బిజు (కొత్త సంవత్సరం పండుగ) సమయంలో, మేమంతా ఉదయానే లేచి పూలు కోయడానికి బయటకు వెళ్తాం. ఆ పూలని నదిలో విడిచి, అక్కడే స్నానం చేస్తాం. ఆ తర్వాత, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి, అందరినీ కలిసి పలకరిస్తాం,” అన్నారు జయ. యాభై ఏళ్ళకు పైగా గడిచినా, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు.

“ప్రతి ఇంట్లో మేం గుప్పెడు బియ్యపు గింజలను (అదృష్టానికి ప్రతీకగా)బహుమతిగా ఇస్తాం. బదులుగా ప్రతి ఇంటివారు మాకు లాంగి (బియ్యంతో తయారయ్యే మద్యం) ఇస్తారు. ప్రతి ఇంట్లో కొన్ని గుక్కలు మాత్రమే తాగినప్పటికీ, అందరిళ్ళకీ వెళ్ళి ఇలా తాగేసరికి చివరకు మాకు బాగా మత్తెక్కిపోతుంది," అన్నారామె. ఇదే కాకుండా, "ఆ రోజు గ్రామంలోని యువకులందరూ పెద్దల పట్ల తమకున్న గౌరవాన్ని చాటేందుకు నది నుండి తెచ్చిన నీటితో వారికి స్నానం చేయిస్తారు.” ఈ వార్షిక వేడుకల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న జయ ముఖం వెలిగిపోతోంది.

తన ఇంటి నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, అంతర్జాతీయ సరిహద్దుకు అవతల ఉన్న ఆమెకు, లాంగి జ్ఞాపకాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి; ఎంతోమంది శరణార్థులను వారి చక్మా సముదాయానికి చెందిన సంప్రదాయాలతో, ఆచారాలతో ముడివేసే బంధం ఈ పానీయం. “ఇది మా సంస్కృతిలో అంతర్భాగం," బంగ్లాదేశ్‌లోని రంగమతిలో పెరిగిన జయ చెప్పారు. ఈ ప్రాంతంలో నివసించే ఇతర తెగలు కూడా తమ ఆచారాలలో, నైవేద్యాలలో లాంగి ని ఉపయోగిస్తారు.

“నా తల్లిదండ్రులు చేసేది చూస్తూ నేను దీని ( లాంగి ) తయారీ నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక, నా భర్త సురేన్, నేను కలిసి దీన్ని తయారుచేయడం మొదలుపెట్టాం,” ఆమె తెలిపారు. ఈ జంటకు మరో మూడు రకాల మద్యాలను - లాంగి , మోద్ , జొగొరా - తయారుచేయడం కూడా తెలుసు.

చైత్ర మాసపు మొదటి రోజున (బెంగాలీ క్యాలెండర్లో చివరి నెల), జొగొరా తయారీకి సన్నాహాలు మొదలవుతాయి. దీన్ని కూడా బియ్యంతోనే తయారుచేస్తారు. “ఇందుకోసం మేం బిరోయిన్ చాల్ (నాణ్యమైన జిగురు ఎక్కువగా ఉండే బియ్యం)ను ఉపయోగిస్తాం. స్వేదనం (distill) చేయటానికి ముందు, కొన్ని వారాలపాటు ఆ బియ్యాన్ని వెదురులో పులియబెడతాం. కానీ, ఇప్పుడు మేం తరచుగా జొగొరా తయారుచేయడం లేదు,” జయ చెప్పారు. ఎందుకంటే, దాని తయారీకి కనీసం ఒక నెల పడుతుంది; పైగా బియ్యం కూడా చాలా ఖరీదైపోయింది. “ఇంతకుముందు మేం ఈ వరిని ఝుమ్ (కొండల సాగు)లో పండించేవాళ్ళం, కానీ అది పండించడానికి ఇప్పుడు మా దగ్గర అంత సాగు భూమి లేదు.”

PHOTO • Amit Kumar Nath
PHOTO • Adarsh Ray

ఎడమ: లాంగి, మోద్‌ల తయారీలో జయ ఉపయోగించే పరికరాలివే – పాత్రలు, కంటైనర్లు, పొయ్యి, స్టాండ్. కుడి: త్రిపురలో వెదురు గోడలతో నిర్మించిన ఇళ్ళు, దుకాణాలు

ఈ దంపతుల ఇల్లు త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఉంది. దేశంలోనే రెండవ అతి చిన్న రాష్ట్రమైన త్రిపురలో దాదాపు మూడింట రెండు వంతులు అటవీ ప్రాంతం ఉంటుంది. వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. అదనపు ఆదాయం కోసం చాలామంది కలపేతర అటవీ ఉత్పత్తులపై (NTFP) ఆధారపడతారు.

“ఇల్లు వదిలి వచ్చేటప్పటికి నాది చాలా చిన్న వయసు. మా సముదాయం మొత్తం నిర్వాసితమైంది,” జయ గుర్తుచేసుకున్నారు. పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్) చిట్టగాంగ్‌లో, కర్ణఫూలీ నదిపై ఆనకట్ట నిర్మించడం కోసం వారి ఇళ్ళను కూల్చేశారు. “అప్పుడు మాకు తిండి లేదు, డబ్బు లేదు. మేం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక శిబిరంలో ఆశ్రయం పొందాం. కొన్నేళ్ళ తరువాత త్రిపురకు వచ్చాం,” ఆమె వివరించారు. ఆ తరువాత, త్రిపుర నివాసి అయిన సురేన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

*****

లాంగి ఒక ప్రసిద్ధ పానీయం, దీనికి మంచి మార్కెట్ కూడా ఉంది. వందలాదిమంది ఆదివాసీ మహిళలు ఈ మద్యం ఉత్పత్తిలో, అమ్మకాలలో భాగమయ్యారు. ఈ తెగలలో ఉండే అన్ని సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో ఇది అంతర్భాగం. అయితే 'అక్రమ మద్యం' అన్న పేరుతో, చట్టాన్ని అమలు చేసే అధికారుల చేతిలో ఈ మద్యాన్ని తయారుచేసి అమ్మే మహిళలంతా అనేక వేధింపులకు, అవమానాలకు గురవుతున్నారు.

ఒక విడత మద్యం తయారుచేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని జయ చెప్పారు. “ఇదేమంత సులువైన పని కాదు. రోజువారీ ఇంటి పనులు చేయడానికి కూడా నాకు సమయం దొరకదు,” మిట్టమధ్యాహ్నపు మండే ఎండ నుండి తనను తాను కాపాడుకుంటూ, తన దుకాణంలో కూర్చొని అప్పుడప్పుడూ హుక్కా నుంచి పొగ వదులుతూ తెలియజేశారావిడ.

జర్నల్ ఆఫ్ ఎత్నిక్ ఫుడ్స్ 2016 సంచిక ప్రకారం, లాంగి తయారీలో విభిన్నమైన పదార్థాలు ఉపయోగిస్తారు. దాన్ని తయారుచేసే సముదాయాన్ని బట్టి, తుది ఉత్పత్తిలో భిన్నమైన రుచులు వస్తాయి. “ప్రతి సముదాయం దగ్గర వారి సొంత లాంగి తయారీ విధానం ఉంటుంది. మేం తయారుచేసే దానిలో, రియాంగ్ సముదాయంవారు ఉత్పత్తి చేసే లాంగి కన్నా గాఢత (ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ) ఎక్కువగా ఉంటుంది,” సురేన్ వివరించారు. రియాంగ్‌లు, త్రిపురలో రెండవ అతిపెద్ద ఆదివాసీ సముదాయం.

ఆ దంపతులు, బరకగా రుబ్బిన బియ్యాన్ని వండటం మొదలుపెట్టారు. “ప్రతి విడతకూ మేం 8-10 కిలోల సిద్ధో చాల్ (జిగురు ఎక్కువగా ఉండే చిన్న బియ్యపు గింజలు)ను డేగ్చీ (పెద్ద లోహపు వంట పాత్ర)లో ఉడకబెడతాం. అది అతిగా ఉడకకూడదు,” అన్నారు జయ.

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

ఎడమ: సారాయి తయారీలో బియ్యాన్ని వండటం మొదటి దశ. కట్టెలతో మంటపెట్టిన మట్టి పొయ్యి మీద బియ్యాన్ని ఉడకబెట్టేందుకు జయ పెద్ద అల్యూమినియం పాత్రను ఉపయోగిస్తారు

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

పులియబెట్ట్డానికి ఉపయోగించే కేకులను కలిపే ముందు, వండిన బియ్యాన్ని టార్పాలిన్‌పై ఇలా ఆరబెట్టి చల్లార్చుతారు

ఐదు కిలోల బియ్యంతో రెండు లీటర్ల లాంగి , లేదా అంతకంటే కొంచెం ఎక్కువ మోతాదులో మోద్‌ ను వారు తయారుచేయగలరు. దీన్ని 350 మి.లీ. సీసాలలో, 90 మి.లీ. గ్లాసుల్లో పోసి వాళ్ళు అమ్ముతారు. మోద్ ధర గ్లాసుకి రూ.20 ఉంటే, లాంగి ధర అందులో సగం, అంటే రూ.10 ఉంటుంది.

“ప్రతీ వస్తువు ధర పెరిగింది. పదేళ్ళ క్రితం ఒక క్వింటాల్ (100 కిలోల) బియ్యం ధర దాదాపు రూ.1,600 ఉండేది. ఇప్పుడది రూ.3,300కి పెరిగింది," సురేన్ పేర్కొన్నారు. బియ్యం మాత్రమే కాదు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గత కొన్నేళ్ళుగా భారీగా పెరిగాయని ఆయన అన్నారు.

తమ విలువైన మద్యం తయారీ విధానాన్ని జయ వివరిస్తుండగా, మేం ఆ పక్కనే కూర్చున్నాం. వండిన అన్నం (ఆరబెట్టడానికి) చాప మీద పరిచి, అది చల్లారిన తర్వాత అందులో మూలీ ని కలిపి, వాతావరణాన్ని బట్టి మూడు రోజుల వరకు పులియబెడతారు. “మండే వేసవి కాలంలో, ఒక్క రాత్రి పులియబెడితే సరిపోతుంది. కానీ, శీతాకాలంలో మాత్రం కొన్ని రోజులు పట్టవచ్చు,” అన్నారామె.

అది పులిసిన తరువాత, "దానికి నీళ్ళు కలిపి, చివరిగా మరొకసారి మరిగిస్తాం. నీటిని తీసివేసి చల్లార్చితే, లాంగి తయారైనట్టే,” ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే, మోద్ తయారీలో స్వేదనం ముఖ్యం. గొలుసు బాష్పీకరణం (chain evaporation) కోసం మూడు పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చాలి. త్వరగా పులవడం కోసం, కృత్రిమంగా పులియబెట్టే ఈస్ట్ వంటివాటిని ఇందులో కలపరు.

ఈ రెండు రకాల మద్యం తయారీలో, సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో వికసించే పూల మొక్క పత్థర్ డాగర్ ( Parmotrema Perlatum - రాతి పువ్వు), ఆగ్చి ఆకులు, జిన్ జిన్ అనే ఆకుపచ్చ మొక్కకి పూసే పూలు, గోధుమ పిండి, వెల్లుల్లి, ఇంకా పచ్చి మిరియాలు లాంటి రకరకాల మూలికలను కలుపుతారు. “వీటి మిశ్రమంతో చిన్న చిన్న మూలీ లను సాధారణంగా ముందుగానే తయారుచేసుకొని నిల్వ చేస్తాం,” జయ వివరించారు.

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

ఉడికించిన బియ్యాన్ని త్వరగా పులియబెట్టడానికి, అందులో నూరిన మూలీ (మూలికల, ధాన్యాల మిశ్రమం)ని కలుపుతున్న జయ. కుడి: 48 గంటల పాటు పులియబెట్టిన మిశ్రమం

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

పులియడం కోసం, కృత్రిమంగా పులవబెట్టే పదార్థాలను, లేదా ఈస్ట్‌ను ఉపయోగించే బదులు అనేక మూలికలు, ఒక పూల మొక్క, ఆకులు, పువ్వులు, గోధుమ పిండి, వెల్లుల్లి, పచ్చి మిరియాలను ఉపయోగిస్తారు

“దీనిలో ఉండే ప్రత్యేకమైన పులుపు, ఇతరత్రా మద్యాల వల్ల కలిగే మండే అనుభూతిని కలిగించదు. వేసవిలో ఇది చాలా ఉపశాంతినిస్తుంది, ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉంటుంది,” తన పేరు చెప్పడానికి ఇష్టంపడని ఒక వినియోగదారుడు తన సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు. PARI కలిసిన వినియోగదారులందరూ ఫోటో దిగడానికి, లేదా స్వేచ్ఛగా సంభాషించడానికి ఇష్టపడలేదు; బహుశా, చట్టానికి భయపడి కావచ్చు.

*****

దీన్ని తయారుచేయడం నానాటికీ కష్టమవుతోందని లాంగి తయారీదారులు చెబుతున్నారు. పులియబెట్టిన బియ్యం నుండి తయారుచేసే ఈ మద్యాన్ని 1987 త్రిపుర ఎక్సైజ్ చట్టం నిషేధించింది.

“ఇక్కడ ఎలా బ్రతకగలం? పరిశ్రమలు లేవు, అవకాశాలు లేవు… ఎవరైనా ఇంకేం చేయాలి? చుట్టూ చూడండి, ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో చూడండి.”

పెద్ద మొత్తంలో ఈ మద్యాన్ని తయారు చేయడం కుదరని పని. తన దగ్గర కేవలం ఐదు కుండలు మాత్రమే ఉండడంతో, ప్రతిసారీ 8-10 కిలోల బియ్యం మాత్రమే పులియబెడతానని; ఆపైన నీటి వసతి కూడా పరిమితంగా ఉంటుందని, అది వేసవిలో మరింత తీవ్రమవుతుందని జయ తెలిపారు. “దీని తయారీలో మేం కట్టెలను మాత్రమే ఉపయోగిస్తాం. ఈ పనికి చాలా కట్టెలు అవసరమవుతాయి – ఇందుకోసం ప్రతి నెలా మాకు రూ.5,000 వరకు ఖర్చవుతుంది,” అన్నారామె. గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడంతో వీరు వాటిని ఉపయోగించలేరు.

“మేము దాదాపు పదేళ్ళ క్రితం [ లాంగి ] దుకాణాన్ని ప్రారంభించాం. అదే లేకపోతే మా పిల్లల చదువులు సాధ్యమయేవే కాదు," అన్నారు జయ. "మాకొక హోటల్ కూడా ఉండేది. అయితే చాలామంది కస్టమర్‌లు అక్కడ తినేవారు కానీ బకాయిలు మాత్రం కట్టేవారు కాదు. దాంతో మేం దాన్ని మూసేయాల్సి వచ్చింది."

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

‘మేం కట్టెలను మాత్రమే ఉపయోగిస్తాం. దీనికి చాలా కట్టెలు పడతాయి - ప్రతి నెలా మాకు రూ.5,000 వరకు ఖర్చవుతుంది,’ ఆ దంపతులు చెప్పారు. గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడంతో వీరు వాటిని ఉపయోగించలేరు

PHOTO • Amit Kumar Nath
PHOTO • Rajdeep Bhowmik

ఎడమ: స్వేదనం ప్రక్రియ కోసం ఒకదానిపై మరొక లోహపు పాత్రని అమర్చి, గాలి చొరబడకుండా, వాటిని అనుసంధానించి ఉంచుతారు. తయారైన మద్యాన్ని పైపు సేకరిస్తుంది. కుడి: సేవించడానికి సిద్ధంగా సీసాలో ఉంచిన లాంగి

తమ చుట్టూ నివసించేవారంతా బౌద్ధులని లత (పేరు మార్చాం) అనే మరొక మద్యం తయారీదారు తెలిపారు. “పూజ (పండుగ), నూతన సంవత్సర వేడుకల సమయంలో మేం లాంగి ని ఎక్కువగా వినియోగిస్తాం. కొన్ని ఆచారాల ప్రకారం, కాచిన మద్యాన్ని దేవుళ్ళకు సమర్పించాలి.” అయితే, గత కొన్నేళ్ళుగా లాభాలు పడిపోవడంతో లత మద్యం తయారీని నిలిపివేశారు.

చాలీచాలని ఆదాయాలు జయ-సురేన్‌ దంపతులకు కూడా ఆందోళనను కలిగిస్తున్నాయి. వయసు మీదపడే కొద్దీ పెరుగుతున్న ఆరోగ్య సమస్యల కోసం వారు డబ్బు సమకూర్చుకోవాల్సి వస్తోంది. “నాకు కంటి చూపు సరిగా లేదు. అప్పుడప్పుడు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. పైగా, నా పాదాలు తరచూ ఉబ్బుతున్నాయి.”

త్రిపురలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ కింద చికిత్స తీసుకోవాలంటే చాలా కాలం వేచి చూడాలి. అందుకే, తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు అస్సామ్‌లోని ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎం-జెఎవై) పథకం ద్వారా తమలాంటి పేద కుటుంబాలకు రూ.5 లక్షల కవరేజీ వస్తున్నా కూడా, రాష్ట్ర ఆరోగ్య సంరక్షణపై వారికి నమ్మకం లేకపోవడంతో, వారు అస్సామ్‌కు వెళ్ళేందుకే సిద్ధపడ్డారు. “రానూ పోనూ ప్రయాణానికే రూ.5,000 ఖర్చవుతోంది,” జయ వాపోయారు. ఇక వైద్య పరీక్షలు కూడా వారి పొదుపును స్వాహా చేస్తున్నాయి.

ఇక మేం బయలుదేరే సమయం వచ్చింది. జయ వంటగదిని చక్కదిద్దడం మొదలుపెట్టారు; సురేన్ మరుసటి రోజు ఉదయానే తరువాతి విడత లాంగి తయారీ కోసం కట్టెలు పేర్చడంలో నిమగ్నమయ్యారు.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Rajdeep Bhowmik

ராஜ்தீப் பௌமிக் புனேவில் உள்ள IISER நிறுவனத்தில் ஆய்வுப்படிப்பு படிக்கிறார். அவர் 2023-ம் ஆண்டிற்கான PARI_MMF உறுப்பினர் ஆவார்.

Other stories by Rajdeep Bhowmik
Suhash Bhattacharjee

சுஹாஷ் பட்டாச்சார்ஜி அஸ்ஸாமின் சில்சாரிலுள்ள NIT-ன் ஆய்வறிஞர். 2023ம் ஆண்டின் பாரி-MMF மானியப் பணியாளர்.

Other stories by Suhash Bhattacharjee
Deep Roy

தீப் ராய் புது தில்லியில் உள்ள VMCC மற்றும் சஃப்தர்ஜங் மருத்துவமனையில் முதுகலை முடித்து மருத்துவர் பணி பார்க்கிறார். 2023 ஆம் ஆண்டிற்கான PARI-MMF உறுப்பினர் ஆவார்.

Other stories by Deep Roy
Photographs : Adarsh Ray
Photographs : Amit Kumar Nath
Editor : Priti David

ப்ரிதி டேவிட் பாரியின் நிர்வாக ஆசிரியர் ஆவார். பத்திரிகையாளரும் ஆசிரியருமான அவர் பாரியின் கல்விப் பகுதிக்கும் தலைமை வகிக்கிறார். கிராமப்புற பிரச்சினைகளை வகுப்பறைக்குள்ளும் பாடத்திட்டத்துக்குள்ளும் கொண்டு வர பள்ளிகள் மற்றும் கல்லூரிகளுடன் இயங்குகிறார். நம் காலத்தைய பிரச்சினைகளை ஆவணப்படுத்த இளையோருடனும் இயங்குகிறார்.

Other stories by Priti David
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi