తేజిలీబాయి ధేడియా నెమ్మదిగా తన దేశీ విత్తనాలను తిరిగి తెచ్చుకుంటున్నారు.

సుమారు 15 ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్, దేవాస్ జిల్లాల్లో వ్యవసాయం చేసే తేజిలీబాయి వంటి భిల్ ఆదివాసులు సేంద్రియ పద్ధతులలో పండించే దేశీ విత్తనాలకు బదులుగా రసాయనిక ఎరువులతో పండించే హైబ్రిడ్ విత్తనాలకు మారారు. ఇది అనువంశిక విత్తనాలను నష్టపోవడానికి దారితీసిందని చెప్తోన్న తేజిలీబాయి, అసలలా మారిపోవడానికి కారణాలను వివరించారు, "మా సంప్రదాయ వ్యవసాయానికి చాలా శ్రమ అవసరం, మా ఫలసాయానికి మార్కెట్‌లో లభించే ధరలు మాకు గిట్టుబాటు కావు. ఈ విధంగా ఆదా చేసిన సమయం, వలస కార్మికులుగా గుజరాత్‌కు వెళ్ళి, అధిక రేట్లకు కూలీ పని చేసుకోవడానికి మాకు వీలు కల్పించింది," అన్నారు 71 ఏళ్ళ ఆ వృద్ధురాలు.

కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లోని 20 గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది మహిళలు తమ అనువంశిక విత్తనాలను సంరక్షిస్తున్నారు; కన్సరీ నూ వడావ్‌నో (KnV) మార్గదర్శకత్వంలో సేంద్రియ వ్యవసాయానికి తిరిగి వస్తున్నారు. స్థానికంగా భిలాలీ అని పిలిచే భిల్ భాషలో కన్సరీ నూ వడావ్‌నో అంటే 'కన్సరీ దేవిని సత్కరించటం' అని అర్థం. భిల్ ఆదివాసీ మహిళల ప్రజా సంఘమైన KnV మహిళల హక్కుల కోసం పోరాడటానికి, వారి ఆరోగ్య సమస్యల గురించి పనిచేయడానికి 1997లో స్థాపించబడింది. ఆరోగ్య సమస్యలపై ఒక దశాబ్దానికి పైగా పనిచేసిన తర్వాత, KnV నిర్మాణంలో భాగస్వాములైన ఆదివాసీ మహిళలు, తమ సంప్రదాయ పంటలకు తిరిగి రావడం తమ ఆహార సంబంధమైన సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుందని గ్రహించారు.

KnV వద్ద, దేశవ్యాప్తంగా జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేయడం కోసం విక్రయించడానికి, ఇతర రైతులకు పంపిణీ చేయడం కోసం ఎంపిక చేసిన విత్తనాలను విడివిడిగా నిల్వ చేస్తారనీ, మిగిలిన పంటను తిండికోసం ఉంచుతారనీ కావడా గ్రామానికి చెందిన రింకూ అలావా చెప్పారు. "పంట కోతల తర్వాత, మేం వాటిలోని నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి," అని 39 ఏళ్ళ రింకూ చెప్పారు.

రైతు, KnV సభ్యురాలయిన కక్రానా గ్రామానికి చెందిన రైతీబాయి సోలంకి దీనికి అంగీకరించారు: “విత్తనాల నాణ్యతను మెరుగుపరచడానికి, వాటి ఉత్పత్తిని పెంచడానికి విత్తనాల ఎంపిక ఉత్తమమైన మార్గం.”

రైతీబాయి (40) ఇంకా ఇలా అంటారు: "చిరుధాన్యాలు, జొన్నల వంటి తృణధాన్యాలు మా భిల్ తెగకు ప్రధాన ఆహారం. అన్ని తృణధాన్యాలలోకి అత్యంత నీటి సామర్థ్యం కలిగినవి, పోషకమైనవి చిరుధాన్యాలు. వరి, గోధుమ వంటి ఇతర తృణధాన్యాల కంటే వాటిని సాగుచేయటం సులభం." ఆమె చిరుధాన్యాల పేర్లను జాబితా చేయడం ప్రారంభించారు - బట్టీ (ఊదలు), భాది, రాలా (కొర్రలు), రాగి (రాగులు), బాజ్రా (సజ్జలు), కోడో (అరికెలు), కుట్కి (సామలు), సాంగ్రీ . "సహజంగా భూసారాన్ని నిర్వహించడానికి జీవవైవిధ్య పంటలను పండించటంలో భాగంగా ఈ పంటలను బీన్స్, పప్పులు, నూనె గింజల వంటి కాయధాన్యాలతో మార్చి మార్చి వేస్తారు."

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: తన మోనోకల్చర్ వరిపొలంలో తేజలీబాయి. కుడి: స్థానికంగా బట్టీ అని పిలిచే ఊదలు

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: జొన్నలు. కుడి: ఊదలను స్థానికంగా బట్టీ అని పిలుస్తారు

ఈ ఆదివాసీ మహిళల సహకారసంఘమైన KnV దేశీ విత్తనాలతోనే ఆగిపోలేదు, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా తిరిగి తీసుకురావటానికి కృషిచేస్తున్నారు.

సత్తువ (manure)ను, ఎరువులను సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లా ఖోదంబా గ్రామంలో నివసించే తేజిలీబాయి చెప్పారు. “నేను నా కుటుంబ వినియోగం కోసం మాత్రమే నా భూమిలోని కొద్ది భాగంలో దేశవాళీ విత్తనాలు విత్తుతున్నాను. పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి నేను మారలేను." ఆమె తన కుటుంబానికి చెందిన మూడెకరాల పొలంలో వర్షాధారంగా జొవార్ [జొన్న], మక్క [మొక్కజొన్న], వరి, పప్పుధాన్యాలు, కూరగాయలను సాగుచేస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే కంపోస్ట్, బయోకల్చర్‌ల తయారీ కూడా తిరిగి వస్తున్నాయని దేవాస్ జిల్లాలోని జమాసింధ్ నివాసి విక్రమ్ భార్గవ వివరించారు. బెల్లం, శనగ పిండి, పేడ, పశువుల మూత్రాన్ని కలిపి, పులియబెట్టడం ద్వారా బయోకల్చర్‌ను తయారుచేస్తారు.

25 ఏళ్ళ బరేలా ఆదివాసి ఇలా అంటాడు, “పొలం నుండి వచ్చే జీవద్రవ్యా (బయోమాస్‌)న్ని పశువుల పేడతో కలపాలి. దీనిని ఒక గొయ్యిలో పొరలు పొరలుగా వేసి, నీటితో తడుపుతూ ఉంటే కంపోస్ట్‌ తయారవుతుంది. అప్పుడు దానిని పొలంలోని మట్టితో కలిసిపోయేలా చల్లటం ద్వారా అది పంటలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: ఆవుపేడను జీవద్రవ్యం (బయోమాస్)తో కలపటం. కుడి: బయోకల్చర్ తయారీ

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ:ఈ ప్రక్రియలో నిరంతరం నీటిని కలుపుతుండాలి. కుడి: ఇది తయారుకాగానే పొలంలోని మట్టితో కలిసిపోయేలా చల్లుతారు

*****

మార్కెట్ పంటల ఒత్తిడి వలన విత్తనాలు మాయమైపోవటంతో వారి సంప్రదాయ వంటకాలు కూడా మాయమైపోయాయనీ, అలాగే చిరుధాన్యాల పొట్టు తీయడం, చేతితో దంచడం వంటి సంప్రదాయ పద్ధతులు కూడా లేకుండాపోయాయనీ వేస్తి పడియార్ అంటారు. ఒకసారి సిద్ధంచేసిన తర్వాత, చిరుధాన్యాలు చాలా తక్కువ కాలం మాత్రమే నిలవుంటాయి, కాబట్టి మహిళలు వాటిని వండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దంచుతారు.

"మేం చిన్నతనంలో రాలా , భాది , బట్టీ వంటి చిరుధాన్యాలతో చాలా రుచికరమైన వంటకాలను వండుకునేవాళ్ళం," చిరుధాన్యాల పేర్లను ఏకరువు పెడుతూ అన్నారు వేస్తి. “దేవుడు మానవులను సృష్టించాడు, జీవనాన్ని పొందడానికి కన్సరీ దేవి స్తన్యాన్ని స్వీకరించమని కోరాడు. జొవార్ [కన్సరీ దేవతను సూచించేది] భిల్లులకు ప్రాణదాతగా పరిగణించబడుతుంది,” అంటూ ఆమె స్థానికంగా పండించే ఆ చిరుధాన్యాన్ని గురించి చెప్పారు. భిలాలా సముదాయానికి (రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడింది) చెందిన 62 ఏళ్ళ ఈ రైతు నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అందులో ఒక అర ఎకరం భూమిని వారి సొంత ఉపయోగం కోసం ఆహారాన్ని సేంద్రియ పద్ధతిలో పండించేందుకు కేటాయించారు.

బిచ్చీబాయి కూడా తాము చిరుధాన్యాలతో వండుకున్న కొన్ని వంటకాలను గుర్తు చేసుకున్నారు. దేవాస్ జిల్లాలోని పాండుతలాబ్ గ్రామ నివాసి అయిన ఆమె మాహ్ కుద్రీ - చికెన్ కూర కలుపుకొని తినే చిరుధాన్యాల అన్నం - తనకు ఇష్టమైనదని చెప్పారు. ప్రస్తుతం అరవయ్యేళ్ళు దాటిన ఆమె, పాలూ బెల్లంతో చేసే జొవార్ ఖీ ర్‌ (జొన్న పాయసం)ను కూడా గుర్తుచేసుకున్నారు.

చేతితో ధాన్యాన్ని దంచే పద్ధతులు స్త్రీలను ఏకతాటిపైకి తెచ్చే ఒక సాముదాయక వ్యవహారం. “మా పని సులభతరం చేసుకోవడానికి మేం జానపద పాటలను పాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వలసలు, చిన్న కుటుంబాల కారణంగా మహిళలు ఒక దగ్గరకు వచ్చి పనిని పంచుకునే అవకాశం లేదు,” అని 63 ఏళ్ళ ఈ మహిళ చెప్పారు.

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ:Iపాండుతలాబ్ గ్రామంలో, అనువంశిక విత్తనాలను సంరక్షించే వ్యూహాలను చర్చిస్తోన్న కన్సరీ నూ వడావ్‌నో సభ్యులు. కుడి:  ఆ పంటలంటే పక్షులకు మహా ఇష్టం. అంచేత, బిచ్చీబాయి పటేల్ వంటి రైతులు వాటిని తోలాల్సివస్తోంది

చిరుధాన్యాలను దంచుతూ పాటలు పాడే కార్లీబాయి, బిచ్చీబాయి; ఈ దంచే సంప్రదాయం చాలావరకు అంతరించిపోయిందని వారు చెప్పారు

కార్లీబాయి భావ్‌సింగ్ యువతిగా ఉన్నప్పుడు, చేతులతో చిరుధాన్యాలను దంచేవారు. చాలా శ్రమతో కూడుకున్న ఆ ప్రక్రియను ఆమె గుర్తుచేసుకున్నారు. “ఈ రోజుల్లో యువతులు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలను మిల్లులో పిండి పట్టించడాన్ని ఇష్టపడతారు. అందుకే చిరుధాన్యాల వినియోగం కూడా తగ్గింది,” అని కాట్‌కూట్ గ్రామానికి చెందిన 60 ఏళ్ళ బరేలా ఆదివాసీ చెబుతున్నారు.

విత్తనాలను నిల్వ చేయడం కూడా ఒక సవాలుగా ఉంది. “తూర్పారబట్టిన పంటలను ముహ్‌తీ [వెదురు గాదె]లలో నిల్వ చేయడానికి ముందు వాటిని ఒక వారం పాటు ఎండలో ఎండబెట్టాలి. ముహ్‌తీలలోకి గాలి చొరబడకుండా ఉండడానికి వాటి లోపల మట్టి, పశువుల పేడ మిశ్రమంతో అలుకుతారు. అయినప్పటికీ, దాదాపు నాలుగైదు నెలల తర్వాత నిల్వ చేసిన పంట పురుగుల బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి దానిని మరోసారి ఎండలో ఎండబెట్టాలి,” అని రైతీబాయి వివరించారు.

ఆ తర్వాత ఈ చిరుధాన్యాలను ఇష్టపడే పక్షులు కూడా ఉన్నాయి. విత్తిన తర్వాత వివిధ చిరుధాన్యాలు వేర్వేరు సమయాల్లో పంటకొస్తాయి కాబట్టి మహిళలు నిరంతరం జాగరూకతతో ఉండాలి. “పండించిన పంటనంతా పక్షులు తినేసి, మనకేమీ మిగలకుండా చేయకుండా చూసుకోవాలి!” అన్నారు బిచ్చీబాయి.

PHOTO • Rohit J.

కక్రానా గ్రామంలో జొన్న, సజ్జలను విత్తుతోన్న భిల్ ఆదివాసీ రైతులు (ఎడమ నుండి కుడికి: గిల్డారియా సోలంకి, రైతీబాయి, రమా సస్తియా, రింకూ అలావా)

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: తాజాగా కోసిన గోంగూర - ఒక ఆకుకూరగా, పువ్వుగా, నూనెగింజలు తీయడానికి కూడా ఉపయోగించే బహుముఖ ప్రయోజనాలున్న నారమొక్క. కుడి: ఒక రకమైన గోంగూర మొక్క, దాని విత్తనాలు

PHOTO • Rohit J.

బీన్స్, చిక్కుళ్ళ వంటి కాయధాన్యాలతోనూ, జొన్నలు, రాలా (కొర్రలు)తోనూ కలిపి పండించే బాజ్రా (సజ్జలు)

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: కక్రానా గ్రామంలోని ఒక పొలంలో పండిస్తోన్న దేశీ రకం జొన్న. కుడి:  కొర్రలు

PHOTO • Rohit J.

ఒక దశాబ్ద కాలం తర్వాత తాను పండించిన కొర్రలను చూపిస్తోన్న రైతు, KnV సభ్యురాలైన వెస్తీబాయి పడియార్

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ:బెండకాయలో ఒక రకం. కుడి: ఆవాలు

PHOTO • Rohit J.

శీతాకాలపు పైరులను విత్తటానికి ముందు జొవార్ పంటను కోస్తోన్న రైతీబాయి (కెమేరాకు వీపుచేసినవారు), రింకూ (మధ్యలో), ఉమా సోలంకి

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: విత్తనాల కోసం సేకరించిన సెమ్/బల్లార్ (చదునుగా ఉండే ఒకరకమైన చిక్కుళ్ళు). కుడి: కందిపప్పు, కాకరకాయ కూరలతో పాటు చిరుధాన్యాలతో చేసిన రొట్టె. ఈ వంటకాలన్నీ పాండుతలాబ్ గ్రామంలోని పొలంలో సేంద్రియ పద్ధతిలో పండించిన పదార్థాలతో తయారుచేసినవి

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: అరండీ (ఆముదాలు). కుడి: ఎండబెట్టిన మహువా (మధూక ఇండిక) పువ్వులు

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ: వచ్చే పంటకాలం కోసం ఎంపికచేసిన మొక్కజొన్న విత్తనాలను నిల్వ చేస్తోన్న బరేలా ఆదివాసీ సముదాయానికి చెందిన హీరాబాయి భార్గవ. కుడి: పప్పులను విసిరేందుకు ఉపయోగించే ఒక రాతి తిరగలి, వెదురు చేట, జల్లెడ

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ:వచ్చే ఏడు విత్తనాలుగా ఉపయోగించుకోవటం కోసం గోతపు సంచులలో కట్టి చెట్టుకు వేలాడదీసిన ఈ ఏటి పంట గింజలు. కుడి: సంరక్షించి, దేశవ్యాప్తంగా పంపిణీ చేయబోయే విత్తనాలను బిచ్చీబాయితో కలిసి ఎంపిక చేస్తోన్న ఆర్గానిక్ ఫార్మింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మధ్యప్రదేశ్ చాప్టర్ ఉపాధ్యక్షురాలు సుభద్ర ఖపర్దే

PHOTO • Rohit J.
PHOTO • Rohit J.

ఎడమ:రసాయన ఎరువులు వాడి పండించే తమ మొక్కజొన్న పొలంలో వెస్తీబాయి, ఆమె కోడలు జసీ. సేంద్రియ వ్యవసాయానికి సమయం, శ్రమ ఎక్కువ అవసరం కాబట్టి రైతులు పూర్తిగా ఈ సాగు విధానానికి మారడం సాధ్యం కాదు. కుడి: అలీరాజ్‌పుర్ జిల్లాలోని ఖొదంబా గ్రామం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Rohit J.

ரோகித் ஜே. இந்தியா முழுவது பயணிக்கும் ஒரு சுயாதீன புகைப்படக் கலைஞர். தேசிய தினசரி ஒன்றில் புகைப்பட துணை ஆசிரியராக 2012-2015ல் இருந்தவர்.

Other stories by Rohit J.
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Photo Editor : Binaifer Bharucha

பினாஃபர் பருச்சா மும்பையை தளமாகக் கொண்ட பகுதி நேரப் புகைப்படக் கலைஞர். PARI-ன் புகைப்பட ஆசிரியராகவும் உள்ளார்.

Other stories by Binaifer Bharucha
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli