరికీ కొద్దిపాటి పశుగణం కూడా ఉంది. 2011 నాటి జనగణన ప్రకారం ఈ గ్రామంలో ఒకే ఒక చేతి పంపు, ఒక బావి ఉన్నాయి. ప్రభుత్వం జిల్లాలోనూ, చుట్టుపక్కలా రాళ్ళ వరుసలు పేర్చి చెరువులు నిర్మించింది, కానీ అక్కడ ఆయకట్టు లేదనీ, " పానీ రుక్తా నహీఁ హై [నీరు నిలబడదు]," అనీ స్థానికులు చెప్పారు

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: పొలాలవైపుకు నీరు పారుతున్నదీ లేనిదీ నిర్ధారించుకోవటానికి ఒక సుత్తె తీసుకొని ఆనకట్ట వద్దకు వచ్చిన సురేన్ ఆదివాసీ. కుడి: 'ఇంతకుమందు ఇక్కడ వ్యవసాయం లేదు. నిర్మాణ ప్రదేశాల వద్ద రోజువారీ కూలి పనుల కోసం నేను దిల్లీ, ముంబై వలసపోయేవాణ్ణి,' అని మహరాజ్ సింగ్ ఆదివాసీ అన్నారు

ఈ గ్రామ ప్రజలకు వారి గ్రామానికీ, ఆనకట్టకూ మధ్య సుమారు 80 ఎకరాల భూమి ఉంది. "ఇంతకుముందు ఒక చిన్న నాలా (ప్రవాహం) ఉండేది, అది కొన్ని ఎకరాలకు ఉపయోగపడేది," మహరాజ్ సింగ్ చెప్పారు. "ఈ ఆనకట్ట వచ్చిన తర్వాతే మేమందరం మా పొలాల్లో పంటలు వేసుకోగలిగాం."

తమ కుటుంబ వాడకం కోసం తమకున్న అయిదెకరాల భూమిలో నాటిన గోధుమ, చనా [సెనగలు], వరి, మక్క [మొక్కజొన్న] క్షేమంగా ఉన్నాయని నిర్ధారించుకోవటానికి మహరాజ్ కూడా ఆనకట్ట వద్దకు వచ్చారు. మంచి పంట పండిన సంవత్సరంలో, ఆయన కొంత ఉత్పత్తిని అమ్ముకోగలిగారు కూడా.

"ఈ నీరు నా పొలానికి వెళ్తాయి," నీటివైపు చూపిస్తూ అన్నారతను. "ఇంతకుముందు ఇక్కడ సేద్యం ఉండేది కాదు. నేను నిర్మాణ స్థలాలలో రోజు కూలీగా పని చేయటానికి దిల్లీ, ముంబై వలసపోయేవాడిని." ఆయన ఒక ప్లాస్టిక్ కర్మాగారంలో, ఆ తర్వాత ఒక దారాల కంపెనీలో కూడా పనిచేశారు.

ఈ ఆనకట్టను 2016లో తిరిగి కట్టడంతోనే, ఆయన వలస వెళ్ళవలసిన అవసరం తప్పింది - వ్యవసాయం ద్వారా వచ్చే సంపాదన ఆయననూ, ఆయన కుటుంబాన్నీ పోషిస్తోంది. ఆనకట్ట నుంచి వచ్చే నీరు ఏడాది మొత్తానికీ సరిపోవటంతో పాటు పశువులకు కూడా ఉపయోగపడుతోంది.

పీపుల్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (పిఎస్‌ఐ) అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన ప్రజా సమావేశాల ఫలితంగా ఆనకట్టను తిరిగి కట్టాలనే ఆలోచన ముందుకొచ్చింది. "స్థానికులతో మాట్లాడినప్పుడు వారందరికీ భూమి ఉందని, కానీ ఒక క్రమమైన నీటిపారుదల సౌకర్యం లేకపోవడంతో వారు దానిని ఉపయోగించుకోలేకపోతున్నారని మాకు తెలిసింది," అని పిఎస్‌ఐ క్లస్టర్ కోఆర్డినేటర్ శరద్ యాదవ్ చెప్పారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: 'ఇంతకుముందు ఒక చిన్న నాలా (ప్రవాహం) ఉండేది, అది కొన్ని ఎకరాలకు ఉపయోగపడేది. ఈ ఆనకట్ట వచ్చిన తర్వాతే మేమందరం మా పొలాల్లో పంటలు వేసుకోగలిగాం,' అని మహరాజ్ సింగ్ ఆదివాసీ చెప్పారు. కుడి: నీటి ప్రవాహాన్నీ, అది సాగుచేస్తోన్న భూమినీ చూపిస్తోన్న మహరాజ్

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: ప్రభుత్వం ఈ దగ్గరలోనే ఇటువంటి ఆనకట్టలను కట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ, నీరు నిలబడలేదని శరద్ యాదవ్ చెప్పారు. కుడి: ఆనకట్టను పరీక్షించటానికి స్థానికులు చాలా తరచుగా ఆనకట్ట దగ్గరకు వస్తుంటారు

ప్రభుత్వం కైథా (వెలగ) చెట్ల తోపు సమీపంలో ఒక చెరువుపై ఆనకట్టను నిర్మించింది. దీనిని ఒక్కసారి కాదు, 10 సంవత్సరాలలో మూడుసార్లు నిర్మించారు. చివరిసారి వర్షాకాలంలో దానికి గండి పడినప్పుడు, ప్రభుత్వాధికారులు ఇంక చాలని నిర్ణయించుకొని, ఆనకట్ట పరిమాణాన్ని తగ్గించారు.

ఆ చిన్న ఆనకట్ట దేనికీ సరిపోలేదు: "నీరు పొలాల్లోకి ఇంచుమించు పారేది కాదు. వేసవి కంటే ముందే అది ఎండిపోతుండటంతో, సాగు అవసరాలకు పనికిరాకుండాపోయింది," అన్నారు మహరాజ్. "సుమారు 15 ఎకరాలు మాత్రమే సాగు చేయగలిగేవాళ్ళం, అది కూడా ఒకటే పంట."

2016లో గ్రామ ప్రజలు పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకోవాలని నిశ్చయించుకొని, ఆనకట్టను తిరిగి నిర్మించేందుకు శ్రమ దానం చేయటానికి ముందుకొచ్చారు. "మేం మట్టి తీసుకొచ్చాం, తవ్వాం, రాళ్ళను పగులగొట్టి అమర్చాం, మొత్తం ఒక్క నెలలోనే ఆనకట్టను పూర్తిచేశాం. జనమంతా మా ఊరివాళ్ళే, అందులో ఎక్కువమంది ఆదివాసులు, కొంతమంది వెనుకబడిన తరగతులకు చెందినవారు," ఈ పనిలో తాను కూడా పాల్గొన్న మహరాజ్ చెప్పారు.

కొత్త ఆనకట్ట పరిమాణంలో పెద్దది. నీరు సమానంగా ప్రవహించేందుకు, మరొకసారి ఆనకట్ట విరిగిపోకుండా ఉండటానికి ఒకటి కాకుండా రెండు అడ్డుకట్టలను వేశారు. ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని నమ్మకం కలిగాక, తేలికగా ఊపిరి పీల్చుకున్న మహారాజ్, సురేశ్‌లు ఒక చిన్నపాటి వర్షం కురవడానికి ముందే తిరిగి తమ ఇళ్ళకు మళ్ళారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

ப்ரிதி டேவிட் பாரியின் நிர்வாக ஆசிரியர் ஆவார். பத்திரிகையாளரும் ஆசிரியருமான அவர் பாரியின் கல்விப் பகுதிக்கும் தலைமை வகிக்கிறார். கிராமப்புற பிரச்சினைகளை வகுப்பறைக்குள்ளும் பாடத்திட்டத்துக்குள்ளும் கொண்டு வர பள்ளிகள் மற்றும் கல்லூரிகளுடன் இயங்குகிறார். நம் காலத்தைய பிரச்சினைகளை ஆவணப்படுத்த இளையோருடனும் இயங்குகிறார்.

Other stories by Priti David
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli