దిల్లీ హమారీ హై
దేశ్ పర్ వహీ రాజ్ కరేగా
జో కిసాన్ మజ్దూర్ కీ బాత్ కరేగా!
[దిల్లీ మాకే చెందుతుంది!
రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేసేవారే
దేశాన్ని పరిపాలించగలరు!]
మార్చి 14, 2024 గురువారంనాడు దేశ రాజధాని కొత్త దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన రైతు కూలీల మహాపంచాయత్‌కు తరలివచ్చిన వేలాది మంది రైతుల ర్యాలీ ఇది.
"మూడేళ్ళ క్రితం [2020-21] సంవత్సరం పాటు జరిగిన నిరసనల సమయంలో మేం టిక్రీ సరిహద్దుకు వచ్చాం," పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన మహిళా రైతుల బృందం రామ్‌లీలా మైదానం వద్ద PARIకి చెప్పారు. "అవసరమైతే మళ్ళీ వస్తాం."
మైదానానికి చేరువగా ఉన్న రహదారులన్నీ పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల నుంచి రైతులను తీసుకువచ్చిన బస్సులతో నిండిపోయాయి. ఉదయం 9 గంటలకంతా చారిత్రాత్మక మైదానానికి దారితీసే రహదారుల ఫుట్‌పాత్‌ల మీద, నిలిపి ఉన్న బస్సుల వెనుక స్త్రీలు, పురుషులు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కట్టెల పొయ్యిల మీద కాల్చిన రోటీ లను ఉదయపు పలహారంగా తీసుకుంటున్నారు.
ఉద్విగ్నభరితంగా ఉన్న ఆ ఉదయాన, జెండాలు చేతపట్టుకొని రామ్‌లీలా మైదానం వైపుకు కదులుతోన్న స్త్రీ పురుష రైతులకు ఆ ప్రదేశమే వారి గ్రామమయింది. 'కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్ (రైతు కూలీల ఐక్యత వర్ధిల్లాలి)! అనే నినాదాలతో గాలి ప్రతిధ్వనిస్తోంది. ఉదయం పదిన్నరకల్లా నేలపై పరచిన పచ్చని పాలిథిన్ అల్లిక పట్టాలన్నీ ఒక క్రమ పద్ధతిలో నిండిపోయాయి; వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ (రైతు, కూలీల మహా గ్రామసభ) ప్రారంభమవడానికి ముందు సిద్ధంగా కూర్చొని ఉన్నారు.
మైదానంలో నీళ్ళు నిలిచివున్నాయని చెప్తూ అధికారులు రామ్‌లీలా మైదానం గేట్లను ఆ ఉదయమే తెరిచారు. ఈ సభను అడ్డుకోవటానికి కావాలనే అధికారులు మైదానాన్ని నీటితో తడిపేశారని రైతు నాయకులు ఆరోపించారు. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు అందుకున్న దిల్లీ పోలీసులు, ఈ సభను 5000 మంది ప్రజలకే పరిమితం చేయాలని సూచించారు. అయితే, ఆ సంఖ్యకు సుమారు పది రెట్ల మంది దృఢనిశ్చయులైన రైతులు మైదానానికి వచ్చారు. మీడియా ఉనికి కూడా గణనీయంగానే ఉంది.
బఠిండా జిల్లా బల్లోహ్ గ్రామానికి చెందిన రైతు శుభ్‌కరణ్ సింగ్ జ్ఞాపకార్థం కొన్ని క్షణాలు మౌనం పాటించడంతో సభ ప్రారంభమయింది. పటియాలాలోని ఢాబీ గుజరాఁ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయు గోళాలతోనూ, రబ్బరు బుల్లెట్లతోనూ చేసిన దాడిలో తలకు తీవ్ర గాయమైన శుభ్‌కరణ్ ఫిబ్రవరి 21న మరణించాడు.
మహాపంచాయత్ వద్ద మొదటగా మాట్లాడిన డా. సునీలమ్, రైతు సంఘమైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్) సంకల్ప్ పత్ర లేదా సంకల్ప పత్రాన్ని చదివి వినిపించారు. వేదిక పైన 25 మందికి పైగా ఎస్‌కెఎమ్, దాని మిత్ర సంఘాలకు చెందిన నాయకులు ఉన్నారు: అక్కడ ఉన్న ముగ్గురు మహిళా నాయకులలో మేధా పట్కర్ కూడా ఉన్నారు. ఎమ్ఎస్‌పికి చట్టపరమైన హామీ ఉండాలని, అదేవిధంగా ఇతర డిమాండ్ల గురించి కూడా ప్రతి ఒక్కరూ 5 నుంచి 10 నిముషాల పాటు మాట్లాడారు.
పంజాబ్, హరియాణాల మధ్య శంభూ, ఖనౌరీ సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతులపై 2024 ఫిబ్రవరిలో బాష్ప వాయు గోళాలను ప్రయోగించడం, లాఠీ ఛార్జీలు చేయటం వంటి ప్రభుత్వ అణచివేత చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'శంభూ సరిహద్దు వద్ద నేను బందీనైనట్టనిపించింది'
రాజధానిలోకి ప్రవేశించే రైతులపై ప్రభుత్వం విధించిన భౌతిక అడ్డంకులు, ఆంక్షలపై స్పందిస్తూ ఒక వక్త ఒక ఆవేశపూరితమైన పిలుపు ఇచ్చారు: దిల్లీ హమారీ హై, దేశ్ పర్ వహీ రాజ్ కరేగా, జో కిసాన్ మజ్దూర్ కీ బాత్ కరేగా! [దిల్లీ మాకే చెందుతుంది! రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేసేవారే దేశాన్ని పరిపాలించగలరు!]
పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రైతు, కార్మిక సంఘాల నాయకులు, 'కార్పొరేట్, మతతత్వ, నియంతృత్వ పాలన' సాగిస్తోన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని శిక్షించాలని పిలుపునిచ్చారు.
“జనవరి 22, 2021 తర్వాత ప్రభుత్వం రైతు సంఘాలతో మాట్లాడనేలేదు. ఎటువంటి చర్చలూ జరగనప్పుడు, సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?" అని రాకేశ్ టికైత్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. టికైత్ భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ అధికార ప్రతినిధి, ఎస్‌కెఎమ్‌లో ఒక నాయకుడు.
“2020-21లో రైతుల పోరాటం చివరలో, C2 + 50 శాతం వద్ద ఎమ్ఎస్‌పి [కనీస మద్దతు ధర]కి చట్టపరమైన హామీ ఉంటుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు అది కూడా చేయలేదు," అని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ అన్నారు. వ్యవసాయ ఆందోళనల గురించి PARI పూర్తి కవరేజీని చదవండి .
ఏడాదిపాటు జరిగిన రైతుల ఆందోళనల సందర్భంగా 736 మందికి పైగా రైతులు మరణించారని , వారి కుటుంబాలకు పరిహారం, వారిపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ ఎందుకు నెరవేర్చలేదని, ఉన్నత వేదికపై నుంచి మాట్లాడుతూ కృష్ణన్ ప్రస్తావించారు. “విద్యుత్ చట్టం సవరణలను ఉపసంహరించుకోవాల్సి ఉంది, అది కూడా చేయలేదు,” అని మహాపంచాయత్‌లో PARIతో మాట్లాడుతూ అన్నారు కృష్ణన్
ఆ తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఐదుగురు రైతులను, ఒక జర్నలిస్టును నరికి చంపాడని మంత్రి అజయ్ మిశ్రా టెనీ కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఆరోపణలుండగా, మంత్రి ఇంకా ప్రభుత్వ పదవిలో కొనసాగడంపై ఎస్‌కెఎమ్ వ్యతిరేకతను కృష్ణన్ లేవనెత్తారు.
దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు (నిరసనలు) కొనసాగుతున్నాయని, “రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతుల, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని,” టికైత్ చెప్పారు.
తన చిన్న ప్రసంగం ముగింపులో, మహాపంచాయత్ తీర్మానాలను ఆమోదించే ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తాలని రాకేష్ టికైత్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అక్కడ చేరివున్న వేలాది మంది రైతులు, కార్మికులు జెండాలతో పాటు తమ చేతులు కూడా ఎత్తారు. చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో వెలుగులు చిమ్ముతోన్న సూర్యుని క్రింద కనుచూపు సాగినంత మేరా తలపాగాలు, కండువాలు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులలో టోపీలు విస్తరించి ఉన్నాయి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి