మా ఇల్లు ఇందిరా కాలనీ అ నే ఒక ఆదివాసీ గ్రామంలో ఉంది. వివిధ ఆదివాసీ సముదాయాలకు చెందిన 25 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మా గ్రామంలో ఒక నీళ్ళ ట్యాంకు, మరుగుదొడ్డి; తాగు నీటి కోసం ఒక బావి ఉన్నాయి.
గ్రామంలో కొందరికి వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, వంగ, మొక్కజొన్న, ఝులన , బెండ, కాకర, గుమ్మడితో పాటు కొలాతా (ఉలవలు), కందులు, పెసలు వంటి వివిధ రకాల పప్పు దినుసులు కూడా పండిస్తారు. చాలామంది మా తిండి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగు చేస్తుంటారు. వర్షాకాలంలో ఈ వరి సాగు జరుగుతుంది.
వరి పంట కోతలు అయ్యాక మేం తినడం కోసం సరిపోయేంత ధాన్యాన్ని ఉంచుకొని మిగిలిన ధాన్యాన్ని అమ్మేస్తాం. వీటిని అమ్మడంతో వచ్చే డబ్బు ఎరువులు, ఇంకా పంటపై మేం పెట్టిన పెట్టుబడిపై ఆధారపడివుంటుంది.
మా ఊళ్ళో ఉన్న కొన్ని ఇళ్ళు గడ్డితో కప్పినవి. గడ్డి మమ్మల్ని ఎండ వేడిమి నుంచి, వర్షాల నుంచి, చలి నుంచి కాపాడుతుంది. ప్రతి ఏడాదీ లేదా రెండేళ్ళకోసారి ఈ గడ్డిని మార్చాల్సివుంటుంది. మా ఇళ్ళను మరమ్మత్తు చేసుకునేందుకు మేం బగులీ గడ్డి, సాలువా , వెదురు, లాహి , ఇంకా అడవి నుంచి తెచ్చిన కలపను ఉపయోగిస్తాం.
మేం ఇళ్ళను కప్పడానికి ఈ బగులీ గడ్డిని ఉపయోగిస్తాం. అడవి నుంచి ఈ గడ్డిని కోసుకొచ్చి ఒక రెండు మూడు నెలలు ఎండలో ఎండబెడతాం. తర్వాత దాన్ని మరికొన్ని రోజులపాటు పొడిగా ఉంచి, అవి పాడైపోకుండా వర్షం నుంచి కాపాడతాం. మేం గడ్డి ఇళ్ళలో మా ఊరిలోనే తయారుచేసే మట్టి పలకలను ఉపయోగిస్తాం.
ఇది ఒక ఎద్దులబండి. దీని చక్రాలు తప్ప ఈ బండి మిగతా భాగాలన్నీ చెక్క లేదా వెదురుతో చేసినవే. దీన్ని మేం పొలాల నుండి ధాన్యాన్ని తీసుకురావడానికీ, అడవి నుండి కొయ్యను తీసుకురావడానికీ ఉపయోగిస్తాం. కొన్నిసార్లు ఈ బండి మీదనే పొలానికి ఎరువు కూడా తోలతాం. ప్రస్తుతం ఇలాంటి బండ్లు క్రమంగా ఉపయోగంలో లేకుండాపోతున్నాయి.
మా గ్రామంలోని చాలామంది ఆవులను, ఎద్దులను, మేకలను, కోళ్ళను ఇళ్ళవద్దే పెంచుతుంటారు. వాటికి మేం గంజి, తవుడు, పెసలు ఆహారంగా ఇస్తాం. రాత్రివేళల్లో మా పశువులు ఎండుగడ్డిని తింటాయి. మేం ఆవులనూ ఎద్దులనూ మేత కోసం అడవికి గానీ, పొలాలలోకి గానీ తోలుకెళ్తాం. వర్షాలు పడినపుడు వాటికి పచ్చగడ్డి దొరుకుతుంది, కానీ వేసవి నెలల్లో ఈ గడ్డి ఎండిపోతుంది. అందువలన ఆవులకూ ఎద్దులకూ ఆ కాలంలో సరైన పచ్చిమేత దొరకదు.
మేం మా పొలాల్లో పశువుల ఎరువును వాడతాం. సాగు చేయదానికి ముందు పొలాల్లో పశువుల పేడను ఎరువుగా వెదజల్లుతాం. ఆవులను, ఎద్దులను అమ్మి జనం డబ్బు సంపాదిస్తారు. ఒక ఆవు దాదాపు రూ. 10,000 ధర పలుకుతుంది.
అదనపు ఆదాయం కోసం మా గ్రామంలోని కొంతమంది అమ్మలు కెందూ (తునికి) ఆకులను సాలపత్రాలను (సాల్ ఆకులు), మహువా (ఇప్ప/విప్ప పువ్వు)ను ఏరతారు.
ఇది ఎండిన మహువా పువ్వు. గ్రామంలోని అమ్మలు పొద్దుపొద్దున్నే అడవికి వెళ్ళి 11 గంటలయ్యేసరికి ఈ పువ్వును ఏరుకొని ఇళ్ళకు తెస్తారు. సేకరించిన ఈ పూలను ఆరు రోజుల వరకూ ఎండలో ఎండబెడతారు. తర్వాత అవి పొడిపొడిగా ఎండటానికి గోతాల్లో కట్టి రెండు మూడు నెలలుంచుతారు. మేం ఒక లోటా మహువా రసాన్ని (ఇప్ప కల్లు) 60 రూపాయలకు, ఒక లోటా నిండుగా మహువా పూలను 50 రూపాయలకు అమ్ముతుంటాం. మహువా పూలను సేకరించటం చాలా కష్టమైన పని.
మా సముదాయమంతా మా కుటుంబం వంటిదే, మేమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటాం.
ఈ కథనాన్ని రూపొందించడంలో PARI ఎడ్యుకేషన్ బృందానికి సాయంచేసిన గ్రామ్ వికాస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్నొవేషన్ అండ్ స్ట్రాటజీ మేనేజర్ శర్వాణి ఛట్టోరాజ్‌కు, సంతోష్ గౌడకు ధన్యవాదాలు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి