అక్కడ రేగుతోన్న చిన్న దుమ్ము మేఘం, ఇంజిన్ చేసే ఫట్-ఫుట్ ధ్వని: నీలిరంగు చీర, ముక్కుకు వెడల్పాటి ముక్కుబేసరి ధరించిన అడైక్కలసెల్వి, విశాలమైన చిరునవ్వుతో బైక్‌పై వస్తున్నారు. అంతకు కొన్ని నిమిషాల ముందు, తన మిరప చేనులో ఉన్న ఆమె, తాళం వేసి ఉన్న తన ఇంటి బయట వేచి ఉండమని మమ్మల్ని ఆదేశించారు. ఇప్పుడు మిట్టమధ్యాహ్నం, ఇంకా మార్చి నెలలోనే ఉన్నాం, కానీ రామనాథపురం ఎండలు మాత్రం చాలా ఉగ్రంగా ఉన్నాయి. మా నీడలు చిన్నవైపోయాయి, అయితే మా దాహం మాత్రం చాలా పెద్దది. జామ చెట్టు చక్కని నీడలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి, త్వరత్వరగా ముందు తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు అడైక్కలసెల్వి. చర్చి గంట మోగుతోంది. ఆమె మాకు తాగేందుకు నీళ్ళు తెచ్చి ఇచ్చారు. మేం ఆమెతో ముచ్చటించటం కోసం కూర్చున్నాం.
ముందుగా మేం ఆమె బైక్‌తో ప్రారంభించాం. ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఆమె వంటి నడివయస్సు మహిళ, బైక్‌ను నడపడం అంటే అంత మామూలు విషయమేమీ కాదు. "అయితే ఇది చాలా ఉపయోగపడతా ఉంది," అంటూ 51 ఏళ్ల వయసున్న ఆమె నవ్వారు. ఆమె దాన్ని నడపడాన్ని చాలా త్వరగా నేర్చుకున్నారు. “నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా అన్నయ్య నాకు నేర్పించాడు. నాకు సైకిల్ తొక్కడం వచ్చు, కాబట్టి ఇది కష్టం కాలేదు."
ఈ రెండు చక్రాల వాహనం లేకపోయుంటే జీవితం మరింత కష్టతరంగా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. “నా భర్త చాలా సంవత్సరాలుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. అతను మొదట సింగపూర్‌లోనూ, ఆపైన దుబాయ్, ఖతర్‌లలోనూ ప్లంబర్‌గా పనిచేశాడు. నేను నా కూతుళ్లను ఒంటిచేత్తో పెంచి పోషించటంతో పాటు, వ్యవసాయం కూడా చేస్తున్నాను."
జె. అడైక్కలసెల్వి ఎప్పటినుంచో రైతుగా ఉన్నారు. బాసింపట్టు వేసుకుని, ఒక్కో చేతికి ఒక్కో గాజు ఉన్న చేతుల్ని మోకాళ్లపై ఆనించి, నేలపై కూర్చునివున్న ఆమె వెన్ను భాగం నిటారుగా ఉంది. ఆమె శివగంగై జిల్లాలోని కాళైయార్‌కోవిల్‌లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ముదుకుళత్తూరు బ్లాక్‌లోని ఆమె కుగ్రామం పి. ముత్తువిజయపురం రోడ్డు మార్గం నుండి గంటన్నర దూరంలో ఉంటుంది. "నా సోదరులు శివగంగైలో ఉంటున్నారు. అక్కడ వారికి చాలా బోరుబావులు ఉన్నాయి. నేనిక్కడ వ్యవసాయం కోసం నీటిని గంటకు 50 రూపాయల లెక్కన కొంటాను. రామనాథపురంలో నీటిది పెద్ద వ్యాపారం."
అడైక్కలసెల్వి తన కూతుళ్లను చిన్నతనంలోనే హాస్టల్‌లో చేర్పించారు. పొలంలో పని పూర్తి అయాక, వారిని చూడటానికి వెళ్తారు; తిరిగి వచ్చాక మళ్ళీ తన ఇంటి పనులు చేసుకుంటారు. ఇప్పుడామె ఆరెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. అందులో ఒక ఎకరం ఆమె సొంతపొలం, మిగిలిన ఐదెకరాలను ఆమె కౌలుకు తీసుకున్నారు. “వరి, మిరప, ప్రత్తి: ఇవి మార్కెట్ కోసం. కొత్తిమీర, బెండకాయలు, వంకాయలు, పొట్ల, సొర వంటి తీగజాతి కూరగాయలు, చిన్న ఉల్లిపాయలు (సాంబారు ఉల్లిపాయలు): ఇవి ఇంట్లో వంట కోసం…”
ఆమె హాలులో ఉన్న అటక వైపు చూపించారు. “ఎలుకలు పడకుండా వడ్ల బస్తాలను అక్కడ పైన ఉంచాను. మిరపకాయలు వంటగదిలో ఉన్న అటక మీదకు వెళ్తాయి," ఇంట్లోని గదులు చూపిస్తూ అన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆ ఇంటిని కడుతున్నప్పుడు తానే ఈ గదులను స్వయంగా డిజైన్ చేసినట్టు, సిగ్గుతో కూడిన చిరునవ్వుతో, ఆమె నాతో అన్నారు. ముందు తలుపు మీద మేరీమాత బొమ్మను చెక్కించాలనేది కూడా ఆమె ఆలోచనే. ఒక పువ్వు పైన మేరీమాత నిలబడి ఉన్న ఆ దారు శిల్పం చాలా అందంగా ఉంది. ఇంటి లోపలి గదుల్లో, పిస్తా ఆకుపచ్చ రంగు గోడలు పువ్వులతోనూ, కుటుంబ ఛాయాచిత్రాలతోనూ, జీసస్, మేరీల బొమ్మలతోనూ అలంకరించి ఉన్నాయి.
ఇంటిని ఇలా కట్టడం వలన సౌందర్యంతో పాటు, ఆమె తన పంటను ఇంట్లోనే ఎక్కువకాలం నిల్వచేసి ఉంచుకునే అవకాశం కలిగింది. అందువల్ల పంటకు మంచి ధర వచ్చేవరకూ ఆమె వేచి ఉండగలరు. చాలాసార్లు అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. వరిధాన్యానికి ప్రభుత్వ సేకరణ ధర రూ. 19.40గా ఉంది.
స్థానిక కమీషన్ ఏజెంట్ రూ. 13 మాత్రమే ఇస్తాడు. “నేను ప్రభుత్వానికి రెండు క్వింటాళ్ల (200 కిలోలు) ధాన్యాన్ని విక్రయించాను. వాళ్ళు మిరపకాయలను కూడా ఎందుకు కొనరు?" అని ఆమె అడుగుతున్నారు.
మిర్చి పండించే ప్రతి రైతు స్థిరమైన, మంచి ధరను కోరుకుంటారని ఆమె వాదిస్తారు. “వరిలా కాకుండా, మిరపకు ఎక్కువ వర్షం లేదా నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ సంవత్సరం విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు ఒకసారి, అవి చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు మరోసారి, వాన పడింది. అయితే ఈ వాన మిరపకు పనికిరాదు. మొక్కలు పూతకు వచ్చేముందు పడే వాన మొక్కకు కొంత సహాయపడుతుంది. ఆ సమయంలో ఇక్కడ అసలు వర్షమే రాలేదు." ఆమె 'వాతావరణ మార్పు' అనే పదాన్ని ఉపయోగించలేదు కానీ మారుతున్న వర్షపు నమూనాను చక్కగా సూచించారు - చాలా ఎక్కువగా, చాలా ముందుగా, కాలం గాని కాలంలో, సమయం గాని సమయంలో- ఇలా, ఈ అకాల వర్షం వలన, ప్రస్తుతం వున్న పంట దిగుబడి సాధారణంగా వచ్చే దిగుబడిలో ఐదవ వంతు మాత్రమే రావచ్చునని ఆమె అంచనా వేస్తున్నారు. ఆమె పండించే ‘రామ్‌నాడ్ ముండు ’ రకం మిర్చికి కిలో 300 రూపాయలుగా 'అధిక ధర' ఉన్నప్పటికీ కూడా "ఇది మొత్తం కొట్టుకుపోయినట్టే!" అన్నారామె
ఒక కొలత మిరపకాయలు ఒకటి రెండు రూపాయలకు వెళ్ళటం ఆమెకు గుర్తుంది. అలాగే వంకాయలు కిలో 25 పైసలకు అమ్ముడవటం కూడా. “ముప్ఫై ఏళ్ల క్రితం పత్తి కిలో మూడు లేదా నాలుగు రూపాయలు మాత్రమే అమ్మింది. అప్పుడు కూడా, మీరు రోజుకు ఐదు రూపాయలు కూలీగా ఇచ్చి, కూలీలను పనిలోకి తీసుకోగలిగారు. మరి ఇప్పుడు? కూలీ 250 రూపాయలకు చేరుకుంది. కానీ పత్తికి మాత్రం కిలోకు రూ. 80 మాత్రమే వస్తుంది!" మరో మాటలో చెప్పాలంటే, కార్మికుల పైన అయే ఖర్చు 50 రెట్లు పెరిగింది; పత్తి అమ్మకపు ధర కేవలం 20 రెట్లు మాత్రమే పెరిగింది. ఇప్పుడు రైతు ఏం చేయాలి? నోరు మూసుకొని పని చేసుకుంటూ పోవడమే
అడైక్కలసెల్వి ఎలాగూ అదే పని చేస్తారు. ఆమె మాట్లాడేటప్పుడు ఆమె సంకల్పం ఆ మాట్లల్లో కనిపిస్తుంటుంది. "మిరప చేను ఇటువైపు ఉంది," కుడివైపు చూపిస్తూ అన్నారామె. "అక్కడ కొంత భూమిని, మరికొంత ఆ వైపూ సాగు చేస్తున్నాను." దిక్కులు చూపిస్తోన్న ఆమె చేతులు గాలిలో నమూనాలను గీస్తున్నాయి. “నా దగ్గర బైక్ ఉంది కాబట్టి, నేను మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి రాగలుగుతున్నాను. బస్తాలు తీసుకురావడానికి గానీ, మొయ్యడానికి గానీ నేను మగవాళ్ళపై ఆధారపడను. వాటిని బండి క్యారియర్‌పై ఉంచి ఇంటికి తెచ్చేస్తాను." అడైక్కలసెల్వి నవ్వుతూ మాట్లాడతారు. ఆప్పుడామె ప్రాంతపు తమిళ మాండలికం ఒక్కసారిగా సుపరిచితంగానూ, విలక్షణంగానూ తోస్తుంది.
"నేను 2005లో బైక్‌ను కొనుక్కునేంత వరకు గ్రామంలోని ఒకరి వద్ద బైక్‌ను అరువుతీసుకుని వాడుకునేదాన్ని." ఆమె తన టివిఎస్ మోపెడ్‌ను గొప్ప పెట్టుబడిగా భావిస్తారు. ఇప్పుడామె గ్రామంలోని యువతులను డ్రైవింగ్ చేయమని ప్రోత్సహిస్తుంటారు. "ఇప్పటికే చాలామంది చేస్తున్నారు," అని నవ్వుతూ, తన పొలానికి తిరిగి వెళ్లడానికి బైక్ ఎక్కారు. మేం మా వాహనంలో ఆమెను అనుసరిచాం- ఎండలో ఎండుతున్న మిరపకాయల పంటను దాటుకుంటూ, రామనాథపురంలో పరచివున్న ఆ ఎర్రని తివాచీనీ, దూరంగా ఎక్కడో తయారవుతున్న భోజనానికి మసాలా రుచిని అద్దే ఒక్కో గుండు మిళగాయ్ (గుండుగా ఉన్న మిరపకాయ) నీ దాటుకుంటూ...
*****
"
నిన్ను
ఆకుపచ్చగా
ఉండగా
చూశాను
,
ఆపైన
పక్వానికి
వచ్చినకొద్దీ
ఎర్రగా
మారడాన్ని
కూడా
చూట్టానికీ
బాగుంది
;
వంటకాల
రుచిగానూ
బాగుంది
…”
సంగీతకర్తా, సాధువూ పురందరదాస కీర్తన నుంచి
అనేక అన్వయాలకు దారితీసే ఈ ఆసక్తికరమైన పంక్తి - మిరపకాయల గురించిన మొదటి సాహిత్య ప్రస్తావన - అని కె. టి. అచ్చయ తన ' ఇండియన్ ఫుడ్ , ఎ హిస్టారికల్ కంపానియన్ ' అనే పుస్తకంలో చెప్పారు. ఇప్పుడీ మసాలా ద్రవ్యం, భారతీయ ఆహారంలో సర్వవ్యాప్తి చెందివుంది. "ఇది ఒకప్పుడు మనకు తెలియని పదార్థమంటే నమ్మడం కష్టం." అన్నారాయన. అదే సమయంలో, ఈ పాట మనకు దాని ఉనికిని గురించిన ఒక సుమారు సమయాన్ని తెలియచేస్తుంది: ఇది "1480-1564 మధ్య జీవించిన గొప్ప దక్షిణ భారత స్వరకర్త పురందరదాసు"చే స్వరపరచబడింది.
ఆ పాట ఇంకా ఇలా సాగుతుంది:
"పేదలపాలిట రక్షకుడు, మంచి ఆహారాన్ని మరింత రుచికరం చేసేవాడు, కొరికినప్పుడు నోటిని మండించేవాడు, పాండురంగ విఠలుని (దేవుడు) తలచుకోవడం కూడా కష్టం!"
క్యాప్సికమ్ ఆనమ్ ను మిరపకాయ అని పిలుస్తారు. 'మిరపకాయ పోర్చుగీసువారితో కలిసి భారతదేశానికి ప్రయాణించింది. పోర్చుగీసువారు దీనిని దక్షిణ అమెరికాపై తాము సాధించిన విజయాల నుండి భారతదేశ తీరానికి తీసుకువచ్చారు' అని సునీతా గోగటే, సునీల్ జలీహాల్‌లు తమ పుస్తకం ' రొమాన్సింగ్ ది చిల్లీ 'లో చెప్పారు.
మిరపకాయ ఇక్కడకు వచ్చిన తర్వాత, అప్పటి వరకు ఆహారానికి 'వేడి'ని జోడించే ఏకైక మసాలాగా ఉన్న మిరియాలను త్వరత్వరగా అది అధిగమించింది. ఎందుకంటే "మిరియాలను పండించడం కంటే కూడా గొప్ప వైవిధ్యంతో దీన్ని దేశమంతటా పండించవచ్చు." అని అచ్చయ పేర్కొన్నారు. బహుశా ఒక అంగీకారంగా మిరపకాయలకు అనేక భారతీయ భాషలలో మిరియాలకు సంబంధించి ఉండేలా పేరు పెట్టారు. ఉదాహరణకు, తమిళంలో మిరియాలు - మిళగు ; మిరపకాయ - మిళగాయ్ అయింది- ఖండాలకూ శతాబ్దాలకూ వారధి అయిన రెండు అచ్చులు.
ఈ కొత్త మసాలా దినుసు మనదైపోయింది. ఈ రోజు భారతదేశం, ప్రపంచంలోని ఎండు మిరపకాయల అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. 2020 సంవత్సరానికి గాను 1.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అగ్రగామిగా ఉంది. ఇది రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న థాయ్‌లాండ్, చైనా దేశాల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ . భారతదేశంలో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021లో 8,36,000 టన్నుల మిరపకాయలను ఉత్పత్తి చేసి, 'హాటెస్ట్' రాష్ట్రంగా పేరుపొందింది. అదే సంవత్సరం తమిళనాడు కేవలం 25,648 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. తమిళనాడు రాష్ట్రంలో , మిర్చిని ఉత్పత్తి చేయడంలో రామనాథపురం జిల్లా మొదటి స్థానంలో ఉంది: ఈ రాష్ట్రంలో మిర్చి పండించే ప్రతి నాలుగు హెక్టార్లలో ఒకటి (54,231 టన్నుల్లో 15,939 టన్నులు) ఈ జిల్లాకు చెందినదే.
రామనాథపురంలోని మిర్చి పంట గురించీ, రైతుల గురించీ నేను మొదట చదివినది, జర్నలిస్ట్ పి. సాయినాథ్ రాసిన ప్రఖ్యాత పుస్తకం, Everybody Loves a Good Drought లోని ‘ The Tyranny of the Tharagar (తరగర్ దౌర్జన్యం)' అనే అధ్యాయంలో. కథ ఈ విధంగా మొదలవుతుంది: “ఒక చిన్న రైతు తన ముందు ఉంచిన రెండు బస్తాలలో ఒకదానిలోకి తరగర్ (కమీషన్ ఏజెంట్) తన చేతులను ముంచి ఒక కిలో మిరపకాయలను తీస్తాడు. ఆ మిరపకాయలను అతను - సామి వత్తల్ (దేవుని వాటా) అంటూ, నిర్లక్ష్యంగా ఒక వైపుకు విసురుతాడు."
అప్పుడు సాయినాథ్ మనకు నిర్ఘాంతపోయిన రైతు, రామస్వామిని- 'ముప్పావు ఎకరంలో తన జీవన మార్గాన్ని వెతుక్కున్న', తన ఉత్పత్తులను ఈ దళారికి తప్ప మరెవరికీ విక్రయించలేని మిర్చి రైతు- మనకు పరిచయం చేస్తారు. ఎందుకంటే ఈ దళారీ "పంట మొత్తాన్నీ దాన్ని విత్తడానికి ముందే కొనుగోలు చేశాడు.” 1990వ దశకం ప్రారంభంలో సాయినాథ్ ఈ పుస్తకం రాయటం కోసం దేశంలోని అతి పేద జిల్లాలైన పది జిల్లాల్లో పర్యటించిన సమయంలో రైతులపై తరగర్ కు ఉన్న పట్టు అలా ఉండేది.
‘లెట్ దెమ్ ఈట్ రైస్’ అనే నా సిరీస్ కోసం, మిర్చి రైతులు ఇప్పుడు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడానికి, 2022లో తిరిగి నేను రామనాథపురం వెళ్లాను.
*****
"
తక్కువ
దిగుబడికి
కారణాలు
:
మయిల్
(
నెమలి
),
ముయల్
(
కుందేలు
),
మాడు
(
పశువులు
),
మాన్
(
జింక
).
ఆపైన
అయితే
అతివృష్టి
లేదంటే
అనావృష్టి
."
వి. గోవిందరాజన్,
మిర్చి రైతు, ముమ్ముడిసాత్తాన్, రామనాథపురం
రామనాథపురం పట్టణంలోని మిర్చి వ్యాపారి దుకాణం లోపల మహిళలు, పురుషులు వేలంపాట కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వీరంతా టెంపోలలోనూ, బస్సులలోనూ ప్రయాణించి ఈ మార్కెట్‌కు వచ్చిన రైతులు. వాళ్ళు తమ పైటకొంగులతో, తువ్వాళ్ళతో విసురుకుంటూ అక్కడ వున్న పశువుల మేత (‘డబుల్ హార్స్’ బ్రాండ్) బస్తాలపై కూర్చుని ఉన్నారు. అక్కడ చాలా వేడిగా ఉంది. కానీ కనీసం, కొంత నీడైనా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. వారి పొలాల్లో ఆ కాస్త నీడ కూడా ఉండదు మరి. చూడండీ, మిరప మొక్కలు నీడకు పెరగవు మరి.
వి. గోవిందరాజన్(69), ఒక్కోటీ 20 కిలోల బరువున్న మూడు సంచుల ఎర్ర మిరపకాయలను తీసుకొచ్చారు. "ఈ యేడు పంట చాలా తక్కువగా ఉంది" తలవిదిలిస్తూ పంట మగసూల్ (దిగుబడి) గురించి చెప్పారాయన. "కానీ మిగిలిన ఖర్చులేవీ దిగిరావడంలేదు." మల్లిగై (మల్లెపూలు) వంటి చికాకు పెట్టే పంటలతో పోలిస్తే ఈ పంట చాలా గట్టిది. వాటికిలాగా మిళగాయ్ ని పురుగుమందులలో ముంచితేల్చనక్కరలేదు.
ఆ తర్వాత గోవిందరాజన్ పంట సాగుచేసే పద్ధతి గురించి చెప్పారు. చేనుని ఎన్నిసార్లు దున్నాలో వివరించారు: ఏడుసార్లు. (రెండుసార్లు లోతుగా దున్నుతారు, ఐదుసార్లు వేసవికాలంలో దున్నుతారు). తర్వాత ఎరువుల గురించి. ఒక వారం రోజులపాటు వంద మేకలను రాత్రివేళల్లో తన మిరపచేనులో వదులుతారు. మేకల గెత్తం భూమిని సారవంతం చేస్తుంది. ఇందుకు ఒక రాత్రికి రూ. 200 చొప్పున ఆయనకు ఖర్చవుతుంది. ఆ తర్వాత వచ్చేది విత్తనాల ఖర్చు, 4-5సార్లు కలుపు తీయడానికి అయ్యే ఖర్చు. "మా అబ్బాయికి ట్రాక్టర్ ఉంది. అతను ఉచితంగానే నా చేనుని పంట కోసం సిద్ధంచేస్తాడు," ఇకిలిస్తూ చెప్పారాయన. ఉన్న పనినిబట్టి, మిగతావాళ్ళు గంటకు రూ. 900 నుండి రూ. 1500 వరకూ చెల్లిస్తారు.
మేం మాట్లాడుకుంటున్న చోటికి మరికొంతమంది రైతులు వచ్చి చేరారు. తమ పంచలనూ, లుంగీలనూ ఎత్తి కట్టుకొని, తువాళ్ళను భుజం మీద వేసుకునీ, తలకు చుట్టుకునీ మగవాళ్ళు చుట్టూ నిలబడి ఉన్నారు. నైలాన్ చీరలు కట్టుకున్న మహిళలు తలతో పూలతో కళకళలాడుతున్నారు. వారి తలల్లో నారింజ రంగు కనకాంబరాలు , ఘుమఘుమలాడుతున్న మల్లిగై మాలలూ ఉన్నాయి. గోవిందరాజన్ నాకో టీ ఇప్పించారు. పెంకుటింటి కప్పులో ఉన్న కిటికీల నుంచీ, ఖాళీల నుంచీ సూర్యరశ్మి లోపలికి జాలువారుతోంది. ఆ కాంతి రాశులుగా ఉన్న ఎర్ర మిరపకాయలపై పడి, అవి పెద్ద పెద్ద కెంపులలాగా మెరిసిపోతున్నాయి.
రామనాథపురం బ్లాక్‌లోని కోనేరి నుంచి వచ్చిన ఎ. వాసుకి అనే మహిళా రైతు తన అనుభవాలను మాతో పంచుకున్నారు. మిగతా అందరు మహిళలకులాగే ఆమెకు ప్రతిరోజూ ఇంట్లోని మగవాళ్ళకంటే ముందే మొదలవుతుంది. ఆమె ఉదయం 7 గంటలకు ఈ మార్కెట్‌కు రావడానికి చాలా ముందే, తన బడికి వెళ్ళే పిల్లలకోసం వంట చేయడం, వారికి మధ్యాహ్నానికి భోజనం కట్టి పంపిచేయడం పూర్తవుతుంది. ఇక్కడినుంచి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆమెకు పూర్తిగా 12 గంటలు పడుతుంది. అది సరిగ్గా ఇంటి పనులు చేసుకునే సమయం.
ఈసారి పంట మొత్తం కొట్టుకుపోయింది, అన్నారామె. "ఈసారి ఏదో జరిగింది. మిరపకాయలు ఎంతమాత్రం పెరగలేదు. అంబుట్టుం కొట్టిడుచ్చు (మొత్తం వాలిపోయాయి)." చివరికామె తెచ్చింది 40 కిలోల మిరపకాయలు మాత్రమే. ఇవి వచ్చిన పంటలో సగం. ఈ సీజన్‌లోనే తర్వాత మరో 40 కిలోలు రావొచ్చని ఆమె అంచనావేసుకుంటున్నారు. మరికొంచం సంపాదన కోసం, ఎన్ఆర్ఇజిఎ పనులమీదే ఆమె ఆశలు పెట్టుకుని ఉన్నారు.
59 ఏళ్ళ పి. పూమయిల్‌కు అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామమైన ముమ్ముడిసాత్తాన్ నుంచి ఇక్కడకు రావడం ఆ రోజుకెల్లా చాలా ముఖ్యమైన విషయం. ఆ ఉదయం ఆమెకు ఉచితంగా ప్రయాణించే అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో నడుస్తోన్న డిఎమ్‌కె ప్రభుత్వం 2021లో తాము అధికారంలోకి రాగానే పట్టణాలలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
పూమయిల్ తన టికెట్‌ను నాకు చూపించారు. దానిపైన మగలిర్ (మహిళలు) అనీ, ఉచిత టికెట్ అనీ ఉంది. ఆమెకు 40 రూపాయలు మిగలటం గురించీ, ఉచిత ప్రయాణ సౌకర్యం తమకూ కావాలని ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు గొణగటం గురించీ మేం చర్చించాం. అందరూ నవ్వారు, ప్రత్యేకించి మహిళలు సంతోషంగా నవ్వారు. తక్కువ పంట రావడానికి గల కారణాలను గోవిందరాజన్ చెపుతుండటంతో ఆ నవ్వులు సద్దుమణిగాయి. మయిల్ , ముయల్ , మాడు , మాన్ - అంటూ ఆయన తమిళంలో జాబితా చదివారు. నెమలి, కుందేలు, ఆవు, జింక. "ఇంకా, అయితే ఒకటే వానలు, లేదంటే అసలు వానే కురవకపోవటం."ఎక్కువ పూత, ఎక్కువ కాయ వచ్చేందుకు ఒక మంచి వాన అవసరం.అలాంటప్పుడు అసలు వాన పడలేదు. "ఇంతకుముందు మిరప పంట చాలా ఎక్కువగా పండేది." పైకప్పు వేపు చూపిస్తూ అన్నారాయన. "ఆ పై కప్పుదాకా! ఒక మనిషి పైన నిలుచొని ఒక కొండంత గుట్ట అయిందాకా మిరపకాయలను పోసేవాడు."
ఇప్పుడా గుట్టలు చిన్నగా, మా మోకాళ్ళవరకూ వస్తున్నాయంతే. వాటి రంగులు కూడా కొన్ని గాఢమైన ఎరుపు రంగులో ఉంటే, కొన్ని కొంత తక్కువగా ఉంటున్నాయి. అయితే అవన్నీ కారంగానే ఉంటాయి. అప్పుడప్పుడూ ఆ ఘాటుకు ఎవరో ఒకరు తుమ్మటమో దగ్గటమో చేస్తున్నారు. కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నా, ఇక్కడ ఈ వ్యాపారి దుకాణం లోపల ఆ తుమ్ములకూ దగ్గులకూ కారణమైన దోషి మాత్రం మిరపకాయే!
వేలంపాట నిర్వహించే ఎస్. జోసెఫ్ లోపలికి రాగానే అందరిలో అసహనం మొదలవుతుంది. అప్పటికప్పుడే పరిస్థితి మారిపోతుంది. మిరపకాయల గుట్టల చుట్టూ జనం మూగుతారు. జోసెఫ్‌తో వచ్చిన బృందం మిరపకాయల వేపుకు వెళ్ళి, వాటి పైన నిల్చొని వాటిని దగ్గరగా పరిశీలిస్తారు. అప్పుడతను తన కుడి చేతి మీద తువ్వాలు కప్పుకుంటాడు. మరొక వ్యక్తి - కొనుగోలుదారులందరూ మగవాళ్ళే - రహస్య వేలంపాటలో భాగంగా తువ్వాలు కిందనుంచి తన వేళ్ళను చొప్పిస్తాడు.
బయటివాళ్ళను ఆ రహస్య భాష చికాకుపెడుతుంది. కానీ అరచేతిని తాకడం, వేలిని పట్టుకోవడం, కిందినుంచి తట్టడం వంటివాటి ద్వారా, వాళ్ళు అంకెలను చెప్పుకుంటారు. అంటే ఆ మిర్చి గుట్టకు వాళ్ళు ప్రతిపాదించే ధర అన్నమాట. వాళ్ళ వేపునుంచి ఏ ప్రతిపాదన లేకపోతే అరచేతిలో సున్నా చుడతారు. ఇందులో వేలంపాట నిర్వాహకునికి ఒక్కో సంచికి 3 రూపాయలు చొప్పున కమీషన్ లభిస్తుంది. ఈ వేలంపాట నిర్వహణను ఏర్పాటు చేసినందుకు దుకాణదారుడు రైతు నుంచి మొత్తం అమ్మకంపై 8 శాతం తీసుకుంటాడు.
ఒక కొనుగోలుదారుడి పని అయిపోయాక ఇంకొకరు నిర్వాహకుడి ఎదుటకు వచ్చి తువ్వాలు కిందుగా తన వేళ్ళను కదుపుతాడు. అలాగే మరొకరు... ఇలా అందరూ తమ ప్రతిపాదనలను ఉంచిన తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఉన్న ధరను బయటకు ప్రకటిస్తారు. మిరపకాయల పరిమాణం, వాటి రంగును అనుసరించి ఆరోజు ఒక కిలో మిరపకాయల ధర 310-389 రూపాయల వరకూ పలికింది. అయితే రైతులు పెద్ద సంతోషంగా అయితే లేరు. చిన్న మొత్తాల్లో వచ్చిన ఉత్పత్తికి మంచి ధర పలకటం వారికి నష్టాన్నే తెస్తుంది. "మేం బాగా సంపాదించాలనుకుంటే వాటికి అదనంగా విలువను జోడించాలని మాకు చెప్తారు," అని గోవిందరాజన్ అన్నారు. “అయితే చెప్పండి, మాకు సమయం ఎక్కడుంది? మిర్చిని కారం పట్టించి ప్యాకెట్లే అమ్ముతామా, వ్యవసాయమే చేస్తామా? అని అడుగుతారాయన.
అతని సరుకు వేలానికి వచ్చేసరికి ఆయనలో కోపం స్థానంలో ఆందోళన చోటుచేసుకుంది. "ఇక్కడికి రా, ఇక్కడ్నించి బాగా చూడొచ్చు" అంటూ నన్ను పిలిచారు. "ఇది కూడా నువ్వు నీ పరిక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తుండటం లాంటిదే," తువ్వాలుని నోటికి అడ్డంగా పెట్టుకుంటూ అన్నారు. రహస్యంగా కలుసుకుంటున్న చేతుల్ని జాగ్రత్తగా గమనిస్తోన్న ఆయన శరీరం ఉద్రిక్తంగా ఉంది. "నాకు కిలోకు 335 రూ.లు వచ్చాయి," ధరని ప్రకటించినపుదు నవ్వుతూ చెప్పారాయన. ఆయన కొడుకు పండించిన మిరపకాయలకు, కొంచం పెద్దగా ఉండటం వలన కిలోకు మరో 30 రూ.ల ఎక్కువ ధర వచ్చింది. వాసుకి పంటకు 359 రూ.ల ధర వచ్చింది. రైతులకు కాస్త ప్రశాంతత వచ్చింది. కానీ వారి పని అప్పుడే అయిపోలేదు. తర్వాత వాళ్ళు తమ మిరపకాయలను తూయించి, డబ్బులు తీసుకుని, కొంచమేదైనా తిని, కొన్ని వస్తువులు కొనుక్కొని, చివరకు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు బస్సును పట్టుకోవాలి…
*****
"ఇంతకుముందు మేం సినిమాకు వెళ్ళేవాళ్ళం. కానీ చివరిసారి నేను థియేటర్‌లో సినిమా చూసింది 18 ఏళ్ళ క్రితం: తుళ్ళాద మనముమ్ తుళ్ళుమ్" (తుళ్ళిపడని మనసు కూడా తుళ్ళిపడుతుంది!)
ఎస్. అంబిక, మిర్చిరైతు, మేలాయ్‌కుడి,
రామనాథపురం
"చేను ఒక అరగంట నడక దూరంలో మాత్రమే ఉంది. కానీ ఈ దారిలో నడక ఎక్కువ సమయం తీసుకుంటుంది." ఎస్. అంబిక మాతో చెప్పారు. మూడున్నర కిలోమీటర్ల దూరం, అనేక మలుపులూ వంపులూ తిరిగిన తర్వాత పరమకుడి బ్లాక్‌లో ఉన్న మేలాయ్‌కుడి గ్రామంలోని ఆమె మిరపచేలను చేరుకున్నాం. దూరం నుంచే మొక్కలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆకులు చక్కని మరకతం రంగులో, ప్రతి కొమ్మకూ వివిధ దశలలో పక్వానికి వస్తున్న పండ్ల్లు: కెంపు ఎరుపు, పసుపు, అందమైన పట్టుచీరల రంగైన అరక్కు (మరూన్) రంగుల్లో ఉన్నాయి. అక్కడక్కడా ఎగురుతోన్న నారింజ రంగు సీతాకోక చిలుకలు ఇంకా పక్వానికి రాని మిరపకాయలకు రెక్కలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.
ఇంకో పది నిముషాల్లోనే ఆ అందం మాకు కనిపించకుండా పోయింది. అప్పటికింకా ఉదయం 10 గంటలైనా కాలేదు. కానీ సూర్యుడు చాలా తీక్షణంగా ఉన్నాడు, నేల పొడిగా ఉంది, కళ్ళలోకి చెమట కారి చురుక్కుమంటోంది. రామనాథపురం వాన దాహంతో ఉందా అనిపించేట్టు, జిల్లా అంతటా నేల బీటలువారి ఉండటాన్ని మేం గమనించాం. అంబిక మిరప చేను కూడా వేరేగా ఏం లేదు, భూమి అంతా నెర్రెలు విచ్చి ఉంది. అయితే నేల మరీ అంత పొడిగా ఉందని అంబిక అనుకోవటంలేదు. తన కాలి బొటనవేలితో - ఆమె కాలి రెండవ వేలుకు వెండి మెట్టీలు (మెట్టెలు) చుట్టుకొని ఉన్నాయి - నేలను తవ్వుతూ "ఇదుగో, ఇది తేమ కాదా?" అంబిక అడిగారు.
ఎన్నో తరాలుగా అంబిక కుటుంబం జీవనం కోసం వ్యవసాయం చేస్తూవుంది.38 ఏళ్ళ అంబికతో పాటు ఆమె మరదలు 33 ఏళ్ళ ఎస్. రాణి కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు చెరి ఒక ఎకరం సొంత భూమి వుంది. ఆ భూమిలో వాళ్ళు మిరపకాయలతో పాటు అగత్తి (అవిసె)ని కూడా సాగుచేస్తారు. ఈ అవిసె ఆకులు వారి మేకలకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు బెండకాయలు, వంకాయలు కూడా పండిస్తారు. అది వారికి మరింత పనిని పెంచుతుందన్నది నిజమే. కానీ వారికి ఆదాయం అవసరం కదా? చేను కాపలా కోసం ఈ మహిళలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి, సాయంత్రం 5 గంటలవరకూ అక్కడే ఉంటారు."లేకపోతే మేకలు మొక్కలను తినేస్తాయి." ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచే ఈ మహిళలు, ఇల్లు శుభ్రం చేసుకొని, నీళ్ళు పట్టుకువచ్చి, వంటచేసి, పిల్లలను నిద్రలేపి, అంట్లు తోముకొని, భోజనం కట్టి, పశువులకూ కోళ్లకూ మేత వేసి, పొలానికి నడిచివెళ్ళి, అక్కడ పనిచేసి... ఇలా సాగుతుంది వీరి దినచర్య. ఒక్కోసారి పశువులకు నీళ్ళు పెట్టడానికి మధ్యాహ్నం వేళల్లో ఇంటికి తిరిగి వెళ్తుంటారు. మళ్ళీ ఇంటినుండి 'అడ్డదారిలో' మిరప చేనుకు వెళ్ళటానికి అరగంట నడక ఉంటుంది. ఇప్పుడు ఆ దారిలో ఒక కుక్కను, దాని పిల్లలు తరుముతున్నాయి. కనీసం ఆ కుక్క తల్లికి కాసేపయినా పరుగులుతీసి పారిపోయే అవకాశం ఉంది…
అంబిక ఫోన్ మోగింది. ఆమె కొడుకు ఫోన్ చేశాడు. మూడు రింగుల తర్వాత " ఎన్నడా (ఏమిట్రా), ఏం కావాలి?" కనుబొమలు ముడేసి అతను చెప్పేది విని, మెత్తగా చివాట్లు పెడుతూ ఆమె ఫోన్ పెట్టేశారు. ఇంటిదగ్గర పిల్లలు కూడా ఏవో కోరికలు కోరుతూనే ఉంటారని ఆ మహిళలు మాతో చెప్పారు. "మేం ఏం వండినా, వాళ్ళు గుడ్లూ బంగాళాదుంపల కోసం అడుగుతారు. అందుకని మేం కొంచం కొంచంగా వాటి వేపుళ్ళు కూడా చేస్తుంటాం. ఆదివారాల్లో వారికి ఏ మాంసం కావాలంటే దాన్ని కొంటాం."
మాతో మాట్లాడుతూనే, పక్కనే ఉన్న పొలాల్లోని మహిళలతో పాటు వీళ్ళు కూడా మిరపకాయలు కోస్తూనే ఉన్నారు. సున్నితంగా మొక్క కొమ్మలను పైకెత్తి, వాటినుంచి చకచకా మిరపకాయలను కోసేస్తున్నారు. చేతి నిండుగా అవగానే, పక్కనే ఉన్న పెయింట్ బక్కెట్‌లోకి వాటిని వేస్తున్నారు. ఇంతకు ముందు తాటాకు బుట్టలను వాడేవాళ్ళమని అంబిక చెప్పారు. ఇప్పుడు చాలాకాలం పాటు మన్నే ప్లాస్టిక్ బక్కెట్లను వాడుతున్నారు.
అక్కడ అంబిక ఇంటి మేడమీద, ఈ కోసిన మిరపకాయలు మండుతున్న సూర్యుడి కింద ఎండుతూ వున్నాయి. పండు మిరపకాయలను ఆమె జాగ్రత్తగా నేలమీదంతా పరుచుకొనేలా చేసి, అవి సమానంగా ఎండటం కోసం మధ్యమధ్యలో వాటిని తిరగేస్తున్నారు. ఆమె కొన్ని కాయలను చేతిలోకి తీసుకొని, వాటిని ఊపి చూస్తున్నారు. "ఇవి బాగా ఎండితే గడ గడ (గలగలమని) శబ్దం చేస్తాయి." అది మిరప్పండు లోపల ఉండే గింజలు ఎండినతర్వాత చేసే శబ్దం. అవి అలా ఎండాక, ఎండబెట్టిన వాటినన్నిటినీ పోగుచేసి, సంచులకెత్తి, వాటిని తూకం వేసి, ఊరిలోనే ఉండే కమీషన్ ఏజెంటు దగ్గరకు తీసుకువెళ్తారు. లేదంటే మరిం కొంచెం ఎక్కువ ధర కోసం పరమకుడికి గానీ, రామనాథపురం మార్కెట్‌కు గానీ తీసుకువెళ్తారు.
"నీకు కలర్(సీసాలో ఉండే పానీయం) ఇష్టమేనా?" కింద వంటగదిలో ఉన్నప్పుడు అంబిక నన్ను అడిగారు.
దగ్గరలోనే ఉన్న పొలంలో ఉన్న మేకల మందను చూసేందుకు ఆమె నన్ను తీసుకువెళ్ళారు. వైరు మంచాల కింద పడుకొని నిద్రపోతున్న కాపలా కుక్కలు నిద్రలేచి మమ్మల్ని దగ్గరకు రావద్దన్నట్టుగా మొరిగాయి. "మా ఇంటాయన ఏదయినా ఉత్సవాలలో భోజనం వడ్డించే పనికి బయటకు వెళ్ళినప్పుడు మా కుక్క నాకు కూడా రక్షణగా ఉంటుంది. ఆయనకూడా రైతే. పొలంపని దొరికినపుడు కూలి పని కూడా చేస్తాడు."
తనకు పెళ్ళైన కొత్తలోని విషయాలు చెప్పేటపుడు అంబిక సిగ్గుపడ్డారు. "అప్పుడు మేం సినిమాలకు వెళ్ళేవాళ్ళం . కానీ నేను థియేటర్ లో చివరుసారి సినిమా చూసింది 18 ఏళ్ళ క్రితం : తుళ్ళాద మనముమ్ తుళ్ళుమ్ !(తుళ్ళిపడని మనసు కూడా తుళ్ళిపడుతుంది!)" ఆ సినిమా పేరు మా ఇద్దరినీ నవ్వుకునేలా చేసింది.
*****
"మిరప పంటను అమ్ముకునే ప్రయత్నాల్లో
చిన్న రైతులు 18 శాతం ఆదాయాన్ని కోల్పోతారు"
కె. గాంధిరాసు, సంచాలకులు, ముండు చిల్లీ గ్రోయర్స్ అసోసియేషన్, రామనాథపురం
"ఐదో పదో బస్తాల మిరపకాయలున్న రైతులను తీసుకోండి. ముందు మీ గ్రామం నుంచి మండీ వరకూ సరుకును తీసుకురావడానికి టెంపోనో, మరో రవాణా సాధనమో తీసుకొని దానికి డబ్బు చెల్లించాలి," అన్నారు గాంధిరాసు. "మండీలో వ్యాపారులు వచ్చి ధరను నిర్ణయించి, 8 శాతం తమ కమిషన్‌గా తీసుకుంటారు. బరువులో వ్యత్యాసం రావొచ్చు. వస్తే అది సాధారణంగా వ్యాపారికి లాభించేటట్టుగానే ఉంటుంది. ఒక్కో బస్తాకు అరకిలో బరువు తగ్గించినా అది రైతుకు నష్టమే. అందుకే అనేక మంది రైతులు దీని గురించి ఫిర్యాదులు.చేస్తుంటారు.
పైపెచ్చు, ఒక వ్యక్తి పొలానికి వెళ్ళకుండా, ఒక రోజు మొత్తం ఈ మార్కెట్‌లోనే గడపాల్సి ఉంటుంది. వ్యాపారస్తుడి వద్ద డబ్బు సిద్ధంగా ఉంటే, వెంటనే కట్టేస్తాడు. దగ్గర డబ్బు లేకపోతే మరోరోజు రమ్మని రైతుకు చెప్తాడు. చివరగా, మార్కెట్‌కు వచ్చేవాళ్ళు సాధారణంగా భోజనం తెచ్చుకోరు. హోటల్లో తింటారు. వీటన్నిటినీ మేము లెక్కలు వేసి రైతుకు వచ్చే ఆదాయంలో 18 శాతం ఈ విధంగా పోతుందని తెలుసుకున్నాం."
గాంధిరాసు ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పిఒ)ను నడుపుతున్నారు. రామ్‌నాడ్ ముండు చిల్లీ ప్రొడక్షన్ కంపెనీ లిమిటెడ్, 2015 నుంచి రైతుల ఆదాయం పెరిగే వైపుగా కృషిచేస్తోంది. ఆ సంస్థకు ఆయనే చైర్మన్, డైరెక్టర్ కూడా. ముదుకుళత్తూర్ పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మమ్మల్ని కలిశారు. "ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? ముందుగా వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించాలి. రెండవది, ఉత్పత్తిని పెంచుకోవాలి. మూడవది మార్కెటింగ్ సంబంధాలను అందించాలి. ప్రస్తుతం మేం మార్కెటింగ్ మీద కేంద్రీకరిస్తున్నాం." రామనాథపురం జిలాలో జోక్యం చేసుకోవాల్సిన అత్యంత అవసరం ఉందని ఆయనకు తెలిసింది. "ఇక్కడ వలసపోవడం చాలా ఎక్కువ," అని ఆయన పేర్కొన్నారు.
ఆయన చెప్పినదానిని ప్రభుత్వ లెక్కలు బలపరుస్తున్నాయి. ప్రతి ఏడాదీ దాదాపు 3000 నుంచి 5000 మంది రైతులు వలస పోతున్నారని తమిళనాడు రూరల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్ట్ వారి రామనాథపురం జిల్లా డయాగ్నొస్టిక్ రిపోర్ట్ తెలియజేస్తోంది. మధ్యవర్తుల ప్రభావం, అతి తక్కువ నీటి వనరులు, కరవులు, శీతల గిడ్డంగులు లేకపోవడం వంటివి ఉత్పాదకతకు అడ్డంకులుగా ఉన్నాయని ఆ నివేదిక గుర్తించింది.
పరిస్థితులు మారటంలో నీటి పాత్ర చాలా ముఖ్యమంటారు గాంధిరాసు."కావేరీ డెల్టా ప్రాంతానికి గానీ, దక్షిణ తమిళనాడులోని వ్యవసాయభూములకు గానీ వెళ్ళి చూస్తే, మనకేం కనిపిస్తుంది?" ఎఫెక్ట్ కోసమన్నట్టు కొంచం ఆగి, "విద్యుత్ స్థంభాలు! ఎందుకంటే అక్కడంతా బోరుబావులుంటాయి." రామనాథపురంలో వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వర్షాధార సాగుబడికి వాతావరణ అస్థిరతలకు సంబంధించిన పరిమితులుంటాయని ఆయన అన్నారు.
మరోసారి, ప్రభుత్వం - ఈసారి జిల్లా స్టాటిస్టికల్ హేండ్ బుక్ - నుంచి ఉన్న సమాచారం ఆయన మాటల్ని బలపరచింది. రామనాథపురం విద్యుత్ పంపిణీ సంస్థ అందించిన వివరాల ప్రకారం, 2018-19 నాటికి జిల్లాలో కేవలం 9,248 పంపుసెట్లున్నాయి. రాష్ట్రంలో ఉన్న 18 లక్షల పంపుసెట్లను బట్టి చూస్తే ఈ సంఖ్య చాలా చిన్నది.
రామనాథపురం సమస్యలు పెద్ద కొత్తవేమీ కావు. ఎవ్రిబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ (Everybody Loves a Good Drought -1996 ప్రచురణ) పుస్తకంలో జర్నలిస్ట్ పి. సాయినాథ్, ప్రసిద్ద రచయిత (లేట్) మేలాణ్మై పొన్నుసామిని ఇంటర్వ్యూ చేశారు. "సాధారణంగా అందరూ నమ్మేదానికి భిన్నంగా, ఈ జిల్లాకు మంచి వ్యవసాయ సామర్థ్యం ఉంది. కానీ ఎప్పుడైనా ఆ సంగతిని దృష్టిలో పెట్టుకుని పనిచేసిందెవరు? రామ్‌నాడ్‌లోని 80 శాతం కంటే ఎక్కువ భూ యాజమాన్యం రెండెకరాల కంటే తక్కువ పరిమాణం కలిగినదీ, లాభసాటి కానిదీ. ఇందుకు ఉన్న అనేక కారణాలలో నీటిపారుదల సౌకర్యం లేకపోవటం ప్రధాన కారణం." అని ఆయన అన్నారు.
పొన్నుసామి భూ సామర్థ్యాన్ని గురించి సరిగ్గానే గుర్తించారు. రామనాథపురం జిల్లా 2018-19లో 33.6 కోట్ల రూపాయల విలువైన 4,426.64 మెట్రిక్ టన్నుల మిరపకాయల వ్యాపారం చేసింది. (నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమిలో ఎక్కువభాగాన్ని ఆక్రమించుకొని ఉన్న ధాన్యం మాత్రం కేవలం 15.8 కోట్ల రూపాయలను మాత్రమే అర్జించింది). స్వయంగా ఒక రైతు కొడుకూ, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడే వ్యవసాయం కూడా చేసిన గాంధిరాసు మిర్చి సామర్థ్యాన్ని గుర్తించారు. ఆయన వెంటనే ఆ పంటకు సంబంధించిన ఆర్థిక విషయాల్లోకి వచ్చేస్తారు. సాధారణంగా ఒక చిన్న రైతు ఒక ఎకరం పొలంలో దీన్ని సాగుచేస్తాడు. పంట కోతల సమయంలో కొంతమంది పనివాళ్ళను పెట్టుకున్నప్పటికీ సాధారణంగా ఆ పనులన్నీ ఆ కుటుంబమే చేసుకుంటుంది. "ఒక ఎకరంలో ముండు (గుండు) మిర్చిని సాగుచేసేందుకు రూ. 25 వేల నుంచి రూ. 28 వేల వరకూ ఖర్చవుతుంది- అంటే, 10 నుంచి 15 మంది మనుషులు నాలుగుసార్లు మిరపకోత కోయడానికి." ప్రతి కార్మికుడు ఒక్క రోజులో ఒక బస్తా మిరపకాయలు కోయగలడు. అయితే మొక్కలు దగ్గరదగ్గరగా ఉన్నప్పుడు, పని ఇంకాస్త కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.
మిరప ఆరు నెలల పంట. దాన్ని అక్టోబర్ మాసంలో నాటుతారు. రెండు బోగంలు (దిగుబడులు) ఉంటాయి. మొదటి కోత జనవరి మధ్యనుంచి ప్రారంభమయ్యే తమిళ మాసం, తై (పుష్య మాసం)లో జరుగుతుంది. రెండవ కోత ఏప్రిల్ మధ్యనుంచి మొదలయ్యే చిత్తిరై (చైత్ర మాసం)లో జరుగుతుంది. 2022లో పడిన అకాల వర్షాల వల్ల, ఈ మొత్తం పంట చక్రానికి భంగం కలిగింది. మొదటి విడత మొలకలు చనిపోయాయి, పూత రావడం ఆలస్యమయింది, దాంతో కాపు బాగా తగ్గిపోయింది.
పంట దిగుబడి తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఈ మధ్యకాలంలో ఉన్న ధరల కంటే ఈసారి కాస్త మెరుగైన ధర పలికింది. మార్చి నెల ప్రారంభంలో మొదటిసారి వచ్చిన పంటకు, అసాధారణంగా కిలో ఒక్కింటికి 450 రూ.ల ధర పలకడం గురించి రామనాథపురం, పరమకుడి మార్కెట్లలో రైతులు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. అది 500 రూ.లకు చేరుతుందనే గుసగుసలు కూడా వినిపించాయి.
గాంధిరాసు ఆ సంఖ్యలను 'సునామి' అని పిలుస్తారు. ఒక కిలో ముండు మిరపకు 120 రూ.లను లాభమూ నష్టమూ లేని ధరగా గాంధిరాసు నిర్ణయిస్తారు. ఎకరానికి వెయ్యి కిలోల ఉత్పత్తి వస్తే, రైతు 50000 రూపాయల లాభాన్ని కళ్ళజూచూడవచ్చు. "రెండేళ్ళ క్రితం, కిలో మిర్చి 90 లేదా 100 రూపాయలు మాత్రమే పలికేది. ఈనాటి ధర చాలా బాగుంది. కానీ ఈ కిలో 350 రూ.ల ధరను మనం నమ్ముకోలేం. ఈ ధర సరైంది కాదు."
ముండు మిరప, జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంట అని ఆయన అంటారు. సూక్ష్మరూపంలోని టమాటాలా కనిపించే దాని రూపాన్ని వర్ణిస్తూ, ఇదొక 'ప్రత్యేక' రకమని అంటారాయన. "రామ్‌నాడ్ ముండు ను చెన్నైలో సాంబార్ మిర్చి అని పిలుస్తారు. ఎందుకంటే దాని తోలు కూడా మందంగా ఉంటుంది కాబట్టి, దీనిని మెత్తగా నూరి పుళి కొళంబు (పుల్లని చింతపండు పులుసు కూర) లో కలిపితే అది చిక్కగా అవుతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది."
దేశంలోనూ, విదేశాల్లో కూడా ఈ ముండు కు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఆన్‌లైన్‌లో కూడా ఉన్నట్టు వెతికితే తెలిసింది. మే నెల మధ్య వరకు, అమెజాన్‌లో ముండు మిర్చి అమ్మకం ధర కిలో 799 రూ.లుగా ఉంది! ఈ ధర కూడా ఆకర్షణీయమైన 20 శాతం తగ్గింపు ఇచ్చిన తరువాత! "ఇంత ధర కోసం ఎలా లాబీ చేయాలో మాకు తెలియదు, మర్కెటింగ్ ఒక సమస్య." అని గాంధిరాసు ఒప్పుకున్నారు. అదీగాక, వెయ్యి మందికి పైగా రైతులు ఎఫ్‌పిఒ సభ్యులుగా ఉన్నప్పటికీ, వారిలో అందరూ తమ ఉత్పత్తిని తమ ఈ సంస్థకు అమ్ముకోలేరు. "వారి మొత్తం ఉత్పత్తిని కొనగలిగేంత డబ్బు గానీ, వాటిని నిలవ ఉంచే సామర్థ్యం కానీ మాకు లేదు."
మంచి ధర పలికే వరకు పంటను నిలవచేసి ఉంచాలని ఎఫ్‌పిఒ అనుకున్నప్పటికీ అది చాలా కష్టమైన పని. ఎందుకంటే నెలల తరబడీ నిలవ ఉంచితే మిరపకాయలు నల్లబడిపోతాయి. మిరప్పొడికి పురుగులు పట్టే అవకాశం కూడా ఉంది. రామనాథపురానికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న ప్రభుత్వ శీతల గిడ్డంగుల వద్దకు వెళ్ళినపుడు, శీతలీకరణ చేసిన మిర్చి యార్డులలో నిలవ ఉంచిన క్రిందటేడాది నాటి మిర్చి పంటను చూశాం. వర్తకులనూ, రైతులనూ ఒకే చోట సమీకరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రైతులు వెనుకాడుతున్నారు. వారికి తమ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకురావడానికీ, ఇక్కడినుండి బయటికి రవాణా చేయడానికీ గల సాధ్యాసాధ్యాల గురించి ఖచ్చితంగా తెలియటంలేదు.
తనవంతు బాధ్యతగా, చీడపీడల నివారణకు సంప్రదాయక పద్ధతులను పాటించాలని ఎఫ్‌పిఒ రైతులకు సలహా ఇచ్చింది. "ఈ ప్రాంతంలో సాధారణంగా మిరప చేల చుట్టూతా ఆమణక్కు (ఆముదం) చెట్లను పెంచుతుంటారు. ఎందుకంటే, మిళగాయ్ ని ఆశించి వచ్చే పురుగులను ఇది తనవైపుకు తీసుకుంటుంది. పైగా, ఆముదం పెద్ద మొక్క కావటంతో చిన్న చిన్న పక్షులను అది ఆకర్షిస్తుంది. అవి కూడా పురుగులను తింటాయి. అది ఒక ఉయిర్వేలి , సజీవమైన కంచె."
తన తల్లి గట్లవెంట ఆమణక్కు , అగత్తి (అగస్ట్ చెట్టు అని పిలిచే ఒక ప్రసిద్ధ పాలకూర రకం) మొక్కలను పెంచడం ఆయనకు గుర్తుకొచ్చింది. "మా అమ్మ మిరపకాయల కోసం చేనులోకి వెళ్తున్నప్పుడు మా మేకలు ఆమె వెనకాలే పరిగెత్తేవి. ఆమె వాటిని ఒక పక్కగా కట్టేసి అగత్తి , ఆమణక్కు ఆకులను వాటికి మేతగా వేసేది. అదొక్కటే కాదు. మిళగాయ్ పెద్ద పంటైతే, ఆమణక్కు చిన్న పంట. మిరప పంట ద్వారా వచ్చే డబ్బును మా నాన్న తీసుకుంటే, ఆముదాలు అమ్మగా వచ్చిన డబ్బును మా అమ్మ ఉంచేసుకునేది."
గతం నుంచి తీసుకున్న పాఠాలతో పాటు గాంధిరాసు భవిష్యత్తు వైపుకు- సహాయం కోసం విజ్ఞానశాస్త్రం వైపుకు - కూడా చూస్తున్నారు. "రామనాథపురంలో, ప్రత్యేకించి ముదుకుళత్తూర్‌లో ఒక మిరప పరిశోధన కేంద్రం అవసరం ఉంది. వరి, అరటి, ఏలకులు, పసుపు- వీటన్నిటికీ పరిశోధన కేంద్రాలున్నాయి. ఒక పాఠశాల, ఒక కళాశాల ఉన్నప్పుడే, పిల్లల్ని చదువుకోసం వాటికి పంపించగలుగుతాం. అలాగే ఒక పరిశోధన కేంద్రం ఉన్నప్పుడే, సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను వెతకగలుగుతాం. అప్పుడే మిరప పంట 'తర్వాతి స్థాయి’ని చేరుకోగలుగుతుంది."
ప్రస్తుతానికి, ముండు రకం మిరపకు భౌగోళిక గుర్తింపు చిహ్నాన్ని తెచ్చేందుకు ఎఫ్‌పి కృషిచేస్తుంది. "ఈ మిరపకు ఉన్న ప్రత్యేక లక్షణాలను గురించి బయటకు ప్రచారం చేయాలి. దీని గురించి ఒక పుస్తకం రావడం అవసరమనుకుంటా?"
వ్యవసాయానికి సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారంగా చెప్తోన్న విలువ జోడింపు అనేది మిరప విషయంలో పనిచేయకపోవచ్చు. "చూడండి, ప్రతి వ్యక్తి దగ్గర యాభయ్యో అరవయ్యో బస్తాల మిరపకాయలున్నాయి. వాటితో వాళ్ళేం చేయగలరు? ఎఫ్‌పిఒ సమష్టిగా పనిచేసినా కూడా మసాలా కంపెనీలతో పోటీ పడి, మిరప్పొడిని వారికంటే చౌక ధరలకు అమ్మలేదు. దానికి తోడు వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్ కోట్ల రూపాయలలో ఉంటుంది." అన్నారు గాంధిరాసు.
అయితే, భవిష్యత్తులో రాబోయే ప్రధాన సమస్య వాతావరణంలో మార్పులు. "ఆ సమస్యను పరిష్కరించడానికి మనమేం చేస్తాం?" గాంధిరాసు అడిగారు. "మూడు రోజుల క్రితం తుఫాను ముప్పు వచ్చిపడింది. మార్చి నెలలో తుఫానులు వస్తాయనే వార్త నేనెన్నడూ వినలేదు. నీరు బాగా ఎక్కువగా ఉంటే మిరప మొక్కలు చచ్చిపోతాయి. రైతులు అందుకు తగ్గ దారులు వెతకాల్సి ఉంటుంది."
*****
"మహిళలు తమకు కావాల్సినంత, లేదంటే
కావల్సిన దానిలో కొంత మాత్రమే అప్పు తెచ్చుకుంటారు. చదువు, పెళ్లి, ప్రసూతి– వీటికి
మాత్రం ఎప్పుడూ అప్పులు వద్దనుకోం. వ్యవసాయం కూడా వీటి తర్వాతే వస్తుంది."
జె. అడైక్కలసెల్వి,
మిర్చి రైతు, స్వయంసహాయక బృందం నాయకురాలు, పి. ముత్తువిజయపురం, రామనాథపురం
"మొక్కను పీకేస్తానేమోనని భయపడ్డావు కదా నువ్వు, కదా?" అడైక్కలసెల్వి నవ్వారు. ఆమె తన పొరుగువారి చేనులో నన్ను పనిచేయడానికి పెట్టారు. తనకు పనివాళ్ళు తక్కువగా ఉన్నారనీ, కొంచం అదనపు సాయం వస్తే బాగుండునని ప్రార్థిస్తున్నాననీ ఆ చేను యజమాని అన్నారు. కానీ, నాకు కృతజ్ఞతలు చెప్పినందుకు అతను వెంటనే విచారించారు. ఎందుకంటే నేను ఆ పనికి పనికిరానని ఆయనకు తెలిసిపోయింది. అడైక్కలసెల్వి ఇంతలోనే ఒక బక్కెట్‌ను లాక్కొని అప్పటికే మూడవ మొక్కనుంచి మిరపకాయలను కోస్తున్నారు. నేనింకా నా మొదటి మొక్క పక్కనే కూర్చొని, ఒక లావుగా ఉన్న మిరపకాయను పీకాను. దాని కాడ మందంగా గట్టిగా ఉంది- మా ఇంట్లోని నా అంజలపెట్టి (పోపుల డబ్బా)లో పెళుసుగా ఉండే ఎండు మిరపకాయల్లా లేదు. కొమ్మని విరగ్గొట్టేస్తానేమోనని నేను భయపడ్డాను.
చూడటానికి కొంతమంది మహిళలు చుట్టూ గుమిగూడారు. పొరుగాయన తల విదిలించారు. అడైక్కలసెల్వి ప్రోత్సహిస్తున్నట్టుగా శబ్దాలు చేశారు. ఆమె బక్కెట్ మిరపకాయలతో నిండిపోతోంది, నా అరచేతిలో ఎనిమిది ఎర్ర మిరప్పళ్ళు ఉన్నాయి. "నువ్వు సెల్విని నీతోపాటు చెన్నైకి తీసుకెళ్ళు. ఆమె పొలంపనీ చేయగలదు, ఆఫీసు పని కూడా చేయగలదు." అన్నారు పొరుగు చేనాయన. ఈయన నాకు పని ఇవ్వరు, నేను ఈ పనికి పనికిరానని స్పష్టమైపోయింది.
అదైక్కలసెల్వి తన ఇంట్లోనే ఒక కార్యాలయాన్ని నడుపుతున్నారు. దీన్ని ఎఫ్‌పిఒ ఏర్పాటుచేసింది. అందులో ఒక కంప్యూటర్, ఒక జిరాక్స్ మెషీన్ ఉన్నాయి. పత్రాలను ఫోటోకాపీ చేసి, పట్టాల (భూమి దస్తావేజులు)కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేలా చేయడం ఆమె పని. "అంతకంటే చేయడానికి నాకు సమయం దొరకదు. నేను చూసుకోవాల్సిన మేకలూ కోళ్ళూ కూడా ఉన్నాయి."
ఆమెకున్న బాధ్యతల్లో మగళిర్ మండ్రమ్ , లేదా మహిళా స్వయం సహాయక బృందాలను నడిపించడం కూడా ఒకటి. ఆ ఊర్లో ఐదు బృందాలుగా చీలివున్న 60 మంది సభ్యులున్నారు. ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున తలైవిలు (నాయకురాళ్ళు) ఉంటారు. ఆ పదిమందిలో అడైక్కలసెల్వి కూడా ఒకరు. సేకరించిన డబ్బును అందరు సభ్యులకు పంచడమనేది నాయకత్వంలో ఉన్నవారి పనుల్లో ఒకటి.“ప్రజలు అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటుంటారు - రెండు వాట్టి, అంజు వాట్టి (సంవత్సరానికి 24 నుండి 60 శాతం వరకూ). మా మగళిర్ మండ్రమ్ రుణాలు ఒరు వాట్టి - ప్రతి లక్షకు 1,000 రూపాయలు." ఇది సంవత్సరానికి దాదాపు 12 శాతం. “కానీ మేం సేకరించిన డబ్బు మొత్తాన్ని కేవలం ఒక వ్యక్తికే ఇవ్వం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న రైతులే, వారందరికీ తమ పనులు సాగించుకోవడానికి కొంత డబ్బు కావాలి, అవును కదా?”
"మహిళలు తమకు కావాల్సినంత, లేదంటే కావల్సిన దానిలో కొంత మాత్రమే అప్పు తెచ్చుకుంటారు. మాకు ముఖ్యంగా మూడు ప్రాథమ్యాలు ఉంటాయి- చదువు, పెళ్లి, ప్రసూతి– వీటికి మాత్రం ఎప్పుడూ అప్పులు వద్దనుకోం. వ్యవసాయం కూడా వీటి తర్వాతే వస్తుంది.”
అడైక్కలసెల్వి, అప్పులు చెల్లించడంలోఒక ముఖ్యమైన మార్పును తీసుకొచ్చారు. "ఇంతకుముందంతా, నువ్వు ప్రతి నెలా ఇంత సొమ్ము అని చెల్లించాల్సి ఉండేది. నేను వాళ్లతో ఏం చెప్పానంటే: మనం అందరం రైతులం. కొన్ని నెలలు మన దగ్గర డబ్బు అనేదే ఉండదు. మనం పంటను అమ్మిన తర్వాత మాత్రమే మనందరి దగ్గరా కొంత నగదు ఉంటుంది. వాళ్ల దగ్గర ఉన్నప్పుడే జనాన్ని డబ్బు కట్టనిద్దాం. ప్రతి ఒక్కరూ దీని నుంచి లబ్ధి పొందాలి. అవునా కాదా?" అందరినీ కలుపుకొని పోయే బ్యాంకింగ్ విధానాల్లో ఇదొక పాఠం - స్థానికంగా, ప్రతి ఒక్కరి వాస్తవిక జీవితాలకు బాధ్యత వహించేట్టుగా ఉండటం.
ముప్పై ఏళ్ల క్రితం ఆమెకు పెళ్లయ్యేనాటికే ఉన్న మగళిర్ మండ్రమ్ గ్రామంలో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. మార్చ్‌లో మేమక్కడ పర్యటించిన తర్వాత వచ్చిన వారాంతంలో వాళ్లు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని అనుకున్నారు. "చర్చ్‌లో సండే మాస్ తర్వాత, మేము కేకులు పంచుతూ ఉంటాం," అంటూ ఆమె నవ్వారు. వాళ్లు వానల కోసం కూడా ప్రార్థనలు జరుపుతారు. పొంగలి వండి, అందరికీ వడ్డిస్తారు.
ధైర్యవంతురాలు, ఏ తటపటాయింపూ
లేకుండా మాట్లాడే స్వభావం వల్ల, గ్రామంలోని తాగే అలవాటు, భార్యల్ని తిట్టే అలవాటు ఉన్న
మగవాళ్లకు అడైక్కలసెల్వి సలహాలు ఇస్తుంటారు. దశాబ్దాలుగా సొంతంగా బండి నడుపుతూ, వ్యవసాయాన్ని
చూసుకుంటున్న ఆమె ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకం. "ఇప్పటి యువతులందరూ తెలివైనవారు,
బండ్లను నడుపుతారు, బాగా చదువుకుంటున్నారు కూడా. కానీ, ఉద్యోగాలేవీ?" అని ఆమె
సూటిగా ప్రశ్నిస్తారు.’
ఇప్పుడు ఆమె భర్త తిరిగివచ్చారు కాబట్టి, పొలంపనుల్లో ఆయన సాయం చేస్తున్నారు. దాంతో మిగిలిన సమయాన్ని ఆమె ఇతర పనులు చేసుకోవడానికి వాడుకుంటున్నారు- ఆమె పత్తిని కూడా పెంచుతున్నారు కాబట్టి, దానికి సంబంధించిన పనులు. "గత పదేళ్లుగా పత్తి విత్తనాలు తీసి, వాటిని విడిగా అమ్ముతున్నాను. కిలోకు వంద రూపాయల చొప్పున అవి అమ్ముడవుతాయి. చాలామంది నా దగ్గర కొంటారు– ఎందుకంటే నా విత్తనాలు చాలా బాగా మొలకెత్తుతాయి. గతేడాది దాదాపు 150 కిలోల విత్తనాల వరకూ అమ్మివుంటాను." ఒక మెజీషియన్, తన మాయసంచిలోంచి కుందేలుని బయటకు తీసినట్టు, ఆమె ఒక ప్లాస్టిక్ సంచిని తెరిచి, అందులోంచి మూడు కవర్లను బయటకు లాగి, అందులో ఉన్న రకరకాల తరగతుల విత్తనాలను నాకు చూపించారు. పెద్ద హడావుడేం లేకుండా విత్తన సంరక్షకురాలిగా ఆమె పోషిస్తున్న ఇంకో గొప్ప పాత్ర అది!
మే నెల చివరి నాటికి ఆమె మిరప పంట చేతికొచ్చింది. సీజన్ ఎలా ఉందని మేం ఫోన్లో మాట్లాడుకున్నాం. "కిలోకి 300 రూపాయలకు పైగా ఉన్న ధర 120 రూపాయలకు పడిపోయింది. అది స్థిరంగా తగ్గిపోయింది," అని ఆమె నాతో చెప్పారు. ఈసారి ఆమెకు ఎకరాకు 200 కిలోల మిర్చి మాత్రమే వచ్చింది. అమ్మకాల మీద 8 శాతం కమీషన్ చెల్లించారు. దీనికితోడు ప్రతీ 20 కిలోల మిర్చికి 1 కిలో నష్టపోయారు. ఎలాగంటే, వ్యాపారులు 200 గ్రాముల బరువుండే సంచిని ఒక కిలో బరువుండే సంచిగా లెక్కవేసి, 800 గ్రాములు అదనంగా తగ్గించారు. ఆమె ఈ సంవత్సరం కూడా నష్టపోయింది, మంచి ధర లేకపోవడం వల్ల కాదు. వానలు మొక్కలను పాడుచేసి, దిగుబడి తగ్గిపోయేట్టు చేశాయని ఆమె చెప్పారు.
ఏదేమైనా ఒక రైతు పనిని ఏది కూడా కుదించలేదు. సరిగ్గా పండని మిరప పంటను కూడా తెంపాల్సిందే, ఎండబెట్టాల్సిందే, సంచీల్లో నింపాల్సిందే, అమ్మాల్సిందే. అడైక్కలసెల్వి, ఆమె స్నేహితురాళ్ల శ్రమ ప్రతి చెంచాడు సాంబారుకూ రుచిని జతచేస్తూనే ఉంటుంది.
ఈ కథనం రూపొందేందుకు సాయపడిన రామ్‌నాడ్ ముండు చిల్లీ ప్రొడక్షన్ కంపెనీకి చెందిన కె. శివకుమార్, బి. సుగన్యలకు ఈ రిపోర్టర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.
అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన రీసెర్చ్ ఫండింగ్ ప్రోగ్రామ్ 2020లో భాగంగా ఈ పరిశోధనాత్మక అధ్యయనానికి నిధులు సమకూర్చింది.
కవర్ ఫోటో: ఎమ్. ఫళని కుమార్
అనువాదం: సుధామయి సత్తెనపల్లి