ఆ ఫిబ్రవరి మధ్యాహ్నం కొల్హాపూర్ జిల్లాలోని రాజారామ్ చక్కెర కర్మాగారం వద్ద వాతావరణం చాలా ఉక్కపోతగా, నిశబ్దంగా ఉంది. ఫ్యాక్టరీ ఆవరణలోని వందలాది ఖోప్యాలు (చెరకు కోత కూలీల గుడిసెలు) చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి గంట నడక దూరంలో ఉన్న వడానాగే గ్రామం దగ్గరలో వలస కూలీలు చెరకు పంట కోస్తున్నారు.
దూరం నుంచి వినవస్తోన్న లోహ పాత్రల శబ్దాలు కొంతమంది కార్మికులు ఇంటికి వచ్చి ఉండొచ్చు అని సూచిస్తున్నాయి. ఆ శబ్దాలను అనుసరిస్తూ పోతే, 12 ఏళ్ల స్వాతి మహర్నోర్ తన వాళ్లకు భోజనం తయారు చేయడానికి సిద్ధం కావడం కనిపిస్తుంది. పాలిపోయి, అలసిపోయివున్న ఆ అమ్మాయి, తమ గుడిసెలో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె చుట్టూ వంట పాత్రలు ఉన్నాయి.
వస్తున్న ఆవలింతను ఆపుకుంటూ, ‘‘నేను తెల్లవారుజామున 3 గంటల నుంచి మేలుకుని ఉన్నా,’’ అంది ఆ అమ్మాయి.
ఈ రోజు తెల్లవారుజామున ఆ అమ్మాయి, మహారాష్ట్రలోని బావాడా తాలూకా లో చెరకు కోతలో సహాయ పడేందుకు తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాతయ్యలతో కలిసి ఎద్దుల బండిపై బయలుదేరింది. ఐదుగురు సభ్యులున్న ఆ కుటుంబం రోజుకు 25 మోళీ (కట్టలు) కోయాలనేది ఒప్పందం, ఈ లక్ష్యం పూర్తి కావాలంటే అందరూ పనిచేయాలి. వాళ్లు తమ మధ్యాహ్న భోజనం కోసం ముందు రోజు రాత్రి చేసిన భక్రి (రొట్టెలు), వంకాయ సబ్జీ (కూర)ని కట్టుకుని వెళ్లారు.
తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న తమ గుడిసెకు స్వాతి మాత్రమే ఆరు కిలోమీటర్లు నడిచి మరీ వచ్చింది. " బాబా (తాతయ్య) నన్ను దింపేసి వెళ్ళాడు." 15 గంటలకు పైగా చెరకు కోసి అలసిపోయి, మరి కాసేపట్లో ఆకలితో ఇంటికి తిరిగి వచ్చే కుటుంబ సభ్యుల కోసం రాత్రి భోజనాన్ని సిద్ధం చేయడానికి ఆమె మిగతా వాళ్ల కంటే ముందే ఇంటికి వచ్చింది. "మేం (కుటుంబం) ఉదయం నుండి ఒక కప్పు టీ మాత్రమే తాగాం," చెప్పింది స్వాతి.
ఆమె కుటుంబం 2022 నవంబర్‌లో బీడ్ జిల్లాలోని సకుంద్‌వాడి గ్రామం నుండి కొల్హాపూర్ జిల్లాకు వలస వచ్చినప్పటి నుండి - గత ఐదు నెలలుగా పొలానికీ ఇంటికీ మధ్య తిరుగుతూ, చెరకు కోయడం, వంట చేయడమే స్వాతి నిత్యకృత్యం అయిపోయింది. ఫ్యాక్టరీ ఆవరణలోనే వాళ్ల నివాసం. ఆక్స్‌ఫామ్, 2020లో హ్యూమన్ కాస్ట్ ఆఫ్ షుగర్ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం, మహారాష్ట్రలోని వలస కార్మికులు టార్పాలిన్ పైకప్పులతో తాత్కాలికంగా నిర్మించిన గుడారాలతో కూడిన పెద్ద కాలనీలలో నివసిస్తారు. ఈ కాలనీలలో తరచుగా నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండవు.
"చెరకు కోతంటే నాకిష్టంలేదు" చెప్పింది స్వాతి. " మా గ్రామంలో ఉండడమే నాకిష్టం ఎందుకంటే నేనక్కడ బడికి పోతాను." ఆమె పాటోడా తాలూకా లోని సకుంద్‌వాడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషద్ మాధ్యమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆమె తమ్ముడు కృష్ణ అదే బడిలో 3వ తరగతి చదువుతున్నాడు.
స్వాతి తల్లిదండ్రులు, తాతయ్యల మాదిరిగానే దాదాపు 500 మంది వలస కూలీలు రాజారామ్ చక్కెర కర్మాగారంలో చెరకు కోత సీజన్‌లో కాంట్రాక్టుపై పని చేస్తున్నారు. వారితో పాటు వాళ్ల చిన్నపిల్లలు కూడా వారితో ఉంటారు. "మార్చి (2022)లో మేం సాంగ్లీలో ఉన్నాం" అని స్వాతి చెప్పింది. స్వాతి, కృష్ణలిద్దరూ సంవత్సరంలో దాదాపు ఐదు నెలల పాటు బడికి వెళ్లటంలేదు.
“ బాబా (తాతయ్య) ప్రతి మార్చి నెలలో తిరిగి మమ్మల్ని మా గ్రామానికి తీసుకుపోతాడు, అప్పుడు మేం పరీక్షలు రాస్తాం. పరీక్షలయిపోగానే మా అమ్మానాన్నలకు సహాయం చేయడానికి ఇక్కడికి తిరిగొస్తాం,” అని స్వాతి తాను, తన తమ్ముడు ప్రభుత్వ పాఠశాలలో ఎలా కొనసాగుతున్నామో వివరించింది.
నవంబర్ నుండి మార్చి వరకు బడికి వెళ్ళకపోవడం వల్ల ఆఖరి పరీక్షలలో గట్టెక్కడం కష్టమవుతుంది. "మేం మరాఠీ, చరిత్రలాంటి సబ్జెక్టులలో ఫర్వాలేదు, కానీ లెక్కలు అర్థం చేసుకోవడం కష్టం," అంటుంది స్వాతి. ఊరిలో ఉన్న ఆమె స్నేహితులు కొందరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ దాని వల్ల చదవలేకపోయిన పాఠాలన్నీ నేర్చుకోవడం కుదరదు.
‘‘ఏం చేయాలి మరి? మా అమ్మానాన్నలు పని చేయాలి,’’ అంటుంది స్వాతి.
వాళ్లు వలస వెళ్లని నెలల్లో (జూన్-అక్టోబర్), స్వాతి తల్లిదండ్రులైన 35 ఏళ్ల వర్ష, 45 ఏళ్ల భావూసాహెబ్, సకుంద్‌వాడి గ్రామం చుట్టుపక్కల గల పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. "వర్షాకాలం కాపణీ (కోతలు) వరకు, మాకు మా గ్రామంలో వారానికి 4-5 రోజులు పొలాల్లో పని దొరుకుతుంది," వర్ష చెప్పారు..
ఈ కుటుంబం మహారాష్ట్రలో సంచార తెగగా జాబితా చేసివున్న ధనగర్ సముదాయానికి చెందినది. ఈ దంపతులు ఇద్దరూ కలిసి రోజుకు రూ. 350 సంపాదిస్తారు. దీనిలో వర్ష సంపాదన రూ. 150, భావూసాహెబ్ సంపాదన రూ. 200. వాళ్ల గ్రామం చుట్టుపక్కల పనులు లేనప్పుడు, వాళ్లు చెరకు కోత పనికి వలసపోతారు.
*****
పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE) 2009 ప్రకారం "ఆరు నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్య" అందించాలి అని ఆదేశాలున్నాయి. కానీ స్వాతి, కృష్ణలాగా దాదాపు 0.13 మిలియన్ల మంది వలస కూలీల పిల్లలు (6-14 సంవత్సరాల వయస్సు), వారి తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్లడం వల్ల పాఠశాల విద్యకు దూరమవుతున్నారు.
బడి మానేసేవారి సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం 'విద్యా హామీ కార్డులు' (Education Guarantee Cards - EGC)ని ప్రవేశపెట్టింది. ఇజిసి అనేది విద్యా హక్కు చట్టం, 2009కు 2015లో ఆమోదించిన ఒక తీర్మానం ఫలితం. పిల్లలు తాము వెళ్లిన కొత్త ప్రదేశంలో ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల విద్యను కొనసాగించడానికి ఈ కార్డు ఉద్దేశించబడింది. దీనిలో విద్యార్థుల చదువు వివరాలన్నీ ఉంటాయి, దీనిని పిల్లల స్వంత గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయులు జారీ చేస్తారు.
బీడ్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త అశోక్ తాంగడే, “పిల్లలు తమ వెంట తాము వలస వెళ్లే జిల్లాకు ఈ కార్డును తీసుకెళ్లాలి," అని వివరించారు. కొత్త పాఠశాలలో అధికారులకు కార్డును చూపించినప్పుడు, "తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి బడిలో చేర్చే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు, పిల్లలు అదే తరగతిలో తమ విద్యను కొనసాగించవచ్చు," అని ఆయన తెలిపారు.
అయితే, వాస్తవమేమిటంటే, "ఇప్పటి వరకు పిల్లలకు ఒక్క ఇజిసి కార్డును కూడా జారీ చేయలేదు," అన్నారు అశోక్. పిల్లలు కొంతకాలం పాటు వలస వెళ్లేటప్పుడు, ఆ పిల్లలు తమ పేరును నమోదు చేసుకునివున్న పాఠశాల ఈ కార్డును ఇవ్వాలి.
" జిల్లా పరిషద్ (జెడ్‌పి) మిడిల్ స్కూల్‌లోని మా టీచర్ నాకు గానీ, నా స్నేహితుల్లో ఎవరికీ గానీ అలాంటి కార్డులు ఇవ్వలేదు," నెలల తరబడి బడికి దూరమైన స్వాతి చెప్పింది.
నిజానికి, స్థానిక జెడ్‌పి మిడిల్ స్కూల్ చక్కెర ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది, కానీ ఆ కార్డు లేకపోవడంతో స్వాతి, కృష్ణలు దానికి హాజరు కాలేకపోతున్నారు.
పిల్లలు తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లినప్పుడు వాళ్లకు తప్పనిసరిగా విద్యను అందించాలని RTE 2009 చెబుతున్నా, దాదాపు 0.13 మిలియన్ల మంది చెరకు కోత పనికి వెళ్లే వలస కూలీల పిల్లలకు చదువు అందుబాటులో ఉండడంలేదు
పుణెలోని డైరెక్టరేట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు చెందిన ఒక అధికారి, “ఈ పథకం చాలా బాగా అమలు అవుతోంది. పాఠశాల అధికారులు వలస వెళ్లే విద్యార్థులకు కార్డులు ఇస్తున్నారు," అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎంతమందికి కార్డులు ఇచ్చారని అడిగినప్పుడు, “ఈ సర్వే కొనసాగుతోంది; మేము ఇజిసి వివరాలను సేకరిస్తున్నాం, ప్రస్తుతం దానినంతా క్రోడీకరిస్తున్నాం," అన్నారు.
*****
"నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టంలేదు" అంటాడు అర్జున్ రాజ్‌పుత్. ఈ 14 ఏళ్ల పిల్లాడు కొల్హాపూర్ జిల్లాలోని జాధవ్‌వాడి ప్రాంతంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తున్న తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
ఏడుగురు సభ్యులున్న ఆ పిల్లవాని కుటుంబం ఔరంగాబాద్ జిల్లాలోని వడగావ్ గ్రామం నుండి కొల్హాపూర్-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఇటుక బట్టీలో పనిచేయడానికి వలస వచ్చింది. నిత్యం పనితో సందడిగా ఉండే ఆ బట్టీ నుంచి రోజుకు సగటున 25,000 ఇటుకలు బయటకు వెళతాయి. భారతదేశంలోని ఇటుక బట్టీలలో ఉపాధి పొందుతున్న 10-23 మిలియన్ల మందిలో అర్జున్ కుటుంబం కూడా ఒకటి. ఇటుక బట్టీలలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి, శారీరకంగా చాలా కష్టతరమైన పనులు, సురక్షితం కాని పని వాతావరణం ఉంటుంది. వేతన దోపిడీ ఎక్కువగా ఉండే ఈ బట్టీలలో, ఎక్కడా పని దొరకనివాళ్లు మాత్రమే పనిచేస్తారు.
తల్లిదండ్రులతో పాటు వలసవచ్చిన అర్జున్, నవంబర్ నుండి మే వరకు పాఠశాల మానేయాల్సి వచ్చింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపెట్టే ధూళిమేఘాలను రేపుతూ జెసిబి మెషీన్‌లు వెళుతుండగా, "నేను మా గ్రామంలోని జడ్‌పి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను," అన్నాడు అర్జున్.
అర్జున్ తల్లిదండ్రులు సుమన్, ఆబాసాహెబ్‌లు వడగావ్‌లోనూ, గంగాపూర్ తాలూకా చుట్టుపక్కల గ్రామాలలోనూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. పంటసాగు, పంటకోత సమయాలలో వాళ్లకు నెలకు సుమారు 20 రోజులు పని దొరుకుతుంది, ఒక్కొక్కరికి రోజుకు సుమారు రూ. 250-300 కూలిగా ఇస్తారు. ఈ సమయంలో అర్జున్ తన గ్రామంలోని బడికి వెళ్లొచ్చు.
గత సంవత్సరం, అతని తల్లిదండ్రులు తమ గుడిసె పక్కన పక్కా ఇల్లు నిర్మించడం కోసం ఉచల్ - అడ్వాన్స్ తీసుకున్నారు. “మా ఇంటి పునాది కోసం రూ. 1.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాం,’’ అని సుమన్ చెప్పారు. "ఈ సంవత్సరం, గోడలు కట్టడానికి మరో లక్ష రూపాయలు తీసుకున్నాం."
తమ వలస గురించి వివరిస్తూ, “మేం ఇతర మార్గంలో సంవత్సరానికి లక్ష (రూపాయిలు) సంపాదించలేం. ఇదొక్కటే (ఇటుక బట్టీలలో పని చేయడానికి వలస వెళ్లడం) దారి. "ఇంటి గోడలకు పూత పూయడం కోసం అయ్యే డబ్బు కోసం" తాము వచ్చే ఏడాది తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.
రెండు సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకో రెండు సంవత్సరాలు ఉన్నాయి - ఇంతలో అర్జున్ చదువు ఆగిపోయింది. సుమన్ ఐదుగురు పిల్లలలో నలుగురు బడి మానేశారు. 20 ఏళ్లు కూడా నిండకముందే వారికి పెళ్ళిళ్ళయ్యాయి. తన కొడుకు భవిష్యత్తు గురించి చింతిస్తూ, “మా తాతలు ఇటుక బట్టీల్లో పనిచేసేవారు; ఆ తర్వాత మా అమ్మానాన్నలు, ఇప్పుడు నేను కూడా ఇటుక బట్టీల్లో పని చేస్తున్నాను. ఈ వలస చక్రాన్ని ఎలా ఆపాలో నాకర్థం కావడం లేదు," అసంతృప్తిగా అన్నారామె.
ఇప్పుడు చదువుకుంటున్నది అర్జున్ ఒక్కడే. కానీ "ఆరు నెలలు బడికి వెళ్లలేకపోయిన తర్వాత, ఇంటికి తిరిగి వెళ్ళాక, నాకింక చదువుకోవాలనిపించదు," అన్నాడు అర్జున్.
ప్రతిరోజు ఆరు గంటల పాటు అర్జున్, అనిత (తల్లి తరపు బంధువులమ్మాయి) బట్టీకి దగ్గరలో అవని అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న డే-కేర్ సెంటర్‌లో ఉంటారు. అవని కొల్హాపూర్, సాంగ్లీలలో ఇటుక బట్టీల దగ్గరా, మరికొన్ని చెరకు పంట పొలాల దగ్గరా 20కి పైగా డే-కేర్ సెంటర్లను నడుపుతోంది. అవనిలోని చాలామంది విద్యార్థులు, ప్రత్యేకించి హానికి లోనయ్యే ఆదివాసీ సమూహాల (Particularly Vulnerable Tribal Groups - PVTG) కిందికి వచ్చే కట్కారి సముదాయానికి, సంచార తెగగా గుర్తించబడిన బేల్దార్ జాబితాకు చెందినవారు. దాదాపు 800 నమోదైన ఇటుక బట్టీలు ఉన్న కొల్హాపూర్, పని కోరుకునే వలస కూలీలకు మంచి ఆకర్షణీయమైన ప్రదేశమని అవనిలో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న సత్తప్ప మోహితే వివరించారు.
"ఇక్కడ (డే-కేర్ సెంటర్‌లో) నేనేమీ 4వ తరగతి పుస్తకాలు చదవను. మేం తింటాం, ఆడుకుంటాం. అంతే," అనిత నవ్వుతూ చెప్పింది. 3 - 14 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది వలస కూలీల పిల్లలు పగలంతా ఈ కేంద్రంలో గడుపుతారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు పిల్లలకు ఆటలు ఆడటం, కథలు చెప్పడం వంటివి చేస్తారు.
సెంటర్ నుంచి తిరిగి వచ్చాక, "మేం ఆయి-బాబా లకు (ఇటుకలు అచ్చు పోయడంలో) సహాయం చేస్తాం," అని అర్జున్ సంకోచిస్తూ చెప్పాడు.
ఈ కేంద్రంలోని చిన్నారుల్లో ఏడేళ్ల రాజేశ్వరి నయినేగేలీ ఒకరు. ఆమె, "నేను కొన్నిసార్లు మా అమ్మతో కలిసి రాత్రిపూట ఇటుకలు చేస్తాను," అని చెప్పింది. కర్ణాటకలోని తన గ్రామంలో 2వ తరగతి చదువుతున్న రాజేశ్వరికి తానేం చేయాలో బాగా తెలుసు: “మధ్యాహ్నం ఆయి, బాబా మట్టిని సిద్ధం చేస్తారు, రాత్రివేళ ఇటుకలు తయారుచేస్తారు. వాళ్లు చేసే పనినే నేనూ చేస్తాను." ఆమె ఇటుక అచ్చులో మట్టిని నింపి, దానిని బాగా తడుతుంది. అంత చిన్నపిల్ల అంత బరువును ఎత్తలేదు కాబట్టి ఆమె తల్లి లేదా తండ్రి ఆ అచ్చు నుండి ఇటుకను విడదీస్తారు.
"నేను ఎన్ని (ఇటుకలు) తయారు చేస్తానో నాకు తెలీదు. నేను అలసిపోయినప్పుడు నిద్రపోతాను, కానీ ఆయి-బాబా పని చేస్తూనే ఉంటారు," అని రాజేశ్వరి చెప్పింది.
అవనిలో ఉన్న 25 మంది పిల్లలలో ఎవరి దగ్గరా - వీరిలో చాలా మంది మహారాష్ట్రకు చెందినవాళ్లు - కొల్హాపూర్‌కు వలస వచ్చిన తర్వాత తమ చదువును కొనసాగించడానికి అవసరమైన ఇజిసి కార్డు లేదు. అంతేకాదు, ఇటుకల బట్టీకి ఐదు కి.మీ. దూరంలో బడి ఉంది.
‘‘అది (బడి) చాలా దూరంలో ఉంది. మమ్మల్ని అక్కడికి ఎవరు తీసుకెళతారు?’’ అని అడుగుతాడు అర్జున్.
నిజానికి, సమీపంలోని పాఠశాల ఒక కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు, "స్థానిక విద్యా శాఖ, జిల్లా పరిషద్ లేదా మునిసిపల్ కార్పొరేషన్, వలస వచ్చిన పిల్లల చదువు కోసం తరగతి గదులను, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి" అని ఇజిసి కార్డు తల్లిదండ్రులకు, పిల్లలకు హామీ ఇస్తుంది.
కానీ, 20 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అవని వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ అనురాధ భోసలే, “ఈ నిబంధనలు కాగితాలపై మాత్రమే ఉన్నాయి,’’ అంటారు.
అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన ఆర్తి పవార్ కొల్హాపూర్ ఇటుక బట్టీలో పనిచేస్తోంది. "మా అమ్మానాన్నలు 2018లో నాకు పెళ్లి చేశారు" అని 7వ తరగతి తర్వాత చదువు మానేసిన ఆ 23 ఏళ్ల యువతి చెప్పింది.
"నేను బడికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఇటుక బట్టీలలో పని చేస్తున్నా," ఆర్తి చెప్పింది
*****
“నేను రెండేళ్లు ఏమీ చదువుకోలేదు. మా దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు,” అన్నాడు అర్జున్. మార్చి 2020-జూన్ 2021 మధ్య చదువు పూర్తిగా ఆన్‌లైన్‌లో కొనసాగిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ.
“కోవిడ్‌కు ముందు కూడా, నేను చాలా నెలలు బడికి పోలేదు కాబట్టి నేను పాస్ కావడం కష్టమైంది. 5వ తరగతిని మళ్లీ చదవాల్సి వచ్చింది,” అని ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న అర్జున్ చెప్పాడు. మహారాష్ట్రలోని చాలామంది విద్యార్థుల లాగానే, కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్జున్ బడికి వెళ్లకున్నా, రెండు తరగతులు (6వ, 7వ తరగతి) పాసయ్యాడు.
భారతదేశ మొత్తం జనాభాలో (2011 జనాభా లెక్కల ప్రకారం) దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళుతున్న వారి సంఖ్య 37 శాతం (450 మిలియన్లు), వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారని అంచనా. ఈ భారీ సంఖ్య - సమర్థవంతమైన విధానాలను రూపొందించి, వాటిని సరిగా అమలు చేయాల్సిన తక్షణ అవసరం గురించి నొక్కి చెబుతుంది. వలస కార్మికుల పిల్లలు అంతరాయం లేకుండా విద్యను కొనసాగించేలా చూడటం అనేది 2020లో ప్రచురించిన ఐఎల్‌ఒ నివేదిక చేసిన కీలకమైన సిఫార్సు.
"రాష్ట్ర లేదా కేంద్ర స్థాయిలో, వలస వెళ్ళిన పిల్లల విద్యకు హామీ ఇచ్చే విధానాలను అమలు చేయడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు," అని అశోక్ తాంగడే చెప్పారు. అందువల్ల వలస కార్మికుల పిల్లలు విద్యా హక్కును కోల్పోవడమే కాకుండా, వాళ్లు అభద్రతా వాతావరణంలో జీవించవలసి వస్తోంది.
ఒడిశాలోని బర్‌గఢ్ జిల్లాలోని సునలరంభా గ్రామానికి చెందిన చిన్నారి గీతాంజలి సూనా, నవంబర్ 2022లో తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి దేశమంతా ప్రయాణించి కొల్హాపూర్ ఇటుక బట్టీకి వలస వచ్చింది. పెద్దగా శబ్దాలు చేసే యంత్రాల మధ్య, పదేళ్ళ గీతాంజలి అవనిలోని ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటోన్న ఆ పిల్లల కిలకిలల శబ్దం కొద్ది క్షణాలపాటు కొల్హాపూర్ ఇటుక బట్టీల ధూళి నిండిన గాలిని నింపేస్తోంది.
అనువాదం: రవి కృష్ణ