తూర్పు భారతదేశంలో ఉన్న ఒక బీచ్‌లో అప్పుడు సమయం ఉదయం 3 గంటలు. ఒక ఫ్లాష్‌లైట్ సాయంతో రామోలు లక్ష్మయ్య ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్ల కోసం వెతుకుతున్నారు. ఒక పొడవాటి కర్రనూ, ఒక బాల్చీనీ పట్టుకొనివున్న ఆయన జాలారిపేటలో ఉన్న తన ఇంటి నుంచి ఆర్కె బీచ్ వరకూ ఉన్న ఇసుక దారిలో నెమ్మదిగా నడుస్తున్నారు.
ఆడ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి సముద్రపు ఒడ్డుకు వస్తాయి. వాలుగా ఉన్న తీరప్రాంతంతో ఉండే విశాఖపట్నం ఇసుక బీచ్‌లు ఈ తాబేళ్ళు గూడు కట్టుకోవటానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. 1980ల ప్రారంభం నుండి ఈ తాబేళ్ళు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అయితే, ఉత్తరాన మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా తీరంలో ఈ తాబేళ్ళకు దేశంలోనే అతిపెద్ద సామూహిక స్థావరాలు ఉన్నాయి. ఆడ తాబేళ్ళు ఒకేసారి 100-150 గుడ్లను పెడతాయి, వాటిని ఇసుక గుంటలలో లోతుగా పాతిపెడతాయి.
“ఎక్కడైనా ఇసుక వదులుగా ఉందంటే, అక్కడ తల్లి తాబేలు గుడ్లను పెట్టిందనటానికి అది సూచన," తేమగా ఉన్న ఇసుకలో కర్రతో జాగ్రత్తగా వెతుకుతూ వివరించారు లక్ష్మయ్య. లక్ష్మయ్యతో పాటు జాలరి సముదాయానికి (ఆంధ్రప్రదేశ్‌లో ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు) చెందిన కర్రి జల్లిబాబు, పుట్టియపాన యెర్రన్న, పుల్లా పోలారావు కూడా ఉన్నారు. సముద్ర తాబేళ్ళ పరిరక్షణ ప్రాజెక్టు కింద ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ గుడ్లను సంరక్షించటంలో భాగంగా 2023లో వీరంతా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ (ఎపిఎఫ్‌డి)తో కలిసి గార్డులుగా పార్ట్-టైమ్ పని చేస్తున్నారు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్ళను ( లెపిడోకెలిస్ ఆలివేసియా ), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ లో 'హానికి లోనయ్యే జాతులు'గా వర్గీకరించారు. భారతదేశ వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 (1991లో సవరించబడినది) షెడ్యూల్-I క్రింద రక్షణనిచ్చారు.
తీరప్రాంత విధ్వంసం వంటి అనేక అంశాల వల్ల తాబేళ్ళు ప్రమాదంలో ఉన్నాయి. “ప్రత్యేకించి గూళ్ళు కట్టుకునే ఆవాసాల వద్ద అభివృద్ధి పేరుతోనూ, అలాగే వాతావరణ మార్పుల వలన సముద్ర ఆవాసాలను కోల్పోవడం వల్ల కూడా,” అని విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రాజెక్ట్ శాస్త్రవేత్తగా పనిచేస్తోన్న యజ్ఞపతి అడారి చెప్పారు. సముద్రపు తాబేళ్ళను వాటి మాంసం కోసం, గుడ్ల కోసం కూడా వేటాడతారు.
"తల్లి గుడ్లను ఎంత లోతుగా అయినా పాతిపెట్టనివ్వండి, వాటిని కనుక్కోవడం సాధ్యమే. జనం వాటిని తొక్కవచ్చు, మరీ ఘోరంగా కుక్కలు వాటిని బయటికి తోడి తీయవచ్చు కూడా," అంటూ గుడ్లను రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు లక్ష్మయ్య (32). "హేచరీ(గుడ్లను పొదిగించే ప్రదేశం)లలో అవి సురక్షితంగా ఉంటాయి."
అంచేత లక్ష్మయ్య వంటి గార్డులు వాటి మనుగడకు చాలా కీలకమైనవారు. సముద్రపు తాబేలు జాతులలో ఆలివ్ రిడ్లీలు అతి చిన్నవి. ఆలివ్ పచ్చ రంగులో ఉండే వాటి పైచిప్ప వలన వాటికి ఆ పేరు వచ్చింది.
తాబేలు గుడ్లను వెదికి పట్టుకొని వాటిని హేచరీలో భద్రపరచి, అవి పిల్లలయ్యాక వాటిని సముద్రంలో వదిలిపెట్టడం కోసం వీరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు హేచరీలలో ఆర్కె బీచ్‌లొ ఉన్నది ఒకటి. సాగర్ నగర్, పెదనాగమయ్యపాలెం, చేపల ఉప్పాడ - ఇవి మిగిలిన మూడు హేచరీలు.
సాగర్ నగర్ హేచరీలో ఉన్న గార్డులందరూ జాలరులు కారు. వీరిలో కొంతమంది కొంత అదనపు ఆదాయం కోసం పార్ట్-టైమ్‌గా ఈ పనిని చేస్తోన్న వలస కూలీలు. తన జీవనానికయ్యే ఖర్చులు గడుపుకోవడం కోసం ఈ పనిని చేపట్టిన రఘు ఒక డ్రైవర్. తనకు 22 ఏళ్ళ వయసున్నపుడు శ్రీకాకుళానికి చెందిన రఘు విశాఖపట్నం చేరారు. ఆయనకు సొంత వాహనం లేదు, కానీ డ్రైవర్‌గా పని చేస్తూ రూ. 7000 సంపాదిస్తున్నారు.
ఈ పార్ట్-టైమ్ ఉద్యోగం చేయటం ఆయనకు బాగానే సహాయపడుతోంది: "ఇంటి దగ్గరున్న నా తల్లిదండ్రులకు 5000 - 6000 రూపాయల వరకూ పంపగలుగుతున్నాను."
ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి మే నెలవరకూ, గుడ్ల కోసం ప్రతి కొన్ని నిముషాలకు ఆగుతూ, ఈ గార్డులు ఆర్కె బీచ్ పొడవునా ఏడెనిమిది కిలోమీటర్లు నడుస్తుంటారు. భారతదేశంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు గూళ్ళు కట్టుకునే కాలం సాధారణంగా నవంబర్ నుండి మే వరకు ఉంటుంది. అయితే ఫిబ్రవరి మార్చి నెలలలో గరిష్ట సంఖ్యలో గుడ్లు కనిపిస్తాయి.
"కొన్నిసార్లు తల్లి తాబేలు పాదముద్రలు కనిపిస్తాయి; చాలా అరుదుగా మాత్రం తల్లి అలా కనిపించిపోతుంది," జల్లిబాబు చెప్పారు
గుడ్లు కనిపించగానే, వాటిని అక్కడ ఉండే కొంత ఇసుకతో పాటు జాగ్రత్తగా సంచుల్లో పెడతారు. ఈ ఇసుకను హేచరీలో గుడ్లను తిరిగి పాతిపెట్టేటపుడు ఉపయోగిస్తారు.
వారు గుడ్ల సంఖ్యను, అవి దొరికిన సమయాన్ని, పొదిగిన తేదీని నమోదు చేసి, దానిని ఒక కర్రకు కట్టి ఆ గుడ్లను పాతిపెట్టిన ప్రదేశం దగ్గర ఉంచుతారు. ఇది పొదుగుడు కాలాన్ని గమనంలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. గుడ్లు పొదిగే కాలం సాధారణంగా 45-65 రోజుల వరకూ ఉంటుంది.
ఈ గార్డులు తమ ప్రధాన ఆదాయ వనరైన చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళేవరకూ, అంటే ఉదయం 9 గంటల వరకు, హేచరీలో ఉంటారు. వీరికి తాబేళ్ళ పరిరక్షణ పనుల కోసం డిసెంబర్ నుండి మే నెల వరకు నెలకు రూ. 10,000 చొప్పున చెల్లిస్తారు. 2021-22 చివరి వరకు ఈ మొత్తం రూ. 5,000గా ఉండేది. "తాబేలు పిల్లలకు సహాయం చేసినందుకు వచ్చిన డబ్బు చాల అక్కరకొచ్చింది," అని జల్లిబాబు చెప్పారు.
"ప్రతి ఏటా, చేపల సంతానోత్పత్తి కాలమైన ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఆ సమయంలో ఇది నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది," అని లక్ష్మయ్య అంగీకారంగా చెప్పారు. అయితే ఈ నెలల్లో గార్డులకు వారి చెల్లింపులు అందలేదు. జూన్‌లో PARI వారిని కలిసినప్పుడు, వారు మొదటి మూడు నెలలకు మాత్రమే - డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి - తమకు రావలసిన బకాయిలను అందుకున్నారు.
చేపల వేటపై నిషేధం ఉండే సమయంలో వారికి కొద్దిపాటి, లేదా ఎటువంటి ఆదాయం ఉండదు. “మేమప్పుడు మామూలుగా నిర్మాణ ప్రదేశాలలోనూ, మరికొన్ని చోట్లా ఇతర పనులను చేస్తుంటాం. అయితే ఈ ఏడాది అదనంగా వచ్చిన డబ్బు బాగానే ఆదుకుంది. మిగిలిన మొత్తం కూడా త్వరలోనే అందుతుందని ఆశిస్తున్నాను,” అని జూన్‌లో కలిసినప్పుడు లక్ష్మయ్య చెప్పారు.
వారిలో కొంతమందికి ఇటీవల సెప్టెంబరులో చెల్లించగా, మరికొంతమందికి ఆగస్టులో - చేపల వేటపై నిషేధం విధించిన కొన్ని నెలల తర్వాత – చెల్లించారు.
గుడ్లు పొదిగి తాబేలు పిల్లలుగా మారిన తర్వాత ఈ ఉద్యోగంలో తనకు ఇష్టమైన భాగం మొదలవుతుందని రఘు చెప్పారు. గార్డులు వాటిని నెమ్మదిగా ఒక బుట్ట లో ఉంచి, తీసుకుపోయి బీచ్‌లో వదులుతారు.
"అతి చిన్న పాదాలను కలిగి ఉండే తాబేలు పిల్లలు ఇసుకను త్వరత్వరగా తవ్వుకొని బయటకు వస్తాయి. చిన్న చిన్న అడుగులు వేస్తూ, సముద్రాన్ని చేరే వరకు ఆగకుండా పోతుంటాయి,” అని ఆయన చెప్పారు. "అప్పుడు అలలు ఆ పిల్లలను అక్కడినుంచి సముద్రం లోపలికి తమతో తీసుకుపోతాయి."
ఈ ఏడాది జూన్ నెలలో చివరి విడత గుడ్లను పొదిగించారు. ఎపిఎఫ్‌డి సమాచారం ప్రకారం 21 మంది గార్డులున్న ఈ నాలుగు హేచరీలలో 46,754 గుడ్లను సేకరించి, వాటిని పొదిగించి 37,630 పిల్లలను సముద్రంలోకి వదిలేశారు. 5,655 గుడ్లు పిల్లలను చేయలేదు
"మార్చ్ 2023లో వచ్చిన భారీ వర్షాలకు అనేక గుడ్లు పాడైపోయాయి. అది చాలా విచారకరం. మే నెలలో వచ్చిన కొన్ని పిల్లలకు పైచిప్పలు పగిలిపోయి ఉన్నాయి," అన్నారు లక్ష్మయ్య.
తాబేళ్ళు అవి పుట్టిన భౌగోళిక స్థానాన్ని గుర్తిస్తాయని అడారి వివరించారు. 5 సంవత్సరాల వయసులో లైంగిక పరిపక్వతకు చేరుకునే ఆడ తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి అవి పుట్టిన అదే బీచ్‌కి తిరిగి వస్తాయి.
"ఇందులో భాగస్వామిని కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. తాబేళ్ళ గుడ్లు చాలా సున్నితమైనవనీ, వాటికి రక్షణ అవసరమనీ నాకు అర్థమయింది," తాబేళ్ళు మళ్ళీ గూడు కట్టుకునే సమయం కోసం ముందుకు చూస్తూ అన్నారు లక్ష్మయ్య.
ఈ కథనానికి రంగ్ దే నుంచి గ్రాంట్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి