ఒక నాగుపాము దృఢమైన సాగ్వాన్ (టేకు) చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉంది. రట్టి తోలా గ్రామవాసులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది చలించలేదు.
ఐదు గంటల తర్వాత, దురదృష్టవంతులైన ఆ గ్రామస్థులు చివరకు సమీపంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్‌లో ఇంతకుముందు కాపలాదారుగా పనిచేసిన ముంద్రికా యాదవ్‌ను పిలిచారు. అతను పులులు, చిరుతపులులు, ఖడ్గమృగం, పాములతో సహా 200 కంటే ఎక్కువే జంతువులను రక్షించారు.
ముంద్రికా వచ్చిన వెంటనే మొదట నాగుపామును క్రిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, అది వచ్చింది. “దాని నోట్లో ఒక వెదురు కర్రను పెట్టి తాడు బిగించాను. తర్వాత దాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకుపోయి మళ్ళీ అడవిలో వదిలేశాను,” అని 42 ఏళ్ళ ముద్రికా చెప్పారు. "ఇదంతా చేయటానికి నాకు కేవలం 20-25 నిమిషాల సమయం పట్టింది."
బిహార్‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ సుమారు 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇతర వన్యప్రాణులతో పాటు 54 పులులకు ఇది ఆవాసంగా ఉంది. " హమ్ స్పాట్ పర్ హీ తురంత్ జుగాడ్ బనా లేతే హైఁ [నేను అక్కడికక్కడే కొత్త కల్పన చేయగలను]," జంతువులను రక్షించడంలో తన వ్యూహాల గురించి ముంద్రికా చెప్పారు.
రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల కింద జాబితా చేసివున్న యాదవ సముదాయానికి చెందిన ముంద్రికా అడవికీ, దానిలోని జంతువులకూ చాలా చేరువగా పెరిగారు. “గేదెలను మేపడానికి వాటిని అడవికి తీసుకెళ్ళినప్పుడు నేను తరచుగా పాములను పట్టుకునేవాడిని. అప్పటి నుంచి నాకు వన్యప్రాణులంటే అభిమానం పెరిగింది. అందుకే 2012లో ఫారెస్ట్ గార్డుకు దేహదారుఢ్య పరీక్షను నిర్వహించినపుడు నేను దరఖాస్తు చేసుకొని ఉద్యోగంలో చేరాను," అని ఈ విజయ్‌పూర్ గ్రామ నివాసి చెప్పారు. ఆయన తన భార్యతోనూ, కుమార్తెతోనూ కలిసి ఇక్కడ నివసిస్తున్నారు.
“మొత్తం ఈ రిజర్వ్ పటమంతా మా కళ్ళల్లోనే ఉంటుంది. మా కళ్ళకు గంతలు కట్టి మమ్మల్ని అడవిలో వదిలిపెట్టేసి మీరు కారులో బయటకు వెళ్ళిపోండి, మీ కంటే ముందే మేం అడవి నుండి బయటకు వచ్చేస్తాం,” అని ఈ మాజీ వనరక్షి (ఫారెస్ట్ గార్డు) చెప్పారు.
ఆయన నెలవారీ జీతం మామూలుగా ఒక ఏడాది ఆలస్యంగా వస్తున్నప్పటికీ, ఆ తర్వాతి ఎనిమిదేళ్ళు ముంద్రికా ఫారెస్ట్ గార్డుగా పనిచేశారు. "అడవినీ జంతువులనూ రక్షించటమంటే నాకు అమిత మక్కువ," అని ఆయన PARIతో చెప్పారు.
బిహార్ ప్రభుత్వం 2020లో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్త ఫారెస్ట్ గార్డులను నియమించింది. ఇంతకుముందు గార్డులుగా పనిచేసిన యాదవ్ వంటివారికి ఇతర ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడాయన విటిఆర్ వాహనాలను నడుపుతున్నారు. "మమ్మల్ని పక్కన పెట్టేశారు," తన కొత్త ఉద్యోగం గురించి అసంతృప్తిగా చెప్పారాయన. ముంద్రికా వయస్సు, ఆయన విద్యార్హత అయిన మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత గార్డు పోస్టుకు సరిపోని కారణంగా, ఈ కొత్త పరీక్షకు కూర్చునే అర్హతను ఆయన పొందలేకపోయారు.
పరిస్థితి ప్రమాదకరంగా, క్లిష్టంగా ఉన్నప్పుడు కొత్త ఫారెస్ట్ గార్డులు ముంద్రికను ఆశ్రయిస్తారు. "పరీక్షల ద్వారా నియమితులైన ఫారెస్ట్ గార్డులకు డిగ్రీ ఉండొచ్చు, కానీ వారికి ఆచరణాత్మక జ్ఞానం లేదు," అని ఆయన చెప్పారు. “అడవిలో పుట్టిన మేము, జంతువులతో కలిసి జీవించడం ద్వారా వాటిని రక్షించడాన్ని నేర్చుకున్నాం."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి